Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anathagiri hills - tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆదాబ్ హైదరాబాద్: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

aadab hyderabad book review

పుస్తకం: ఆదాబ్ హైదరాబాద్
చిత్ర రచన: సుభాని
వెల: 250 రూపాయలు
ప్రతులకు: http://www.supatha.in/index.php/adaab-hyderabad.html

ప్రతి వారం తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు పరిచయం చేసే నాకు ఈ వారం ఒక విశేషమైన పుస్తకం నా కంట పడింది. రకరకాల కార్టూన్లు, క్యారికేచర్లతో ఇది చదవలేని వారిని కూడా సంతోషపెడుతుంది. చిత్రరచనకి ఏ భాషా అవసరంలేదు. మనసు భాష, మనిషి భావం తెలిస్తే చాలు. ఆ రెండూ బాగా తెలిసిన ప్రముఖ కార్టూనిస్ట్ సుభాని ఈ పుస్తక రూపకర్త.

డెక్కన్ క్రానికల్ పేపర్ పరిచయమున్న వారికి సుభాని పరిచయం అవసరం లేదు. గత 22 యేళ్లుగా విరామం లేకుండా కౌంటర్ పాయింట్ శీర్షికన వేలాది కార్టూన్లు గీసి ఏనాడో కోట్లాది పాఠకులకు దగ్గరయ్యారు. ఇప్పటికి 25,000 లకు పైగా కార్టూన్లు 15,000 పైగా చిత్రాలు గీసారు. అంతేకాకుండా గ్రీస్, బెల్జియం, జెర్మని, స్వీడన్, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఎన్నో కర్టూన్ సంబరాల్లో వీరు బహుమతులు కూడా గెల్చుకున్నారు.

ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సంస్కృతి, భాష, పరిసరాలు, పర్యాటక స్థలాలు అంశాలుగా తీసుకుని కళ్లని, మనసుని ఆహ్లాదపరిచే బొమ్మలు గీసారు ఇందులో. ఈ 48 పేజీల పుస్తకాన్ని ఒక గదిలో కూర్చుని తిరగేస్తూ పోతే చాలు హైదారాబ్ చుట్టి వచ్చిన అనుభూతి కలుగుతుంది. నిజాము నవాబుల క్యారికేచర్లతో మొదలయ్యే ఈ పుస్తకం బిర్లా మందిర్ స్కెచ్ తో ముగుస్తుంది. అక్కడక్కడా బొమ్మల పక్కన ఉన్న డయలాగ్ బాక్సుల్లోని హైదరాబాద్ భాష, యాస నవ్వించడం ఖాయం.

ఎక్కువగా పాత బస్తీ వాతావర్ణం మీద దృష్టి పెట్టడంతో ఈ పుస్తకంలో సింహ భాగం ఆ ప్రాంతపు చిత్రాలు దర్శనమిచ్చినా హైటెక్ సిటీ, శిల్పారామం, హుస్సేన్ సాగర్లకు సంబంధించిన వర్ణ చిత్రాలు కూడా కనపడతాయి. ఏదో బొమ్మ గీయడం అంటే గీసేయడం కాకుండా ప్రతి చిత్రం మాట్లాడుతున్నట్టు, మాట్లాడకపోయినా ఏదో భావప్రకటన చేస్తున్నట్టు అనిపించడం చిత్రకారుడి ప్రతిభకు ప్రతీకగ నిలుస్తాయి.

హైదరాబాద్ వాసులు వేరే ప్రాంతాల నుంచి తమ ఇంటికి అతిధులుగా వచ్చే వారికి, అలాగే వేరు వేరు కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీటింగులు జరిగినప్పుడు వచ్చే అతిధులకి ఈ పుస్తకం కాపీలను ఇస్తే హైదరాబాద్ నగరానికి ప్రచారం చేసినట్టే.

శ్రీ సుభాని కృషికి వెల కట్టడం కష్టమేగాని 48 పేజీల పుస్తకానికి 250 రూపాయల వెల నిర్ణయించడం పెద్ద సాహసమే. కార్టూన్ ప్రియులు, చిత్రకారులు కొనడానికి ముందుకు రావొచ్చు గాని అట్ట చూసి కొందామనుకునే మామూలు పాఠకులు చాలామంది వెల చూసి వెలవెల పోతారేమో అనిపిస్తుంది. లోపల ఎంత మంచి ఆర్ట్ పేపర్ వాడినా పుస్తకప్రియులు ఎప్పుడూ పుస్తకం ధర తమ హార్టుకు దగ్గరగా (జేబుకి దగ్గరగా అన్నమాట) ఉండాలనుకుంటారు. తదుపరి ముద్రణలో ఈ విషయంపై పునరాలోచన చేయడం మంచిదని ఒక ఉచిత సలహా ఇచ్చి ముగిస్తున్నాను.

మరిన్ని శీర్షికలు
pawanism shortfilm