Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'నాకెందుకు మిస్సమ్మలు, గుండమ్మ కథలు చూపించావ్ ?'

Interview with Rakendu Mouli

ఈ ఇంటర్ వ్యూ చదివే ముందు వీలయితే 'అందాల రాక్షసి' సినిమాలోని 'మనసు పలికే భాష ప్రేమ' పాటని వినండి.  అందులో -
మౌనమడిగే బదులు ప్రేమా
మనకి జరిగే మాయ ప్రేమా
విశ్వమంతా వున్న ప్రేమా ...
ఇరుకు ఎదలో దాచగలమా


అంటూ ప్రేమని కొత్త కోణంలో, సరికొత్త ఎక్స్ ప్రెషన్స్ తో ఆవిష్కరించిన కవి హృదయాన్ని గమనించండి. రాసిన ఆ కవి వయసు పాతికేళ్ళు. (అతని డేటాఫ్ బర్త్ 9th ఫిబ్రవరి 1988) పాడింది కూడా అతనే. అతని పేరు రాకేందు మౌళి.

రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్ లలో ఈ పాట పరిశీలనకి వచ్చినప్పుడు అప్ కమింగ్ లిరిసిస్ట్ గా, అప్ కమింగ్ సింగర్ గా - మరో ఆలోచనకి తావివ్వకుండా - ఏకగ్రీవంగానే కాకుండా మనస్ఫూర్తిగా కూడా జ్యూరీ సభ్యులందరూ ఓటేశారా కుర్రాడికి.

ఆ తర్వాత తెలిసింది ఆ రాకేందు మౌళి - ప్రముఖ మాటల పాటల రచయిత వెన్నెలకంటి గారబ్బాయి అనీ, మరొక మాటల పాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి కి తమ్ముడనీ ...

ఒకే ఒక పాటతో ... అది కూడా తొలి ప్రయత్నంలోనే ... రెండు అవార్డులను స్వంతం చేసుకున్న రాకేందు మౌళితో జరిపిన ' some భాషణ' ఇది...

"మీ పేరు కొత్తగా వుంది."
"అది మా నాన్నగారి క్రియేటివిటీ అండీ... అన్నయ్య పేరు శశాంక మౌళి, నా పేరు రాకేందు మౌళి అని పెట్టారు"

"శశాంక మౌళి అంటే నెలవంక ని ధరించిన శంకరుడు అని అర్ధం వస్తుంది. కనుక ఓకే .. రాకేందు మౌళి అంటే పున్నమి వెన్నెలని ధరించిన వాడు అని వస్తుంది కదా ..  అలా ఎవరున్నారు ?"
"చెప్పాను కదండీ అది పూర్తిగా మా నాన్నగారి క్రియేటివిటీయే"
(ఈ విషయమై వెన్నెలకంటి గారిని సీక్రెట్ గా అడగడం జరిగింది.  "ఇది కూడా  శంకరుడికే అనుకుని పెట్టాను. నిజానికి బాలేందు మౌళి అని పెట్టాలి. ఆర్యుల దుష్టంబులు గ్రాహ్యమ్ములు పెద్దలు అన్నారు. కానీ ఈ అనార్యుడి దుష్టంబు కూడా గ్రాహ్యమ్ము అనుకొని వదిలెయ్యండి " అని అన్నారు)

"ఏం చదువుకున్నారు ?"
"ఇంజనీరింగ్ ...ఎలక్ట్రానిక్స్  అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ "

"ఇవి కాక డ్యాన్స్ , మ్యూజిక్ కూడా నేర్చుకున్నారని విన్నాను"
"కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను నేర్చుకుంటే చూడాలని కోరిక. ఆవిడ కోసం డ్యాన్స్ క్లాసెస్ కి వెళ్ళేవాణ్ణి.  ఫోర్త్ ఆర్ ఫిప్త్ స్టాండర్డ్ లోనో అనుకుంటా ... సాగర సంగమం చూశా ... అప్పట్నించీ డ్యాన్స్ అంటే ప్రాణం అయిపోయింది."

"చదువు తో పాటు  ఆడుకోవలసిన వయసులో వీటి తోనే టైమ్ అయిపోయేదనుకుంటా .."
"ఆటలు కూడా వుండేవండీ ... నేను క్రికెట్ లో ఆల్ రౌండర్ ని.  షటిల్ ప్లేయర్ ని కూడా.. రన్నింగ్ రేస్, బాస్కెట్ బాల్ లో కూడా ప్రయిజులు తెచ్చుకున్నాను. ఇవన్నీ కాక కరాటే లో నాకు బ్రౌన్ బెల్ట్ ఉంది."

"తెలుగు సినిమా హీరో లాగ ఇన్ని విద్యలేంటండీ బాబూ ...  టైమెక్కడ సరిపోయేది ?"
"అన్నిటికీ అమ్మ సపోర్టే కారణం ... నేనేదైనా నేర్చుకోవాలని ముచ్చట పడితే అమ్మ ఇమ్మీడియట్ గా వెళ్ళి ఫీజ్ కట్టేసి వచ్చేసేది"

"నేటి యువతరం లో కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నవారున్నారు, సద్వినియోగం చేసుకుంటున్న వారూ ఉన్నారు. మీరు సద్వినియోగం కేటగిరికి వస్తారు, ఒక రకంగా మీ నాన్నగారి మంచితనం వల్ల చేకూరిన పుణ్యబలం మీ అన్నదమ్ముల రూపంలో ఆయనకి తిరిగొచ్చిందని చెప్పొచ్చు... అన్నట్టు మీ అన్నదమ్ముల మధ్య సఖ్యత చాలా వుందని విన్నాను ... అది చిన్నప్పట్నించీనా లేక ఒకటే ఫీల్డ్ అవడం వల్ల ఈ మధ్య పెరిగిందా ? "
"చిన్నప్పట్నించీనండీ ... తను నన్ను తమ్ముళ్ళా చూడలేదండి ... ఒక కొడుకులా తీర్చిదిద్దాడు. తనకి పెళ్ళయి, ఇప్పుడొక పిల్లాడు పుట్టినా నేనే తన పెద్ద కొడుకునంటాడు. అంతిష్టం నేనంటే ... "

"మరి మీకు ... "
"నాకసలు సాహిత్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైనా వుంటే అది అన్నయ్య వల్ల వచ్చిందే ... తనొక వెర్సటైల్ రీడర్ ... ఒకే రకం రచనలకి కట్టుబడిపోడు.. పొద్దున్న ముళ్ళపూడి గారివి చదివితే సాయంత్రం షిడ్నీ షెల్డన్ వి చదువుతాడు. మరొక రోజు దేవులపల్లి వారివి చదువుతూ కనిపిస్తే ఆ మర్నాడు శ్రీశ్రీ కవిత్వం తో కనిపిస్తాడు. ఇంకో రోజు తిలక్ అమృతం కురిసిన రాత్రి చదువుతూ కనిపిస్తాడు. తను చదవడమే కాదు నాకు చదివి వినిపించి అర్ధంతో సహా విడమర్చి చెప్పేవాడు. పైగా తను చాలా డ్రమెటిక్ గా చదువుతాడు. ఉదాహరణ కి శ్రీ శ్రీ మహాప్రస్థానం ని సాయికుమార్ మాడ్యులేషన్ తో చదువుతాడు. ఇంతే కాదు అన్నయ్యలో గ్రేట్ ఫిలాసఫర్ వున్నాడు. సింపుల్ గా బ్రతకడం, ఎంతుంటే అంతలో తృప్తిగా బ్రతకడం తనని చూసే నేర్చుకోవాలి ఎవరైనా . తన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. నిక్కచ్చిగా వుంటాడు. సూటిగా వుంటాడు. సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కువ. ఫలానా పుస్తకం చదువు లాంటి సలహాలిస్తూ - ఏది చదివినా ఇన్ ఫ్లుయెన్స్ కాకు. నీ వ్యక్తిత్వాన్ని నీ అంతట నువ్వే మలచుకో - అని హెచ్చరిస్తూ వుంటాడు. ఇప్పుడు చెప్పండి ... ఇంత మంచి, గొప్ప అన్నయ్య అంటే ఇష్టపడని వాళ్ళుంటారా !? "

"మీలో లిటరరీ నాలెడ్జ్ కి నాన్నగారి హెల్ప్ ఏదీ లేదా ? "
"ఎందుకులేదు ... కాకపోతే పౌరాణిక చిత్రాల ద్వారా డెవలప్ చేసుకున్నది ఎక్కువ. అందులో ఏ సందేహం వచ్చినా నాన్నగారే తీర్చేవారు "

"ఒక్క ఉదాహరణ చెప్పగలరా ?"
"లవ-కుశ వుందనుకోండి. అందులో చివర్న వచ్చే పద్యాల్లో - తురగమును వీడి రణభూమి తొలగిపొండి- అని రాముడంటే - వారువమె కాదు మిము కూడా వదలమయ్యా రణమో శరణమో చెప్పుమా రామచంద్రా- అని కుశలవులు అంటారు. తురగము అంటే ఏమిటి , వారువము అంటే ఏమిటి అని అడిగితే రెండిటికీ అర్ధం గుర్రమే అని చెప్పేవారు నాన్నగారు."
 



"చెన్నై లోనే పెరిగారు కదా మాటల్లో గానీ, రాతల్లో గానీ ఇంత మంచి తెలుగు కనిపించడానికి నాన్నగారు, అన్నయ్య ప్రభావమేనా లేక తెలుగులో చదువుకున్నారా !?"
"టెన్త్ లో తెలుగుకి తమిళనాడు స్టేట్ ఫస్ట్ వచ్చానండీ "

"అందాల రాక్షసి తో కలుపుకొని ఇప్పటికెన్ని సినిమాలు, ఎన్ని పాటలు అయ్యాయి ?"
"పులివేట, రక్షకుడు లాంట్ డబ్బింగ్ లు 10 సినిమాలు, 20 పాటలు ... "

"సింగిల్ కార్డ్ ?"
"పులివేట కి సింగిల్ కార్డే "

"ఏవైనా ప్రయోగాలు ... ?"
(డబ్బింగ్ లో ప్రయోగాలేమిటి అనుకోకండి ... 'కర్ణ' సినిమాలో  కణ్ణదాసన్ 'కణ్ణ్ క్క్ కులమేదూ' (కన్నుకు కులమేది) ? అని రాస్తే 'గాలికి కులమేదీ' అని మార్చారు సినారె. అలాగే 'భామనే సత్యభామనే' సినిమాలో 'వరకట్నం' అనే డైలాగ్ వుంటే దాన్ని 'క్షవర కట్నం' అని మార్చారు వెన్నెలకంటి)

"పులివేట లోనే ఓ ప్రయోగం చెయ్యాల్సి వచ్చింది. ఆ పాటలో 'సిలబెల్స్' వస్తాయి. వెంకటేష్ గారు యాక్ట్ చేసిన 'ఘర్షణ' లో 'చెలియ చెలియా'  పాటలో ' ఓ మహ్ జీయా వాహియాయా ' అంటూ వస్తుంది చూడండి ... అర్ధం లేకుండా వచ్చే అటువంటి సౌండ్స్ ని 'సిలబెల్స్' అంటారు.  అలాంటి సిలబెల్స్ ని ఓ పాటలో పెట్టారు. అది భక్తి పాట.  'ఈ సౌండ్స్ కి నేను పదాలు రాస్తాను . ఓ సారి చూడండి' అని రిక్వస్ట్ చేశాను. ఒప్పుకున్నారు. అప్పుడు నేను ఆ సౌండ్స్ కి ' శంభో శంకర దేవా ... సిద్ధీశ్వర హరనాథా ... జ్వాలా నేత్ర సర్వేశా ' అంటూ రాశాను. అందరూ మెచ్చుకున్నారు."

"చూడ్డానికి ఫొటోజెనిక్ గానే వున్నారు కదా ... యాక్టింగ్ కి ఆఫర్లు రాలేదా !?"
"ఎందుకు రాలేదు ... వచ్చాయి, వస్తున్నాయి కూడా ... పాడడం లో నాకు బాలు గారు ఎలా ఆదర్శమో , మిగిలిన క్రాప్ట్ లలో కమల్ హసన్ గారు నాకు ఆదర్శం. 24 క్రాప్ట్ లలోనూ క్షుణ్ణంగా స్టడీ చేసినవారాయన. ఆయన లాగ 24 క్రాప్ట్ లలోనూ ఉత్తీర్ణుణ్ణి కావాలి . అందుకని ఏ క్రాప్ట్ లో అవకాశం వచ్చినా 'నో' చెప్పను. అన్నీ నేర్చుకుంటాను"

"ఇంత ఆసక్తి, అనురక్తి వున్న మీరు సినిమా ఫీల్డ్ కి వెళుతుంటే ఇంట్లోంచి ఎటువంటి ప్రోత్సాహం లభించింది ?"
"నాన్నగారు, అన్నయ్య ఫుల్ సపోర్ట్ ... అమ్మ మాత్రం బాధపడింది - నువ్వు కూడా సినిమా ఫీల్డ్ కేనా - అంటూ"

"ఆవిణ్ణెలా కన్విన్స్ చేశారు ?"
"మరి నాకెందుకు మిస్సమ్మలు, గుండమ్మ కథలు చూపించావ్!? మాయాబజార్లు, లవకుశలు, శ్రీకృష్ణార్జున యుద్ధాలు చూపిస్తే - అవన్నీ నా బ్లడ్ లో కలిసిపోయి  సెకెండ్ నేచర్ అయిపోయాక - సినిమా ఫీల్డ్ కి కాక ఇంకెక్కడి కెళతాను ... అన్నాను."

"మీ అమ్మగారే కాదు ఎవరైనా ఈ పాయింట్ కి కన్విన్స్ అయితీరాల్సిందే.... గత 39 ఏళ్ళుగా నేనెన్నో ఇంటర్ వ్యూలు చేశాను. నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక యువకుడి నుంచి ఇంత స్ఫూర్తిదాయకమైన జవాబు రావడం ఇదే ప్రథమం.... కంగ్రాట్స్ అండ్ హ్యాట్సాఫ్ ..."






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu