Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: కాటమరాయుడు 
తారాగణం: పవన్‌ కళ్యాణ్‌, శృతిహాసన్‌, శివ బాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌, చైతన్య కృష్ణ, అలీ, నాజర్‌ తదితరులు. 
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల 
దర్శకత్వం: కిషోర్‌ కుమార్‌ పార్థసాని 
నిర్మాత:శరత్‌ మరార్‌ 
విడుదల తేదీ: 24 మార్చి 2017

క్లుప్తంగా చెప్పాలంటే

కాటమరాయుడు (పవన్‌ కళ్యాణ్‌) ఊరికి పెద్ద. ఆయనకు జనార్ధన్‌ (కమల్‌ కామరాజు), శివ (శివ బాలాజీ), కొండబాబు (అజయ్‌), చైతన్య (చైతన్య కృష్ణ) అనే నలుగురు తమ్ముళ్లు. తమ్ముళ్లంటే కాటమరాయుడుకి ప్రాణం. అలాగే ఊరి ప్రజలకు కూడా కాటమరాయుడంటే ఎంతో అభిమానం. అయితే ఆయనకి ఒక్కటే వీక్‌ నెస్‌. అదే అమ్మాయిలంటే అస్సలు పడదు. అలాంటి కాటమరాయుడి జీవితంలోకి అవంతిక (శృతిహాసన్‌) ఎంటర్‌ అవుతుంది. ఆమెతో కాటమరాయుడు ఎలా లవ్‌లో పడ్డాడు. అసలు అవంతిక కథేంటి? ఆమె రాకతో కాటమరాయుడి జీవితం ఏ మలుపు తిరిగింది? మరో పక్క తమ్ముళ్లు కూడా ప్రేమలో ఉంటారు. వాళ్ల ప్రేమ సంగతి అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? కాటమరాయుడు ఊరి కోసం, తమ్ముళ్ల కోసం ఏం చేశాడనేది తెరపై చూస్తేనే బావుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే

పవన్‌ కళ్యాణ్‌ కాటమరాయుడుగా ఒదిగిపోయాడు. సరదాగా నవ్వించాడు, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అభిమానుల్ని అలరించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేసేశాడు పవన్‌. కొత్తదనం ఏంటంటే, ఈ సారి పవన్‌ కళ్యాన్‌ పంచె కట్టులో కనిపించి, ఫ్యాన్స్‌కి మరింత బూస్టప్‌ అందించారు. పంచెకట్టులో పవన్‌ చాలా అందంగా కనిపించారు. నలుగురు తమ్ముళ్లకు అన్నయ్య పాత్రలో మొదటి సారి నటించినా, పవన్‌ ఆ పాత్రకి చాలా హుందాతనం తీసుకొచ్చారు. ఫ్యాన్స్‌ తన నుంచి కోరుకున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా సమపాళ్లలో అందించారు పవన్‌ కళ్యాన్‌ ఈ సినిమా ద్వారా. స్క్రీన్‌పై చాలా జోష్‌గా కనిపించారు.

శృతిహాసన్‌ చాలా అందంగా కనిపించింది. నటనలో ఎలాగూ టాలెంటెడ్‌ కాబట్టి, తన పాత్ర వరకూ తాను న్యాయం చేసింది. తమ్ముళ్లలో శివ బాలాజీకి, అజయ్‌కే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. రావు రమేష్‌ ఎప్పటిలానే తన డైలాగులతో, నటనతో ఆకట్టుకున్నాడు. విలన్‌గా తరుణ్‌ అరోరా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అలీ వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పంచ్‌ డైలాగులతో బాగా ఆకట్టుకున్నాడు. నాజర్‌ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.

ఆల్రెడీ 'వీరమ్‌' సినిమాని తెలుగులోకి వీరుడొక్కడే పేరుతో విడుదల చేశారు. దాంతో ఈ సినిమా కథేమీ కొత్తది కాకపోయినా, పవన్‌ కళ్యాణ్‌ తన స్టార్‌డమ్‌తో ముందుకు నడిపించేశాడు. అయితే దర్శకుడు డాలీ పవన్‌ కళ్యాణ్‌ కోసం కొన్ని కొన్ని సీన్స్‌ యాడ్‌ చేశాడు. పవన్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా లవ్‌ ట్రాక్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశారు. సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రసాద్‌ మూరెళ్ల కెమెరా పనితనం చాలా బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించారు. అనూప్‌ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కాస్టూమ్స్‌ బాగున్నాయి. 
ఫస్టాఫ్‌ చాలా సరదాగా సాగిపోతుంది. పవన్‌ వినోదంతో, చాలా బాగా ఆకట్టుకుంటాడు. అన్నదమ్ముల మధ్య సరదా సరదా సన్నివేశాలు మధ్యలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకుంటాయి. తమ్మళ్ల లవ్‌స్టోరీలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి. సెకండాఫ్‌ విషయానికొచ్చేసరికి సినిమా కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది కానీ చివరికొచ్చేసరికి పవన్‌ కళ్యాన్‌ పవర్‌ ఫుల్‌ పంచ్‌ డైలాగులు, యాక్షన్‌ సీన్స్‌తో మళ్లీ పుంజుకుంటుంది. అన్నదమ్ముల మధ్య ఎమోషనల్‌ టచ్‌ గుండెకు హత్తుకునేలా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే అన్నదమ్ముల సెంటిమెంట్‌ సీన్స్‌తో పతాక సన్నివేశాలకు సమపాళ్లలో న్యాయం జరుగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
అభిమానులు మెచ్చే కాటమరాయుడు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka