Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఆక్సిజన్

oxygen

స్నాతక వ్రతం పూర్తయింది . పెళ్లికొడుకు చేతికి పసుపు గావంచా లో కట్టిన బియ్యం మూట , చేతికర్ర యిచ్చి కాళ్లకి పాంకోళ్ళు కట్టించి , రంగు కాయితాలతో అలంకరించిన గొడుగు తెరచి పట్టుకోమని " బావమరుదిని రమ్మనండి కాశీ ప్రయాణానికి పెళ్లికొడుకు బయలు దేరేడు " అన్నాడు పురోహితుడు .

అప్పుడే పీటలమీంచి లేచిన రాధాకృష్ణ మీద పడ్డ అక్షింతలను దులుపు కుంటూ కాశీయాత్ర కెళ్తున్న కొడుకు వెనకాలే నడవబోయేడు .

" బావా పెళ్లి నీదికాదు , కాబట్టి కాశీ యాత్ర కూడా నీది కాదుగానీ యిలారా , మా అక్క చూస్తే ఉతికి ఆరేసీగలదు " మేనమామ కొడుకు మేలమాడేడు .

" సార్ మీరు పెళ్లికొడుకుని కవర్ చేస్తున్నారు , లేడీస్ ఫంక్షన్ కదా , మీరు తప్పుకోండి సార్ ప్లీజ్ " అన్న ఫోటో గ్రాఫర్ మాటతో అక్కడ నుంచి తప్పుకోవలసి వచ్చింది రాధాకృష్ణ కి .

కాళ్లల్లో పడుతున్న పంచని జాగ్రత్తగా యెత్తి పట్టుకొని మంటపానికి యెదురుగా వేసిన కుర్చీలో చతికిలబడ్డాడు . తనకి జ్ఞానం వచ్చినప్పటినుంచి ప్రతీ పెళ్లిలోనూ ఈ కాశీ యాత్ర చూస్తున్నాడు . పెళ్లికొడుకు పట్టుకొనే మూట తప్ప అన్నీ మారిపోయాయి . అసలు పెళ్లి స్వరూపమే మారిపోయింది . సినిమాలలో చూపించే పెళ్లిలా వుంటోంది తప్ప నిజం పెళ్లిలా వుండటం లేదు . పెళ్లి కొచ్చేవారికి తెచ్చిన ప్యాకెట్  కొత్తదంపతుల చేతుల్లో పెట్టి వారిచ్చే ప్యాకెట్ పుచ్చుకోడం , ప్యాకెట్ల మార్పిడి మధ్యలో భోజనాలు కానిచ్చి యింటికి వెళ్లిపోవడం తప్ప పెళ్లి చూడాలనే ఆసక్తి యెవరిలోనూ వుండటం లేదు . ఆసక్తి వున్న రాధాకృష్ణ  లాంటివారికి మండపాన్ని చుట్టుముట్టే ఫొటోగ్రాఫర్లు యేమీ కనబడనివ్వకుండా చెయ్యడం పరిపాటి అయింది .

రాధాకృష్ణ యే పెళ్లికి వెళ్లినా పెళ్లి అయేంతవరకు కళ్యాణమండపం లో కుర్చీకి అంటుకు పోయినట్టు కూర్చోడం , తన ఆరవయేట జరిగిన పెద్దక్కయ్య పెళ్లిని కళ్ల యెదుట వూహించుకొని ఆ జ్ఞాపకాలలో మునిగి పోవడం అలవాటు .

యెప్పడో యాభైయేళ్ల కిందట జరిగిన అక్కయ్య పెళ్లి యివాళో నిన్నో జరిగినట్టుంటుంది రాధాకృష్ణ కి . అక్కయ్య పెళ్లిలో జరిగిన ప్రతీ చిన్న సంఘటనా తనకి బాగా గుర్తు .

అంతెందుకు కాశీయాత్ర కి బావగారు సిద్దంగా నిలబడ్డప్పుడు పురోహితుడు చెప్పమన్న మాటలను పెద్దగా అరచి చెప్పడం , అందరికీ వినబడేటట్టు చెప్పినందుకు రెండు వరహాలకి బోనసు మరో రెండురూపాయలు కలిపి మావయ్యగారు పది రూపాయలు తనకు యిస్తున్నట్టుగా ప్రకటించి కొత్త పదిరూపాయలనోటు తన చేతిలో పెట్టటం ,ఆ కొత్త పదిరూపాయలనోటు ని చేతితో తాకినప్పుడు కలిగిన పులకింత మొదటిరాత్రి భార్యని తాకినప్పుడు కూడా కలుగలేదు . ఆకొత్త పదిరూపాయలనోటు యిచ్చిన తృప్తి ఉద్యోగంలో నెలకి లక్ష రూపాయల జీతం పుచ్చుకున్నప్పుడు కూడా కలగలేదు .

ఆ బోనసు రెండు రూపాయలు తనను ముప్ప తిప్పలు పెడుతుందని అప్పుడు తెలిస్తే రెండువరహాలతో సరిపుచ్చుకొని ఆ రెండు రూపాయలని తిరస్కరించేవాడు . ఆరెండు రూపాయలు వారం రోజులు తనను నిద్రపోనివ్వకుండా చేసింది , ఆ రెండు రూపాయలు రెండువేల రైళ్లని తనగుండెలలో పరుగెత్తించింది .

యిప్పుడు నవ్వొస్తుంది కాని అప్పుడు ......

జ్ఞాపకాల పొరలలోకి జారిపోయేడు రాధాకృష్ణ . అక్కయ్య పెళ్లికి ముహూర్తాలు పెట్టిన దగ్గరనుంచి కాశీయాత్ర లో తనకెంత యిస్తారు , దానిని యెలా ఖర్చు చెయ్యాలి అనేదే తన ఆలోచన . తనకంటె పదేళ్లు పెద్దయిన పెదనాన్న కొడుకు హరన్నయ్య తన కంటికి హీరో . తన సందేహాలని తీర్చుకోవలన్నా , సలహాలు అడగాలన్నా అతడే అందుబాటులో వుండే వాడు .

హరన్నయ్య చెప్పిందాని ప్రకారం కాశీ యాత్రకి రెండువరహాలు చేతిలో పెట్టటం ఆనవాయితీ , అది అచ్చంగా తనదే అని తనకి నచ్చినట్లు ఖర్చు పెట్టుకో వచ్చని, నాన్నగారు కూడా యేమీ అనరని . అయితే రాధాకృష్ణ కి యిక్కడ మరో సమస్యొచ్చి పడింది . అంత డబ్బుని యెలా ఖర్చు పట్టుకోడం అని .

అప్పట్లో పది రూపాయలకి చాలా విలువుండేది . సగటు గుమస్తా జీతం మూడువందలకి మించి వుండేదికాదు .

తనకు రాబోయే రెండు వరహాలను యెలా ఖర్చు చెయ్యాలో హరన్నయ్యని అడిగితే నీకెది యిష్టమో ఆలోచించుకోమన్నాడు . గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే తనకి చాలా యిష్టం , అదే విషయం అన్నయ్యతో చెప్తే " తిండిపోతు వెంకన్నా ,  బిసకత్తులూ , తుస్సు పకోడీలూ కాదోయ్ , తిండి వస్తువలు అయితే అందరూ తినెయ్యరూ ? నీకు .......ఒక్క నీకే పనికొచ్చేది కొనుక్కోవాలోయ్ " గిరీశం లెవల్లో అన్నాడు .

తనొక్కడికే పనికొచ్చేది పలక , పెన్సిలు, బాల్  యిలా యెన్ని చెప్పినా అన్నయ్య ఆమోదం పొందలేక పోయేడు . పోనీ అన్నయ్యనే చెప్పమందాం అనే ఆలోచన రాగానే పరుగెత్తుకుంటూ వెళ్లి ' అన్నయ్యా నువ్వు చెప్పు , నాకేంటి కావాలో ' అన్నాడు .

" నన్ను చూడు నీకేమైనా గుర్తొస్తుందేమో " అన్నాడు హరి .

అన్నయ్యను పరీక్షగా కిందనుంచి మీద వరకు చూసేడు యేమీ తట్టలే , మళ్లా పై నుంచి కిందకి చూస్తూ  జోళ్ల దగ్గరకు వచ్చేసరికి తట్టింది , ' అన్నయ్యా జోళ్లు ..... జోళ్లు కొనుక్కుంటా ' ఉద్వేగం పట్టలేక గట్టిగా అరచినట్లు అన్నాడు .

" ఇప్పుడు నా తమ్ముడిలా ఆలోచించేవోయ్ " ఓ చిన్న మొట్టికాయ బహుమతిగా యిచ్చేడు .

పెద్దవాళ్లు ముద్దుగా మొట్టికాయలు వెయ్యడం , చిన్నవాళ్లు పెద్ద అవార్డు పుచ్చుకున్నట్లు ఆనందించడం అప్పట్లో జరిగేవి . ఇప్పుడు అలాంటివి యెక్కడా కనబడవు , పొరపాటున పెద్దవాళ్లు అలా చేసినా పిల్లలు దాన్ని అవమానంగా భావిస్తున్నారు .

తన హీరో మెచ్చుకొనే ఆలోచన చేయగలిగినందుకు తనకెంతో సంతోషం కలిగింది . ఇప్పుడైతే జోళ్లషాపుల వివరాలు కొత్తరకాల గురించి తెలసుకోడం చిటికె లో పని గాని అప్పుడలాకాదు . ఎక్కడో రెండు కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దబజారులో రెండు చవక జోళ్లషాపులు ఒక బాటా షాపు వుండేవి . చవక షాపులో చెప్పులు సగం ధరకే వస్తాయి కాని మన్నిక తక్కువ . పెద్దనాన్నగారు బాటా జోళ్లయితే మన్నిక యెక్కువ , జోళ్లు కరవవు అనేవారు .  ఎన్ని జోళ్లని పరీక్షంచినా యెక్కడా పళ్లు కనిపించేవికావు . ఇప్పటి పిల్లలకున్న చొరవ అప్పటి పిల్లలకి వుండేదికాదు , యెన్ని సందేహాలున్నా కడుపులో దాచుకోడం తప్ప బయటకి అనే చొరవ వుండేది కాదు .

పెళ్లికి పదిహేను రోజులుందనగా ఒకరోజు హరన్నయ్య కూరలు తేవడానికి పెద్దబజారు సంతకివెళుతూ వుంటే కాళ్లా వేళ్లా పడి అతని వెనుక వెళ్లి దూరంనుంచి బాటా షాపుని , షాపులో జోళ్లని కళ్లనిండుగా చూసుకొన్నాడు . కాశీయాత్ర అవగానే బటాషాపుకి తీసుకు వెళ్లే భాధ్యతని హరన్నయ్యకి అప్పజెప్పేక కాని నిద్దరరాలేదు రాధాకృష్ణ కి .

పెళ్లివారు విడిదింట్లో దిగేంతవరకు పగలూ రాత్రీ రంగురంగుల జోళ్లు , అవి వేసుకొని పాతాళ భైరవి సినిమాలో బాలకృష్ణ లా గాలిలో యెగురుతున్నట్లు కలలు కన్నాడు .

పెళ్లివారు వచ్చేకా కాశీయాత్ర యెప్పుడు మొదలవుతుందా అని యెదురు చూస్తూ గడిపేడు . అంత నిరీక్షించిన తరవాత వచ్చిన అవకాశం వదులుకో దలుచుకోలేదు అదీకాక తను చెప్పకపోతే మరెవరైనా పెళ్లికొడుకు కాశీయాత్ర ఆపి రెండువరహాలూ కొట్టెస్తారేమో అని అనుమానం వీటితో పంతులు చెప్పమన్న వన్నీ గట్టిగా చెప్పి మావయ్యగారిని ఇంప్రెస్స్ చేసి మరో రెండురూపాయలు బోనస్ కూడా సంపాదించుకున్నాడు . అదనంగా చేతిలో పడ్డ రెండురూపాయలని యేం చెయ్యాలి అని తర్జనభర్జన చేసుకున్నాకా హిందీ సినిమాకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు .

ముందుగా అనుకున్న ప్రకారం హరన్నయ్యతో బాటా షాపులో హరన్నయ్య కాళ్లకున్న పెద్దపెద్ద  పట్టీలున్న హవాయు చెప్పులు లాంటివి యేడురూపాయల తొంభైతొమ్మిది పైసలు యిచ్చి కొనుక్కున్నాడు . షాపువాడు యిచ్చిన రెండు రూపాయి నోట్లను , నలుచదరంగా వున్న నయాపైసాని , జోళ్లడబ్బాని పట్టుకొని మురిసిపోతూ యిల్లు చేరేడు .

పెళ్లిలో అటూయిటూ తిరిగినంతసేపూ జోళ్లుకట్టుకొని , యింట్లోకి వెళ్లేటప్పుడు జోళ్లు చంకలో పెట్టుకొని తిరగసాగేడు . సాయంత్రం అవగానే జోళ్లు గూట్లో ట్రంకు పెట్టె వెనకాల దాచుకొనేవాడు .

చేతిలో మిగిలిన రెండు రూపాయలు యేం చెయ్యాలనే ఆలోచన నిలవనివ్వటం లేదు . హరన్నయ్య పెళ్లికొచ్చిన చుట్టాలు కలిసి హిందీ సినిమా ప్రోగ్రాం వేసుకోడం చెవినపడింది . నా దగ్గర డబ్బులున్నాయి నన్ను తీసుకెళ్లండని వారి వెనుకబడి వారిని ఒప్పించేడు . అప్పట్లొ సినిమా కుర్చీ టికెట్టు రూపాయి , మిగతా రూపాయి యెండాకాలం శలవులలో తాతగారింటికి వెళ్లేటప్పుడు పలాసా లో జీడిపప్పు కొనుక్కోవాలని డిసైడ్ అయ్యేడు .

అప్పట్లో పెళ్లంటే నాలుగు రోజుల వేడుక . మూడోనాటి వేడుకని నాగవల్లి అనేవారు . కాశీయాత్ర తరవాత రాధాకృష్ణ కి పెళ్లిమీద ఇంట్రెష్టు తగ్గి వీధిలో వేసిన పందిట్లో స్థంబాలాట లో పడ్డాడు . పందిరి తీసేస్తే స్థంబాలాట వుండదుగా మరి .

రాత్రి కుర్రజట్టు రెండో ఆట సినిమాకి బయలుదేరేరు . నిద్రపోతే రాధాకృష్ణను వదిలేసి పోదామనేది వారి ప్లాన్లు , కాని రాధాకృష్ణ కన్నుముయ్యలేదు .

సైకిళ్లమీద డబుల్స్ త్రిబుల్స్ కూర్చొని సినిమాహాలు చేరేరు . అప్పట్లో మల్టీ ప్లెక్స్ లా యేమన్నానా ? , స్థంభాల హాలు , పాట మొదలయేసరికి వుయ్య్ ..... మని విజిల్స్ , రంగుల బొమ్మలు తెరమీద కదులు తున్నాయి . తనకంటె పెద్దపిల్లలతో సమానంగా హిందీ సినిమా చూస్తున్నాడనే అనుభవం తప్ప సినిమా యెంత అర్ధం అయిందీ అంటే మాత్రం పెద్ద గుండు సున్నాయే . సినిమాహాలులో నిద్ర పోతే సినిమా టికెట్టు డబ్బులు దండగ అవుతాయని బలవంతంగా నిద్ర ఆపుకున్నాడు . ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం నిద్ర ఆపుకోలేక పోయేడు . ఇంటికి గుమ్మం దగ్గర సైకిలు దిగి రెండడుగులు వెయ్యగానే తెలిసొచ్చింది ఒక కాలికే జోడున్న సంగతి .

బేర్ మని యేడవాలని అనిపించింది , కాని బయటకి యేడిస్తే వీపువిమానం మోత మోగుతుంది . అందుకే యేడుపు దిగమింగుకొని హరన్నయ్యకి జరిగిన విషయం చెప్పేడు . ఇద్దరూ మళ్లా సైకిల్ మీద సినిమాహాలు వరకు వెళ్లి దారంతా వెతికినా ఫలితం శూన్యం .

ఆ రోజులలో హైస్కూల్లో అడుగుపెడితేనే  జోళ్ల వయసు నచ్చినట్లు , పదవతరగతిలోకి వస్తేనే పేంటు వయసువచ్చినట్లు .

ఎవడో తనకొత్తజోళ్లకి దిష్టి పెట్టివుంటాడు , యింకెవడు పక్కింటి " టుల్లు " గాడే , చవకరకం జోళ్లు కట్టుకొని తనయెదురుగా స్టైలు వొలకబోసేవాడు , కొత్తజోళ్లు చూపించగానే " అమ్మో ...... బాటా జోళ్లా " అని ఈర్షగా చూసేడు . వాడి దిష్టే కొట్టింది .

ఈ విషయం యింట్లో తెలిస్తే యింకేమైనా వుందా ? వీపు విమానం మోతతో పాటు పనిష్మెంటుగా తన జోళ్ల వయసు మరో యేడాదికి పొడిగింప బడొచ్చు . వీటిని తప్పించుకోవాలంటే యేం చెయ్యాలి అనే ఆలోచనతో రాత్రంతా నిద్ర పట్టలేదు , అయిడియా తట్టడం తోనే హాయిగా ఆదమరచి నిద్రపోయేడు .

మగపెళ్లి వారిని బండెక్కించి వచ్చి నాన్న పెదనాన్నలు కూర్చొని పెళ్లిముచ్చట్లు మాట్లాడుకుంటూ వుంటే తన యీడువాడే కలకత్తా పెదనాన్న కొడుకు సూర్య గాడు బేర్ మని యేడుస్తూ వచ్చి ' నాన్నోయ్ నా జోళ్లు పోయేయి నాన్నా , మధ్యాహ్నం భోజనాలప్పుడు యిక్కడ యిక్కడే విప్పేను " అని వీధి గుమ్మం వైపు చూపించేడు .

రాధాకృష్ణ గుండెల్లో రైళ్లు పరుగెత్తేయి . అంటే తను కొట్టేసి దాచేసిన జోళ్లు సూర్యాగాడివా? యిప్పుడు వాడు పెద్ద ధర్మసంకటంలో పడ్డాడు . నిజం చెప్పి తన్నులు తినటమా ? లేక నిజం దాచి తన బెష్ట్ ఫ్రెండు తన్నులు తినేట్టు చెయ్యడమా ? , సూర్యా గాడు తన్నులు తినడం తనకు యెంత మాత్రం సమ్మతం కాదు . తన అజాగ్రత్త వల్ల తను జోళ్లు పోగొట్టుకున్నాడు కాబట్టి దెబ్బలు తను తినాలి , వాడి జోళ్లు తను కొట్టేసి వాడికి దెబ్బలు తినిపిస్తే దేవుడు పాపంమూట తన నెత్తిన పెడతాడు దాన్ని మొయ్యడం యెవరితరమూకాదని బామ్మ చెప్పిందిగా !

సూర్యా యేడవకురా ? నీ జోళ్లు నేను దాచేనుగా అని ట్రంకు పెట్టె వెనకాల దాచిన జోళ్లు తెచ్చి వాడికి యిచ్చి , తన జోళ్లు పోయిన సంగతి చెప్పి గట్టిగా కళ్లు మూసుకొని వీపు మీద పడే దెబ్బకోసం యెదురు చూడసాగేడు .

దెబ్బ పడలేదు సరికదా  నాన్న అలాంటి జోళ్లే కొని నిజం చెప్పినందుకు గిఫ్టుగా యిచ్చేరు .

తరవాత రాధాకృష్ణ జోళ్ల కథని చాలా రోజులవరకు చెప్పుకొని నవ్వుకొనేవారు . రాధాకృష్ణకు కూడా ప్రతీపెళ్లిలోనూ ఆ అనుభవాలు నెమరువోసుకోడం అలవాటుగా మారింది .

" ఒరేయ్ క్రిష్ణా , జ్ఞాపకాల పొరలలో అక్క పెళ్లి దగ్గరే ఆగిపోతే యిక్కడ నీ కొడుకుని ఆశీర్వదించేది యెవరు పద.... పద " అని లేపుతున్న సూర్యాని చూసి " యెంతవరకు వచ్చిందేమిటి పెళ్లి " అన్నాడు .

" మనం అక్షింతలను వెయ్యడమే మిగిలింది ,  అయినా వొరేయ్ యెన్నాళ్లు జ్ఞాపకాలలో జీవిస్తావురా  ? "

" జ్ఞాపకాలలో జీవించడం కాదు సూర్యా , జ్ఞాపకాలు వున్నాయి కాబట్టే జీవించ గలుగుతున్నా , ఈ యాంత్రికమైన జీవితానికి ఆక్సిజన్ లాంటివి కదూ బాల్య స్మృతులు అంటూ వేదిక వైపు నడిచేడు రాధాకృష్ణ .

మరిన్ని కథలు
tadini tannevadu