Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu aame oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue208/591/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).....

ఆ అబ్బాయి తన వైపు అలా చూస్తుంటే తన ఫ్రెండ్స్ చెబుతున్నట్లుగా గొప్పగా లేదు. చాలా అవమానంగా వుంది. అయినా రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అన్నట్లు తన లోనూ ఏదో లోపముంటే తప్ప యిలా జరగదు. తను చాలా స్ట్రిక్ట్ గా వుండాలి. మనసులో గట్టిగా డిసైడ్ అయ్యింది కీర్తన.

‘‘లోకంలో రక రకాల మనుషులు వుంటారు....వాళ్ళు రక రకాలుగా ప్రవర్తిస్తుంటారు. మనం పట్టించుకో కూడదు’’ అంటూ డ్రస్ ఛేంజ్ చేసుకోడానికి డ్రస్సింగ్ రూం వైపు వెళుతూ అంది.

అంత నగ్న సత్యాన్ని విప్పి చెప్పిన కీర్తన వంక నిలువు గుడ్లు చేసుకుని చూస్తూ నిలబడ్డారు టీమ్ మేట్స్.

అయిదు నిమిషాల తర్వాత ఆట ప్రారంభమైంది.

సబ్సిట్యూట్స్ తో సహా పన్నెండు మంది టీమ్ లో వుంటారు. మామూలుగా గేమ్ లో ఆడేది ఆరుగురే.... ప్రాక్టీస్ టైమ్ లో ఈ పన్నెండు మంది రెండు జట్లుగా విడి పోయి హోరా హోరీగా ఆడతారు.

జనరల్ గా వీక్ ప్లేయర్స్ మీదే ఎక్కువ దృష్టి పెడతారు కీర్తన తన శాయ శక్తులా వాళ్ళ బలహీనతని సరి దిద్దడానికి ప్రయత్నిస్తుంది.
చాలా మంది క్రీడాకారులు ఆ పని చేయరు. తమకి తెలిసిన మెలకువ మిగతా వారికి చెబితే వారు ఆటలో తమని దాటి వెళ్ళి పోతారని భయం.

అయితే నిజమయిన స్ఫూర్తి, కమిట్ మెంట్ వున్న వారికి ఆ భయం వుండదు. కీర్తన ఈ కోవకే చెందుతుంది.

అంతే కాదు, నాలుగేళ్ళ కింద ఒక యువకుడు తన క్రీడా జీవితంలో తిప్పిన మేలి మలుపుని ఆమె ఎన్నటికీ మరవదు.

తన ఆటలోని బలహీనత ఏంటో తెలిపి ఒకే ఒక గంటలో దాన్ని సరి దిద్దిన మహానుభావుడు అతను అదంతా ఏదో కలలో జరిగినట్లుగా అనిపిస్తుంది.

కల లాగే అదృశ్యమయి పోయాడు. తను సంపూర్ణంగా మెలకువలన్నీ గ్రహించానన్న ఆనందంలో, సంబరంలో వుండగా వెళ్ళి పోయాడు అతను.

‘ప్రణీత్!’

యస్! అతని పేరు ప్రణీత్!...అంతే తెలుసు తనకి.

కృతజ్ఞతలు చెప్పాలన్న జ్ఞానం కూడా తనకి లేక పోయింది. అతన్ని చూడాలని ఎన్నోసార్లు తలపించి పోయింది. ఎపుడు మ్యాచవుతున్నా ప్రేక్షకులు కూర్చున్న వైపు పరికించి చూస్తూ వుండేది.

ఎపుడూ అతను కనిపించే వాడు కాదు. మ్యాచ్ ముగిశాక విజయం సొంతమయ్యాకా తన కళ్ళు అతని కోసమే వెతికేవి.

ప్రతి మ్యాచ్ లో బూస్టర్ బూస్టింగ్ చేసి బాల్ తనకి పాస్ చేసినపుడు తను రివ్వున లేచి కాళ్ళు వెనక్కి మడిచి ఆ బంతిని స్మాష్ కొట్టినప్పుడల్లా ఏనాడూ దానికి ఎదురు లేక పోయేది. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అతని చప్పట్లు యిమిడి వున్నాయేమోనని ఆశగా వెతికేది.

కళ్ళు ఆనందంతో బాధతోనో చెమర్చేవి.

ఆమె టీమ్ మేట్స్ ఎంత అల్లరి చేసినా ఆటకి సంబంధించి కీర్తన ఏం చెపితే అది మారు మాట్లాడకుండా వింటారు.

ఎందుకంటే....ఆ ఆట మీద ఆమెకి వున్న కమాండింగ్ అటువంటిది.

ఆమె తల కాస్త పక్కకి తిప్పినా క్లియర్ గా కనపడే పొజిషన్ తో కూర్చున్నాడతను.

కానీ అతనికి తెలీదు...ఆ సమయంలో అతను వెళ్ళి ఎదురుగా నిలుచున్నా, అతని తల ఆమెకి ఆటలో వాలీబాల్ లా కనిపిస్తుందని!
పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమె వంకే కళ్ళార్పకుండా చూస్తున్నాడు.

ఒక్క సారయినా తల తిప్పి చూస్తే తన చూపుతో ఆమె చూపుల్ని కట్టి పడేయాలని అతని ఉద్దేశ్యం. కానీ ఎక్కడా! అసలు ఒక్క సారయినా తల తిప్పి చూస్తేగా!

ఒక అందమైన యువకుడు తన వంకే తదేకంగా అదే పనిగా చూస్తున్నాడన్న ధ్యాసయినా లేదామెకి.

మిగతా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, ఉత్సాహంలో తాదాత్మ్యతతో ఆటని ఆడటం లోని మజాని అనుభవిస్తోందామె.

అతను తన మనసు ద్వారా ఆమె వేవ్ లెంగ్త్ ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

నువ్వు నన్ను చూస్తున్నావ్!

తల తిప్పి నా వైపే చూస్తావ్!

నన్ను చూడాలని నీకు బాగా అనిపిస్తుంది!

‘‘నా వంకే చూడూ....’’ అంటూ రకరకాల సజెషన్స్ ఆమెకి టెలీపతి ద్వారా పంపడానికి ప్రయత్నించ సాగాడు.

కానీ ఏ మాత్రం అతని ప్రయత్నాలు ఫలించిన దాఖలాలు కనిపించటం లేదు.

ఆమె అదే పనిగా హుషారుగా గంతులు వేస్తూ ఆడుతుంటే, అతనిది పూర్తిగా ఒంటరి ప్రయత్నమే అయింది.

కీర్తన సీరియస్ నెస్ చూసి మిగతా వాళ్ళు కూడా తాత్కాలికంగా ఆ అబ్బాయిని దృష్టి పథం నుంచి తప్పించి ఆట మీద ధ్యాస పెట్టారు.
మూడు గేమ్ లు  ఆడాక అందరూ ఇళ్ళకి బయల్దేరారు. కీర్తన బ్యాగ్ సర్దుకోవడం చూసి అతను లేచి నిల్చున్నాడు.

‘‘నిన్ను ఈ రోజు వదలడు...’’ ఇంకో అమ్మాయి గుసగుసగా అంది.

‘‘ఎవరు?’’ అయోమయంగా అంది కీర్తన.

విసుగ్గా నుదురు కొట్టుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళి పోయింది.

జనరల్ గా ప్రాక్టీసయ్యాక అమ్మాయిలు పోలోమంటూ హడావిడిగా ఎవరి దోవన వాళ్ళు వెళ్ళి పోతుంటారు.

కానీ కీర్తన బాధ్యతగా నెట్, బాల్ అన్నీ వాచ్ మాన్ కి అప్పగించి ఆ తర్వాత తను బయల్దేరుతుంది.

ఆ రోజూ అలాగే....అన్నీ అప్పచెప్పి బయల్దేరే టైమ్ కి అందరూ వెళ్ళి పోయారు.

బ్యాగ్ భుజానికి తగిలించుకుని, తల దించుకుని ఆ రోజు ఆట లోని తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ నడుస్తోంది.

కాస్త దూరం నడిచే సరికి ఏదో అడ్డు వచ్చింది.

ఎడమ పక్కకి జరిగింది.

ఆ వస్తువు అటు జరిగింది.

మళ్ళీ కుడి పక్కకి జరిగింది.

ఆ వస్తువు ఇటు జరిగింది.

చివాలున తలెత్తి చూసింది. ఎదురుగా ఆ అబ్బాయి. అదేంటీ ఇందాకటి నుంచీ ఈ అబ్బాయి....ఇక్కడే వున్నాడా? ఎందుకు....?
ఎందుకైతే తన కెందుకు?

ముందుకు నడవబోయింది.

అతను చెయ్యి అడ్డుగా పెట్టి ఆపాడు.

‘‘ఏంటిది చిరాగ్గా?’’ అంది.

అప్పుడు ఆ సమయంలో ఆమె ఫ్రెండ్స్ వుంటే పగలబడి నవ్వేవారు.

ఎందుకంటే.... ‘‘ ‘ ఏంటది చిరాగ్గా!’’ అన్న ఆమె డైలాగ్ వెనుక పెద్ద స్టోరీ వుంది.

కీర్తన చాలా అందంగా వుంటుంది. అందులోనూ ఆంధ్రా కెప్టెన్. దాంతో అబ్బాయిల ఫాలోయింగ్ ఎక్కువగా వుంటుంది.

దాంతో ఆమెతో పరిచయం పెంచుకకోవాలని ఉవ్విళ్ళూరే అబ్బాయిలు కోకొల్లలు. . ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేక పోవడంతో ఆ అమ్మాయి తమ కోసమే పుట్టినట్లు ప్రతి ఒక్కరూ ఫీలయి పోయేవారు!

ఓ ఫైన్ డే...బాగా ముస్తాబయి, పది సార్లు ఏం మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకొని కొండొకచో చేతిలో ఫ్లవర్ పట్టుకొని, స్టయిల్ గా కారో బైకో దిగి, కీర్తనకి ఎదురుగా వెళ్ళి ‘‘హలో కీర్తనా...’’ అంటూ ఎవరైనా మాట కలపబోతే...

‘‘ఏంటిది చిరాగ్గా!....’’ మొహం చిట్లించుకొని ఎదుటి వాడిని పురుగుని చూసినట్లు చూస్తూ అంటుంది కీర్తన.

అంతే!.....

ఎదుటి వ్యక్తికి నిజంగా తాము ఆమె కన్నా హీనం అన్న భావం వచ్చేస్తుంది.

మరి మాట్లాడకుండా వెనక్కి తిరిగి అదే పరుగు. బతికుంటే అనాకారిని చేసుకునయినా బతకొచ్చు కానీ, ఎంత అందగత్తయితే మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఏ గొంగళి పురుగునో చూసినట్లు చీదరించుకుంటూ మాట్లాడే అమ్మాయిని ఎవరు భరించ గలరు?
అలా ఎంతో మంది అబ్బాయిలు ప్రయత్నాలు పురిట్లోనే సంధి కొట్టినట్లు’ విఫలం కావడంతో, కీర్తన అంటే అబ్బాయిలకి జడుపు, అమ్మాయిలకు నవ్వులు  కలుగుతాయి.

ఇప్పుడూ యధా విధిగా ‘ఏంటి చిరాగ్గా’ అనగానే, ఆ అబ్బాయి ఫీలింగ్స్ మార్చండి’’ కామ్ గా అన్నాడు.

బిత్తర పోయింది కీర్తన.

అలవాటు లేని ఎదురు దాడి ఇది. అసు తన డైలాగ్ కి అందరూ అమడ దూరం పరుగెడితే, ఇతను ఎదురు నిలవడమే గాక....మళ్ళీ తనకి డైలాగు చెపుతాడా!

‘‘ఎవరు మీరు....?’’ గంభీరంగా మాట్లాడాలని నిశ్చయించుకుని అంది.

‘‘కనపడటం లేదా....? రెండు కళ్ళు, ముక్కు, నోరు, రెండు చెవులు....’’

‘‘అవి మనుషులకే ఉండాలని రూల్ లేదు’’ ఇంత తెలివిగా తనకి మాటలు నోటి నుంచి దొర్లినందుకు ఆనంద పడి పోతూ అంది.

‘‘మిమ్మల్ని చూశాక ఆ విషయం కూడా అర్ధమయింది.’’ నిట్టూర్చాడతను.

‘‘ఆ...’’ రెండు నిమిషాలకి అతనేమన్నాడో అర్ధమై కోపం వచ్చింది.

అంత లోనే సడెన్ గా గుర్తొచ్చింది. ముక్కూ మొహం తెలీని మనిషితో తను అంత సేపు అధిక ప్రసంగం చేస్తొందని!

‘‘తప్పుకోండి, నేను వెళ్ళాలి’’ గట్టిగా అంది.

‘‘మీ పేరు చెప్పండి. వదులుతాను.’’

‘‘ఎందుకు?’’

‘‘ఎందుకేంటి? జస్ట్ పరిచయం....’’

‘‘నాకు చెప్పాల్సిన అవసరంలేదు.’’

‘‘మీరు అసలు వాలీ బాల్ ప్లేయరేనా?’’ గంభీరంగా అడిగాడు.

తెల్ల బోయింది కీర్తన.

‘‘ఏం?’’ తగ్గి పోయి అడిగింది.

‘‘వాలీ బాల్ ప్లేయర్స్ ఎప్పుడన్నా అభిమానుల్ని కించ పరుస్తారా?’’ ఆవేదనగా అన్నాడు.

‘‘అభిమానులా.....! ఎవరికీ....?’’

‘‘మీకే....!

‘‘ఎవరూ....?’’

‘‘నేనే....!’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్