Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
friends, best friends, be alert

ఈ సంచికలో >> యువతరం >>

యువతకి కావాల్సిందేమిటి?

youth needs and wants

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు యువతనుద్దేశించి అనేక 'ఆకర్షణీయ' ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణకు అభివృద్ధి చెందిన రాజధాని హైదరాబాద్‌ యువతకు అండదండగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కి ఆ పరిస్థితి లేదు. 2014 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నిరుద్యోగ బృతి కల్పిస్తామంటూ యువతలో ఆశలు పెంచారు. ఎన్నికల్లో పార్టీలు హామీలివ్వడం, వాటిని ఆచరణలో పెట్టలేకపోవడం కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూడేళ్ళపాటు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజా బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించడంతో ఆంధ్రప్రదేశ్‌ యువతలో కొంత ఆందోళన తగ్గింది. అయితే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో సహాయం అందించినట్లు అవదు. యువత ప్రభుత్వాల నుంచి ఆశించేది 'భృతి' ఏమాత్రం కాదు. తమ చేవకు తగ్గ ఉద్యోగం లభిస్తే, అద్భుతాలు చేయడానికి యువత ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్ష ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన దరిమిలా, ఆ ఉద్యోగాల ప్రకటన పూర్తిస్థాయిలో రాకపోవడంతో తెలంగాణలో కూడా కొంత ఆందోళన నెలకొంది. నిరుద్యోగ యువత పోరుబాట పట్టారు కూడా. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ అసెంబ్లీ వేదికగా నిరుద్యోగులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందనీ, లక్ష ఉద్యోగాలు రానున్న రోజనుల్లో ఇచ్చి తీరతామని అన్నారు.

తద్వారా తెలంగాణ రాష్ట్ర యువతలోని కొంత ఆందోళనను ఆయన తగ్గించగలగాలి. రాజకీయ ప్రకటనలు వేరు, వాటిని అమల్లోకి తీసుకురావడం వేరు. ఇచ్చిన మాట తప్పడం నైతికత కానప్పటికీ, ప్రభుత్వంలో ఉన్నవారికి ఇబ్బందులు సహజమే. ఆ ఇబ్బందుల్ని అధికారంలో ఉన్నవారు అధిమించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే యువత కూడా కేవలం ప్రభుత్వ వైపు మాత్రమే ఆశలు పెట్టుకోకుండా ఉండాలి. ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. అవకాశాల కోసం ఎక్కడికైనా ఎగిరిపోగలుగుతున్నాం. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు అపారం. ఉద్యోగమొక్కటే కాదు, సరికొత్త ఆలోచనలతో ముందుకెళితే ప్రపంచమంతా యువతకు రెడ్‌ కార్పెట్‌ వేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ యువతకు కావాల్సింది మోటివేషన్‌. అదే సమయంలో యువతను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులా మాత్రమే చూడటం మానుకోవాలి. వాస్తవ పరిస్థితుల్ని యువతకు తెలియజెప్పగలిగితే యువత ఆలోచనలు కొత్త పంథాలు నడుస్తాయి. నమ్మించి, నైరాశ్యంలోకి నెట్టేసినప్పుడే సమస్యలు రావడం సహజం.

మరిన్ని యువతరం