Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya

సినిమాల్లోకి కొత్తగా రావాలనుకునే వాళ్లకి...

1. యాటిట్యూడ్ :
అవకాశం వచ్చేవరకూ ఎంతైనా తగ్గి, ఒదిగి ఉండేవాళ్లు, అవకాశం వచ్చాక కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈగోగా, ఈగో మహా మూర్ఖంగా, ఇలా ఇంతింతై వటుడింతై పద్యంలాగా, వివేక భ్రష్ట సంపాతకుల వలె డౌన్ ఫాల్ వైపు అలా వడివడిగా పరుగెత్తేయకుండా మనని మనం నియంత్రించుకోగలమా లేదా అన్నది తెలుసుకోవాలి.

జయాపజయాలని సమానంగా స్వీకరించగలిగే స్పోర్టివ్ స్పిరిట్ వుందా లేదా చూసుకోవాలి.

ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారు నా చిన్నప్పుడు పేపర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మంచి మాట చెప్పారు. "ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత, అక్కడ జెండా ఎగరేసిన తర్వాత ఎవ్వడైనా చెయ్యవలసిన పని, అక్కణ్ణుంచి దిగడమే". ఇలా అప్స్ అండ్ డౌన్స్ ని, అప్పులు అండ్ డెబిట్స్ ని, రోలర్ కోస్టర్ రైడ్ ని అనుభవిస్తూ కూడా పనిపైన, సృజనాత్మకత పైన, అంతే మమకారాన్ని, కసిని, టెక్నికల్ గా మనని మనం అప్ డేట్ చేసుకోవడాన్ని మెయిన్ టెయిన్ చేయగలమా లేదా చూసుకోవాలి. ఈలోపు కుటుంబ జీవితం, అక్కడి ఎదుగుదలలు, తరుగుదలలు వృత్తి జీవితంపై, ప్రవృత్తి పై ప్రభావం చూపకుండా బ్యాలెన్స్ చేయగలమా లేదా చెక్ చేసుకోవాలి.

2. క్రియేటివిటి :
సమాజంలో మారుతున్న జీవన విధానం లాగా, టెక్నికల్ గా ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అయినంత వేగంగా రోజు రోజుకీ కొత్త కొత్త ఆలోచనలు మనం కూడా చేయాల్సి వస్తోంది. ఒక కథ మనం ఒకేడాది కష్టపడి రాసుకుంటే కనీసం వేయిమంది దానిని సినిమాగా తీసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట దాని ఫలితాన్ని చూసేస్తారు. ఇవాళ మనకొచ్చిన ఐడియా ఆచరణలోకి వచ్చేలోపు వంద రకాలుగా మారి మనని కంగారుపెడుతుంది. కొన్నిసార్లు ఒరిజినల్ ఐడియా తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. అప్పుడు కూడా భావ దారిద్ర్యం లేకుండా సమయస్ఫూర్తితో అవకాశాన్ని అందుకోగలగాలి.

మనకంటే ముందే ఈ పరిశ్రమలో ఉన్నవారికి ఏమీ తెలియదనుకునే భావన విడనాడాలి. వారి అనుభవాన్ని పరిగణించి మన కొత్తదనాన్ని జోడించి మన పని మనం చేసుకోగలగాలి. సినిమాలు బాగా తీయాలంటే, లైబ్రరీలో రీసెర్చ్ పుస్తకాలు చదివే పి.హెచ్.డి. స్టూడెంట్ లాగా థియేటర్ లో ప్రేక్షకుల మధ్య విరివిగా సినిమాలు, నాటకాలు చూస్తూ ఉండాలి.

ప్రపంచ సాహిత్యంలో పేరుపొందిన పుస్తకాలన్నీ నిత్యం చదువుతూనే ఉండాలి.

ఆర్ధిక మాంద్యంలో కూడా బుద్ధి మాంద్యం రాకుండా చూసుకోగలగాలి. మన ఆలోచనలని మనం రెండోవ్యక్తిలా విమర్శించుకునే హంస గుణం ఉండాలి.

3. కాయకష్టం :
ఒకేరోజు ఎండలో కాసేపు, ఏ.సి. లో కాసేపు, వర్షంలో కాసేపు, చల్లగాలిలో కాసేపు, విలాసవంతమైన భవంతిలో కాసేపు, స్మశానంలో కాసేపు, రోడ్లమీద కాసేపు, ఇలా రకరకాల వాతావరణాల్లో రకరకాల ఉష్ణోగ్రతల మధ్య, సరైన తిండి, నీరు, సదుపాయం ఉన్నా, లేకపోయినా కూడా శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి. మన అనారోగ్యం వల్ల ఒక్కరోజు కూడా పనికి విఘాతం కలగకుండా ఫిట్ నెస్ ఉండాలి. స్విట్జర్లాండ్ స్నో మౌంటెన్ మీదయినా, రాజమండ్రి గోదారి నీళ్ళల్లో అయినా, ముంబై మురికివాడల్లో అయినా, హైదరాబాద్ నడిరోడ్ల మీదైనా, మండువేసవిలో చెన్నై, విశాఖలాంటి సముద్రప్రాంతాల్లో అయినా, బొగ్గుగనులు, ఫ్యాక్టరీలలో అయినా మన పని మనం ఒకేలా చేయగలగాలి.

4. అదృష్టం :
పైన చెప్పినవన్నీ మనకు మనం కష్టపడి అలవర్చుకున్నా, ఎక్కడో తెలీని కారణాల వల్ల మన అవకాశాలు చేజారిపోతూనే ఉంటాయి. కొన్ని మనకు తెలిసీ, కొన్ని మనదాకా రాకుండానే.

మా పెద్దన్నయ్య సతీష్ చెప్పేవాడు... కృషితో నాస్తి దుర్భిక్షం పాత మాటరా... సుడితో నాస్తి దుర్భిక్షం... కొత్త 'నా'నుడి అని.

ప్రముఖ రచయిత జంధ్యాలగారితో రావికొండలరావు గారి అధ్వర్యంలో చందమామ విజయా కంబైన్స్ కోసం ఒక స్క్రిప్ట్ వర్క్ లో నాలుగునెలలు కూర్చున్నాను నేను అసోసియేట్ డైరెక్టర్ గా. ఆ టైం లో మాకు కాఫీలు, టిఫిన్లు వడ్డించే ప్రొడక్షన్ బాయ్ రోజూ ఒకతనే. అతను లోపలికొచ్చి బైటకి వెళ్తున్న ప్రతీసారి మా డిస్కషన్ లో కొన్ని పేర్లు అతని చెవిన పడుతుండేవి. ఒకరోజు నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి గారు వస్తే కథ చెప్పి, అవసరమైన ఆర్టిస్టుల పేర్లు చెప్తున్నారు జంధ్యాల గారు. కాఫీ తెచ్చిన ప్రొడక్షన్ వ్యక్తి నిర్మాతతో ఒక నటుడి గురించి చెప్పి, ఆయనకి చాలా పెద్ద వేషం ఉన్నట్టుందండి మన సినిమాలో. రోజూ వింటున్నాను ఆ పేరు. ఆయన మంచి నటుడే కానీ మంచి మనిషి కాడండి. నిర్మాతకి, ప్రొడక్షన్ మేనేజర్లకి, చివరికి మా బాయ్స్ కి కూడా మహా తలనొప్పి, డబ్బిచ్చి, మంచి పాత్ర ఇచ్చి తలనెప్పులెందుకండి పడడం అన్నాడు. వెంటనే ఆ నటుడి పేరు నేను లిస్టు లో తీసేయాల్సి వచ్చింది. మేం అనుకున్న విషయమూ ఆ నటుడికి తెలీదు. క్యాన్సిల్ చేసిన విషయమూ ఆయనకి తెలీదు. ఇలా చాలామందికి చాలా కారణాల వల్ల జరుగుతాయి.

మనం ప్రయత్నిస్తే దక్కే అవకాశాలు, అప్రయత్నంగా మనకొచ్చే అవకాశాలు, మనం ప్రయత్నించినా దక్కని అవకాశాలు వీటన్నింటి కన్ ఫ్యూజన్ వల్ల ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మనని మనం నిత్యం నిరూపించుకోవాలి.

అందరి లక్ష్యం థియేటర్ లో ఉండే ప్రేక్షకుడి ఆమోదం పొందడమే అయినా, ఆ ప్రొసీజర్ లో అనేకమంది ఆమోదం అవసరమైన పనులని సమర్ధవంతగా నిర్వహించాలి. ప్రేక్షకుల ఆమోదం పొందిన ప్రతివాడూ మేధావి కాదు. ప్రేక్షకులు తిరస్కరించిన ప్రతివాడూ తెలివితక్కువ వాడు కాదు.

ఈ రెండింటినీ సమన్వయపరిచే వాడికే స్టార్ డమ్ వస్తుంది. అందరూ కలలు కనేది దానికోసమే. అవసరమైతే ఇన్ సెప్షన్ సినిమాలో లియోనార్డో డి కాఫ్రియో పాత్రలాగా పక్కవాడి కలల్ని దోచేయడం కూడా దానికోసమే.

సినిమా వయసున్న వందేళ్ళ అనుభవాలూ మనం చదువుకుని వుండాలి. తర్వాత సినిమా గమనాన్ని కనీసం పాతిక, ముఫ్ఫై సంవత్సరాలు నిర్దేశించగలిగిన నూతన దృక్పథం, విజన్, తెలివితేటలు, సామర్ధ్యం కూడా మనకుండాలి. విషయం నేర్చుకోవడం ఒకెత్తు. అది ఆసక్తి కలిగిన ప్రతివారూ చేస్తారు. దాన్ని సరైన సమయంలో, సరిపడా మోతాదులో అప్లై చేయడం ముఖ్యమైన ఎత్తు.

పేరు, డబ్బు ఎక్కువ వచ్చే ఏ పనిలో అయినా అంతర్గత రాజకీయాలు సహజంగా ఎక్కువే ఉంటాయి. ఎవరైనా మన కళ్లముందే జాక్ పాట్ లు కొట్టినా మనం ఫుల్ కౌంట్ ఇచ్చి కుదేలైపోకుండా, తక్కువ నష్టంతో తప్పించుకుంటూ, మళ్లీ మనం జాక్ పాట్ కొట్టే అవకాశం వచ్చేదాకా సహనంగా, శాంతంగా వేచి చూడగలగాలి. సినిమా అంటే అందరికీ పిచ్చే. ఆ పిచ్చిని పిచ్చిపిచ్చిగా తుప్పల్లా, పొధల్లా పెంచకుండా కలుపుని కత్తిరించి, పాలిష్డ్ గా మంచి చెట్లుగా ఏపుగా పెరగనివ్వాలి.

అప్పుడే ఎవరైనా తుప్పల్ని చూసినట్టు మనని కిందకి చూడకుండా, చెట్టు కొమ్మల్ని చూసినట్టు తలెత్తి పైకి చూస్తారు.

ఇది జనరలైజ్ చేసి చెప్పాను. వచ్చేవారం కొన్ని సంఘటనలతో, ఇంకొన్ని డిటెయిల్డ్ విషయాలు చెప్తాను. పనికొస్తాయని భావిస్తాను.

మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
thanikella bharani - nalupu thelupu konchem color