Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె...ఒక రహస్యం

atadu .. aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue215/605/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి )..  చీకట్లో కూడా ప్లాష్ లేకుండా ఫోటోలు తియ్య గల ఆ రేడియం డిజిటల్ కేమేరాలో తీసిన ఫోటోలని పరిశీలనగా చూసాడు అతడు. ఫోటోలో పాణి, ఇంద్రనీల రూపాలు గుర్తు పట్టేంత స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

ఒకరినొకరూ కౌగిలించుకుంటున్నట్టుగా, ముఖమ్మీద ముఖం పెట్టి ముద్దు పెట్టుకుంటున్నట్టుగా, నడుమ్మీద చెయ్యి వేసి తమకంతో  హత్తుకుంటున్నట్టుగా... రక రకాల  యాంగిల్స్ లో తీసిన ఆ ఫోటోలని చూస్తూ సంతృప్తిగా తల పంకించాడతను.

“దేనికోసమో వెదుకుతుంటే మరేదో దొరికినట్టుగా మనకి మంచి ఆయుధమే దొరికింది. ఈ ఫోటోలని వెంటనే నిన్న పంపిన నెంబరుకి  వాట్సప్ లో పంపించు.  ‘మీ ఆయన్ని ఈ అమ్మాయి వల్లో వేసుకుంది. నువ్వు వెంటనే మీ ఆయన్ని ఇక్కడ నుంచి  వెనక్కి రప్పించుకోక పోతే  నీ జీవితం అన్యాయమై పోతుంది. జాగ్రత్త. ఇట్లు నీ శ్రేయోభిలాషి’ అని మెసేజ్ కూడా పంపించు”  అన్నాడు.

“పని జరుగుతుందంటారా?”

“నిన్న మనం పంపిన ఫోటోలతో ఇనుము వేడెక్కి ఉంటుంది. మన అదృష్టం కొద్దీ అనుకోకుండా ఇప్పుడీ ఫోటోలు దొరికాయి.  వేడి మీదున్న ఆమెకి ఈ దెబ్బ తగలాల్సిన చోట తగులుతుంది. మన పని కచ్చితంగా జరుగుతుంది”  అన్నాడతడు.

“మీరు చెప్పినట్టుగా పాణినీ ఇంద్ర నీలనీ ఒక కంట కని పెడుతూ ఉన్నారు మన మనుషులు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరూ తమ ఇన్వెస్టిగేషన్ తాము చేస్తున్నారు. ఇద్దరిదీ తలో దారిలా ఉంది”

“కానీ ఇద్దరూ మన దారికి అడ్డు తగులుతున్నారు”

“నిజమే. ఇవాళంతా ఇంద్ర నీల ఎక్కడికీ వెళ్ళకుండా బంగళా లోనే ఉండి పోయింది. పాణి మాత్రం నిజామాబాద్ లో పోలీసు డిపార్టుమెంట్ల  చుట్టూ తిరుగుతూ ఏదో ఎంక్వయిరీలు చేస్తున్నాడు. సిర్నాపల్లి గ్రామం లోకి కూడా వెళ్ళి  ఏదో ఎంక్వయిరీ చేసాడు.  పోలీస్ డిపార్టుమెంట్ లో ఎవరితో మాట్లాడాడో తెలియ లేదు. ఏది ఏమైనా  ఇంద్ర నీల దేని కోసం వెదుకుతోందో తెలియదు కానీ పాణి వ్యవహారం చూస్తుంటే మాత్రం ఒక విషయం కచ్చితంగా అర్ధమౌతోంది. అతడి ఎంక్వయిరీ వజ్రాల గురించి కాదు.  రాజేంద్రది హత్యా అత్మహత్యా అన్న మీమాంస మీదే అతడు చేసే ఎంక్వయిరీలన్నీ.  మనకి  పెద్దగా ప్రమాదం ఉండక  పోవచ్చు”

అతడు తల అడ్డంగా ఊపుతూ అన్నాడు “ఏ తీగ లాగితే ఏ డొంక కదులుతుందో చెప్పలేం. అతడి పరిశోధనని అంత తేలికగా తీసి  పారెయ్యద్దు.  ఇంకొక్క రోజు అతడు బంగళాలో ఉన్నా మనకి ప్రమాదమే.  ముందు పాణిని ఇక్కడ్నుంచి తప్పించ గలిగితే ఇంద్రనీల పెద్ద లెక్కలోనిది కాదు.  ఆ  ఫోటోలని  వెంటనే అంజలి నెంబరుకి పంపు.  అన్ని ఫోటోలనీ ఒక్క సారి కాకుండా అర గంటకొక ఫోటో పంపిస్తూ ఆమెని రెచ్చగొట్టు”

ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ కుర్చీలో  సొమ్మ సిల్లి ఉన్న బంగారు లక్ష్మి దగ్గరకి వచ్చారు “ఎన్ని హింసలు పెట్టినా ఈమె ఆ వజ్రాల గురించి ఎందుకు చెప్పడం లేదు? అసలు మనకి కావాల్సిన బంగారు లక్ష్మి ఈమేనా?” అనుమానంగా అన్నాడు.

“ఆ అనుమానం అక్కర్లేదు. హైదరాబాద్ మొత్తం మీద ఎక్సైజు డిపార్టుమెంట్లో పని చేసే వాళ్ళలో  బంగారు లక్ష్మి అన్న పేరు గల వ్యక్తి  ఈమె ఒక్కర్తే”  చెప్పాడు కేమేరా పట్టుకున్న వ్యక్తి.

****

ముందు రోజు లాగే ఆరోజు కూడా ఉదయానే తలుపు మీద ఎవరో తడుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది పాణికి.  కళ్ళు తెరిచి  చేతి గడియారం వంక చూసుకున్నాడు. సమయం ఇంకా ఐదు కూడా కాలేదు.

నిజామాబాద్ నుంచి  పాణి తిరిగి వచ్చే సరికి  నాలుగున్నర అయింది.  మానసికంగా, శారీరికంగా  రోజంతా బాగా అలసి పోవడంతో  రాగానే  మంచమ్మీద పడుకుంటే ఒళ్ళు తెలియ లేదు.  సరిగ్గా గంటన్నరేనా పడుకో లేదు ఇప్పుడే  ఎవరొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు? అనుకుంటూ వెళ్ళి తలుపు తీసాడు.

ఎదురుగా ఇంద్రనీల !

ఆమె జాగింగ్ డ్రెస్ లో లేదు. ఇంకా నైట్ డ్రెస్ లోనే ఉంది.  జాగింగ్ కి వెళ్ళడానికి రాలేదని అర్ధమైంది. పూర్తిగా తెల్ల వారకుండానే నైట్ డ్రెస్ లో తన గదికి  ఎందుకు వచ్చింది? అతడు అనుమానంగా  చూస్తుండగానే ఆమె  ఆమె  లోపలకి వచ్చేసింది.  వస్తూనే గది తలుపు దగ్గరగా వేసి గడియ పెట్టింది.

ఆమె చేస్తున్న పనికి పాణి గుండెలు దడ దడలాడాయి. ఏం చేస్తోందామె? తలుపు గడియ ఎందుకు పెట్టింది?  

ఆమె లోపలకి వచ్చి మంచం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది.  రాత్రంతా నిద్ర లేనట్టుగా ఆమె కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి.  మనసులో ఏవో అనుమానాలు తొలుస్తుంటే అప్రయత్నంగా వచ్చి   ఆమె ఎదురుగా కూర్చున్నాడు పాణి.  ఆమె ముఖం చూస్తుంటే, ఆమె తనతో ఏదో విషయాన్ని సీరియస్ గా చర్చించడానికి వచ్చిందన్న సంగతి అర్ధమయ్యింది.

“పాణి గారూ, మీతో ఒక విషయాన్ని  మాట్లాడాలని వచ్చాను. మరోలా చెప్పాలంటే నేను మిమ్మల్ని ఒక సహాయాన్ని అర్ధించడానికి వచ్చాను. ఒక విషయంలో నాకు మీ సహాయం కావాలి” అందామె.

ఆమె మాటలు వింటుంటే ఈ కేసులో ముఖ్యమైన ఒక రహస్యం బయట పడే సమయం దగ్గరకి వచ్చినట్టనిపించింది పాణికి.  “చెప్పండి” అన్నాడు.

“నేను మీతో ఒక అబద్దం చెప్పాను. మీకు చెప్పినట్టుగా నేను ఇక్కడికి  అనుకోకుండా రాలేదు.  నేను కావాలని అడిగి మరీ ఈ ప్రదేశానికి పోస్టింగ్ వేయించుకుని వచ్చాను. ఈ జిల్లాకి మరీ ముఖ్యంగా ఈ  ప్రాంతానికి నేను  కావాలని పోస్టింగ్  వేయించుకుని రావడానికి ముఖ్యమైన కారణం ఈ  సిర్నాపల్లి రాజ సంస్థానమే ! ఈ సంస్థానంలో నాకు కావల్సిన ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికే నేను ఈ ప్రాంతానికి పోస్టింగ్ వేయించుకున్నాను. ఐతే ఇక్కడికి వచ్చాక  పరిస్థితులు చూస్తుంటే నాకు ఆ రహస్యం తెలుసుకోవడం నా వల్ల కాదనిపిస్తోంది. అందుకే మీ సహాయాన్ని అర్ధిస్తున్నాను”  ఉపోద్ఘాతంగా అంటున్నట్టు అందామె.

పాణి ఆశ్చర్యంగా చూసాడామె వంక. “ఏమిటి మీరు తెలుసుకోవాలనుకున్న ఆ రహస్యం?”  

“చనిపోయిన రాజేంద్ర గారితో మంచి స్నేహం ఉంది మీకు.  ఆయన తన గురించిన అన్ని సంగతులూ తెలుసు. ఈ విషయం తెలియదని నేననుకోవడం లేదు” సూటిగా అతడి కళ్ళ లోకి చూసి, మరు క్షణం ఏమీ మాట్లాడకుండా తల దించుకుని తన చేతి వేళ్ళ వంక చూసుకుంటూ మౌనంగా ఉండి పోయింది. తరువాత నెమ్మదిగా తలెత్తి అంది “మీ అంతట మీరుగా ఆ రహస్యాన్ని నాతో పంచుకుంటారేమో నన్న ఉద్దేశంతోనే మీతో  కొంత ‘క్లోజ్’ గా కూడా మూవ్ అయ్యాను.  కానీ  మీరు ఎక్కడా ఆ విషయంలో బయట పడ లేదు”
ఆమె దేని గురించి మాట్లాడుతోందో అన్నది అతడి ఊహకి  స్పష్టంగానే అందుతోంది.  అయినా సరే ఆమె నోటితో చెప్పించాలన్న ఉద్దేశంతో అన్నాడు “ఏమిటి మీరు మాట్లాడుతున్నది?  ఏ విషయం గురించి నేను మీతో చెబుతానని నాతో  ‘క్లోజ్ గా’ ఉన్నారు?”   ఎంత వద్దనుకున్నా అతడి గొంతులో  కోపం, వెటకారం ధ్వనించకుండా ఉండ లేదు.

“రాజేంద్ర ప్రియురాలు రత్నమాల గురించి!”

షాక్ తిన్నట్టుగా చూసాడు పాణి ఆమె సమాధానానికి.  ఆమె తనని వజ్రాల గురించి అడుగుతుందనుకుంటే, ఆమె రత్నమాల గురించి అడుగుతోంది !

“నేను చెప్పబోయే విషయమ్ మీద మీకు ఒక క్లారిటీ రావాలంటే ముందుగా మీకు  తెలియని ఒక విషయం చెప్పాలి.  రాజేంద్ర ప్రియురాలు రత్నమాలా నేనూ స్నేహితులం”

పాణి ఆశ్చర్యంగా చూసాడామె వంక.

“మీ స్నేహితుడు రాజేంద్ర గారి లాగే  మా స్నేహితురాలు రత్నమాలకి కూడా సాహిత్యంలో మంచి అభిలాష ఉంది. పీజీ అయిన తరువాత నేను పోలీస్ ట్రైనింగ్ అవుతుంటే, తను ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు చదవడానికి    చెయ్యడానికి వెళ్ళింది.  అక్కడే పరిచయం ఆమెకి రాజేంద్ర గారితో.  యూనివర్సిటీ  విద్యార్దులకి  భావ కవిత్వం మీద  పాఠాలు చెప్పడానికి గెస్టు  లెక్చరర్ గా రాజేంద్ర గారు వచ్చేవారు. రత్నమాలది అద్భుతమైన అందం. ఆమె అందం రాజేంద్రని సమ్మోహితుడ్ని చేసి ఆమెతో స్నేహం చేసేలా చేసింది.   తెలుగు సాహిత్యం మీదున్న విపరీతమైన అభిమానం ఇద్దరినీ  బాగా దగ్గర చేసింది. చాలా తొందరగానే వాళ్ళ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది.

ఇద్దరివీ ఆధునిక భావాలు.  పైగా ఇద్దరూ భావుకులు, ప్రకృతి ప్రేమికులూ కావడంతో  ఎప్పుడూ వాళ్ళ ప్రపంచం వాళ్ళది అన్నట్టుగా ఉండే వారు.  సాహిత్య చర్చల కోసం ఇద్దరూ ఎక్కడెక్కడో  ఉన్న ఏకాంత  ప్రదేశాలకి   వెళ్ళిపోయి గంటలు గంటలు గడిపేవారు. నగరంలో ఉన్న ఏ సాహితీ సమావేశానికి రాజేంద్ర గారిని ఆహ్వానించినా  ఆయన వెంట తప్పనిసరిగా రత్నమాల ఉంటూ ఉండేది.

అలా కొద్ది రోజులు గడిచాక ఒక రోజు హఠాత్తుగా రత్నమాల నాతో  తను రాజేంద్రని వివాహం చేసుకోబోతున్నానని చెప్పింది.  మేమంతా చాలా సంతోషించాము.  రత్నమాల చాలా పేద కుటుంబంలోంచి వచ్చింది. కష్టపడి చదువుకుంది.  ఆమెకి తండ్రి ఎవరో తెలియదు. తల్లి అంతంత మాత్రం అనారోగ్యంతో   ఏదో ఆశ్రమంలో  ఉండేది.  ఆమె గురించి పట్టించుకునేవాళ్ళు కానీ, ఆమెకి  పెళ్ళి గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎవరూ లేరు ఆమె కుటుంబంలో.  అలాంటిది ఆమె అంత గొప్ప వ్యక్తికి భార్య కాబోతోందంటే  మాకందరికీ చాలా  ఆనందం కల్గింది.  మా రత్నమాల  సిర్నాపల్లి సంస్థానానికి మహారాణి కాబోతోందంటే అదంతా ఆమె అదృష్టం అనుకున్నాము.  అయితే, తమ పెళ్ళి గురించి  రత్నమాల చెప్పిన మరో విషయం మాకందరికీ షాకింగా అనిపించింది.

(అనుకున్నవన్నీ జరిగితే అది అపరాధ పరిశోధన ఎలా అవుతుంది...? అందరూ సహకరిస్తే పాణి బుర్ర పదునెలా తెలుస్తుంది....?? రహస్యాలు చేదింపబడుతున్నాయా, సరికొత్త ముడులు బిగుసుకుంటున్నాయా......వెయిట్ అండ్ సీ......ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా......)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్