Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రారండోయ్ వేడుక చూద్దాం చిత్ర సమీక్ష

rarandoy veduka chuddam movie review

చిత్రం: రారండోయ్‌ వేడుక చూద్దాం 
తారాగణం: నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌, చలపతిరావు, అన్నపూర్ణ, పృధ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖా వాణి, అనితా చౌదరి, ప్రియ, తాగుబోతు రమేష్‌, రజిత, ఇష్క్‌ మధు తదితరులు. 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: ఎన్‌.వి. విశ్వేశ్వర్‌ 
దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల 
నిర్మాత: అక్కినేని నాగార్జున 
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్‌ 
విడుదల తేదీ: 26 మే 2017

క్లుప్తంగా చెప్పాలంటే
భ్రమరాంభ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) పల్లెటూరి అమ్మాయి. మనసులో అనుకుంటే, చేసేయడం ఆమెకి అలవాటు. మాటకు కట్టుబడి ఉండడం ఆమె నైజం. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి చూసిన సంబంధాన్నే చేసుకుంటానని తల్లికి మాట ఇస్తుంది. భ్రమరాంభ. ఆమెకు పట్టనంలో శివ (నాగచైతన్య) పరిచయమవుతాడు. అయితే ఆ పరిచయం ప్రేమగా మారితే మాత్రం, పరిచయాన్ని వదులుకుంటానని శివతో, భ్రమరాంభ చెబుతుంది. దానికి ఒప్పుకుంటాడుగానీ, భ్రమరాంభపై ప్రేమ పెంచుకుంటాడు శివ. అది తెలిసి, శివకి భ్రమరాంభ దూరమవుతుంది. మరి, భ్రమరాంభని శివ ఎలా దక్కించుకున్నాడు? అన్నది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
నాగచైతన్య ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. ఫుల్‌ జోష్‌తో నాగచైతన్యని అలా చూస్తోంటే అదో కొత్త భావన కలుగుతుంది. చాలా ఈజ్‌తో తన పాత్రని చేసుకుపోయాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లో, యాక్షన్‌ ఎపిసోడ్‌లో, రొమాంటిక్‌ సీన్స్‌లో నాగచైతన్య చాలా చాలా బాగా చేశాడు. ఇది ఖచ్చితంగా నాగచైతన్యకి నటుడిగా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది.

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఇది నిజంగానే డిఫరెంట్‌ జోనర్‌లో సినిమా అని చెప్పవచ్చు. సినిమా అంతటా సంప్రదాయ దుస్తుల్లోనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించింది. భ్రమరాంభ పాత్రలో ఒదిగిపోవడానికి రకుల్‌ చాలా కష్టపడింది. ఆ కష్టమంతా తెరపై కన్పిస్తుంది. చాలా ఇంటర్వ్యూల్లో గ్లామర్‌ అనే పదమే వాడొద్దంటూ చెబుతున్న రకుల్‌, ఈ సినిమాలో గ్లామరస్‌గానే కన్పించింది. గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ కాదు, అందం. చాలా అందంగా కన్పించి మెప్పించింది రకుల్‌.

జగపతిబాబు తన సీనియారిటీని రంగరించి, తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సంపత్‌, హీరోయిన్‌ తండ్రి పాత్రలో మెప్పించారు. తెరపై చాలామంది కమెడియన్లు కన్పించి నవ్వించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌ తదితరులంతా తమ పాత్రల పరిధి మేర నటించారు. మిగతా పాత్రల్లో కొన్ని పెద్దగా ఉపయోగపడలేదు.

కథ కొత్తదేమీ కాదు. కథనాన్ని కొత్తగా నడిపించే ప్రయత్నం చేయకపోయినా, తెరపై అందమైన దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. ఆద్యంతం తెరపై అందమైన దృశ్యాలే కన్పిస్తాయి. కుటుంబ సంబంధాలు, ఆప్యాయతానురాగాలు, అందమైన పల్లెటూరి వాతావరణం ఇలా అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు తెరపై చూడ్డానికీ చాలా చాలా బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. అక్కడక్కడా ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణ. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా కన్పించిందంటే సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ అలాంటిది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీపడలేదు.

కుటుంబ కథా చిత్రాల ట్రెండ్‌ నడుస్తోన్న ఈ రోజుల్లో అందమైన సినిమా ఎప్పుడొచ్చినా, దానిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ప్రతి ఫ్రేమ్‌ అందంగా కన్పించడంతో చిన్న చిన్న మైనస్‌లు పెద్దగా కన్పించవు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైనింగ్‌ పార్ట్‌ ఎక్కువగా ఉంటే, సెకెండాఫ్‌లో ఎమోషన్స్‌ ఎక్కువయ్యాయి. దాంతో తొలి సగం వేగంగా నడిచినట్లనిపించడం, రెండో సగం కాస్త నెమ్మదించిందనే భావన కలగడం సహజమే. భారీ ట్విస్ట్‌లు ఏమీ లేవు. దాంతో తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించగలుగుతాం. ఓవరాల్‌గా సినిమా మంచి ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ అన్పించుకునే అవకాశాలున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
రారండోయ్‌ కుటుంబ సమేతంగా చూసేద్దాం

అంకెల్లో చెప్పాలంటే: 3/5 

మరిన్ని సినిమా కబుర్లు
magadeera fighting