Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
creation and distroid

ఈ సంచికలో >> యువతరం >>

కామెంట్‌ కొంప ముంచేస్తోంది గురూ

comment is so dangerous

ఓ రాజకీయ నాయకుడు తనకు నచ్చలేదు గనుక, ఆ రాజకీయ నాయకుడు లేదా నాయకురాలిపై వ్యక్తిగత దూషణలకు దిగుతామనడం సబబు కాదు. సోషల్‌ మీడియాలో ఏమైనా అంటాం అనుకునేవారికి ఇదొక గుణపాఠం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సోషల్‌ మీడియాలోని 'అతి స్వేచ్ఛ'పై ఉక్కుపాదం మోపడానికి చర్యలు చేపట్టింది. దీని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, సోషల్‌ మీడియాలో చెలరేగిపోయేవారూ తాము చేస్తున్న 'చెత్త' పనిపై పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. 'మాకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది' అనుకోవడం సబబు కాదు. ఇతరులకీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని హరించే హక్కు ఇంకెవరికీ ఉండదు. ప్రజా జీవితంలోకి వస్తే ఏమైనా అంటాం అని ఓ మహా కవి చెప్పవచ్చునుగాక. ఆయన ఉద్దేశ్యం వేరు. తప్పు చేస్తే ఎవర్నయినా నిలదీయవచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు సబబు కాదు. నెటిజన్లు, ముఖ్యంగా యువత సోషల్‌ మీడియా వేదికగా హద్దులు మీరుతున్న ఘటనల్ని ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణం, సోషల్‌ మీడియాలో ఏం చేసినా దానిపై చట్టపరమైన చర్యలు ఉండవనే గట్టి నమ్మకం కూడా కావొచ్చు. కానీ అది నిజం కాదు. 

రాజకీయాలపై యువత స్పందించవలసిన అవసరం ఉంది. నేటి యువతే రేపటి అద్భుత భారతావని రూపకర్తలు. వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపడానికి సోషల్‌ మీడియాని వేదికగా మలచుకుంటే వారిని సమాజం అందలమెక్కించకపోయినా, అర్థం చేసుకుంటుంది. కానీ మంచి వేదికని వ్యక్తిగత వైరం ప్రదర్శించడానికి వీలుగా మలచుకోకూడదు. సోషల్‌ మీడియాలో ఎలాంటి కామెంట్స్‌ చేయడం వల్ల వ్యవస్థకు మేలు జరుగుతుంది? అని ఆలోచించుకోవాలి. ఇక్కడ విజ్ఞత అవసరం. సమాజంలో మనమూ భాగమన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడం ముఖ్యం. అది జరిగిన నాడు, సోషల్‌ మీడియా సమాజంలో ఎవరూ ఊహించని అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది. మాకు నచ్చిన పోస్టింగ్స్‌ పెడతాం, చర్యలు తీసుకోవడం అక్రమం అనడమూ సబబు కాదు. ఎందుకంటే, ఓ వ్యక్తి జీవించి ఉండగానే మరణించాడని సోషల్‌ మీడియాలో చేసే ప్రచారం ఆ కుటుంబానికి తీవ్ర మానసిక క్షోభను మిగుల్చుతుంది. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతం కాదు. 

వ్యవస్థలో మెట్టూ మెట్టూ పైకెక్కి రాజకీయ నాయకులుగా అవతరించినవారు ప్రజా ప్రతినిథులుగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నవారిపై వివక్ష పూరిత కామెంట్స్‌ చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. సద్విమర్శని ఎవరూ తప్పు పట్టలేరు. అలాగే ప్రశ్నించడమూ తప్పు కాదు. కానీ విద్వేషం వెదజల్లడం సమాజానికి హానికరం. ఒక్క కామెంట్‌ మీ కొంప ముంచేయొచ్చు. బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో మీ పాత్ర గురించి మీరు ఓ అవగాహనకి వస్తే, సోషల్‌ మీడియా సమాజంలో అద్భుతాలకు కారణమవుతుంది.

మరిన్ని యువతరం