Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు-ఆమె-ఒక రహస్యం

atadu..aame..oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

http://www.gotelugu.com/issue209/593/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి )...

మధ్యాహ్నం రెండు గంటల ప్రాతంలో డి.ఎస్పీ ప్రసాద్ పాణికి  ఫోన్ చేసి చెప్పాడు “నువ్వు చెప్పినట్టుగా రాజేంద్ర సూసైడ్ నోట్ ని ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించాను. నోట్ రాసిన ఇంకూ, సంతకం పెట్టిన ఇంకూ ఒకటే. నోట్ రాసిన సమయమూ, సంతకం చేసిన సమయమూ కూడా టేలీ అవుతున్నాయి. అంతే కాదు, రాజేంద్ర బ్యాంకు అక్కౌంట్ లు ఉన్న బ్యాంకు నుంచి స్పెసిమెన్ సిగ్నేచర్స్ తెప్పించి చూసాను. సూసైడ్ నోట్ మీద సంతకం కూడా రాజేంద్రదే అందులో అనుమానం లేదు”

“అయితే సూసైడ్ నోట్ జెన్యూన్. అంటే రాజేంద్ర మరణం ఆత్మహత్యే నన్నమాట!” అన్నాడు పాణి.

ప్రసాద్  చిన్నగా నిట్టూర్చి అన్నాడు. “అప్పుడే  అలాంటి కంక్లూజన్ కి రావద్దు. మొదటి నుంచీ ఈ కేసులో దొరుకుతున్న ఆధారాలన్నీ ఒకదానికొకటీ భిన్నంగా ఉంటున్నాయి. ఆ సూసైడ్ నోట్ జెన్యూనే కానీ దాని మీద ఏదో కెమికల్ ఉందన్న నీ అనుమానం కూడా నిజమే. దాని మీద పౌడర్ రూపంలో ఉన్న కెమికల్ సోడియం బై కార్బనేట్. పార్టికల్స్ ఆఫ్ సోడియం బై కార్బనేట్ ప్రెజెంట్ అని రిపోర్టులో వచ్చింది. ఒక వేళ అది జెన్యూన్  సూసైడ్ నోటే అయి ఉంటే, రాజేంద్రే దాన్ని స్వయంగా రాసి ఉన్నప్పుడు దాని  మీద ఆ కెమికల్ కాంపౌండ్  ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎవరైనా ఫోరెన్సిక్ నిపుణులకి కూడా అందనంతగా ఫోర్జరీ చేసి, లేదా వేరే ఎక్కడో రాజేంద్ర రాసిన రాతలని కెమికల్ కాంపోజిషన్ ద్వారా ఒక చోట చేర్చి సూసైడ్ నోట్ గా తయారు చేసారంటావా?”

“ఆ  కెమికల్  పేరేమిటన్నావు?”

“సోడియం బైకార్బనేట్  ణహ్ఛో3  అని ఉంది”

పాణి పక పకా నవ్వాడు. “అంటే ఏమిటో తెలుసా?”

“ఏమిటి?” అతడెందుకు నవ్వుతున్నాడో అర్ధం కాక అడిగాడు ప్రసాద్.

“సోడియం బై కార్బనేట్ అంటే వంట సోడా. సింపుల్ గా వంట సోడా అని రాయకుండా  పార్టికల్స్ ఆఫ్ సోడియం బైకార్బనేట్  ణహ్ఛో3  ప్రెజెంట్ అంటూ ఏదో రాసి కన్ఫూజ్ చేసారు”

“అంటే గదిలో ఏ తినుబండారాల  మీద ఉన్న వంట సోడానో దాని మీద పడి ఉంటుందంటావా?  అయితే ఇందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదన్నమాట”

“అంజలి బలవంతంగా నాతో వారానికొక రోజు వంట చేయిస్తుంది. ఆ అనుభవమే లేకపోతే నేనూ నీలాగే మాట్లాడే వాడిని”  అన్నాడు పాణి.

“ఏమిటి నువ్వనేది?”

“బేకింగ్ సోడాని తినుబండారాల ‘మీద’ చల్లరు. వంటలో  పదార్ధాలు తొందరగా ఉడకడానికీ, పులియడానికీ ‘కేటలిస్ట్’ లా వాడతారు. కనుక అది  ఏ తినుబండారాల మీద నుంచో ఎగిరి వచ్చి ఆ నోట్ మీద పడడానికి ఆస్కారం లేదు. పైగా  మరణించిన రాజేంద్ర ముందు రోజు భోజనం కూడా చెయ్యలేదు. ఆ గదిలో ఎటువంటి తినుబండారాలూ లేవు”

“మరైతే ఆ బేకింగ్ సోడా ఆ సూసైడ్ నోట్ మీదకి ఎలా వచ్చి ఉంటుంది?”

“ఎలా వచ్చిందన్నది కాదు. ఎందుకు వచ్చిందన్నదే  ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది.  ఎందుకు వచ్చిందో తెలిస్తే, ఎలా వచ్చిందో కనుక్కోవచ్చు”

“స్టిల్ కన్ఫ్యూజన్”  గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు ప్రసాద్. “మొదటి నుంచీ కన్ఫ్యూజన్ అన్నది ఈ కేసు లక్షణంగా వస్తోంది. రాజేంద్రది హత్యో ఆత్మహత్యో కన్ఫ్యూజన్. సూసైడ్ నోట్ జెన్యూనో డూప్లికేటో అన్నది కన్ఫ్యూజన్.  విచిత్రమేమిటంటే, అతడిది హత్య అనడానికి ఎన్ని ఆధారాలు దొరుకుతున్నాయో, ఆత్మహత్య అనడానికి కూడా అన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. అలాగే సూసైడ్ నోట్ జెన్యూన్ అని ఒక పక్క రిపోర్టు  చెబుతున్నా, అదే రిపోర్టు ఆ సూసైడ్ నోట్ ఫేక్ అన్న అనుమానాన్ని కలుగ చేస్తోంది. ఇక పోతే అనుమానితుల లిస్టు కొండవీటి చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. సమయం చూస్తే దగ్గర పడుతోంది. ఒక్క రోజులో ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తావో ఏమో నాకేమీ అర్ధం కావడం లేదు”

“ఒక్క రోజేమిటీ?”  ఆశ్చర్యంగా అన్నాడు పాణి.

“మర్చిపోయావా? నువ్వు ఈ కేసు పరిశోధనకి డిటెక్టివ్ గా అక్కడికి వెళ్ళలేదు. రాజేంద్ర స్నేహితుడిగా ఒక అతిధిగా ఆ బంగళాకి వెళ్ళావు. రాజేంద్ర పెద్ద కర్మ వరకూ మాత్రమే నీకు అక్కడ ఉండడానికి పర్మిషన్. రేపే రాజేంద్ర పెద్ద కర్మ.  నువ్వేం పరిశోధన చెయ్యాలన్నా ఈ  ఒక్క రోజు లోనే చెయ్యాలి. రేపు సాయంత్రం నువ్వు అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవ్వాల్సిందే. అంటే నీకున్న సమయం ఒక్క రోజు...  ఇప్పటికి నీ పరిశోధన అసలు ఇంకా ప్రారంభమే కాలేదు”  వివరిస్తూ అన్నాడు  ప్రసాద్.

“నువ్వు చెప్పింది నిజమే.  ఈ ఆలోచనల్లో పడి నేను అసలు ఆ విషయాన్నే మర్చిపోయాను. నాకున్న సమయం  హార్డ్ లీ థర్టీ సిక్స్ అవర్స్!”  భయంగా అన్నాడు పాణి.

“ఎనీ హౌ, ఎన్నో పెద్ద పెద్ద కేసులని సాల్వ్  చేసిన నీకు ఇరవై నాలుగు గంటలలో ఈ మిస్టరీని  సాల్వ్ చెయ్యడం పెద్ద పని కాదు. ఆల్ ది బెస్ట్” అన్నాడు ప్రసాద్.

“థాంక్యూ” అని ఫోన్ పెట్టేసాడు పాణి.

****

“హలో” అన్నాడు పాణి  పాణి తెల్లగా ఉన్న ఆ  ఇరవై ఎనిమిదేళ్ళ యువకుడిని పలకరిస్తూ.

ఏదో పనిలో ఉన్న ఆ యువకుడు తలెత్తి పాణిని చూస్తూనే “హలో హలో మీరా? ఏమిటిలా వచ్చారు?”  అన్నాడు సంభ్రమంగా. రాజేంద్ర చనిపోయినప్పుడు డిపార్టుమెంటు తరపున వచ్చి, గదిలో వేలి ముద్రలనీ, ఇతర ఆధారాలనీ సేకరించిన వ్యక్తి అతడు. అతడి పేరు వివేక్. నిజామాబాద్ లో ఉన్న అతడి ఆఫీసుకి వచ్చి పలకరించాడు పాణి.

“మా స్నేహితుడి అంత్య తిధి రేపు. అప్పటి దాకా ఉండమని మా స్నేహితుడి తాత గారు బలవంతం  చేస్తే ఉండిపోయాను. ఆ పల్లెటూళ్ళో ఏం తోచక కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే ఈ ఊరు కూడా ఇంకా పెద్ద పల్లెటూర్ లా ఉంది.  కంపెనీ ఎవరైనా ఉంటే బాగుండునని ఆలోచిస్తుంటే మీరు గుర్తొచ్చారు. నేరుగా మీ ఆఫీసుకు వచ్చేసాను.  మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా?” అన్నాడు పాణి.

“నో... నో... డిస్టర్బెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆఫీసులో ఎవరూ లేరు. బయటకి వచ్చి నేను మీకు కంపెనీ ఇవ్వలేను”  అంటూ చేస్తున్న పని ఆపి పక్కగా ఉన్న విజిటర్స్ రూమ్ లోకి తీసుకెళ్ళి కూర్చో పెట్టాడు పాణిని.

“ఓహ్… సర్లెండి. కాస్సేపు ఇక్కడే  గడిపి వెళ్తాను”  

“ష్యూర్” అంటూ అటెండర్ ని పిలిచి కాఫీ తీసుకు రమ్మని  చెప్పాడతడు.

“ఎన్నాళ్ల నుంచీ పని చేస్తున్నారు ఫోరెన్సిక్ విభాగంలో?”

“రెండు సంవత్సరాల నుంచీ”  

“ఆ రోజు మీతో సంభాషణ నాకు చాలా బాగా అనిపించింది”

“భలే వారు సార్... పెద్ద డిటెక్టివ్ కంపెనీ రన్ చేస్తున్నారు. మీ ముందు నేనెంత? ఆ రోజు  ఉత్సాహంలో ఏదేదో మాట్లాడేసాను” సిగ్గు పడుతూ అన్నాడు.

“అదేం లేదు. ఒక్కొక్కళ్ళు అనుసరించే పద్దతి ఒకలా ఉంటుంది. నాకు అన్నీ తెలుసుకోవడం ఆసక్తి. సాటి డిటెక్టివ్ లతో మాట్లాడుతుంటే ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు వస్తాయి” అన్నాడు పాణి.

ఎప్పటికైనా స్వంతంగా ఒక డిటెక్టివ్ ఏజన్సీ పెట్టాలన్నది అతడి కల. అంత పెద్ద డిటెక్టివ్ తన మాటలు నచ్చి తనని వెతుక్కుంటూ రావడం, తనని ‘సాటి డిటెక్టివ్’ గా గుర్తించడం అతడికి అమితమైన ఆనందాన్నిచ్చేయి.

“అంత పెద్ద కంపెనీని నడుపుతూ కూడా ఇంకా నేర్చుకుంటున్నాను అనడం మీ గొప్పతనం సార్” అన్నాడు.

కొద్దిసేపు ఇద్దరూ  మాట్లాడుకున్నాక అటెండరు కాఫీలు తీసుకొచ్చి ఇచ్చాడు.

“ఆ రోజు మీరు పని చేస్తున్న విధానం చూస్తే నాకు చాలా ప్రొఫెషనల్ గా అనిపించింది. నేర ప్రదేశంలో ఆధారాలని సేకరించేటప్పుడు దేనికి ఎక్కువగా  ప్రాధాన్యత ఇస్తారు? ”  అన్నాడు పాణి కాఫీ సిప్ చేస్తూ.

ఆ యువకుడు ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్