Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  http://www.gotelugu.com/issue215/606/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

( గతసంచిక తరువాయి )..  ‘‘ఆకాష్‌ ఇటే చూస్తున్నాడు చూడు’’ ఒకమ్మాయి గట్టిగా అంది.
ఆ అమ్మాయి చూస్తున్న వైపు కీర్తన దృష్టి మళ్ళింది. కీర్తన ఫ్రెండ్స్‌ అసలు విషయం గ్రహించారు.

కీర్తనని హెచ్చరించే లోపే స్కోరు 10`13లో వుంది.

ఈ సారి లేట్‌ చెయ్య లేదు ఎదురు డిఫెన్స్‌లో వున్నమ్మాయి. రైట్‌ స్పైడర్‌గా వున్న కీర్తనకి మెసేజ్‌ పాస్‌ చేసింది.
అసలు ఆకాష్‌ రాలేదు. కీర్తన రెండు రోజులు అతనితో మాట్లాడటం చూసి, అతని పేరు తెలుసు కొని, కీర్తనని డిస్టర్బ్‌ చెయ్యడానికి చేస్తున్నారు అని.

ఆ మెసేజ్‌ విన గానే కీర్తన మొహం ఎర్ర బడి పోయింది.

అసలు ఏమనుకుంటున్నారు?

ఏదో రకంగా గెలవటమే ముఖ్యమా?

ఆ ఆటకయినా నైతిక నియమావళి ముఖ్యం కాదా? తాము గెలవడమే ముఖ్యమనుకుంటే గెలిచి గెలవాలి తప్ప. గెలిచి ఓడి పోకూడదు.
ఇలా ఎదుటివారి మైండ్‌ని డిస్టర్బ్‌ చేసి, వాళ్ళ ఏకాగ్రతని భగ్నం చేసి అప్పుడు గెలిస్తే, నిజంగా వాళ్ళలో సత్తా వున్నట్లా, ఆమె ఆలోచన ముగిసేసరికి....

మహారాష్ట్ర జట్టు 13`14లో వుంది.

కీర్తన ఆలోచనన్నింటినీ ఒక విశ్వాసంతో బయటకి పారద్రోలి బంతి మీద మనసు లగ్నం చేసింది. మణి బిందు సర్వీస్‌ చేస్తోంది. అర చేతి చివర బలంగా చరవడం మూలంగా బంతి లెఫ్ట్‌ డిఫెన్స్‌లోకి వచ్చింది. ఆమె దానిని ఎదుర్కొని బూస్టర్‌ వైపు పాస్‌ చేయ బోయింది.

క్షణంలో సగంలో కీర్తన సైగ చేసింది. అందరూ పక్కకి తప్పుకున్నారు. సెంటర్‌లో వున్న కీర్తన మనసులో ప్రణీత్‌ని తల్చుకుని రివ్వున పైకెగిరి స్మాష్‌ కొట్టింది.

ప్రత్యర్థి కోర్టులో సెంటర్‌ ప్లేస్‌కి వెళ్ళింది ఆ బాల్‌. ఆ అమ్మాయి శాయ శక్తులా ఆ బాల్‌ తీయడానికి ప్రయత్నించింది కానీ, అది ఆమెకి తగిలి...బాగా డౌన్‌కి వెళ్ళి పోయింది.

దాంతో సర్వీస్‌ బ్రేకయి కీర్తన సర్వీస్‌ లోకి వచ్చింది. ఎదుటి వాళ్ళని వూపిరి పీల్చుకోనివ్వకుండా వరుసగా మూడు బంతులు, మూడు సర్వీసులు తుఫాను వేగంతో ప్రచండంగా దూసుకొచ్చిన ఆ సర్వీసులను  కూడా పాస్‌ చెయ్య లేక పోవడంతో ఆంధ్రా జట్టు విజయం సాధించింది.

అప్పటి వరకూ గెలుపు ముంగిట్లో సగర్వంగా నిల్న్న మహారాష్ట్ర జట్టు చివరిలో జరిగిన ట్విస్ట్‌ని భరించ లేక పోయింది.

ఆఖరిలో పోరాడి ఓడ లేదు.

ఆఫ్ట్రాల్‌ సర్వీస్‌లని ఎదుర్కో లేక పోయారు.

మూడు సర్వీసుల్లో వాళ్ళు గెలిచారూ అంటే, సర్వీసులని కూడా ఎదుర్కోలేనంత అధమమైన జట్టని పేరు పడినట్టేగా! వాళ్ళ అందమైన మొహాలు నెగిటివ్‌ ఫీలింగ్‌తో సహజత్వాన్ని కోల్పోయాయి.

పరస్పరం షేక్‌ హాండ్స్‌ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో మణి బిందు కీర్తనతో ‘‘ఇంత వరకూ ఫ్రీ అనుకున్నాము. నీకూ బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడన్న మాట’’ మాటల్లో సాధ్యమైన వ్యంగ్యాన్ని రంగరించి అంది.

నవ్వింది కీర్తన. ‘‘ఎవరి గురించి అంటున్నావు?’’

‘‘ఎవరో ఆకాష్‌ అట కదా!’’

‘‘అతను నా బాయ్‌ ఫ్రెండ్‌ కాదు’’ మెల్లగా అంది.

‘‘మరి?’’ నొసలు చిట్లించి చూసింది మణి బిందు.

‘‘అతను నా అభిమాని’’ స్పష్టంగా పలికి అక్కడ నుంచి కదిలింది.

వెనకాల మణిబిందు బిత్తర పోయి చూస్తూ నిల్చుంది.

**********

ఆ రోజు యింటికి వచ్చే సరికి ఏడున్నరయింది. ‘బాగా లేటయిందే’ అనుకుంటూ ఆదరా బాదరా వచ్చింది. అశోక్‌ అప్పటికే వచ్చేసాడు.
తండ్రి పనులన్నీ అతను చూశాడు.

కూతురిని చూడగానే భూపతి కళ్ళు మెరిసాయి

‘‘ఐయాం సారీ నాన్న గారూ!’’ తండ్రి దగ్గరకెళ్ళి అంది.

ఫర్లేదన్నట్లు తలూపాడు.

‘‘ఏమయ్యింది మ్యాచ్‌?’’ అడిగాడు.

‘‘గెలిచాం....’’ఆనందంగా అంది.

ఆమె కళ్ళలో, మాటలో సంతృప్తి తప్ప గర్వం లేదు.

‘‘కంగ్రాట్స్‌!’’ షేక్‌ హాండ్‌ యిచ్చాడు అశోక్‌.

ఇంకా ఏవో విశేషాలు చెప్ప బోయింది.

‘‘స్నానం చేసిరా! పిన్నికి ఫోన్‌ చేద్దాం....నాలుగు రోజులయింది మాట్లాడి.’’

తన గేమ్‌ విశేషాలు చెపుతుంటే కట్‌ చేసినందుకు కోపం వచ్చింది. పిన్నితో మాట్లాడాలని చెప్పే సరికి గబగబా బాత్‌ రూంకి వెళ్ళింది.
ఎందుకు ఫోన్‌ అన్నట్లు చూశాడు తండ్రి. సమాధానం చెప్ప లేక పోయాడు అశోక్‌.

ఏమని చెప్పగలడు? అది తమ బాధ్యత అని...కీర్తన డైనింగ్‌ టేబుల్‌ మీద అన్నీ సర్దేసి, తండ్రికి అన్నం తినిపించింది.
నానమ్మ, కీర్తన, అశోక్‌, తండ్రికి కనబడేలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు.

అశోక్‌ ఫోన్‌ చేసే టైమ్‌కి మృదులా దేవి భోజనం చేసి, పాత కాలపు వుయ్యాల బల్ల మీద కూర్చుని వూగుతూ, తమలపాకులు వేసుకుంటోంది.

‘నీ కొడుకు ఫోన్‌’ అంటూ కార్డ్‌ లెస్‌ తెచ్చిచ్చి పక్కనే నిల్చున్నాడు పెద్ద తమ్ముడు జగన్నాధం.

‘‘పిన్నీ బాగున్నావా?’’ అశోక్‌ అడిగాడు.

‘‘ఆ!ఆ! ఏం చేస్తున్నారు?’’ అడిగింది.

‘‘భోజనాలు అయ్యాయి. కూర్చున్నాం. నాన్న గారి తో మాట్లాడుతున్నాం’’ అశోక్‌ చెప్పాడు.

‘‘ఆ! ఎక్కువ విసిగించకండి. కీర్తన ఏం చేస్తోంది’’ అడిగింది.

‘‘ఉంది. మాట్లాడు’’ అంటూ ఫోన్‌ యిచ్చాడు.

కుశల ప్రశ్నలు అయ్యాక.....

‘‘ఈ రోజు మ్యాచ్‌ గెలిచాను పిన్నీ.....’’ ఆనందంగా చెప్పింది.

భూపతి జాలిగా కూతురి వైపు చూశాడు.

ఏంటీ పిచ్చి తల్లి ఆరాటం....ఆమె సంతోషిస్తుందనే! అతను అనుకున్నట్లుగానే అటువైపు పిన్ని బోధనలు ప్రారంభమయ్యాయి.
‘‘మ్యాచ్‌లు అవీ ఇవీ అంటూ ఎక్కువ సేపు బయట తిరగొద్దు. అయినింటి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా వుండాలి. ఇలా తిరిగితే రేపు సంబంధాలు గుమ్మం ఎక్కుతాయా?’’ అంటూ కఠినంగా హెచ్చరించింది మృదులా దేవి. అలవాటయిన విషయమే అయినా, ఆ టైమ్‌లో మొహం మాడి పోయింది.

‘‘అలాగే పిన్నీ!’’ అంటూ చెప్పిన వాటికల్లా ‘ఊ’ కొట్టింది. ఆ తర్వాత అశోక్‌ కాసేపు మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు.

పిన్ని మ్యాచ్‌ గురించి మందలించినప్పుడల్లా తనని ఓదార్చే అశోక్‌ మౌనంగా వుండి పోయాడు.

ఆ విషయం మనసు గ్రహించింది. బాధ పడక పోయినా, అశోక్‌ ప్రవర్తనకు కారణం బోధ పడ లేదు.

ఆ రాత్రంతా కలత నిద్ర తోనే గడిచి పోయింది.

**********

సాయంత్రం నాలుగు గంటల సమయం. ఆంధ్రా జట్టు అంతా ప్రాక్టీస్‌ కని స్టేడియంకు బయల్దేరారు. కానీ బాగా మబ్బు బట్టి వర్షం పడేలా ఉండటంతో అందరిలో ప్రాక్టీస్‌ కన్నా షికారుకి వెళ్ళాలన్న కోరికే ఎక్కువయింది.

ప్రోగ్రాం కీర్తన కి ముందే చెబితే ఆమె ఒప్పుకోదు. అందుకే చెప్పకుండా ఆమెని బయల్దేర దీశారు.

తీరా ఆటో ఎక్కాక పావు గంటకి కీర్తనకి డౌట్‌ వచ్చింది. ఆటో స్టేడియం వైపు వెళ్ళడం లేదు.

‘‘ఎక్కడికి వెళుతున్నాం?’’ అనుమానంగా ఫ్రెండ్స్‌ని అడిగింది.

సీటు మధ్యలో కూర్చున్న కీర్తన రెండు చేతునూ అటూ ఇటూ చివర కూర్చున్న వాళ్ళు పట్టుకున్నాక, కడ్డీమీద కూర్చున్న అమ్మాయి చెప్పింది.

‘‘ఎగ్జిబిషన్‌కి వెళుతున్నాం.....’’ అని చెప్పాక, ఆమె మూమెంట్స్‌ ఎలా వుంటాయో వూహించి ముందే అందుకు సన్నద్ధమైపోయారు వాళ్ళు.
కానీ అందుకు విరుద్ధంగా వుంది కీర్తన, ఆమె వద్దని తిట్టనూ లేదు, వెళదామని సరదా పడనూ లేదు. మామూలుగా కూర్చుంది.

చేతులు వదిలేసి ఆశ్చర్యంగా ఆమె వంక చూశారు. అసలీ లోకంలో లేదు కీర్తన.

ఆమె మనసంతా ఆకాష్‌ మీద వుంది.

ఇది వాస్తవం...

నమ్మ లేని నిజం...

మాట మాటకీ అతను గుర్తొస్తున్నాడు. తను గెలిచిన ప్రతి మ్యాచ్‌ తాలూకు విశేషాలు అతనితో చెప్పాని, అతని రియాక్షన్‌ స్వయంగా గమనించాలనీ కోరికగా వుంది.

ఇలా అనిపించడం తనకే ఆశ్చర్యంగా వుంది.

అసలు ఆకాష్‌ ఎవరు?

అతనితో తనకున్న పరిచయం ఎంత?

అతను కేవలం తన అభిమాని అంతే!

‘‘ఏమయిందీ?’’ కీర్తన అలా వుండటం చూసి ఒకమ్మాయి అడిగింది.

ఆలోచనల్లో మునిగి పలక లేదు కీర్తన.

మళ్ళీ అడిగింది. అప్పటికి ఉలిక్కి పడి తేరుకుంది కీర్తన.

‘‘ఏం లేదు’’ అంది ముభావంగా.

వాళ్ళకి ఏదో అర్ధమైనట్లుగా వుంది. మొన్న మ్యాచ్‌లో మణి బిందు, ఆకాష్‌ గురించి కామెంట్‌ చేసింది. కీర్తనని వీక్‌ చేయడానికే అంది. తమకి తెలిసి కీర్తనకి బాయ్‌ ఫ్రెండ్స్‌ లేరు.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu .. aame..oka rahasyam