Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu Seventeenth Part

ఈ సంచికలో >> సీరియల్స్

నడిచే నక్షత్రం పదకొండవ భాగము

nadiche nakshatram telugu serial eleventh part

ఓపక్క హీరో ప్రదీప్ తో స్టోరీ నడుపుతూ... ఇపుడు మళ్ళీ సాగర్ వలలో పడబోతోందా? కలిసి నటిస్తున్న దగ్గరితనమే ఈ చిత్తచాంచల్యానికి కారణమా? ఆలోచిస్తుండగా... ఆరోజు షూటింగ్ కంప్లీట్ అయింది.

"ఇవాళెందుకో అన్యమనస్కంగా ఉన్నావ్" డైరక్టర్ చెప్పాడు.

"ఔను... కాస్త మూడ్ చెడిపోయింది" చెప్పిందామె.

"నువ్విక్కడా... నీ హార్ట్ హైద్రాబాద్ లో ఉంది ఉంటుంది. ఎల్లుండే ఆదివారమే కదా నీ ఫస్ట్ మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్" అడిగాడతడు.

"ఔను. రేపు సాటర్ డే. కంపల్సరీ సాంగ్ కంప్లీట్ కావాల్సిందే" అందామె.

"అలా కావాలంటే మాటిమాటికీ 'కట్స్' లేకుండా నువ్వే సహకరించాలి. మనసెక్కడో ఉంటే సీన్ రక్తి కట్టదు" అన్నాడు డైరెక్టర్.

"ష్యూర్. రేపు ఇలాంటి ఇబ్బంది ఎదురవకుండా జాగ్రత్త వహిస్తా" చెప్పింది గాయత్రీ కారెక్కి వీడ్కోలు తీసుకోబోతూ.

"హలో మేడం! మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుంది" అన్నాడు సాగర్ ఫోన్ లో.

"పొద్దుట్నుంచీ డిస్టర్బ్ చేస్తున్నావ్... మళ్ళీ కొత్తగా చేసేదేముంది?" మనసులో అనుకుంది గాయత్రీపాటిల్. షూటింగ్ స్పాట్ నుంచి తనకు కేటాయించిన హోటల్ రూంకొచ్చిన వెంటనే బాత్ రూంలోకి వెళ్లి షవర్ కింద తలపెట్టి తలారా స్నానం చేసింది. వేడెక్కిన బుర్ర కాస్త సేద తీరినట్లనిపించి... టీవీ చూస్తుండగా సెల్ మోగింది. హీరో సాగర్ కాల్. లిఫ్ట్ చేయాలా... వద్దా? అని కాసేపు ఆలోచించిన తర్వాత తనేం తప్పు చేయనప్పుడు తప్పుకు తిరగాల్సిన పనేముందని లిఫ్ట్ చేసి - 'హలో' చెప్పింది.

"మేడం... ఈ నైట్ మీతో కలిసి భోంచేయాలనుకుంటున్నా"

"పొద్దున్నంత నా తలకాయ తిన్నావ్... కనీసం ఇప్పుడైనా ప్రశాంతంగా నన్ను భోంచేయనీయవా?" ఆ మాటలు పైకి అనలేదు ఆమె.

"ఏం మేడం... నేను మీ రూంకి రానా?"

ఒకే హోటల్ లో ఫోర్త్ ఫ్లోర్ లో అతడి మకాం. ఫస్ట్ ఫ్లోర్ లో హీరోయిన్ బస.

"రండి. కలిసి డిన్నర్ చేద్దాం" వెల్ కం చెప్పింది. ఆమె మాట పూర్తయిందో లేదో తలుపు చప్పుడైంది. హోటల్ స్టాఫ్ అనుకుని - 'క'మిన్..." అంది.

డోర్ తెరిచి వచ్చాడు సాగర్.

"అంటే... రూం దగ్గరే ఉండి కాల్ చేసారా?"

"ఔను... రూం లో నాకేం తోచడం లేదు. అందుకే..." అన్నాడు సాగర్.

తర్వాత - "తలుపు మూసిన తలవాకిట పగలూ రేయి నిలుచున్నా... పిలిచి పిలిచి బదులే రాక అలిసి తిరిగి వెళుతున్నా... నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు. నువ్వు వలచావనే తెలిపేలోగా నివురైపోతానూ..." అని పాడాడతడు.

"వాయిస్ బాగుంది. హీరోగానే కాదు... సింగర్ గా కూడా మీరు ట్రయ్ చేయొచ్చు" అంది గాయత్రి.

"ఈ సాంగ్ లో నా గొంతు చూడకండి..."

"మరి..." అడిగిందామె.

"ఇందులో నా గుండె చప్పుడు ఉంది" పోయెటిక్ గా చెప్పాడతడు.

"అది లవ్ సాంగ్ కదా... ఫీల్ అర్ధమైంది" అంది గాయత్రీపాటిల్.

"మనసు కవి ఆత్రేయ అనీ మాకో లిరిక్ రైటరున్నాడు. ఆయన రాసిన పాట ఇది. ఇందులో ప్రియురాలి ప్రేమకోసం అల్లాడే ఓ ప్రేమికుడి హృదయం ఆవిష్కృతమైంది..." అంటూ
విడమర్చి చెప్పాడు సాగర్.

"భలే ఉందే..." అర్ధం తెలిసిన తర్వాత అమితానందానికి లోనైందామె.

"ఎట్ ప్రజెంట్ నా స్టేజ్ అదే. ఔను మేడం. మీతో ఇంత సన్నిహితంగా ఉంటానని నేననుకోలేదు. అంతేకాదు... ఇంతకుముందు నేనెపుడూ ప్రేమలో పడలేదు. ప్రేమ అనే భావన ఇంత మధురంగా ఉంటుందనీ అనుకోలేదు. నిజంగా... ప్రేమ ఎంత గొప్పదో? 'మరుమల్లెలా పూవులా... చిరునవ్వు జల్లులా... అరుదైన హాయిలా... తేనెలా... మంచులా తెలుగింటి పెరుగులా కమ్మగా ఉంటుందనీ తెలియకనే ప్రేమించా...' అని ఓ సినిమాలో మరో కవి వేటూరి సుందరరామ్మూర్తి రాసాడు. ఆయన కూడా ఆత్రేయలాంటి మహాకవి. ఎవరో అన్నట్లు సినీకవికులానికి శ్రీనాథుడంతటివాడు. అల్లరిపాటలు రాయగలడు... ఎదకు హాయి కలిగించే పాటలూ రాయగలడు" అన్నాడు సాగర్.

"మీకు పాటలంటే బాగా ఇష్టంలా ఉందే..."

"ఔను..." అన్నాడతడు.

"అంటే... మీరు నన్ను ప్రేమించటం లేదు"

"అదేంటలా అనేసారు"

"ఒక్కసారి నింపాదిగా ఆలోచించండి. మీరు నాకు ప్రపోజ్ చేసారు. అదెలా? ఆత్రేయ, వేటూరి రాసినపాటల్లో. అంటే, వాళ్ల మాటల్లో..."

"ఎవరిమాటలైతేనేం... ప్రేమంటే అదేగా. కళ్ళూ కళ్ళూ మూసుకున్నా హృదయంతో మాటాడునమ్మా ప్రేమ... నిద్దుర చెదిరిపోయేనమ్మా... నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమ... ఆడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ... రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమ... ప్రేమలకు హద్దులేదులే... దాన్ని ఎవరైనా ఆపలేరులే..." అంటూ మరోపాట పాడాడు సాగర్.

"ఇదెవరి పాట..." అడిగింది గాయత్రి.

"భువనచంద్ర అని ఇంకో సినిమా రైటర్... ఈ పాటలో ప్రేమ గురించి ఆయనెంతో బాగా చెప్పారు. ఇంకో చరణంలో... జాతి లేదు... మతమూ లేదు... కట్నాలేవీ కోరుకోదు ప్రేమా... ఆది లేదు... అంతం లేదు... లోకం అంతా తానై ఉండును ప్రేమా... ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను ప్రేమా... నాలోనా నువ్వుండి... నీలోనా నేనుండి జీవించేదే ప్రేమా... జాతకాలు చూడబోదులే... ఎన్ని జన్మలైనా వీడిపోదులే..." అని శ్రావ్యంగా పాడాడు సాగర్.

"నిజం సాగర్. నువ్వు ప్రేమలో పడ్డావు. చిన్నప్పట్నుంచీ నువ్వు చూసిన సినిమాలు, విన్న ప్రేమకథలు, పాటల తర్వాత 'ప్రేమ' అనే  థ్రిల్ తెలుసుకోవాలనే ప్రగాడవాంఛతో ఇపుడు నువ్వు ప్రేమలో పడ్డావు. నిజం చెప్పాలంటే నువ్వు ప్రేమతో ప్రేమలో పడ్డావు. రెండక్షరాల ప్రేమ అనే ఆ ఫీలింగ్ ని నువ్వు ప్రేమిస్తున్నావు. అది వ్యక్తపరిచేందుకు నేన్నీకు ఓ ఆలంబనగా అందుబాటులోకి వచ్చాను. నువ్వు పెరిగిన సమాజంలో నా అంత దగ్గరగా ఏ స్త్రీని నువ్వు ఎరిగి ఉండవు. అలాగనీ, ఏ స్త్రీతో పరిచయం లేదని నేననను. నీ పక్కింట్లో అమ్మాయి, కాలేజీలో లేడీ స్టూడెంట్, స్ట్రీట్ లో నిత్యం ఎదురయ్యే ఎంతమందో ఆడవాళ్లు నీకు తెలిసే ఉంటారు. కానీ, వాళ్లతో సుప్త చైతన్యంలో నిద్రాణమై ఉన్న నీ ఫీలింగ్స్ ని బయటపెట్టే అవకాశం నీకు దొరక్కపోయి ఉంటుంది. కానీ... ఈ సినిమా వాతావరణం వల్ల ఓ స్త్రీని ముట్టుకోవడంతో పాటు ఆమె ఊపిరి వెచ్చదనాన్ని అతిసన్నిహితంగా అనుభవించే అవకాశం అందిరావడంతో... నువ్వు నన్ను ప్రేమిస్తున్నాననే భావనతో నీ ఇన్నర్ ఫీలింగ్స్ ని బాహాటంగా వెల్లడిస్తున్నావు" ఆమె ఆపింది.

అతడు ఆలోచిస్తున్నాడు.

"అంటే... నిన్ను ప్రేమించడం లేదంటావు?" అడిగాడు కాసేపటి తర్వాత.

"ఖచ్చితంగా ప్రేమిస్తున్నావు. కానీ, నన్ను కాదు... ప్రేమ' అనే తీయని భావనని. అంతే!" అంది ఆమె.

"అలా కాకుండా నిజంగా నువ్వు నన్నే ప్రేమించి ఉంటే... నీ హృదయాన్ని స్వచ్చంగా నా ముందు పరిచేవాడివి. 'ప్రేమ' అనే ఓ అభివ్యక్తీకరణ కోసం ఆత్రేయ, వేటూరి సహకారం తీసుకునేవాడివి కావు. వేవ్ లెంగ్త్ కలిస్తే పాటలపంక్తుల ఆసరా ఎందుకు? అంటే... నువ్వింతవరకూ తెలుసుకున్న సినీసాహిత్యంలోని కల్పనాత్మక ప్రేమని నిజజీవితంలోకి ఆహ్వానించాలని చూస్తున్నావు. ఒక్క విషయం... సినిమా వేరు. జీవితం వేరు. సినిమాలో అతిశయోక్తులుంటాయి. జీవితంలో వాస్తవికత ప్రగాడముద్ర వేస్తుంది..."

"మరి... ఆ కవులు రాసిన పాటల్లోనే కదా హీరోహీరోయిన్లు నటిస్తున్నారు"

"అదీ సినిమాల్లోనే కదా? జీవితంలో ప్రతి సందర్భంలోనూ పాటలు పాడుకుంటూ ఉంటారా ఎవరైనా? ప్రతీదీ మాటల్లోనే వ్యక్తపరుస్తారు..."

"అంటే... నేను పాటల్లో వ్యక్తీకరించినందువల్లే నా ప్రేమపై డౌట్ పడ్తున్నావు. ఔనా?"

"అదికాదు... తెరపై కనిపించే హీరోహీరోయిన్లు జీవితంలో అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నావు. ఇపుడు నీలో చూస్తున్నదదే" అంది గాయత్రి.

"అయితే... మరి నా ప్రేమ"

"ఆల్రెడీ సినిమాలో 'ఓకే' చెప్పాను కదా" నవ్విందామె.

"ఆ విషయం రియల్ లైఫ్ లోనూ చెప్పాలి కదా!"

"చెప్పాలంటే... నీ లవ్ 'స్క్రీన్ లవ్' లాంటిది కాదని నాకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకం నువ్వెపుడు కలిగిస్తే అపుడు..." సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆపేసింది గాయత్రీపాటిల్.

"ఇప్పటికీ నీకు సిన్సియర్ గానే నా ప్రేమని వ్యక్తం చేస్తున్నాను. ఇంకోసారి నా ప్రపోజల్ గురించి ఆలోచించు" అభ్యర్ధించాడు సాగర్.

"ఓకే..."

"ఓకేనా... యురేకా" అంటూ ఎగిరిగంతేసాడు సాగర్.

"ఓకే... అసలర్ధం తెలుసా... వన్ కిస్" చెప్పాడు.

"అదే... అదే... ఆ టెర్మినాలజీయే నీ లవ్ లోని అపరిపక్వతని పట్టిఇస్తోంది. సరే, ఇపుడేం చేద్దాం. డిన్నర్ ఆర్డరియ్యనా" అడిగిందామె.

అంతలో - టీవీలో వెదర్ రిపోర్ట్ వస్తోంది.

"నీలం తుఫాను కారణంగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాలవాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చే ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేపలవేటకి జాలరులు సముద్రం మీదకి వెళ్లకూడదని హెచ్చరించడమైంది" యాంకర్ చెప్తోంది. ఇంతలో... కిటికీలోంచి ఓ శీతలపవనం వేగంగా వచ్చి అ ఇద్దర్నీ ముద్దాడింది.

"ఈ తుఫాన్ లో రేపటి షెడ్యూల్ డౌటే" అన్నాడు సాగర్.

"అంటే... ఈ సండే నేను హైద్రాబాద్ వెళ్ళడమూ డౌటే" అనుకుంది గాయత్రి. తన మనసు తెలుసుకోకుండా 'లవ్ ప్రఫోజల్'ని అర్ధం చేసుకోనందుకు సాగర్... తుఫాను కారణంగా తన ఫస్ట్ సినిమా ఫంక్షన్ కి అటెండ్ కాలేనేమోనన్న ఆందోళనతో గాయత్రి... ఇక, ఆరాత్రి సిగ్గా భోంచేయలేదు. పైకి సభ్యతకోసం ఏదో నాలుగు మెతుకులు కెలికి డిన్నర్ అయిందనిపించారు.

ఆ మర్నాడు అచ్చం ఆమె అనుకున్నట్లే జరిగింది. గంటగంటకీ తుఫాను బీభత్సం పెరగడం... ఈదురుగాలుల్తో కూడిన వాన జోరుగా కురుస్తుండటంతో చెన్నయ్ నుంచి బయల్దేరాల్సిన ఫ్లయిట్లన్నీ కేన్సిల్ అయ్యాయి.

మొత్తానికి తన మొదటి సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి ఆమె వెళ్ళలేకపోయింది.

ఆ గైర్హాజర్ 'నీలం తుఫాన్' లా ఆమె కెరీర్ ని చుట్టుముట్టింది.

"పరభాషాహీరోయిన్లకు మన తెలుగు భాషంటే గౌరవం లేదు. వాళ్లు మన ప్రోగ్రామ్ లకు హాజరుకారు. సినిమా ప్రమోషన్ ల పట్ల ఆసక్తి చూపించరు. ఆఖరికి... తమ సొంత సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో మెమెంటో తీసుకోడానికి కూడా రారు" ఓ డైరెక్టర్ సరిగమరావు శివాలెత్తిపోతున్నాడు.

"ఎక్కడో అనామకంగా పడిఉన్న పరభాషనటీమణుల్ని ఇక్కడికి తీసుకొచ్చి నెత్తిమీద కూచోబెట్టుకుని మోయడం కన్నా తెలుగమ్మాయిలకు అవకాశాలు కల్పించడం మేలు..." అంటున్నాడాయన.

చెన్నయ్ లోని తన హోటల్ రూంలో టీవీలో ఆ ప్రోగ్రామ్ లైవ్ టెలీకాస్ట్ ని చూస్తోంది గాయత్రిపాటిల్. బయట జోరున వాన కురుస్తున్న శబ్ధం వినిపిస్తోంది. హైద్రాబాద్ లో తుఫాను ఎఫెక్ట్ అంతగా లేదేమో... ప్రోగ్రామ్ సజావుగా సాగుతోంది. చాలామంది సినీ ప్రముఖులు హాజరైన ఆ ఫంక్షన్ లో తనూ ఉండాల్సింది. కానీ, పాడు తుఫాను తన ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేసింది. ఉదయం నుంచీ ప్రొడ్యూసర్ మాతంగరావుకి పదేపదే కాల్ చేస్తూనే ఉందామె.. సెల్ రింగవుతున్నా ఎంతకీ లిఫ్ట్ చేయడం లేదాయన. అలాగే డైరక్టర్ కి, ఇతర టెక్నీషియన్స్ కి కాల్ చేసింది. డైరక్టర్ మాట్లాడుతూ - "విషయమంతా తెలిసింది. నువ్వు సిటీలో లేనందుకు ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఫంక్షన్ సంగతి ముందుగా చెప్పినా ఖాతరు చేయలేదని ఆయన ఆరోపణ" అన్నారు.

"ఎలా సార్... సాటర్ డే కూడా షూటింగ్ ఉంది. సండే మార్నింగ్ ఫ్లయిట్ పట్టుకుని హైద్రాబాద్ వద్దామనుకున్నా. కానీ, ఇంతలో ఈ తుఫాన్" ఆమె అంది.

"అనుకున్నట్లు అన్నీ జరగవు కదా! అందుకే, కనీసం ఆ షూటింగైనా కేన్సిల్ చేసుకోవాల్సింది" అభిప్రాయం చెప్పాడు. ఇంకేం చెప్పాలో తెలీక 'సారీ' చెప్పేసింది గాయత్రి. ఆయన పిక్చర్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇదే డైరక్టర్ - "కాన్ సంట్రేషన్, కమిట్ మెంట్, డెడికేషన్... ఇవే ఓ స్టార్ గా ఎదగాలనుకునేవాళ్లకుండాల్సిన లక్షణాలు. ఎన్ని హార్డిల్స్ వచ్చినా సరే... ఇచ్చిన కాల్ షీట్ వృధా చేయొద్దు. షూటింగ్ కి బంక్ కొట్టొద్దు" అని చెప్పేవాడు. కానీ, ఇపుడో ఓ ఫంక్షన్ కి అటెండ్ కాలేని పరిస్థితిని కూడా అర్ధం చేసుకోకుండా తమకు అనుకూలమైన వాదనని మాత్రమే వినిపిస్తున్నాడు" అనుకుందామె. తర్వాత ప్రోగ్రామ్ ఇంకో గంటలో స్టార్టయే సాయంసమయాన ప్రొడ్యూసర్ మాతంగరావు గాయత్రి కాల్ అటెండయ్యాడు.

"హలో సర్..." అంటూ ఆమె మాట్లాడబోతుండగా ఏదీ వినిపించుకోకుండా - "చేతుల్లో రెండు సినిమాలు ఉండగానే కొంతమంది స్టార్ హీరోయిన్లయిపోయినట్లు ఫోజిస్తారు. ఎక్కడ్నుంచి తాము వచ్చామో... ఎన్ని మెట్లెక్కి ఈ స్థితికి చేరుకున్నామో చిటికలో మరిచిపోతారు. తమ మొదటి సినిమా... మొదటి ప్రొడ్యూసర్... మొదటి డైరెక్టర్... మొదటి కెమెరామేన్... వీళ్లని ఎవరు గుర్తుంచుకుంటారో వాళ్లే ఎంతో ఉన్నతికి ఎదుగుతారు..." చిటపటలాడిపోతున్నాడు మాతంగరావు.

"సర్... నా ఫస్ట్ ప్రాజెక్ట్ నెలా మరిచిపోతాను?" అంది బాధగా గాయత్రి.

"ఇదిగో... ఇలా. ఈవేళ ఈ ఫంక్షన్ లో తళుక్కున మెరవాల్సింది నువ్వే. నువ్వు ఫంక్షన్ కి వచ్చి ఉంటే నీకోసం సడన్ సర్ ప్రయిజ్ ఎదురుచూస్తూ ఉండేది. కానీ..." అతడు మాట్లాడలేదు.

"సర్... నాకూ ఆ ప్రోగ్రామ్ అటెండ్  చేయాలనే ఉంది. కానీ, రాలేకపోయాను. ఆ కారణమూ మీకు తెలుసు. అదలా ఉంచితే... ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అన్నట్లు... నా మెమెంటోని మీ చేతుల మీదుగా మీరే అందుకుని నేను హైద్రాబాద్ వచ్చాక అందజేస్తే సంతోషిస్తాను" అంది.

ఆమె మాటలకి ఏం సమాధానం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు మాతంగరావు. తుఫాను కారణంగా గదిలోనే అరెస్ట్ అయిన గాయత్రీ టీవీలో తన ఫస్ట్ మూవీ ఫంక్షన్ చూస్తూ కూచుంది. ఇందాకటి డైరక్టర్ సరిగామరావే మాట్లాడుతున్నాడు. తెలుగులో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ఖ్యాతి గడించిన ఆ దర్శకుడు ఇండస్ట్రీలోని పెద్ద తలకాయల్లో ఒకడు. ఆయన పరభాషా హీరోయిన్లను తన సినిమాల్లో పెట్టుకుని హిట్ చవి చూసినవాడే. కానీ, ఇపుడు పరభాషా హీరోయిన్లంటేనే ఎందుకో ఆయనకు చిరాకు. ఆ చిరాకునే తన ప్రసంగంలో ప్రదర్శిస్తున్నాడాయన.

"కాజల్ అగర్వాల్, ఇలియానాలాటి హీరోయిన్లు ఇక్కడి సినిమా ఫంక్షన్లకి డుమ్మా కొడ్తున్నారు. తాము నటించిన సినిమా ప్రమోషన్లకే వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ వీళ్లని గుర్తించి పెంచి పెద్ద చేసింది. అయినా సరే... వీళ్లకి బాలీవుడ్ అంటేనే మోజు. మొన్నటికి మొన్న అజయ్ దేవగన్ కి జోడీగా హిందీ 'సింగం' సినిమాలో నటించిన కాజల్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ - 'బాలీవుడ్ అంటే తనకెంతో ప్రేమ అనీ... తనిక్కడిదాన్నే అనీ చెప్పుకొచ్చింది. దాంతో, ఇక్కడి నిర్మాతలకు ఆమెపై పట్టరాని కోపం వచ్చింది. ఒక దశలో ఆమెకి చిత్రాలు ఇవ్వకూడదనే వరకూ ఆ ఆగ్రహం కట్టలు దాటింది. అది గమనించిన ఆమె... మళ్ళీ ఇక్కడి మీడియా ద్వారా 'సారీ...' చెప్పి దక్షిణాది చిత్రాలకే తన ప్రాధాన్యత అని ప్రకటించింది. అయితే... బాలీవుడ్ లో ఆమె ఎంట్రీ వర్కవుట్ కాకపోవడంతో కాని పరిస్థితుల్లోనే ఆమె మళ్లీ ఇక్కడి సినిమాలు చేస్తోంది..." అన్నాడు సరిగమరావు.

"ఇక... ఇదే బాటలో ఇలియానా కూడా నడుస్తోంది. ఇక్కడి సినిమాల ప్రమోషన్ ఆమెకేం పట్టదు. లక్షల్లో రెమ్యునరేషన్ కావాలి. కానీ... ఆ సినిమా జనాల్లోకి వెళ్లేందుకు మాత్రం ఈమె జనాల్లోకి వెళ్ళదు. అయితే, ఈమధ్యే బాలీవుడ్ లో 'బర్ఫీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా సుందరి అక్కడ ఆ సినిమా ప్రమోషన్ కోసం కాల్ షీట్స్ బాగానే ఖర్చు చేస్తోంది. ఈ వివక్ష ఎన్నాళ్లు?

(... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
shatruvu telugu stroy by chandra