Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu aame oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue207/590/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి )... “ఆయన మాటలు అర్ధం కాక అప్పుడు నేను కూడా మీలాగే ఆశ్చర్య పోయాను. అసలు ‘గంధర్వ వివాహం’ అన్న మాటని నేను వినడం అదే మొదటి సారి. తల్లి దండ్రులకు చెప్పకుండా చేసుకునే ప్రేమ వివాహమే... ‘గంధర్వ వివాహం’ అని ఆయన చెప్పారు.  కేవలం దండలు మార్చుకోవడం మినహా ఈ పెళ్లిలో ఇంకేమీ ఉండదట. గుడి లోని దేవుడు తప్ప మా పెళ్లికి మరెవరూ సాక్షులు లేరు అన్నాడాయన.  ‘పెళ్ళికి ముందు శృంగారం కోసం దీవులకి వచ్చే వాళ్ళు ఇలాగే  కథలు చెబుతారు’  అనుకునే వాడ్ని ఆయన కాకుండా ఇంకెవరైనా ఆ మాట అని ఉంటే.  రత్న మాల గారి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ రాజేంద్ర వర్మ గారి స్వభావాన్ని అంతకు ముందే దగ్గరగా చూసి ఉండడం వల్ల వాళ్ళ మాటలని నమ్మాను. వాళ్ళు చెప్పినట్టు గానే ఆవిడ మెడలో మంగళ సూత్రం కూడా లేదు.  వేలికి మాత్రం ధగ ధగా మెరుస్తున్న  వజ్రంతో చేసిన ఉంగరం ఉండేది” గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా అన్నాడు.

“వాళ్ళిద్దరి మధ్యనా సంబంధాలు ఎలా ఉండేవి?”

ఒక్క క్షణం సందేహిస్తున్నట్టుగా ఆగి నెమ్మదిగా అన్నాడు “చాలా అన్యోన్యంగా ఉండేవారు. నిరంతరం ఒకరి కోసం తపించి పోతున్నట్టుగా ఉండేవారు.  ఎప్పుడూ ఒకరి చుట్టూ ఒకరూ చేతులు వేసుకుని ఒకరినొకరు విడిచి పెట్టలేనట్టుగా ఉండే వారు.  దీవుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లోనే ఒకరినొకరూ ముద్దులు పెట్టుకునేవారు. ఒకసారి...”

“ఊ...ఏమైంది?”  అతడు చెప్పడం అపెయ్యడంతో మళ్ళీ అడిగాడు పాణి.

“ఇది మీ పరిశోధనకి పనికొస్తుందో లేదో తెలియదు. ఒక కస్టమర్ తాలూకు వ్యక్తిగత వ్యవహారాలని బహిరంగ పరచడం టూరిస్టు గైడ్ గా సరి కాదని తెలుసు కానీ, అడుగుతున్నది మీరు కనుక, అడిగేది సత్య శోధన కోసం కనుక చెబుతున్నాను”

“చెప్పు- ఫరవాలేదు” అన్నాడు పాణి అతడి మాటలకి చిన్నగా నవ్వుతూ.

“ఒక రోజు రాత్రి  పదకొండవుతున్నా ఇద్దరూ హోటల్ రూమ్ కి రాలేదు.  సాధారణంగా ఇక్కడ టూర్లన్నీ సాయంత్రానికే పూర్తయి టూరిస్టులంతా హోటళ్ళకి తిరిగి వచ్చేస్తారు.  వాళ్ళు ఎంతకీ రాక పోవడంతో అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేస్తే,  ఇద్దరూ  బోట్ లు అద్దెకిచ్చే అతడికి  పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి ఒక ప్రైవేట్ మోటార్ బోట్ తీసుకుని, దాన్ని నడుపుకుంటూ దూరంగా ఉన్న దీవికి వెళ్ళారని తెలిసింది.  ఆ బోట్ యజమాని దూరం వెళ్ళద్దని వారిస్తున్నా వినకుండా వెళ్ళి పోయారట.  అప్పటి దాకా తిరిగి రాలేదని అతడు చెప్పడంతో ఖంగారు పడ్డాను నేను. ఆ రోజు పౌర్ణమి.  సముద్రం పోటు మీద ఉంటుంది. అదీ కాక రాత్రి పూట దీవులలో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి చాలా ప్రమాద కరం.  

అక్కడ వాళ్ళకే ప్రమాదం జరిగిందోనని నేను మరో బోట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిన దీవి వైపు వెళ్ళి, అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పోయాను...  అక్కడ ఆ దీవిలో, ఇద్దరూ ఏకాంతంగా, సముద్ర తీరంలో విహరిస్తున్నారు !   ఆ వెన్నెల్లో ఆ దీవిలో ఏకాంతంగా రాత్రంతా గడపడానికే అక్కడికి వెళ్ళారన్న వాళ్ళ ఉద్దేశం అర్ధమై నేను షాకయ్యాను.   చెసేది లేక వాళ్ళని  డిస్టర్బ్ చెయ్యకుండా తెల్లవారే వరకూ దూరంగా మరో చోట బోట్ లో వెయిట్ చేసి, తెల్ల వారేక వాళ్ళని  క్షేమంగా హోటల్ కి తీసుకుని వచ్చాను”  వింటున్న పాణికి క్షణ కాలం పాటూ సంభ్రమంగా అనిపించింది. అతడు చెప్పిన సంఘటనతో  రాజేంద్ర స్వభావం  ఏమిటో, వాళ్ళిద్దరి మధ్యనా  సంబంధాలు ఎలా ఉండేవో పూర్తిగా అర్ధమైంది.  రాజేంద్ర తన పుస్తకాల్లో రాసుకున్న వాక్యాల వెనుక భావావేశం కూడా అర్ధమైంది. ఒకరినొకరు అంత పిచ్చిగా ప్రేమించుకున్న వ్యక్తులు  మరి పెళ్ళెందుకు చేసుకోలేదు?   గంధర్వ వివాహం అని చెప్పుకుని పెళ్ళి కాకుండా కలిసి ఉండడం ఎందుకు?

“అసలు వాళ్ళు గంధర్వ వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటి? అది అతడి కోరికా ఆమె కోరికా?”   అప్రయత్నంగా అన్నాడు పాణి.“నాకూ మీలాగే అనుమానం వచ్చి ఒకసారి వాళ్ళని అడిగాను సార్.  అది రత్నమాల గారి కోరికట! ఆమెకి సంప్రదాయ వివాహం మీదా, కట్టుబాట్ల మిదా పెద్దగా నమ్మకం లేవట. అందుకే ఆమె మాట మీద ఇద్దరూ ఎవరికీ తెలియకుండా గంధర్వ వివాహం చేసుకున్నారట” చెప్పాడు యోగేష్.

పాణి మనసులో ఏవో అనుమానాలు మొలకెత్తాయి. అంత  ప్రాణంగా ప్రేమించిన మనిషి... రాజేంద్ర మరణించినప్పుడు ఏమై పోయింది?!

‘ముల్లు...

కాలిలో గుచ్చుకుంటే ఓర్చుకోవచ్చు

చేతిలో గుచ్చుకుంటే తీసుకోవచ్చు

గుండెలో గుచ్చుకుంటే మాత్రం  భరించడం కష్టం!’

రాజేంద్ర రాసుకున్న సూసైడ్ నోట్ లోని వాక్యాలు గుర్తొచ్చాయి.  అసలు రాజేంద్ర ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ రత్నమాలేనా?  వజ్రాలని తీసుకుని, రాజేంద్రని మోసం చేసి పారిపోయిందా? అందుకే రాజేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అనుమానం వచ్చింది.

“రత్నమాల ఎలా ఉండేది?”  అని అడిగాడు.

“అద్భుతమైన సౌందర్యం ఆమెది. ఉత్తర భారత దేశం నుంచీ, దక్షిణ భారత దేశం నుంచీ, ఆ మాటకొస్తే విదేశాల నుంచి కూడా ఎంత మందో యువతులూ, కొత్తగా పెళ్ళైన వాళ్ళూ అండమాన్ యాత్రలకి వచ్చిన వాళ్లని చూసాను.  కానీ రత్నమాల అంతటి అద్భుతమైన అందగత్తెని ఇప్పటి వరకూ చూడలేదు.  అంత అందమైనది కనుకే రాజేంద్రగారిని అలా కట్టి పడెయ్య గలిగింది అనిపించేది నాకు”

అతడు అంతగా వర్ణించి చెబుతుంటే, ఆమె ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది పాణికి.

“నీ దగ్గర అప్పుడు నువ్వు వాళ్ళకి తీసిన ఫోటో కానీ, వాళ్ళతో నువ్వు తీయించుకున్న ఫోటో గానీ ఉందా?”  అని అడిగాడు.

“లేదండీ” అన్నాడు యోగేష్.

“టూర్ లో తిరిగేటప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా?  వాళ్ళు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకునే వాళ్ళు?”

“వాళ్ళిద్దరూ ఎక్కువగా పొయెట్రీ గురించి మాట్లాడుకునే వారు”

“కవిత్వం, ప్రేమ సంభాషణలు కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకునే వారా? జాగ్రత్తగా గుర్తు చేసుకుని  చెప్పు?”

యోగేష్ కొద్ది సేపు ఆలోచించి అన్నాడు “మీలాంటి వాళ్ళ స్నేహం వల్ల నేను కొద్ది కొద్దిగా తెలుగు నేర్చుకున్నాను. నాకు తెలుగు తెలుసని వాళ్ళకి తెలియదు కనుక, తెలుగులో నా ముందర ఫ్రీగా మాట్లాడుకునే వారు.  మీరు ఇప్పుడు అడుగుతుంటే గుర్తుకు వస్తోంది. వాళ్ళు ఒక్కో సారి ఏవో వజ్రాల గురించీ, పురాతన నగల గురించీ మాట్లాడుకునే వాళ్ళు. నాకు  తెలుగు పూర్తిగా అర్ధం కాకపోవడం వల్ల  వాళ్ల సంభాషణ సరిగ్గా అర్ధమయ్యేది కాదు కానీ అది ఏదో రహస్యమన్న సంగతి మాత్రం అర్ధమైంది”

వింటున్న పాణి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అంటే, కోటలో  దొరికిన నిధి గురించి తెలిసిన మరో వ్యక్తి రత్నమాల !  ‘ఇప్పటికి కేసులో  పనికొచ్చే క్లూ ఒక్కటి దొరికింది’ ఆనందంగా అనుకున్నాడు.

“వాళ్ళ సంభాషణలో తరచుగా దొర్లే పేర్లు ఏమైనా గుర్తు తెచ్చుకుని చెప్పగలవా?”   

“పేర్లు...” అంటూ ఒక్క క్షణం ఆలోచిస్తూ ఆగాడు. తరువాత అన్నాడు  “వాళ్ళ సంభాషణలో  తరచుగా ఒక పేరు దొర్లుతుండేది.  చాలా విచిత్రంగా అనిపించేది నాకా పేరు... సరిగ్గా నోరు తిరిగేది కాదు”

“ఏమిటా పేరు?”  ఆత్రుతగా అడిగాడు పాణి.

“గుర్తుకు రావడం లేదు” నిరాశగా అన్నాడు యోగేష్.

‘ఛ...’ అసహనంగా అనుకున్నాడు పాణి.  సహజంగానే యోగేష్ ది  మంచి జ్ఞాపక శక్తి.  కానీ  తెలుగు వాడు కాక పోవడం వల్ల కొన్ని తెలుగు పేర్లు నోరు తిరగవు.  అందువల్లే ఆ పేరుని మర్చి పోయాడని అర్థమైంది. 

“ఆ పేరు సుప్రియా?”  అనుమానంగా అడిగాడు.

“కాదు...  ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉంటుంది. సరిగ్గా గుర్తు రావడం లేదు”

“సరే, బాగా ఆలోచించు. గుర్తుకు వస్తుంది. నీకు గుర్తు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్”  అని చెప్పి ఫోన్ పెట్టేసాడు పాణి.

నార్త్ ఇండియాకి చెంది, అండమాన్ లో  స్థిరపడ్డ యోగేష్ నోరు తిరగక  చెప్ప లేక పోయిన ఆ పేరు... బంగారు లక్ష్మి !!

....

బంగారు లక్ష్మిపేరు యోగేష్ నోరు తిరగకనే చెప్పలేదా, ఇంకేదైనా రహస్యమా......

ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్