Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> తీయని బహుమతి

teeyani bahumati

మంత్రి గారి  చాంబర్ నుంచి బయటకు వచ్చిన రాఘవరావు గారికి చాలా నీరసంగా, అంతకు  మించి  నిరుత్సాహంగా  ఉంది. ఎంతో ఆశపడి సచివాలయానికి వచ్చి, ఉత్తి చేతులతో ఊరికి తిరిగి వెళ్ళాలంటే బాధగా ఉంది.  వెళ్ళాక, తన ఊరి వాళ్ళకు  ఏమని  సమాధానం చెప్పాలి? ఊరి సమస్యలకు ఇప్పట్లో పరిష్కారం దొరకదా? - ఇలా పరిపరి విధాల  ఆలోచనలతో బుర్ర వేడెక్కడంతో టీ తాగుదామని కేంటీన్ వేపు నడిచారు.

రాఘవరావు గారిది వెంకటాపురం. ఆ ఊరి ఉన్నత పాఠశాలలో చాలా కాలం పాటు ఉపాధ్యాయులుగా పని చేసిన రాఘవరావు గారంటే, ఆ ఊరి వారందరికీ  చాలా గౌరవం. ఇద్దరు అమ్మాయిలకు మంచి సంబంధాలు చూసి వివాహాలు చేసారు, ఆర్ధికంగా పెద్ద అవసరాలు లేవు, కోట్లు వెనకెయ్యాలనే అత్యాశలు లేవు. అందువల్ల, ప్రశాంత జీవనం గడుపుదామని వాలంటరీ రిటైర్మెంటు తీసుకొన్నారు.

తానొకటి తలిస్తే, దైవమొకటి తలచిందన్నట్లు- ఆయన రిటైర్మెంటు తీసుకున్న సమయానికే పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. ఊరిలో చాలా సమస్యలు ఉండడం మూలంగా చదువుకున్న వ్యక్తి, ఊరి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి సర్పంచ్ అయితే  మంచిదనే ఉద్దేశ్యంతో – గ్రామస్తులంతా కలిసి రాఘవరావు గారిని సర్పంచిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, తన పట్ల, తన కుటుంబం పట్ల ఎంతో అభిమానం, గౌరవం చూపించే ఊరి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో రాఘవరావు గారు ఆ ఊరి పెద్దల నిర్ణయానికి తలొగ్గారు.

సర్పంచి అయిన నాటి నుండి, ఊరి  అభివృద్ధికి తన శక్తివంచన  లేకుండా ఎన్నో ప్రణాళికలు రచించారు. ఊరివారు కూడా తమకు తోచిన  సహాయాన్ని  అందిస్తున్నారు. అయితే, చదువుకున్న  యువకులంతా  ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు  వెళ్లిపోవడంతో పెద్దవయసు  వారే ఆ ఊర్లో అధికంగా ఉన్నారు.  దాంతో, అనుకున్న కార్యక్రమాలన్నీ వాస్తవ రూపం  దాల్చడం  కష్టంగా ఉంటోంది. రైతాంగం  ఎక్కువగా ఉండే ఆ ఊరిలో ప్రస్తుతం  తాగునీరు, సాగునీరు  లభ్యమవటం ప్రధాన సమస్యగా  మారింది. ఒకప్పుడు పచ్చని పొలాలతో, మంచి నీటి చెరువులు, బావులతో ఏ విధమైన ఇబ్బందిని ఎదుర్కోని ఆ ఊరికి నేడు వేసవి వచ్చిందంటే గుక్కెడు మంచినీళ్ళకి కూడా కటకట. ఈ సమస్యకు పరిష్కారం కోసం వెదుకుతూ, ఏమైనా పథకాల పరంగా సాయం చేస్తాడేమోనని, ఆ ఊరివారికి దూరపు బంధువైన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దగ్గరకు వచ్చారు. అయితే, అన్ని ఊళ్లలో ఇదే సమస్య ఉందని, ప్రస్తుతానికి ఏ రకమైన సహాయం చేయలేనని తేల్చేసి, భవిష్యత్తులో ఆ ఊరి గురించి తప్పక ఆలోచిస్తానని ఒక శుష్క వాగ్దానం చేసి, రాఘవరావు గారిని సాగనంపాడు మంత్రిగారు.

గంపెడాశతో వచ్చిన రాఘవరావు గారికి ఇప్పుడు ఏమీ పాలుపోవటం లేదు, అలాగని అక్కడ ఉండి  చేసేదేమీ లేదు. తిరిగి వెళ్ళాల్సిన బస్సు  రాత్రి పది గంటలకు, అంతవరకూ ఎక్కడో కాలక్షేపం చేస్తే చాలు అనుకుంటూ, టీ  తాగుతున్న రాఘవరావు గారి దృష్టి అక్కడ కట్టిన ఒక బ్యానర్ పై పడింది. “సచివాలయ సారస్వత వేదిక ఆధ్వర్యంలో ధరిత్రీ దినోత్సవం కార్యక్రమం” - సాయంత్రం 4 గంటలకు – తనకు బస్సుకు చాలా సమయం ఉండడం, ఆసక్తికరమైన కార్యక్రమం కావడంతో, రాఘవరావు గారు ఆ కార్యక్రమం చూసి వెళ్దామనుకున్నారు. ఆయన లోపలికి ప్రవేశించేటప్పటికే ఆ హాలు ఉద్యోగస్తులతో దాదాపు నిండిపోయింది.

ప్రారంభంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కవితల పఠనం, గేయాల గానంతో ఉద్యోగస్తులు అలరించారు. కొద్ది సేపటికి అసలు సభ ప్రారంభం అయింది. పర్యావరణ కథల, కవితల రచనలో ప్రముఖుడైన ఒక రచయితను, అటవీశాఖ కార్యదర్శిని వేదిక మీదకు ఆహ్వానించారు. వారితో పాటు, ‘డైమండ్ స్వీట్స్’ అధినేత అంటూ ఒక వ్యక్తిని ఆహ్వానించారు. సన్నగా, పొడవుగా, పల్చని గెడ్డంతో, లాల్చీ, పై జమా వేసుకుని, భుజానికి సంచి తగిలించుకున్న ఒక 25-30 సంవత్సరాల మధ్య వయసు ఉండే యువకుడు వేదిక మీదకు వచ్చాడు. కరతాళ ధ్వనుల మధ్య అతని పేరు సరిగా వినబడలేదు రాఘవరావు గారికి.

సభ ప్రారంభం అయ్యాక – ప్రభుత్వ కార్యదర్శి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటోంది అనే అంశంపై ఒక అరగంట అనర్గళంగా ఉపన్యసించాడు.  ఆ పథకాలు గ్రామాలలో ఏమాత్రం అమలులో ఉన్నాయో వాస్తవంగా తెలిసిన రాఘవరావుగారు పేలవంగా ఒక నవ్వు నవ్వారు. అయితే, పట్టణ వాసులైన ఆ ఉద్యోగులు తమ అధికారిని చప్పట్లతో సన్మానించారు. ఆ తరువాత పర్యావరణ రచయిత – తన కథలను, కవితలను ఉట్టంకిస్తూ, మధ్య మధ్యలో – పర్యావరణం కోసం ఇంతటి కృషి చేస్తున్న తనంతటి వాడికి పద్మశ్రీ, ఇత్యాది అవార్డులు రాకపోవడం దేశం చేసుకున్న దౌర్భాగ్యం అంటూ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ, సుదీర్ఘ ప్రసంగం చేసాడు. అతని ప్రసంగం ముగిసిన వెంటనే, అందుకోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లు ప్రేక్షకులు మరింత గట్టిగా చప్పట్లు కొట్టారు. తరవాత, ఆ యువకుని వంతు వచ్చింది. పేరు విజయ కుమార్ అట – రాఘవరావు గారికి ఆశ్చర్యం కలిగింది, పర్యావరణానికి, ఈ స్వీట్ స్టాల్ నడిపే యువకుడికి సంబంధం ఏమిటి? బహుశ – కార్యక్రమం నిర్వహణకు ధన సహాయం చేసుంటాడు – పర్యావరణం గురించి ఇతను చెప్పేదేముంటుంది, ఇక వెళ్దామా అని లేచిన వారే, మళ్ళా బయటకు వెళ్లినా చేసే పని కూడా ఏమీ లేదు కదా- బస్ ఎప్పుడో రాత్రికి అనుకుంటూ కూర్చున్నారు.

“సభా సరస్వతికి నమస్కారం! అంటూ సంస్కారవంతమైన గొంతు సభను పలకరించేటప్పటికి అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. “నేను చెప్పబోయే అంశం లోకి వెళ్లబోయే ముందు, మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేయదలచుకున్నాను...మీలో ‘మాత’ అంటే గౌరవం లేనివారు ఎవరైనా ఉన్నారా?” ఎవరినుంచీ సమాధానం లేదు.... ప్రేక్షకుల ముఖాలలో సందిగ్ధత గమనించి, తన ప్రశ్న సరిగా వినబడలేదేమో నని, మరలా “తల్లి” అంటే గౌరవం లేనివారు ఉన్నారా?” అంటూ ప్రశ్నించాడు. ఈసారి ఒక్కసారిగా – ప్రేక్షకులందరి నుంచీ “నో” , అంటూ సమాధానం వచ్చింది. “తల్లి అంటే అందరికీ గౌరవమే” అంటూ కొంతమంది అందరి తరపున మరింత గట్టిగా చెప్పారు.

“సంతోషం..అయితే, మనకు జన్మనిచ్చిన మాత కాకుండా – మరో ముగ్గురు మాతలు ఉన్నారని మీకు తెలుసా? అంటూనే, “వారు – భూమాత, గోమాత, గంగామాత” అన్నాడు. అంతకు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినవారి కన్నా, నెమ్మదిగానే ఉన్నా, స్థిరంగా ఉన్న అతని స్వరం అందరినీ ఆకట్టుకొంది. అతను తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, “....అయితే, మన మాతకు ఇచ్చే గౌరవం, మనం ఈ ముగ్గురు మాతలకు ఇవ్వటం లేదు... అందుకే నేడు మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలన్నీ...” అంటూ, మనిషి తన స్వార్ధం కోసం ప్రకృతిని ఎలా ధ్వంసం చేస్తున్నది, అవసరానికి మించి జలవనరులని, ఇతర వనరులని ఎలా వాడుకుంటున్నదీ, తన మూర్ఖత్వంతో ఎలా కలుషితం చేస్తున్నదీ ......వివరిస్తూ......సోదాహరణంగా అతను చేస్తున్న ఉపన్యాసం అక్కడ ఉన్నవారందరినీ ఆలోచింపజేసింది.... ముఖ్యంగా, చెక్ డాం లు, ఇంకుడు గుంతల నిర్మాణం మూలంగా కరువు ప్రాంతాలలో కూడా నీటి నిలువ ఎలా చేసుకోవచ్చో చెప్పి, అన్న హజారే కృషి తో ‘రాలెగావ్ సిద్ధి’ గ్రామం ఎలా నీటి కరువు నుండి బయటపడిందో వివరించాడు.

ఆ యువకుడి ప్రసంగం వింటున్న రాఘవరావుగారికి తన నేటి ప్రయాణం ఏమాత్రం వృధా కాలేదని అనిపించింది. అంతేకాదు, తన సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కూడా ఉందన్న ఆనందం కలిగింది. ఆ తరువాత, భారతీయ దేశీయ గోసంతతి మూలాన ఒనగూరే ప్రయోజనాలను అతడు వివరిస్తూ, ప్రకృతి వ్యవసాయం గురించి చెపుతోంటే, అందరూ ఆశ్చర్యచకితులై వింటున్నారు.

అద్భుతమైన తన ప్రసంగం ముగిస్తూ, ఆ యువకుడు తన భుజానికి వేలాడుతున్న సంచిని అందరికీ చూపించాడు. “ఇది జనపనారతో చేసిన ప్రకృతి హితమైన చేతి సంచి...మనం ప్రతి చిన్న అవసరానికి ప్లాస్టిక్ బ్యాగులు వాడడం కాకుండా, ఇలా చేతి సంచి వాడడం అలవాటు చేసుకొంటే, మనమందరం పర్యావరణానికి హితం చేసినవాళ్ళమవుతాం....అందుకే, మా సంస్థ తరుపున అందరికీ ఉచితంగా చేతి సంచులను ఇస్తున్నాము.....దయ చేసి వీటిని ఇంట్లో మూలన పాడేయకుండా నిత్యం వినియోగించండి...” అంటూ తన ప్రసంగం ముగించాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆ హాలు మార్మోగిపోయింది.

వందన సమర్పణతో సభ ముగిసినట్లు ప్రకటించగానే, ప్రభుత్వ కార్యదర్శి, రచయిత తమ దారిన తాము వెళ్లిపోయారు. అయితే ఆ యువకుని చుట్టూ ఉద్యోగస్తులు గుమిగూడారు- అతని ప్రసంగాన్ని వేనోళ్ళ పొగుడుతూ, అతని ఫోన్ నంబర్, ఇతర వివరాలు నోట్ చేసుకొంటున్నారు. జనం తగ్గాక, తను కూడా ఆ యువకుని దగ్గరకు వెళ్లి అభినందిద్దామని అనుకొంటూ, కొంచెం వెనగ్గానే నుంచున్న రాఘవరావు గారిపై ఆ యువకుడి దృష్టి పడింది.  తన ఎదురుగా ఉన్న వారిని దాదాపు తోసుకొంటూ, అతడు వచ్చి రాఘవరావు గారి పాదాలకు నమస్కారం చేసాడు.

ఈ హటాత్పరిణామానికి చేష్టలుడిగి చూస్తున్న ఆయనతో- “మాష్టారూ గుర్తొచ్చానా? నేను – విజయ్ ని. వెంకటాపురం కరణం గారి మేనల్లుడిని. హైస్కూల్ లో మీ విద్యార్ధిని. మీ  అమ్మాయి దీప్తి క్లాస్ మేటుని......” అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు చెప్పిన విషయాల మూలంగా విజయ్ ని పోల్చుకున్న రాఘవరావు గారికి ఆశ్చర్యం, ఆనందం కలగలిసి, కొంతసేపటి వరకు నోట మాట రాలేదు. కాసేపటికి “చాలా ఆనందంగా ఉంది విజయ్, అనుకోకుండా చాలా ఏళ్ల తరువాత నిన్ను ఇక్కడ ఇలా కలుసుకోవడం – సరే కాని, నువ్వు మా ఊర్లో హైస్కూలు చదువు అయిపోయాక మరలా కలిసింది లేదు, ఇంజనీరింగ్, తరువాత ఎంబీయే చేసావు అని విన్నాను. ఇదేంటి మరి? స్వీట్ స్టాల్, పర్యావరణం, ఇంకుడుగుంతలు...” అంటూ రాఘవరావు గారు కురిపిస్తున్న ప్రశ్నలకు చిరునవ్వే సమాధానంగా ఇచ్చిన విజయ్ కుమార్, “మాష్టారూ, ముందు మా షాపుకి వెళ్లి, సావకాశంగా మాట్లాడుకుందాం ...” అన్నాడు. ఆ హడావుడి నుండి మొత్తానికి ఇద్దరు బయటపడి, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో ఇందిరా పార్కు పక్కనే ఉన్న ‘డైమండ్ స్వీట్ స్టాల్’ చేరుకున్నారు.

“రండి మాష్టారూ, మీ రాకతో నా షాపు ధన్యమైంది ......” అంటూ విజయ్ సాదరంగా ఆహ్వానిస్తుంటే, ఆ స్వీట్ స్టాల్ లోకి అడుగుపెట్టిన రాఘవరావు గారికి, ఆ షాపు వాతావరణం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కష్టమర్లతో కిటకిటలాడుతున్న ఆ షాపు రూపురేఖలు పూర్తి పల్లె వాతావరణంలో ఉన్నాయి. పేడతో అలికిన గోడలు, దానిపై సున్నంతో తెల్లని ముగ్గులు, గోమాతల చిత్రాలు, అన్నీఆశ్చర్యంగా గమనించారు. మిలమిలా మెరిసిపోతున్న ఒక పెద్ద రాగి బిందె లోంచి మంచి నీళ్ళు రాగి గ్లాసుతో ఇచ్చాడు – విజయ్ కుమార్.

కుర్చీలో సావకాశంగా అసీనులయ్యాక, తన మనసులో మెదులుతున్న సందేహాలన్నిటికీ సమాధానమా అన్నట్లు – “మాష్టారూ, నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం మీరే.....” అంటూ మొదలు పెట్టాడు విజయ్. “నేనా?” అంటూ ఆశ్చర్యపోతున్న రాఘవరావుగారితో, “అవును మాష్టారూ, మీరు మాకు హైస్కూలు లో చెప్పిన లెక్కలు, సైన్సు నాకు చక్కటి విద్యార్హతలు అందజేస్తే, నిత్యం పర్యావరణం పట్ల మనం చూపవలసిన బాధ్యత గురించి, సమాజానికి ఆదర్శంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరు ఎదగడం గురించి మీరు చెప్పిన విషయాలు – నేను – ఇలా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొనేటట్లు చేసాయి. అంతేకాదు, అన్నాహజారే, పాలేకర్, వంటి వారి ప్రభావంతో పర్యావరణ పరిరక్షణకు జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే, రసాయనాలు లేని, పూర్తిగా పర్యావరణ హితమైన ఆహార ధాన్యాలు, పదార్ధాలతోటే మిఠాయిలు తయారు చేసే ఈ దుకాణాన్ని ప్రారంభించాను.

స్వీట్లకు అవసరమైన పాలు, నెయ్యి, పెరుగు కోసం – దేశవాళీ ఆవులు పెంచడం మొదలుపెట్టాను. క్రమంగా గో సంబందిత ఉత్పత్తులపై పరిశోధన చేసి, ఉత్పత్తులను తయారు చేసి, అమ్ముతున్నాను- చూడండి...”, అంటూ గోమయంతో చేసిన అగరువత్తులు, షాంపు, సబ్బులు, సున్నిపిండి, తదితర ఉత్పత్తులు చూపించాడు. “నా వ్యాపారం లోని లాభాలలో అధికశాతం – ఉచితంగా వివిధ ప్రాంతాలలో ఇంకుడు గుంతల నిర్మాణానికి, వినాయక చవితి మండపాలలో మట్టి గణపతుల తయారీకి, చేతి సంచుల  తయారీకి వినియోగిస్తున్నాను” అన్నాడు.

ఆ మాటలు వింటున్న రాఘవరావు గారికి కళ్ళవెంబడి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి. తన దగ్గర చదువుకున్న అనేకమంది విద్యార్ధులు అత్యున్నత స్థానాలలోనూ, విదేశీ ఉద్యోగాలలోనూ స్థిరపడ్డారు, ఆ విషయాన్ని ఆయన ఎంతో గర్వంగా చెప్పుకుంటారు కూడా. అయితే, వారందరి కంటే ఉన్నతంగా నేడు విజయ్ ఆయన కళ్ళకు కనిపించాడు. గత 5,6 సంవత్సరాలుగా తాను చేసిన కార్యక్రమాలు, ఇంకుడుగుంతల నిర్మాణానికి సంబంధించిన పటాలు, సూచనలు విజయ్ చూపిస్తుంటే, రాఘవరావు గారు కన్నార్పకుండా చూస్తూ, శ్రద్ధగా వింటున్నారు. ఒక గోడపై “తవ్వండోయ్ ప్రతి ఇంటా- ఒక ఇంకుడు గుంత; ఇవ్వండోయ్ భూమికి బహుమతి ఎంతో కొంత” అంటూ రాసిన నినాదం ఆయనను కట్టిపడేసింది.

వెదకబోయిన తీగ కాళ్ళకు తగిలిన చందాన, తమ ఊరి సమస్యకు పరిష్కారం కళ్ళెదురుగా కనిపిస్తోంది రాఘవరావు గారికి. తన స్టాల్ లో ఉన్న వెరైటీ స్వీట్లను పరిచయం చేసి, రాఘవరావు గారి చేత కొసరి, కొసరి తినిపించిన తరువాత, “మాష్టారూ, ఈ స్వీట్స్ మీరు ఇంటికి పట్టుకెళ్ళి, అమ్మగారికి ఇవ్వండి. నా తరుపున బహుమతిగా..” అంటూ ఒక పెద్ద అట్టపెట్టె నిండా స్వీట్స్ సద్దుతున్న విజయ్ మాటలకు అడ్డు తగులుతూ, “ఈ చిన్న చిన్న బహుమతులతో నాకు పని లేదోయ్, ఇంతకన్నా పెద్ద బహుమతి నీ నుండి కోరుతున్నాను, కాదనకూడదు మరి..” అన్నారు రాఘవరావు గారు. “మాష్టారూ, ఏమి కావాలో చెప్పండి, నా దగ్గర మొహమాటం వద్దు” అన్నాడు విజయ్.  విజయ్ ఇచ్చిన నమ్మకంతో, రాఘవరావు గారు తమ ఊరి పరిస్థితి, తాగు నీటికి కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి వివరంగా చెప్పి- “వీటికి నువ్వే పరిష్కారం చూపగలవు అనిపిస్తోంది విజయ్” అన్నారు.

“అవును మాష్టారూ, మావయ్య కూడా నాకు ఒకటి రెండు సార్లు దీని గురించి చూచాయగా  చెప్పారు. అయితే, మీరు చెప్పేంత వరకు సమస్య ఇంత తీవ్రంగా ఉందని అనుకోలేదు. పట్టణాలలోనే మేము ప్రతి అపార్టుమెంట్ కాంపౌండ్ లో ఇంకుడుగుంతలు ఉండేటట్లు చూడడం ద్వారా భూగర్భజలాల మట్టం పెరిగేట్లు చేయగలిగాం....మీ ఊరిలాంటి చోట కొద్దిగా శ్రద్ధ పెడితే, ప్రజలంతా కలిసి వస్తే, అది పెద్ద సమస్య కాదు, తప్పనిసరిగా మరల వచ్చే వేసవికి నీటి ఎద్దడి లేకుండా ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకోవచ్చు” అన్నాడు.

“హమ్మయ్య...నీ భరోసాతో నా నెత్తిన పాలు పోసావు విజయ్, నీ గురువుగా ఆదేశించటం లేదు, మా ఊరి సర్పంచిగా అభ్యర్ధిస్తున్నాను - నువ్వు మా ఊరికి వచ్చి, ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణానికి విలువైన సూచనలు, ప్రణాళికలు రూపొందించడమే కాక, దగ్గరుండి వాటన్నింటి నిర్మాణాలను పూర్తి చేయించగలవా?” అన్నారు. 

“ఎంత మాట మాష్టారూ? మేము ఇంతటి వారం అవ్వటానికి కారకులు మీరు, పైగా పది మందికి పనికొచ్చే పనికోసం, మీరు మమ్మల్ని అభ్యర్ధించడం కాదు, ఆదేశించాలి...నేను తప్పనిసరిగా మీ వెంట ఉండి, ఆ పని పూర్తి చేస్తాను, అయినా, నేను నిత్యం చేస్తున్న పనే అది – నేను చిన్నప్పుడు చదువుకున్న ఊరికోసం ఆమాత్రం చేయలేనా?” అన్నాడు.

“ఈ రోజు రాత్రికి నా ఇంట్లో ఉండండి, రేపు సాయంత్రం ఇద్దరం కలిసి ఊరికి బయలు దేరి, పని ప్రారంభిద్దాం” అంటూ, “అన్నట్లు, మీరు నా బహుమతి తీసుకోనేలేదు...” అంటూ స్వీటు ప్యాకెట్టు మాష్టారి చేతిలో పెట్టాడు. “ఎందుకు తీసుకోలేదు? నా ఒక్కడికే కాకుండా, ఊరందరికీ నీ నుంచి బహుమతులు పట్టుకెళ్తున్నానుగా...నువ్వు అందించబోయే ఇంకుడుగుంతలే మాకు, మా ఊరికి “తీయని బహుమతి” అంటూ విజయ్ ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు రాఘవరావు గారు.

మరిన్ని కథలు
mancham kinda kaallu