Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram telugu serial tenth part

ఈ సంచికలో >> సీరియల్స్

ఈవెంట్ మేనేజర్ - సోమరాజు సుశీల

event manager story by somaraju susheela

ఇప్పటి మాటా! ఎప్పుడో యాభై ఏళ్ళనాటిది. రెండో ప్రపంచ యుద్ధం డిప్రెషన్ లో చిత్తయి కుదేలయిన కుటుంబంలో పెద్ద పిల్ల పెళ్ళి. అదీ మేనమామతో, గుడి సత్రంలో. ఎవరు మగ పెళ్లివారో, ఎవరు ఆడ పెళ్ళివారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పెళ్ళివారి బస్సు సత్రం ముందు ఆగగానే పెళ్లి కూతురి తల్లి వియ్యపురాలిని కావలించుకుని 'అమ్మా' అంటూ బావురుమంది.

'తప్పు! తప్పు! శుభమా అంటూ పెళ్లి వారొస్తే అలా కళ్ళనీళ్ళు పెట్టుకో కూడద'ని పెద్దవాళ్ళు కేకలేశారు. ఆ ఏడు పేదో అప్పగింతలయ్యాకంటూ కన్యాదాత కసురుకున్నాడు.

'మీ ఇంట్లో అందరూ ఇంతే! మనసులు మహాకఠినం! మన చిట్టిగాడుండుంటే ఈవేళ ఎంత సందడి! అక్కని నేల మీద నడవనిచ్చేవాడా ? మీరొక్కరే అన్నిపనులూ నొల్లుకుంటూ సైకిలు మీద తిరిగేవారా? నా బతుకే పాపిష్టిది' - ఐదేళ్ళనాడు రెండు రోజుల జ్వరంతో కన్నుమూసిన కొడుకుని తల్చుకుని మళ్ళీ ఇంకొక్క వరస కళ్ళనీళ్ళాపుకుంటూనే తమ్ముడికి, అదే కాబోయే అల్లుడికి హారతిచ్చింది. ఆ రోజులలో మనిషులు పోయి పదేళ్ళయినా కూడా శుభాలప్పుడు అయినవాళ్ళు కనిపిస్తే కళ్ళనీళ్ళు నదులుగా ప్రవహించేవి. మరిప్పుడు ఎవరైనా పోయారని పలకరిద్దామని ఏ మర్నాడో వెడితే పిజ్జాలో, బిరియానీలో తెప్పించుకుని, సీరియల్స్ చూస్తూ తింటూ ఉంటారు. పోయినవాడి ఫోటో ముందించిన అగరొత్తుల పొగకి దగ్గుతూ, విషాదాన్ని వెంటనే మర్చిపోవడం ఇప్పటి పద్ధతి. ఒక్క రాజకీయనాయకులు పోతే మాత్రం టి.వి సాక్షిగా దేశమంతా మూడు రోజులేడుస్తుంది.

బస్సు దిగిన వాళ్ళు పెద్ద పెళ్లివారిలా డాబుగా ఏం లేరు. తెల్లారగట్ల లేచి బస్సులో కోటిపల్లి రేవుకొచ్చి గోదారి దాటి, మళ్ళీ బసెక్కి నాలుగింటికి విడిదికి చేరిన వాళ్ళెంత నీరసంగా దుమ్ముకొట్టుకు పోయుంటారో అలాగే ఉన్నారు. అందరికీ ఆడపెళ్ళివారి సత్తామీద అనుమానమే. పాపం ఉత్తినే భయపడ్డారు గానీ సత్రమైనా ఎంత కళకళలాడిపోతోందో! ఎటు చూసినా ముగ్గులే. ఎన్ని రకాలో, నడవలోనూ, మెట్లమీదా, గదుల్లోనూ వేసిన ముగ్గు వేయకుండా కళ్ళు చెదిరిపోయేటట్టు. ఇంకా రాత్రి పెళ్లి జరగాల్సిన హాల్లో అయితే పెద్ద కళ్యాణ మండపం ముగ్గు. పెళ్లి కొడుక్కి అతని స్నేహితులకీ అని కేటాయించిన గది వాకిటికి నెమళ్ళు అల్లిన లేసుల తోరణం. అందులోనే చెరోపక్కా వధూవరుల పేర్లు కూడా అల్లికలో వచ్చేశాయి.

'ఏవే కావుడూ! ఈ ముగ్గులన్ని మన స్వర్ణగాడు పెట్టినవేగా! ఈ లేసెప్పుడల్లిందే?' అంటూ అత్తగారు, మనవరాలు అంటే కాబోయే కోడలి పనితనాన్ని చూసి మురిసిపోయింది.

'ఫలహారాలు కానిద్దురుగాని రండి' అంటూ చిన్న విస్తల్లేశారు. వీళ్ళు అద్దెకుండే ప్లీడరు గారి భార్య తన నోముల్లో నందికేశుడి శనగలు, పరవాన్నం మిగిలిపోయాయని బాధపడుతుంటే 'మా మనవరాలి పెళ్ళిలో చెల్లించేసుకోండ'ని చెప్పి ఆవిడకి సాయంచేసి పెట్టింది పెళ్ళికూతురి బామ్మ సరమ్మగారు.

"సరి! సరి! ఫలహారాలంటే ఏ ఉల్లిపాయ పకోడీలన్నా ఉంటాయనుకున్నా! ఈ నందికేశుడి ప్రసాదాలా?" అని వెక్కిరిస్తూనే పెళ్ళికొడుకు పెద్ద బావగారు ఆ నాలుగ్గింజలూ నోట్లో వేసుకున్నారు. ఆకలి మహత్యం అలాటిది మరి!

'బావా! నా మాట దక్కించు! స్వర్ణ నీ కూతురే అనుకో' అని దణ్ణం పెట్టింది కాముడు. ఇంటికి పెద్దల్లుడంటే వియ్యంకుడి కన్నా పవర్ ఫుల్ కదా మరి. అందరూ తలోపక్కనా సామాన్లు సర్దుకొని స్థిమితిపడ్డాక వియ్యంపురాలిని పలకరించేందుకు విడిది గదికి వెళ్ళింది సరమ్మగారు.

'ఏం వదినా! ప్రయాణంలో ఇబ్బంది పడలేదు కదా! అన్నగారేరి కనబడ్డం లేదూ! ఇదిగో ఈ పట్టు మేం ఆడపెళ్ళివారం. మీరు మగపెళ్ళివారై పోయారు. మీకు చేయాల్సిన మర్యాదలన్నీ మీ అమ్మాయికే అప్పజెప్పా. అన్నీ అడిగి చేయించుకోండి. రెండింటికి స్నాతకం పీటలమీద కూచోవాలిట. ఇంక మా బంగారుతల్లి స్వర్ణగాడు మీ ఇంట్లో అడుగుపెట్టిందంటే మీకెలా కలిసొస్తుందో చూడండి? దానిది మహారాణి జాతకం. ఎవరు దాని చెయ్యి పట్టినా ముద్రికా యోగం తప్పదని అది పుట్టినప్పుడే వాళ్ళ తాతగారు రాసుంచారు. ఇంకా మన భాస్కరం కలెక్టరయేది ఖాయం. అంతా మీ అదృష్టం వదినా! మా ఇంటిపిల్ల మీ ఇల్లు మెడుతోంది. ముగ్గులు చూశారా! మూడు రోజుల్నుంచీ పొద్దున్నే వచ్చీ సాయంత్రం వరకు గుడినిండా కూడా వేసింది. పూజారి గారు ఎంత సంతోషించారో. ముహూర్తం టైం కి స్వామివారి తరపున పూలహారాలు పంపిస్తానన్నారు. ఇంక నే మళ్ళీ కనిపిస్తా' అంటూ వచ్చినావిడ వెళ్ళిపోయింది. మాట్లడవల్సినవన్నీ మాట్లాడేయడమే కానీ ఎదుటి వాళ్ళని నోరిప్పనిచ్చే స్వభావం కాదు సరమ్మగారిది. బిక్కుమొహం వేసుకుని తలాడించడమే తప్ప నోరు పెగిల్తేనా పెళ్ళి కొడుకు తల్లికి! పిల్లనిచ్చుకున్నామని చెప్పి పాతికేళ్ళుగా అణిగిమణిగున్నావిడకి మప్పుడు కొత్తగా వియ్యపురాలి హోదా ఏం వస్తుంది? జిల్లా మొత్తంలో ఎవరన్నా సరమ్మగారి ముందు నోరిప్పడమే! ఇంకేమైనా ఉందా!

అప్పుడు నోరు పెగిలింది పెళ్ళికొడుకు నాలుగో అక్కగారికి. అమ్మా అదేంటే అలా బిగుసుకుపోయావ్. మరీ విచిత్రం! తానొక్కతికే మనవరాలైనట్లు. దాన్ని చేసుకోవడం మన అదృష్టమన్నట్లు మరీ ఇంత గడుసుతనమా? పదివేల రూపాయల కట్నాన్ని కాదనుకుని అక్క మొఖం చూసి పిల్లని నువ్వు కడుపులో పడేసుకుంటుంటే, కాస్తన్నా గౌరవం లేకుండా! రేపు నిజంగా మన బాచిగాడు పరీక్ష పాసైతే వాళ్ళ గొప్పదనం వల్ల అంటుందేమో!

'పోన్లే! ఎవరి గొప్ప వల్లయితేనేం. వాడీ పరీక్ష గట్టెక్కి ఉద్యోగస్థుడైతే ఇంక మాకే బెంగా లేకుండా వాడి దగ్గిర పడుండొచ్చు. రెండేళ్ళ నించీ ఏ ఉద్యోగం లోనూ చేరకుండా రాత్రనక, పగలనక కష్టపడ్డాడు పిచ్చి నాగన్న. ఎన్నో అనుకుంటాం! ఎవరి అదృష్టాలెలా ఉంటాయో ఎవరికీ తెలుసు? మన కావుడ్నిచ్చినప్పుడు వీళ్ళది మూడూల్ల కరణీకం, ముఫ్ఫై పుట్ల భూమి. వాళ్ల ఊళ్ళో ఎవరి పెళ్లన్నా మంగళ సూత్రాలూ, మధుపర్కాలు ఆవిడచేత్తో ఇవ్వాల్సిందే. ఎన్ని వందల పెళ్ళిళ్ళయ్యాయో ఆవిడ చేతుల్లో. కాలమహత్యం కాక సత్రంలో జరగడం ఏవిటి చెప్పు! కాలం ఎంతటి వాడ్నయినా వంచుతుందంటారు గానీ ఈవిడ్నేం చెయ్యలేకపోయింది. ఆస్తులు హరించిపోయినా ఝాంకారం పిసరంతైనా తగ్గాలా!' అని కూతుర్ని కాస్త హెచ్చరించింది.

'ఊరికే పోతాయేవిటి ఆస్తులూ! మావిడిపళ్ళు ఎవరెక్కువ తింటే వాళ్లకి బహుమానాలని చెప్పి కాపు అంతా ఊళ్ళో పిల్లలచేత తినిపించీ, ఎక్కడా పెళ్లి కావాల్సిన పిల్లలు కనబడకపోతే ఓ పాలేరాడికి ఆడవేశం వేసి, ఇంకో పాలేరాడి కిచ్చి మూడు రోజులు, బోగం మేళంతో సహా పెళ్ళి చేసి, ఇడ్డెన్ల వద్దని చెప్పి సుబ్బయ్యశెట్టికి వారానికో వెండి గ్లాసు పంపించీ, ఇలా ఒకటా, రెండా... ఇదేగా వీళ్ళు చేసిన నిర్వాకం. చూడు పాపం! పిల్ల జమీందారల్లే పెరిగిన చిన్న బావ ఇప్పుడు మండుటెండలో సైకిలెక్కి తిరిగుతూ, కాంట్రాక్టరు దగ్గర మేస్త్రీ ఉద్యోగం చేస్తూ రెండు గదుల కొంపలో ఒక్కడూ ఇంటి భారాన్ని మోస్తూ! ఇన్నేళయి కాపురానికొచ్చినా అక్కకి ఏ  విషయంలోనూ నోరెత్తడానికి లేదు కదా! అదో వెర్రిబాగుల్ది. 'ఆ' అన్నా, 'ఊ' అన్నా అన్నిటికీ బావురుమనడం తప్ప ఏమీ తెలియదు. అందుకే మనమందరం ఆవిడకి లోకువ. అక్కలాగే చేతకాని వాళ్ళం అనుకుంటోంది. " ఆడబడుచు కదా మరి. మాట్లాడకుండా వుండలేకపోతోంది!

"సర్లే! నాన్నగారు పేకాటలో కూచున్నట్లున్నారు. నువ్వు వెళ్లి నాన్నగారి దగ్గిర పది రూపాయలుంచి, పర్సు పట్టుకెళ్ళి బాచికిచ్చేయి. తిరుగు ప్రయాణంలో అవస్థపడిపోతాం. పెద్దాడ సూరం పిన్ని పిల్లలంతా ఆటలో దూరినట్లున్నారు. ఆఖరి దమ్మిడీ అయ్యేవరకూ వదలరు." పేకాటలో స్థిరపడిపోయిన పెళ్ళి పెద్ద పర్సు దాచేందుకు కూతుర్ని పంపించింది.

ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో దర్జాలకీ, ధారాళానికీ పేరు పడ్డది విస్సన్న పంతులు గారి కుటుంబం. ఆరుగురన్నదమ్ములకీ ఆయనే పెద్ద. ఆయనకి ఒక్కడే కొడుకైనా లంకంత లోగిట్లో ఎటు చూసినా జనమే. ఎవరికీ ప్రత్యేకించి చదువులూ లేవు. పనులూ లేవు. కరణీకం పనులూ, వ్యవసాయం పనులూ అన్నీ ఆయనే చూసుకునేవారు. ఇంట్లో ఆడవాళ్ళందరూ రకరకాలు వండుకోవడం, తిన్నంత తినడం, పారేసినంత పారేయడం, రెండ్రోజులకోసారి గూడుబండి కట్టుకొని కాకినాడెల్లి మూడాటలూ చూసి తెల్లారాక ఇల్లు చేరడం. ఇంక మగవాళ్లయితే పగలంతా పేకాట. సాయంకాలం వేట. డిప్రెషన్ దెబ్బకి పైకి ఎవరికీ చెప్పుకోలేక, మింగలేక అప్పులవాళ్ళ నూరుకోబెట్టలేక ఉన్నట్టుండి రాత్రి నిద్దట్లోనే ప్రాణాలు వదిలారు పంతులుగారు. అప్పుడందరూ కళ్ళు తెరిచి ఆవలిస్తూ ఆలోచించేలోపే సమయాతీతమైపోయింది. ఆస్తులమ్మడం తప్ప ఎవరికైనా ఏ పనైనా చెయ్యడం వస్తే కదా! అయిదారేళ్ళు గడిచేటప్పడికి పొలాలూ, భూములూ, తోటలూ ఆ ఊరి కామందులకీ, కరనీకాలు దూరపు దాయాదులకీ అమ్మేసుకొని చెల్లాచెదురైపోయి తలోచోటా నిజంగానే తలదాచుకుని బ్రతుకుతున్నారు. కానీ ఇంత ఆస్తి ఇలా పల్లాములై పోయిందని గానీ, డెబ్బై రూపాయల జీవితానికి కొడుకు ఎర్రటెండలో మేస్త్రీ ఉద్యోగం చేయాల్సి వచ్చిందని గానీ, నలుగురాడపిల్లలూ, ఇద్దరు మగపిల్లలూ చకచకా ఎదిగొస్తున్నారనీ గానీ, సరమ్మగారికే బెంగా లేదు. ఎవడి తలరాతెలా ఉంటే అలా జరుగుతుందని ఆవిడకో గట్టి నమ్మకం.

ఆ ఇంట్లో సరమ్మగారు తప్ప మిగతా వాళ్ళంతా అనామకులే అయినప్పటికీ పద్దెనిమిదేళ్ళ మనవరాలు స్వర్ణ మాత్రం నిజంగా బంగారు బొమ్మే! బామ్మకి తగ్గ మనవరాలు. ఏ పని చేసినా వచ్చూవరం ఉండవు. ఓ లేసులల్లడమేనా, ముగ్గులు పెట్టడమేనా, గోరింటాకులు పెట్టడమేనా, ఎవరి పెళ్ళికెళ్ళినా రకరకాల పువ్వుల జడలెయ్యడమేనా అన్నిట్లోనూ ఫస్టే! అవన్నీ చూసే కదా పాపం బాచిగాడనబడే భాస్కరం మనసు పారేసుకున్నదీ! భాస్కరానికి బయట సంబంధం చేసుకుంటే వాళ్ళిచ్చే పదివేలు కట్నంలో ఆఖరిదాని పెళ్ళి చేయాలనుకున్న ఇంటిల్లిపాది ప్యాన్లూ తల్లకిందులైపోయాయి. 'మరి చెల్లాయి పెళ్లెల్లెలా? అంటే నే అప్పు చేసి పెళ్లి చేసి తరవాత తీర్చుకుంటానమ్మా! స్వర్ణని కాదంటే నేను పెళ్ళే చేసుకోనని భీష్మించుకు కూచున్నాడు. మావయ్య చేసుకోకపోతే నే నూతిలోకి దూకి చస్తానని ఇది బెదిరింపు. ఇంక ఎవ్వరూ మారు మాట్లాడకుండా, బాచిగాడి పరీక్షలవగానే ముహూర్తాలు పెట్టుకున్నారు. కన్యాదాత ఆఖరి చెక్క అమ్మేసి రెండు వేలు తెచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టగానే అది పట్టుకెళ్ళి చెల్లాయి పెళ్ళివారికి కట్నం అడ్వాన్సిచ్చేశారు. ఇంక ఇప్పుడు పెళ్ళి ఖర్చులకి అటూ ఏవీలేదు. ఇటూ లేదు. ముహూర్త బలం వల్ల ఆ శుభకార్యం జరగాల్సిందే.

'మా మనవరాలు పుట్టినప్పుడే మా పెద్దవాళ్ళు కట్టించిన వీరేశ్వరుడి గుళ్ళో పెళ్లి చేస్తామని మొక్కుకున్నాం' అని చెప్పి సరమ్మగారు వాళ్ళు కాపురం ఉంటున్న ఊళ్ళో సత్రంలో పెళ్ళి అని నిర్ణయించేసింది. అందరికీ కార్డు మీద చేతిరాత ఆహ్వానాలే. శుభలేఖ ఖర్చెందుకు ఊళ్ళోవాళ్ళని బాగుచేయడానికి కాకపోతే! మరుదులకీ ఆడపడుచులకీ తేవాల్సిన బహుమతులన్నీ పురమాయించింది. రామూర్తి పానకం బిందెలూ, కాళ్ళు కడుగు పళ్ళెం, సుందరీ వాళ్ళు మధుపర్కాలీ, పెళ్లికొడుక్కి వాచీ, రాజారాం వాళ్ళు అప్పగింతల బట్టలూ, పెద్ద మేనత్త చేత్తో తలా రెండొందలూ అయిదు రకాల ఫలహారాలు ఇలా పెళ్లి కూతురికిచ్చే సారెతో సహా అన్నీ ఏర్పాటుచేసుకుంది. కాని ఎంత చేసినా మరి ఆరోజుల్లో ముహూర్తం అయ్యాక పెట్టేదే పెళ్లి విందు కదా! క్లుప్తంగా చేద్దామన్నా రెండు భోజనాలు రెండు టిఫిన్లూ తప్పడం లేదు. దగ్గిర వాళ్ళే వందమందవుతున్నారు.

నందికేశుడి పేరు చెప్పి మధ్యాహ్నం టిఫిన్లు గట్టెక్కారు. తెల్లారగట్ల లేచి ఎండలో ప్రయాణం చేసి వచ్చారేమో మగ పెళ్ళివారంతా సొమ్మసిల్లి పడున్నారు. రాత్రి వంటలవుతున్నాయి. వంట చేసేది ఒక ముసలాయనా, మనవడూ. వాళ్ళూ సత్యం జట్టులో వాళ్ళే. కాని పెద్దజట్టు మొత్తం కాకినాడ తాసీల్దారు గారి అమ్మాయి పెళ్ళికి బుక్కయిపోయింది. సత్యం మాత్రం ఏడు మైళ్ళు సైకిల్ మీద తిరుగుతూ అటూ ఇటూ మాట రానీయకుండా చూస్తున్నారు. అరటికాయుప్మాకూర, కందిపొడి, గోంగూర, దోసావకాయ, పప్పుపులుసు చిన్నవడ్డన లడ్డూ అన్నీ సరిచూసుకుని ఇంక నే వెడుతున్నానని అమ్మగారికి చెప్పాలనుకుంటూ ఆరున్నరకల్లా సైకిలెక్కి వెళ్ళబోతున్న సత్యం
ఒక్కసారి ఆగిపోయి చూస్తూ నిలబడిపోయాడు.

తెల్లగా మెరిసిపోతూ రంగురంగుల జంపఖానాలు అలంకరించుకుని పువ్వుల దండలు, చమ్కీలు సీగారించుకుని గంటలు మోగించుకుంటూ నిజమైన పెళ్లి వారెప్పుడొస్తారా అన్నట్టు పాటలూ, పద్యాలతో హోరెత్తుతూ సత్యం ముందు బళ్ళు. ఆడామగా పట్టుబట్టలతో, ఉన్న అన్ని నగలతో, సెంటువాసనలతో, పిల్లా పాకా కలిసి అథమపక్షం నాలుగొందల మంది. ఇంకా ఎంతమందున్నారో వెనకబడ్డ బళ్ళు వచ్చి కలుస్తున్నాయి.

'దండాలు పెగద్దమ్మగారూ,' సంతోషం అమ్మగారూ,' 'ఇంకా మా మీద గయుంచారండమ్మా,' 'మన బామర్ది గారికే ఇత్తన్నారంటగా,' 'అబ్బో ఎంత బాగుండారో!' 'ఇక మన బంగారమ్మ కలెక్టరు గారి భార్య అయిపోతారన్నమాట! ఇలా పట్టరాని సంతోషంతో వానాకాలపు జల్లు మీద జల్లులా జడివానలా ఒకటే జనం. ఊర్నించి పెళ్ళిబళ్ళు వచ్చాయని విని సరమ్మగారు వాకిట్లోకి వచ్చింది.

'ఏం కనకయ్యా బాగున్నావా? మమ్మల్ని మర్చిపోయావనుకున్నా. ఏరా కన్నలూ మనవడుట్రా నీకూ, ఏం పేరు పెట్టావ్? బాపినీడు గారూ మా మూల పొలం ఎలా ఉంటుందోనని వెనకాడారు. మొన్న నలభై అయిదు బస్తాలయ్యాయట కదా!' ఇలా ఒక్కొక్కళ్ళనే పలకరిస్తోంది. అందరికీ వాకిట్లో జంపఖానాలు పరిపించి కూచో పెట్టించింది. కోడలు కంగారు పడిపోతోంది. 'అత్తయ్యా! ఎలా? ఎలా? అంటూ భయానికి అప్పుడే ఆ అర్భకురాలి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

'నువ్వు మాట్లాడకుండా ఇక్కడ నించి పోయి మీ అమ్మతో కబుర్లు చెప్పుకో! విడిదిల్లు విడిచిపెట్టి రాకు. మన చవటని నేనోసారి పిలిచానని చెప్పు' అని కోడలిని ఆర్డరేసింది. అదెవరో తెలుసు కాబట్టి కావుడి వెంటనే వెళ్లి పోయింది. ఇంకా అప్పటికీ ఆ సత్రంలో కరెంటు దీపాలు లేవు. అన్నీ నూనె దీపాలే. వాటికన్నా గాడిపొయ్యి వెలుతురే మెరుగ్గా ఉంది. భోజనాల టైంకి వెలిగించుకోవచ్చునని చెప్పి రెండు పెట్రోమాక్స్ లైట్లు తెప్పించుంచారు. కాసేపటికి ఆవిడగారి వంశోద్ధారకుడు కన్యాదాత వణుక్కుంటూవచ్చాడు 'ఏవిటే అమ్మా! పిలిచావుట' అంటూ.

'నే బతికుండగా తీరువొస్తుందటరా నీకు! మన ఊళ్ళో పెళ్లి పెట్టుకుంటే తట్టుకోలేమని చెప్పేగదా. దిక్కుమాలిన వాళ్ళల్లా ఈ సత్రంలో చేస్తున్నాం, చిన్నప్పుడే మొక్కుకున్నామని పుట్టెడబద్ధాలాడీ! ఎక్కడెక్కడి వాళ్ళకో అయిదు రోజుల పెళ్లి చేసిన దాన్ని సొంత మనవరాలి పెళ్లి అర్ధరాత్రి ముహూర్తం ఏరీకోరీ పెట్టించి గుట్టుచప్పుడు కాకుండా కానిస్తుంటే నీకేవన్నా చీమ కుట్టినట్లన్నా ఉందా! భాద్యత ఎప్పటికి తెలుస్తుందిరా? మన ఊరెప్పుడెళ్ళావ్? వీళ్ళందరినీ ఎప్పుడు పిలిచావ్? పోనీమంటే ఇలా పిల్చానని నాతో మాట మాత్రమైనా చెప్పావా? మన ఇల్లమ్మేశాక నేనావూల్లో అడుగుపెట్టానా? ఇప్పుడే గంగలో దూకమంటావురా?'

ఆవిడ మాటలు వింటున్న సత్యం కల్పించుకున్నాడు.

"కంగారు పడకండమ్మా. నేనో గంటాగి వెళతాగా! ఇప్పటి మట్టుకు అన్నీ సరిపోతాయి. ఒక్క మూట బియ్యం పడేయ్యండి చాలు. మీకు మాట రానిస్తానా' అంటూ ఎక్కిన సైకిలు దిగి, అరటిగెల ముందేసుకున్నాడు సత్యం.

'ముహూర్తం పెట్టడానికి పేరయ్య శాస్త్రిగారు మనింటికి వచ్చినప్పుడే అడిగానే ఓ అయిదొందలు పెళ్లినాటికి సద్ధమని.. శివరాత్రెళ్ళాక రమ్మన్నారు. ఆ డబ్బులు తీసుకోడానికి వెళ్ళినప్పుడు అబ్బాయిగారిటొచ్చారేంటో అని అందరూ అడుగుతుంటే మిమ్మల్ని పెళ్ళికి పిలవడానికి వచ్చారని ఆయన చెప్పారు. ఒకళ్ళకి చెప్పి ఇంకోళ్ళకి చెప్పకపోతే బాగుండదని అందరికీ చెప్పొచ్చా.

శుభలేఖలివ్వలేదు గదా ఎవరూ రారేమోలే అని నీతో చెప్పలేదు. నిజంగా ఇంత మందీ వస్తారనుకోలేదే.' 'సర్లే! వాకిట్లో అందరినీ జాగర్తగా పలకరించు. పాపం వాళ్ళేవేళప్పుడు బయల్దేరారో! దాహం కనుక్కో. భోజనాలు ఏర్పాటు చేసి పిలుస్తా' అంది.

పెళ్ళికని వచ్చిన రైతులెవరూ చేతులూపుకుంటూ రాలా! పది అరటి గెలలూ, గుమ్మడి కాయలూ, ఆనపకాయలూ, బండెడు ఘుమఘుమలాడిపోయే చిన్న రసాలూ, పెళ్ళి వేళ దాహానికని కొబ్బరి బొళ్ళాలూ, అయిదు వీశల నెయ్యీ. అరిశలూ అన్నీ తెచ్చారు గానీ బియ్యంమూట మాత్రం ఎవరూ తేలేదు. ధైర్యంగా మిగతా వంట కానిస్తున్నారు. ఎసల్లు మరిగిపోతున్నాయి. ముందు మగపెళ్ళి వారి భోజనాలవుతున్నాయి. వంటసావిట్లో సత్రంగుండిగలు మెరిసిపోతున్నాయి. ఆవిడ నెమ్మదిగా ప్రభాకరాన్ని పిలిపించింది.

'ఒరే! దొడ్డిగుమ్మం దగ్గరికి కళ్ళిగాడ్ని బండి తోలుకురమ్మను! ఇదిగో ఈ గుండిగట్టికెళ్ళి కాస్త అసింటా ఉన్న ఏ కొట్లోనో పెట్టి బస్తా బియ్యం మంచివి వేయించుకురా! ఎవరికంటా పడకూడదు. తెల్లారేటప్పటికి విడిపించుకుందాం అని చెప్పు. ఇక్కడున్నట్టు రావాలి. ఈ విషయం బయటికి పొక్కిందో అదిగో అ గుళ్ళో కూచున్న మూడోకంటివాడి సాక్షిగా ఆ నూతిలోకి తోసేస్తా నిన్ను! వినిపిస్తోందా?' వాడు మహా అసాధ్యుడు. నెమ్మదిగా గుండిగ నీళ్ళు పారబోసి బండిలో పెట్టుకునెళ్ళి పావుగంటలో బియ్యం బస్తాతో తిరిగొచ్చాడు.

'ఎవరన్నా చూశారేమిట్రా?'

'లేదు. దొడ్డా! కొట్లో వెలుతురు లేదు. తెల్లరేలోపు వచ్చి తీసుకుంటాం అని తీసుకొచ్చా... అవునూ! ఇప్పుడు లేని డబ్బులప్పుడెక్కడ్నించొస్తాయే?'

'నీ అత్తారిస్తార్లే వెధవా! అన్నీ ఆరాలే! ఇంక ఇక్కడ చేసింది చాలు గానీ పోయి వడ్డన కలుస్తుందో, లేదో చూడు. అరటికాయ ముక్కల్లో అగరొత్తులు గుచ్చారో లేదో! కళ్ళిగాడ్ని రాయబారం పద్యాలందుకోమన్నానని చెప్పు!'

ఆఖరి బంతి భోజనాలవుతుండగానే పెళ్ళికూతురికి తలంటు పోయడానికి వెళ్ళిపోయింది. పెద్ద తలకట్టు, సాంబ్రాణి పోగేసి చిక్కులు తీసి పొడుగు మొగ్గలూ కనకాంబరాలు దవనంతో వదులు వదులుగా వంకీల జడ. జడ కుప్పెలు. జడ చూస్తేనే కళ్ళు తిప్పుకోలేం. ఎప్పుడో ఏన్నర్ధం నించీ దాచుంచిన తోపురంగు అరణి పట్టుచీర ప్లీడరుగారి అబ్బాయి పెళ్ళికి కావుడికి పెట్టింది. ఇప్పుడు గౌరీపూజకి అక్కరకొచ్చింది. కోరుకున్న మొగుడు దొరికాడన్న సంబరంతో కళకళ్ళాడిపోయే ఆ చక్కదనానికి వేరే అలంకారాలెందుకట.

నాలుగుంపావుకి ముహూర్తం అయింది. స్వామివారి తరపున వచ్చిన గుండుమల్లె పూలదండలతో పెళ్ళి మండపం గుబాళించిపోయింది. వాళ్ళిద్దరి తలంబ్రాల పోటీ కాగుగానీ చుట్టూ మూగిన పిల్లమేలం నెత్తిన కూడా అక్షింతలు కనిపించాయి. పెళ్లికొడుక్కి పిల్ల ధ్యాస తప్ప వేరే ఏ ధ్యాసా లేదు. ఇక చదివింపులు మొదలయ్యాయి. అన్నీ విస్సన్న పంతులుగారి మనవరాలు ఛి:సౌ: స్వర్ణలతాదేవికే. పెద్దిరాజు గారూ, కనకయ్య గారూ, బాపినీడు గారూ, వెంకాయప్ప గారూ, సీతయ్య గారూ, భద్రి రాజూ, వెంకట్రావుడూ... చదివింపులవుతూనే ఎండెక్కే లోపల ఊరు చేరాలని బళ్ళు బయల్దేరాయి. ఫలహారాల పర్యవేక్షణకి వంటసావిట్లోకి వెళ్ళింది కళ్ళు తుడుచుకుంటూ సరమ్మ గారు. ఊళ్లోకి బండెక్కి షికారెల్లిన గుండిగ మళ్ళీ వచ్చి నేస్తాల సరసన ఏవీ ఎరగనట్లు గట్టెక్కింది.

అప్పగింతలై పెళ్ళివారెళ్ళిపోయాక చూసుకుంటే అన్ని ఖర్చులూ పోనూ, రెండొందల రొక్కం, మూడు నెలల గ్రాసం మిగిలాయి. సత్యం చేతిలో యాభై రూపాయలు పెట్టబోతే 'వద్దంటే వద్దు! స్వర్ణమ్మ నాకేవీ కాదా' అంటూ దణ్ణం పెట్టి సైకిలెక్కి వెళ్ళిపోయాడు.

అలా మావయ్యని వరించి పెళ్ళాడిన స్వర్ణ, తాతగారు రాసిన జాతకం పొల్లుపోకుండా మగడికి ముద్రికాయోగం పట్టించి, బామ్మ దీవెనలు ఫలించి తన ఇల్లు వేయిళ్ళ మొదలై, చుట్టాల సురభి అయి, బంధువుల భాగ్యశాలి అయి, నూలు లేని పుట్టం కట్టుకుని, లెక్కలేని సొమ్ములు పెట్టుకుని తన పెళ్ళి స్వర్ణోత్సవం కూడా జరుపుకుంది.

ప్రస్తుతం అమెరికాలో పుట్టి పెరిగిన తన మనవరాలి పెళ్ళి ఏర్పాటుచేయాలని తాపత్రయపడుతోంది. మాటిమాటికీ బామ్మని తల్చుకుంటూ ఆవిడెంత కష్టపడిందోనని నిట్టూరుస్తోంది. ఇంకా ముహూర్తం నెల్లాళ్ళుంది. ఆడ పెళ్లివారూ, మగ పెళ్లివారూ అందరూ అక్కడ్నించి రావాల్సిందే. ఇక్కడ లంకంత కొంపలో పెద్దవాళ్ళు తప్ప ఎవరూ లేరు. పెళ్ళి కూతురికి ఇండియాలోనే పెళ్ళి చేసుకోవాలని మనసేయడంతో ఇరుపక్షాలవారూ సగం బోయింగు మాట్లాడుకుని వస్తారుట ముహూర్తానికి మూడు రోజుల ముందు. 'ఎలాగో! ఏవిటో! ఏం చెయ్యాలో' అని కంగారు పడుతుంటే భాస్కరరావు గారి గొంతు వినిపించింది.

'ఇదిగో బంగారూ! విశ్వం ఫోన్ చేశాడు. పెళ్లి పనులన్నీ ఎవరో ఈవెంట్ మేనేజరుట వాళ్లకప్పజెప్పాడుట. మనిద్దరం దేనికీ హైరానా పడక్కర్లేదు. అన్నీ వాళ్ళే చూసుకుంటారుట.

'మనల్ని కష్టపెట్టకూడదని వాడికెంత తాపత్రయమో! పోనీలే ఇదీ మన మంచికే.'

'ఎందుక్కాదు! మనకన్నా పుచ్చుకునే వాడికి మరీ మంచిది. మూడు లక్షల అడ్వాన్సు!'

'అడ్వాన్స్ మూడైతే మొత్తం బిల్లెంతవుతుందో! ఇంతకీ అన్ని లక్షలుచ్చుకుని వాళ్ళేం పనులు చేస్తారో!'

'పెళ్ళి పిలుపులు, రిజర్వేషన్లు, హోటల్లు, పెళ్ళి బ్రాహ్మణులు, వీడియోలు, వాయినాలు, బహుమతులు, రిసెప్షన్లు కచేరీ... ఒకటేవిటీ మూడు ముళ్ళేయడం తప్ప అన్నీ వాళ్ళే చేస్తారుట. పెళ్లి పెత్తనం చేద్దామని ఆశపడ్డట్టున్నావ్ పాపం! మనం వాళ్ళెక్కడ కూచోమంటే అక్కడ కూచోవాలి. పెట్టినది తినాలి! అన్నట్లు కాయితం పెన్ను పట్రా. మన వాళ్ళ లిస్టు తయారు చేద్దాం - అదొక్కటే మనం చేయవలసిన పని.'

పెన్నందిస్తూ అడిగింది - 'మరి పెళ్ళికొడుకు తల్లి ముహూర్తానికి చీర తెచ్చుకుంటుందా? లేకపోతే అత్తగారి లాంచనం చీర ముందే ఇచ్చేయమంటుందా?'

'నాకేం తెలుసు! వెళ్ళి గుండిగ నడుగు తెలుస్తుంది.'

'గుండిగనడగడమేం ఖర్మ. ఏకంగా బామ్మనే అడుగుతాను రాత్రి కల్లో కొచ్చినప్పుడు. అయినా ప్రేమ పెళ్ళంటారు. ఇంత ఖర్చేమిటో! నాకప్పజెపితే ఒక్క లక్ష మిగిల్చి ఏ పేదింటి పిల్లలో అక్షింతలు పడేయించకపోదునా! డబ్బూ లక్ష్యాలూ లేవు. ఏ లక్ష్యాలూ లేవు. పాపం బామ్మకి తెలిస్తే ఏం అనేదో!'

 

(...వచ్చేవారం వంశీ కి నచ్చిన మరో కథ)

మరిన్ని సీరియల్స్