Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
opportunities hunt

ఈ సంచికలో >> యువతరం >>

సమస్యలు ఎన్ని వున్నా ప్రాణమే మిన్న

live first

కేవలం 10 రూపాయలు ఓ హత్యకి కారణమవుతున్నాయి. అదే పది రూపాయల కారణంగా ఓ ఆత్మహత్య కూడా జరుగుతుంది. పది రూపాయలు రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించుకోవచ్చు. పోయిన ప్రమాణం తిరిగొస్తుందా? రాదు. క్షణికావేశంలో హత్య జరుగుతుంది. అదే క్షణికావేశం ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. హత్య, ఆత్మహత్య ఏదైనా ఒక్కటే. హత్య అంటే ఇంకొకడు చేసేది. ఆత్మహత్య అంటే ఎవరికి వారు చేసుకునేది. రెండూ ఘోరమైన నేరాలే. దురదృష్టవశాత్తూ హత్య కేసులోనే శిక్ష ఉంటుంది. ఆత్మహత్య అనేది నేరంతోపాటు, శిక్ష కూడా. అందుకే, దానికి ప్రత్యేకంగా ఇంకో శిక్ష ఉండదు. కానీ ఆత్మహత్యకు పాల్పడితే దాన్ని నేరంగానే పరిగణిస్తుంది సమాజం. ఆత్మహత్య మహా పాపం అని అనాదిగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ చిన్న చిన్న సమస్యలు ఆ పాపానికి మనం ఒడిగట్టేలా చేస్తున్నాయి.

ముందే మాట్లాడుకున్నాం కదా, సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. అసలంటూ పరిష్కారం లేకపోతే అది సమస్యే కాదు. ప్రాణం పోవడం సమస్యకు పరిష్కారమెలా అవుతుంది? సమస్యకు పరిష్కారం వెతకలేక ప్రాణం తీసుకోవడమంటే అది చేతకానితనం. ప్రపంచంలోనే యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. కానీ, దురదృష్టమేంటంటే మన దేశంలో యువతే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం. టీవీ నటుడు ప్రదీప్‌ ఆత్మహత్యతో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ సినీ నటుడు ఉదయ్‌కిరణ్‌ కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సినిమా అవకాశాలు లేకపోవడమొక్కటే ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యకు కారణమని అనుకోలేం. సినిమా రంగమే అంత. హిట్టొస్తే, ఆకాశానికెత్తేస్తుంది. ఫ్లాపొస్తే పాతాళానికి పడేస్తుంది. పెద్ద పెద్ద హీరోలూ ఈ సమస్యను ఎదుర్కొన్నారు. సమస్య ఎదురైనప్పుడు దాన్ని సవాల్‌గా తీసుకున్నవాడే నిజమైన విజేత. అనేక మానసిక సమస్యలు ఆత్మహత్యలకు ముఖ్య కారణాలుగా పరిశీలకులు భావిస్తారు. వైద్యులు కూడా, ఆత్మహత్యలకు మానసిక సమస్యలే ముఖ్య కారణమని నిర్ధారించారు. ఏ రోగానికి అయినా మందు ఉంటుందిగానీ మానసిక రోగానికి మందు ఉండదని పెద్దలు చెబుతారు. అయితే ఇప్పుడు కౌన్సిలింగ్‌ అందుబాటులోకి వచ్చింది. మానసిక కుంగుబాటుకి మందులూ ఉన్నాయి. కానీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కారణమేమిటంటే, జగమంత కుటుంబం - ఏకాకి జీవితం. పది మందిలో ఉన్నా తనను తాను ఏకాకిగా భావించడమే చాలా ఆత్మహత్యలకు కారణమంటారు మానసిక వైద్యులు. చిన్నతనం నుంచే పోరాడేతత్వాన్ని పిల్లల్లో తల్లిదండ్రులు అలవాటు చేయాలి. స్కూల్‌ నుంచే వారిలో ధైర్యం నూరిపోయాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సాహవంతుల్లా ప్రతి ఒక్కరూ మారాలంటే, సమాజంలోని అన్ని విభాగాలూ తగిన పాత్ర పోషించక తప్పదు. సమస్యలు ఎన్నయినా ఉండొచ్చు, ఖచ్చితంగా వాటికి పరిష్కారం ఉంటుంది. ప్రాణం పోగొట్టుకోవడమే సమస్యలకు పరిష్కారమంటే, అసలు భూమ్మీద మనిషన్నవాడికి చోటే ఉండదు.

మరిన్ని యువతరం