Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu aame oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.http://www.gotelugu.com/issue206/588/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి )... కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే ముందు రోజు రాత్రి రాజేంద్ర గదిలో పుస్తకాల్లో అతడు అడ్డదిడ్డంగా రాసుకున్న వాక్యాలు  కళ్ళముందు మెదిలాయి పాణికి.

రాత్రి బంగళాలో  అందరూ మత్తులో జోగుతున్నప్పుడు, పాణి మేడమీద ఉన్న  రాజేంద్ర గదిలోకి వెళ్ళాడు ఆ  గదిలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని.  ఎవరైనా లేచి అడిగితే  ‘నిద్ర పట్టడం లేదు, ఏమైనా పుస్తకాలు ఉంటే చదువుదామని వచ్చాను’ అని చెప్పచ్చు అనుకున్నాడు.

అతడు అనుకున్నట్టుగానే గదినిండా రక రకాల కవితల పుస్తకాలూ.  రాజేంద్ర తన కవితలు రాసుకున్న నోట్ పుస్తకాలూ ఉన్నాయి. అన్ని పుస్తకాల నిండా, రాజేంద్ర రాసుకున్న ఇలాంటి చిన్న చిన్న కవితలు అడ్ద దిడ్డంగా ఉన్నాయి.  పుస్తకాలు చదువుతూ మధ్య మధ్యలో ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తే, భావావేశాన్ని  ఆపుకోలేక  రాసుకున్నట్టుగా ఉన్నాయి ఆ వాక్యాలన్నీ.

అన్నీ ప్రేమకీ, శృంగారానికీ సంబంధించినవే.  వాటిని చూస్తుంటే, అతడు ఎవరో స్త్రీతో  శృంగార సంబంధం కలిగి ఉన్నాడనీ, అది ఎఫైరో, ప్రేమో తెలియని స్థాయిలో ఆమెతో  గాఢమైన  అనుబంధంలో కూరుకుపోయి ఉన్నాడనీ అర్ధమయ్యింది.   

వజ్రాల గురించీ, అతడికి ప్రమాదంలో ఉన్నానన్న భయాన్ని కలిగించి తనకి మెయిల్ రాసేలా చేసిన పరిస్థితుల గురించే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని  గదంతా చాలా సేపు గాలించాడు. ప్రతి చోటా ఆ స్త్రీ గురించిన రాతలే తప్ప మరేం కనబడలేదు.   రాజేంద్రకి బుర్ర వేడెక్కిపోయింది.

అసలు ఎవరా స్త్రీ?  

ఆమెకీ  రాజేంద్ర మరణానికీ ఏదైనా సంబంధం ఉందా?!

అసలు తను రాజేంద్ర మరణం గురించి ఆరా తీస్తుంటే  ఇవన్నీ దొరుకుతున్నాయేమిటి?  ప్రసాద్ చెప్పినట్టుగా ఇది నిజంగా చిక్కుముడి లాంటి కేసే.  ఏ దారానికి ఏ దారంతో సంబధం ఉందో తెలియడం లేదు. ఏ దారాన్ని లాగితే ముడి విడుతుందో, ఏ దారాన్ని లాగితే ముడి బిగుసుకుంటుందో అర్ధం కావడం లేదు.

అతడు అలా ఆలోచిస్తున్న సమయంలోనే అతడి మొబైల్ ఫోన్ రింగయింది. రింగవుతున్న మొబైల్ ఫోన్  స్క్రీన్ మీద కనిపిస్తున్న  అన్నోన్ నెంబర్ తాలూకు ఎస్టీడీ కోడ్ చూడగానే  తనకి లాగడానికి మరో  దారం దొరికిందని అర్ధమైంది పాణికి... ఆ దారం వల్ల ముడి బిగుసుకుంటుందో, వదలవుతుందో తెలియదు కానీ... అది మాత్రం అతడు ఎదురు చూస్తున్న కాల్. అండమాన్నుంచి !

ఫోన్ ఎత్తి “పాణి స్పీకింగ్” అన్నాడు.

“సర్, నేను అండమాన్నుంచి  యోగేష్‍ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సర్?”

“బాగున్నాను యోగేష్. నువ్వెలా ఉన్నావు?”

“ఫైన్ సార్. మళ్ళీ ఏదో కేసు విషయంలో నాతో మాట్లాడాలన్నారట?”

“అవును యోగేష్. ఒక కేసు విషయంలో నీ సహాయం కావాలి” అన్నాడు పాణి. గతంలో అండమాన్లో తగిలిన  ఎన్నో  మిస్సింగ్ కేసులని యోగేష్ సాయంతో  సాల్వ్ చేసాడు పాణి. యోగేష్ చాలా ప్రొఫెషనల్ ట్రావెల్ గైడ్.  ట్రావెలర్స్‍తో అంటీ ముట్టనట్టుగా ఉంటూనే, వాళ్ళ గురించి అన్ని విషయాలూ అబ్జర్వ్ చేస్తాడు.  అది ఏదో క్రిమినల్ ఇంటెన్షతో కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళూ,  వాళ్ళ బ్యాక్ గ్రవుండ్ ఏమిటీ అన్న విషయాన్ని గ్రహించి, వాళ్ళ స్వభావాన్ని బట్టి అండమాన్లో జరిగే రక రకాల నేరాల బారిన వారు పడకుండా వాళ్ళని హెచ్చరించడానికి.  వాళ్ళ సేఫ్టీ కోసమే.  అన్నింటికీ మించి అతడికి అద్భుతమైన మెమరీ పవర్ ఉంది. అత్డి  మెమరీ పవర్ తన పరిశోధనకి ఎన్నో సార్లు ఉపయోగపడింది.

“చెప్పండి సార్. ఏమిటి కేసు? ఎవరిది?” అన్నాడు యోగేష్.

“ఆగస్టు నెలలో నిజామాబాద్ నుంచి రాజేంద్ర వర్మ అనే ఆయన అండమాన్ వచ్చి మన హోటల్లో పదిహేను రోజులున్నారు”

“సిర్నాపల్లి సంస్థానం చిన్న రాజావారు....”  పాణి మాటలని వింటూ వెంటనే అన్నాడు యోగేష్.

“ఎగ్జాట్లీ” అన్నాడు పాణి ఆనందంగా.

“ఎలా ఉన్నారు చిన్న రాజావారు?”  అడిగాడు  యోగేష్.

“ఆయన రెండు రోజుల క్రితమే ఆయన అనుమానాస్పద పరిస్థుతుల్లో మరణించారు. ప్రస్తుతం నేను పరిశోధిస్తున్నది ఆయన మరణం తాలూకూ కేసునే” నెమ్మదిగా అన్నాడు పాణి.

షాక్ తిన్నట్టుగా ఒక్క క్షణం ఆగిపోయాడు యోగేష్ “రాజ్ బహద్దూర్ రాజేంద్ర వర్మగారు... వచ్చిన ప్రతిసారీ మా హోటల్లోనే దిగేవారు.  ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే దగ్గరుండి చూపించేవాడ్ని.  చాలా  మంచి వ్యక్తి. ఆయనతో ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి నాకు. చెప్పండి? ఆయన గురించి మీకు ఏ సమాచారం కావాలి?”

‘నాకు ఏ సమాచారం కావాలో నాకే తెలియదు.  అంత గందరగోళంగా ఉందీ కేసు. ఆయన గురించి  నీకు తెలిసినది నువ్వు చెబితే, అందులో  నాకు కావాల్సిన ఏదైనా లింకు దొరుకుతుందేమో వెదుక్కోవాలి’ మనసులో అనుకున్నాడు పాణి.

“చెప్పండి సార్?”

“ఆయన చివరిసారిగా అండమాన్ వచ్చినప్పుడు ఆయనతో పాటూ అప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె?” అడిగాడు పాణి.

“ఆవిడ పేరు రత్నమాల... రాజావారి భార్య! వారు ఇక్కడికి వచ్చింది హనీమూన్‍కి”

“భార్యా?” ఆశ్చర్యంగా అన్నాడు పాణి. “అసలు రాజేంద్ర వర్మకి పెళ్ళైనట్టే ఇంతవరకూ నాకు తెలియదు. బంగళాలో కూడా అందరూ అతడ్ని బ్రహ్మచారి అనుకుంటున్నారు?  అతడి అంత్యక్రియలు కూడా బ్రహ్మచారికి జరిపించిన రీతిలోనే జరిపించారు. వాళ్ళ పెళ్ళి ఎప్పుడైంది? ఆ వివరాలు ఏమైనా నీకు చెప్పాడా రాజేంద్ర?”

“ఆగస్టులో అండమాన్ వచ్చే ముందర కూడా ఎప్పటిలాగే రాజేంద్రగారు నాకు ఫోన్ చేసారు. ఫలానా ఫ్లైటుకి వస్తున్నాను రిసీవ్ చేసుకోమని చెప్పారు.  ఎయిర్పోర్టులో రత్నమాల గారితో పాటూ దిగిన ఆయన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.  అక్కడే ఆయన  ఆవిడ్ని నాకు చూపించి ‘నా భార్య’ అని పరిచయం చేసారు. ‘నన్ను పిలవకుండా పెళ్ళి చేసేసుకున్నారా సార్?’ అని సరదాగా అన్నాను నేను.  దానికి ఆయన నవ్వి ‘మాది మామూలు వివాహం కాదు. గంధర్వ వివాహం’ అన్నారు”

“గంధర్వ వివాహమా?” ఆశ్చర్యంగా అన్నాడు పాణి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్