Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue206/587/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).... కీర్తన  తన కోపాన్నంతా బంతి మీద చూపించింది వాళ్ళు కాస్త పక్కగా నిలబడి స్టేడియం చూస్తూ ఎక్కడ ఏ ఎరేంజ్‌మెంట్స్‌ చెయ్యాలో మాట్లాడుకుంటున్నారు.

అతను మాట్లాడుతున్నా దృష్టి అంతా కీర్తన మీదే. ఆట మధ్యలో ఒకమ్మాయి కావాలనే బంతిని అతని వైపుకి కొట్టింది.

కీర్తన చిరు కోపంగా ఆమె వంక చూసింది.

గంతులు వేస్తూ తన దగ్గరకి వచ్చిన  బంతిని చేత్తో పట్టుకుని చిరునవ్వు నవ్వుతూ కీర్తన వైపు విసిరాడు. మీదకి దూసుకొచ్చిన బంతిని పట్టుకోక తప్పలేదు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వారు.

‘‘హౌ లక్కీ! ఆ హేండ్సమ్‌ చేయి తాకి వచ్చిన బంతి నాకయినా విసరలేదు గదే!’’ ఒకమ్మాయి దిగు నటించింది.

‘‘అయినా ఎవరికి సైట్‌ కొడ్తున్నాడో చూశావా? పాపం అతనికి తెలీదు. ‘ముద్ద పప్పుకి’ షీర్‌వేస్ట్‌’’ ఒక మ్మాయి ముద్దుగా అంది.

‘‘ఏయ్‌! మాటలు ఆపండి’’ గట్టిగా కసిరింది. వాళ్ళ మాటలు లీలగా వినిపించి నవ్వుకున్నాడతను.

బంగారం లాంటి ఆటని చెడగొడుతున్న అతని మీద కోపం ముంచుకొస్తోంది కీర్తనకి.

వాళ్ళ మాటలు ముగిసాక నెమ్మదిగా కదిలారు అందరూ. అతను కాస్త వెనగ్గా కదిలాడు. తన సెక్రటరీని పిలిచి...

‘‘ఆ అమ్మాయి ఎవరో కనుక్కో’’ మెల్లగా చెప్పాడు. ఎప్పుడు అమ్మాయి మాట అతని నోటి  వెంట వినని సెక్రటరీ బిత్తర పోయి ఆ పైన విలాశంగా నవ్వి అలాగేనంటూ వెళ్ళిపోయాడు.

వాళ్ళు అరగంట స్టేడియం అంతా తిరిగారు. మధ్య మధ్య అతని చూపులు  కీర్తన వైపే వున్నాయి.

ఆ అర గంటలో కీర్తన బయోడేటా అంతా సెక్రటరీ అతని ముందుంచాడు. విని తల పంకించాడతను.

కీర్తన ఆటలో లీనమై ఆడుతూనే వుంది.

అతను ఆమె వంక చూస్తూనే కారెక్కాడు.

......

రోజులా కాకుండా ఆ రోజు సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా వుంది. సాయంత్రం ఆరున్నర సమయంలో ఎప్పుడూ ఇంటికి వస్తుంటే మనసంతా గుఋలుగా వుంటుంది.

భయం భయంగా ఇంట్లో ప్రవేశించాక అలసిన శరీరం కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది.

ఆకలితో కడుపు నకనకలాడుతుంటుంది.  శారీరక శ్రమ ఉండే ఆట తను ఆడేది. బలమైన ఆహారం తినాలి. ఇంట్లో దేనికీ లోటుండదు.
కానీ సవతి తల్లి తీక్షణమైన చూపు నుంచి తట్టుకుని ఏది తినాలన్నా భయమే!

అందుకే సాధ్యమైనంత వరకూ కీర్తన వచ్చే టైంకి అశోక్‌ ఇంట్లోనే వుండి ఆమెకి కావలసిన ఫుడ్‌ని తనే దగ్గరుండి తినిపించేవాడు.
పిన్ని వూరు వెళ్ళిందీ అన్న విషయం మనసులో కదలాడుతూ ఆనందాన్ని కలిగించడం తప్పేమో కానీ అదే నిజం.

ఇంటికి రాగానే కూనిరాగాలు తీస్తూ బ్యాగ్‌ ఓ  మూలకి, చెప్పులు మరో మూలకి విసిరింది.

పనమ్మాయి వచ్చి నవ్వుతూ సర్దుతుంటే వారించి ‘‘అయాం సారీ!’’ అంటూ తనే సర్దుకుంది.

తండ్రి దగ్గరకి వెళ్ళి

రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని..

‘‘ఏం చేస్తున్నారూ?’’ అడిగింది.

ఆయన బుగ్గలూ, కళ్ళూ కదిలాయి.

‘‘‘ఆనందంగా వున్నారా?’’ అడిగింది.

ఆయన కళ్ళు నవ్వాయి.

‘‘ఆ!ఆ! సంతోషంగా ఉన్నారయితే. ఉండండి నేను స్నానం చేసి వస్తాను’’ చెప్పి కదిలింది.

అశోక్‌ కూడా ఏడింటికి వచ్చేసాడు. తండ్రికి మొహం కడిగి బట్టలు మార్చారు.

‘‘ముసలావిడ మాట్లాడలేదు. అలిగిందా?’’ రహస్యంగా అన్నని అడిగింది కీర్తన.

‘ప్చ్‌’ తనకి తెలీదన్నట్లు పెదవి విరిచాడు.

దేవుడి గది దగ్గర కూర్చుని వేదాంతంగా ఏదో మాట్లాడుకుంటోంది నానమ్మ.

‘‘ఏంటీ...?’’ దగ్గర కెళ్ళి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని అన్నాడు.

‘‘ఏముందీ మీ పిన్ని గురించే! ఇన్నేళ్ళచ్చినా వారానికి పదిసార్లు పుట్టింటి గడపతొక్కందే నడవదు’’ అక్కసుగా అంది.

‘‘ఎదరు గుండా అనరాదూ! వెనకా ఎందుకీ మాటలు?’’ అశోక్‌ కసిరాడు,

కీర్తన కూడా పక్కన వచ్చి చేరింది.

‘‘నానమ్మా! నీ చేతి వంట తిని చాలా రోజులయింది’’ గారంగా అంది.

‘‘నావంట ఏం తింటావులే! కొత్త రుచులు నాకేం వచ్చు’’ చేతులు తిప్పుతూ అంది.

‘‘నీ చేతిలోనే వుంది మహత్యం’’ మనవడు పొగిడాడు.

దాంతో తబ్బిబ్బయిపోయింది. వంట గదిలోకి రంగ ప్రవేశం చేసింది.

వంటావిడ చూస్తూ నిట్టూర్చింది.

ఎనిమిదిన్నరకల్లా వంట పూర్తయింది.

తండ్రికి కాపీ తెచ్చింది కీర్తన. అశోక్‌ పేపర్‌ చదువుతున్నాడు. నానమ్మ వంట గది గుమ్మంలో కూర్చుంది.

‘‘నాన్నగారూ....ఈ రోజు ఏం జరిగిందో తెలుసా?’’ కళ్ళింత చేస్తూ అడిగింది.

ఆయన ఆ మాట కొన్ని వేలసార్లు వినుంటాడు. ఏం జరిగిందని ఆసక్తిని కళ్ళలోనే ప్రదర్శించాడు.

‘‘ఈ రోజు నేను స్టేడియంకి వెళ్ళానా? గేమ్‌ ఆడుతున్నాము. మిగతా వాళ్ళందరూ సరిగా ఆడటం లేదు. ఎవరో అబ్బాయిని చూస్తూ
నిల్చున్నారు. నేను గట్టిగా తిట్టాను. చెప్పటం ఆపింది. ఆ తర్వాత చూశాను కదా! ఆ అబ్బాయి.... చెప్పడానికి ఇబ్బందిగా అన్పిస్తుందేంటీ? ఎంత వరకూ ఏం జరిగినా అది ఇంట్లో తండ్రితో, అన్నతో షేర్‌ చేసుకోగలిగింది కానీ....

ఇప్పుడు....యిలా....ఏం చెప్పలేక ఇబ్బంది పడటం విచిత్రంగా వుంది.  ఇందులో తన తప్పు ఏం వుందని?

అశోక్‌ పేపర్‌చదవటం ఆపి కీర్తన వంకే నిశితంగా చూస్తున్నాడు.

తన తప్పేం వుందీ అనుకోగానే ధైర్యం వచ్చేసింది.

‘‘నేను చూసే సరికి ఆ అబ్బాయి నన్నే చూస్తూ కనిపించాడు. అదేంటీ చిరాగ్గా....నాకు భలే కోపం వచ్చింది’’ కీర్తన మొహం....ఆమె ఫీలింగ్స్‌ చూసి పకాలున నవ్వాడు అశోక్‌.

‘‘ఇలానే అతని వంక చూశావా?’’

‘‘ఆ!’’

‘‘అయినా నీ వంక చూశాడా?’’

‘‘ఊ!’’అనుమానంగా అన్నవంక చూస్తూ అంది.

‘‘నీ మొహం చూశాక కూడా అతను నీవంక చూస్తూనే వున్నాడంటే గుండెబలం వున్నవాడే! అదే మామూలు వాళ్ళయితే గుండె ఆగి చచ్చి వుండే వాళ్ళు’’ తమాషాగా అన్నాడు.

అప్పటికి అర్ధమయింది అశోక్‌ ఏడిపిస్తున్నాడని.

‘‘చూడండి నాన్నగారూ!....అన్నయ్య....’’ బుంగ మూతి పెట్టి అంది.

ఆయన కళ్ళు కొడుకు వైపు తిరిగాయి.

ఆ కళ్ళు మూగగా ఏవో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి.

పెదవి దాటలేని భావం ఏదో కళ్ళలో సుడులు తిరుగుతోంది.

‘‘రాస్తారా....?’’ మంచం పక్కనే ఉన్న పుస్తకం, పెన్ను తీసి అందిస్తూ అడిగాడు.

‘‘ఊ!....’’  అన్న మూలుగు ఆయన గొంతు నుంచి వినిపించింది . వెనక్కి వాలి కూర్చోవడానికి వీలుగా దిళ్ళు సర్దాడు. లేచి కూర్చోబెట్టి పుస్తకం తను పట్టుకొని పెన్ను చేతికి యిచ్చాడు.

వెండి తీగల్లా మెరుస్తోన్న తండ్రి ఉంగరాల జుట్టు వంక చూస్తోంది కీర్తన.

తల కొంచెం చెదిరినట్లుగా ఉంటే రెండు చేతులతోనూ సరిదిద్దింది.

నానమ్మ కళ్ళు చెమర్చాయి. ఏ కన్నతల్లీ బిడ్డని కూడా ఇంత జాగ్రత్తగా చూసుకోలేదు!

తండ్రికి సేవ చేస్తున్నప్పుడు ఈ పిల్ల మొహంలో ఎంత తాదాత్మ్యతా!!! కడుపున పుట్టిన బిడ్డని లాలించినట్లు సాకుతోంది.కట్టుకోబోయేవాడు అదృష్టవంతుడు!

అంతే....ఎక్కడ రాసిపెట్టి వున్నాడో!

‘‘ఇంతకీ ఆ అబ్బాయి ఎంత సేపు చూశాడు?’’ఆసక్తిగా అడిగాడు అశోక్‌.

‘‘ఏమో నాకేం తెలుసు? నేను మళ్ళీ అటు వైపు చూస్తేగా!ఈ రోజు బాల్‌లో గాలి తక్కువై సరిగా ఎగరలేదు. దాని మీదే వుంది నాదృష్టి’’అంది.

‘‘అంతేలే....అంతకన్నా ఏం జరుగుతుందీ....?’’ నవ్వుకుంటూ అన్నాడు అశోక్‌.

మృదులాదేవి ఇంట్లో వుంటే ఇల్లంతా గంభీరంగా నిశ్శబ్దంగా వుంటుంది.

ఎవరు ఎవరితోనైనా మాట్లాడాలన్నా భయమే! ఎవరి గదుల్లో వాళ్ళు వుంటారు.

ముసలమ్మ పరిస్థితి మరీ హీనం. ‘మీకు ఒంట్లో బావుండదు‘ అని చెప్పి ఆమెనసలు గది దాటనివ్వదు.

అశోక్‌, కీర్తన మాట్లాడుకునేటపుడు ఒక గదిలోకెళ్ళి, మళ్ళీ ఎవరి గదుల్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు పడ్తారు.

భూపతికి మరీ దుర్భరంగా వుంటుంది. అప్పుడప్పుడూ హాల్లో అటూ ఇటూ తిరిగేవాళ్ళ వంక కంటి చివర్ల వరకూ తల తిప్పి చూసి మళ్ళీ పైకప్పు చూస్తూ వుంటాడు. మళ్ళీ ఎవరైనా అలికిడి చేస్తారా అని ఎదురు చూస్తూ వుండటం ఆయనకి అలవాటుగా మారింది.తండ్రి తమతో ఎక్కువ సేపు గడపాలనుకొంటున్నట్లు గమనించిన కీర్తన ఎప్పుడయినా హాల్లోకి వచ్చి ఎక్కువసేపు వుంటే మృదులాదేవి గబగబా వచ్చి అక్కడ ఎందుకు నిల్చున్నావన్నట్లు చూస్తుంది.

అసలు ఇలా గదిలో పెట్టి బందీ చేస్తేనే తట్టుకోలేక భూపతి సైగ ద్వారానే తన కోపాన్ని వ్యక్తం చేసి హాల్లోకి మంచం మార్పించుకున్నాడు.
హాల్లో అయితే వచ్చీ పోయేవాళ్ళ సవ్వడికి కాస్త కాలక్షేపం అవుతుందని ఆయన ఉద్దేశం.

భూపతి రాయడం పూర్తి చేసి కొడుకు వైపు చూశాడు.

ఆ పేపర్‌ తీసుకుని చూశాడు అశోక్‌. వంకర టింకరగా వున్నా ఆ అక్షరాలు తనకి చిరపరిచితమే!

‘‘కీర్తనని బాగా చూసుకో! పిచ్చిపిల్ల.... లోకం తెలీదు.  మంచి సంబంధం చూసి నువ్వే పెళ్ళి చేయాలి. తల్లీ, తండ్రీ అన్నీ నువ్వే....’’ అని రాసుంది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu aame oka rahasyam