Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - పదిహేడవ భాగం

Anubandhaalu Seventeenth Part

మున్నలూరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలీనంతగా అన్నా, చెల్లెళ్లిద్దరూ తమ సరదాల్లో మునిగి తేలుతున్నారు. తరచూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడూ చెన్నై కూడా వెళ్లివస్తున్నారు. మంచినీళ్ళలా డబ్బు ఖర్చుపెడుతున్నారు.

ఏం చేసినా, ఏం చెప్పినా వాళ్లలో మార్పు రానందుకు అంతా బాధపడుతున్నారు. అమెరికా నుంచి ఫోన్ చేసిన తమ్ముడు గోపాల్ కి ఇదే విషయం చెప్పాడు రామలింగేశ్వర్రావు. గోపాల్ బాధపడ్డమే కాదు, కోపం ముంచుకొచ్చింది పిల్లల మీద.

"అన్నయ్యా! ఈ విషయాలు అమ్మకు తెలీనీకు. ఫోన్ చేస్తే వాళ్ళు చాలా మారిపోయారని, పద్ధతుల్లోకి వచ్చేశారని చెప్పు. నేను వీలు చూసుకొని అక్కడికోస్తాను. వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం" అంటూ సూచించాడు.

తల్లి ఫోన్ చేస్తే అదే విధంగా చెప్తూ వచ్చాడు రామలింగేశ్వర్రావు.

మంచి పద్ధతులు అలవర్చుకోమని చెప్పి కొడుకుని, కూతురిని ఇండియా పంపించిన మరునాడే డాక్టర్ గోపాల్ ముందుచూపుతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ తమ ఇంటినెంబర్లూ, ఆస్పత్రి ఫోన్ నెంబర్లూ, ఇతర సెల్ నంబర్లను కూడా మార్పించేశాడు. తన పర్సనల్ సెల్ నంబర్ తప్ప, మిగతావన్నీ మారిపోయాయి. మారిన నంబర్లు అన్న రామలింగేశ్వర్రావుకి మాత్రమే చెప్పి, పొరబాటున కూడా కొత్త నంబర్లను అనంత్, శివానీలకు ఇవ్వొద్దని చెప్పాడు.

ఎందుకంటే... పొరబాటున వాళ్ళు అమెరికాలోని తమ ఇంటికి ఫోన్ చేసి సత్యవతితోగాని, అన్నపూర్ణేశ్వరితోగాని మాట్లాడితే, వాళ్లు మారలేదని తెలిసిపోయి తిరిగి తన తల్లి బెంగతో మంచానపడే ప్రమాదం ఉంది. అందుకే ఆ విషయంలో ముందే జాగ్రత్తపడ్డాడు గోపాల్.

ఈ పరిస్థితుల్లోనే అయిదు వారాలు గడిచిపోయాయి.

అక్కడ అమెరికాలో...

"ఏమిట్రా గోపాల్ హడావుడి? ఎక్కడికన్నా ప్రయాణమా?" రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రయాణానికి సిద్ధమవుతున్న కొడుకును చూసి అడిగింది అన్నపూర్ణేశ్వరి.

"అవునమ్మా! ప్రపంచ గుండెజబ్బు నిపుణుల సదస్సు ఒకటి జర్మనీలోని బెర్లిన్ నగరంలో జరుగుతోంది. దానికి హాజరవ్వాలి నాలుగు రోజుల సదస్సు అది. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను" చెప్పాడు.

"మరి చెప్పావ్ కాదేరా? యూరప్ కూడా చాలా బాగుంటుందట కదా. అమెరికా చూపించారు. ఇండియా వెళ్ళేలోగా యూరప్ చూడొద్దా? చెప్తే నీతోబాటు నేనూ వచ్చేదాన్నిగా" అంది ఉత్సాహంగా ఆవిడ.

ఇండియా వెళ్ళిన పిల్లలు పద్ధతుల్లోకి వచ్చేస్తున్నారని తెలిసినప్పట్నుంచి ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది. ఉత్సాహంగా ఎప్పటిలా ఉంటోంది.

తల్లి కోరిక విని చిన్నగా నవ్వాడు.

"అమ్మా! అదెంత పని... నేను వెళ్ళేది కాన్ఫరెన్స్ కి. నేను వచ్చాక నిన్ను, కోడలిని పంపిస్తాను. హేపీగా చూసిరావచ్చు" అంటూ నచ్చజెప్పాడు.

నిజానికి గోపాల్ ఇండియా బయలుదేరాడు. జర్మనీకి కాదు.

ఇండియా అని చెప్తే వెంట వచ్చేస్తానని అన్నపూర్ణేశ్వరి గొడవ చేస్తుందని జర్మనీకి వెళుతున్నట్టు అబద్ధం చెప్పాడు.

"అంతా బాగానే వుంది గాని, వీళ్ళేమిట్రా. అనంత్ గాని, శివాని గాని ఇక్కడికి ఫోన్ చేయడం లేదేమిటి? ఏ మాత్రం మార్పు వచ్చిందో తెలుసుకుందామంటే వీలు కావడంలేదు. ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అంతా బాగానే ఉందంటాడు పెద్దోడు. పిల్లల్ని పిలవమంటే బయటకెళ్ళారు వచ్చాక ఫోన్ చేయిస్తానంటాడు చేయడు.

"అమ్మా నీకంతా చాదస్తం. అన్నయ్య చెబుతున్నాడుగా. ఇంకా ఎందుకు కంగారు. మారిన ఫోన్ నెంబర్లు వాళ్లకి తెలుసు. చేస్తార్లే. నేను జర్మనీ నుంచి రాగానే మాట్లాడదాం. నాకు ఫ్లైట్ టైమైంది వస్తాను. సత్యా టేకేర్. వారం రోజుల్లో వచ్చేస్తాను" అన్నాడు భార్యతో.

"అలాగే, మీ ఆరోగ్యం జాగ్రత్త" అంది సత్యవతి.

తల్లితోబాటు భార్యకి వీడ్కోలు చెబుతుండగా, ఏర్ పోర్టుకి బయలుదేరాడు గోపాల్. తెల్లవారుజాము నాలుగు గంటలకి అతను ఎయిర్ ఇండియా విమానంలో వున్నాడు. విమానం లండన్ హీత్రో విమానాశ్రయంలో ఆగినప్పుడు ఇండియాకు ఫోన్ చేసి తను వస్తున్నట్టు అన్న రామలింగేశ్వర్రావుకి చెప్పాడు. గంట విరామం తర్వాత విమానం గాల్లోకి లేచింది.

డాక్టర్ గోపాల్ ఇండియా నుంచి వస్తున్న సంగతి ఆ ఇంట్లో రామలింగేశ్వర్రావు ఒక్కడికే తెలుసు.

ఈ విషయం సీక్రెట్ గా వుంచమని గోపాల్ చెప్పడంతో తనూ ఎవరికీ చెప్పలేదు. పనిమీద తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తన కారు తీసుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ వచ్చేశాడు.

ఎప్పటిలాగే మిగిలిన రాత్రి హోటల్లో గడిపి, ఉదయం ఎనిమిది గంటలకు స్నానాదికాలు ముగించుకొని టిఫిన్ చేసి కారులో ఏర్ పోర్టుకి చేరుకున్నాడు.

అతను వచ్చిన అరగంటలో బాంబేనుంచి వచ్చిన విమానం ల్యాండ్ అయింది. కష్టమ్స్ చెకింగ్ ముగించుకొని బయటకొచ్చిన తమ్ముడిని ప్రేమగా కౌగలించుకున్నాడు రామలింగేశ్వర్రావు. పరస్పర యోగక్షేమాలు మాట్లాడుకుంటూనే వచ్చి కారులో కూర్చున్నారు.

"నువ్వు చాలా అలసినట్టు కనిపిస్తున్నావు. విశ్రాంతి తీసుకుంటానంటే చెప్పరా, హోటల్లో స్టే చేద్దాం. మధ్యాహ్నం భోంచేసి బయలుదేరచ్చు" దారిలో తమ్ముడిని అడిగాడు.

"అదే బెటరనుకుంటాను" అన్నాడు గోపాల్.

దగ్గరలోని హోటల్లో రూం తీసుకున్నాడు రామలింగేశ్వర్రావు. గోపాల్ స్నానం చేసి వచ్చాక టిఫిన్ తీసుకునేవరకు కుటుంబ విషయాలేమీ మాట్లాడుకోలేదు ఇద్దరూ. రిలాక్స్ గా కూర్చున్నాక అడిగాడు గోపాల్.

"ఏమిటన్నయ్యా! వాళ్లలో మార్పు రాలేదంటే బాధగా ఉంది. మారే అవకాశం లేదంటావా?" అనడిగాడు బాధగా.

"అదే అర్ధంకావడం లేదు. మాట్లాడితే ఎ.సి. కారు తెప్పించుకుంటారు. హైదరాబాద్ తరచూ వస్తుంటారు. అప్పుడప్పుడూ చెన్నై వెళుతుంటారు. యువతలో విదేశీ వ్యామోహాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇక్కడా నగరాల్లో అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

వీళ్లకి ఫైవ్ స్టార్ హోటళ్ళలో డిన్నర్ కావాలి. డిస్కోటెక్ లు, పబ్ లలో చేరి తాగడం, పిచ్చిపట్టినట్టు ఆడడం, పాడటం, అర్ధనగ్నంగా డాన్సులు, బీరు... ఛఛ. ఇంతగా వీళ్లు డబ్బు దుబారా చేస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా వుంది.

ఇలా అల్లరిచిల్లరగా తిరిగి దుబారా ఖర్చులు చేస్తే భరించలేక నేను వెనక్కి పంపించేస్తాననే ఆలోచనలో వీళ్ళున్నట్టున్నారు. ఏం చేయాలో నువ్వే చెప్పాలి?" అంటూ పరిస్థితిని తమ్ముడికి క్లుప్తంగా వివరించాడు.

అంతా విని భారంగా నిట్టూర్చాడు గోపాల్.

"లేదన్నయ్యా! వీళ్ళు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా వీళ్లలో మార్పు రానంతవరకు వెనక్కు తీసుకెళ్ళే ప్రసక్తి లేదు." అన్నాడు స్థిరంగా.

"అయితే ఎంతకాలం ఇలా? లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. అలాగని వాళ్ళడిగిన డబ్బు ఇవ్వకుండానూ ఉండలేం"

"లేదు లేదు డబ్బు ఇవ్వడం ఆపకు. ఎంత అవసరమైనా నేను పంపిస్తాను."

"ఇదే... అమెరికాలో కూడా ఇలాగే వాళ్లకు డబ్బిచ్చి నువ్వే వాళ్ళని భాద్యత లేకుండా చేసినట్టున్నావ్"

"ఊహు. అమెరికాలో పరిమితంగానే ఖర్చు చేసేవాళ్ళు. అయినా అదీ ఎక్కువే అనుకో. నేనివ్వకపోతే పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించుకునేవాళ్ళు. ఇక్కడా ఛాన్స్ లేదు. నువ్వన్నది కరెక్ట్. విపరీతంగా ఖర్చు చేస్తే తట్టుకోలేక అమెరికా పంపిస్తారని వాళ్ళిద్దరూ అలా చేస్తున్నారు. వాళ్ళని ఎలా దారికి తేవాలో నాకు తెలుసు."

"ఏమిట్రా నీ మొండితనం? ఎందుకొచ్చింది అమెరికా తీసుకెళ్లిపో. వాళ్లకి నచ్చిన పద్ధతిలోనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పెళ్ళయితే వాళ్లే పద్ధతిలోకి వస్తారు."

"పెళ్లి ఎలా చేయమంటావ్? ఫారెన్ కోడల్ని, ఫారెన్ అల్లుడ్ని తెచ్చుకోమంటావా?"

"అదికాదురా తమ్ముడూ..."

"అన్నయ్యా. ఇంకేం చెప్పకు. చెల్లాయికి మాటిచ్చాను. వాళ్ల పిల్లలతోనే మా పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతాయని. ఇక అమ్మ ఆశ మనకు తెలుసు. వీళ్ళ పెళ్ళిళ్ళు చూడడమే తన జీవితాశయం. కానీ వీళ్ళిలా అమెరికా స్టయిల్ వెలగబెడుతుంటే చూస్తూ చూస్తూ చెల్లాయి పిల్లలకిచ్చి ఎలా పెళ్లి చేయడం..."

"వద్దురా. నేను చూస్తూనే ఉన్నాను గదా. అనంత్ లోగానీ, శివానీ లోగానీ మేమంతా ఎంతచెప్పినా ఆవగింజంత కూడా మార్పు రాలేదంటే ఇక ముందైనా వస్తుందన్న నమ్మకం లేదు. చెల్లాయితో కూడా చెప్పేస్తాను. వాళ్ళుగాని, మీరు గాని బయట సంబంధాలే చూసుకోండి. సమస్యలు రావు." "అది జరగదు. నీకో ముఖ్య విషయం చెప్పాలన్నయ్యా! మేం అమెరికాలో ఇంకో అయిదేళ్ళు మాత్రం ఉంటాం. ఈలోపల వీళ్ల పెళ్ళిళ్ళు జరిపించి నవీన్ ని, మహేశ్వరి ని కూడా మాతోబాటు అమెరికా తీసుకెళ్ళి కొంతకాలం మా దగ్గరే ఉంచుకుంటాం. మేం అక్కడ్నుంచి వచ్చే లోపల ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టాలి. ఆ హాస్పిటల్ అమ్మ చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి. పేద, మధ్య తరగతి ప్రజలకి నా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. అమ్మ ఆశీస్సులతో అమ్మ ఆశల్ని నెరవేర్చడం మన బాధ్యత. నవీన్ ని అమెరికాలో డాక్టర్ చదివిస్తాను. ఇష్టపడితే మహేశ్వరి కూడా డాక్టర్ కోర్సులో చేరుతుంది. ఇక అనంత్ శివానీలు ఇద్దరికీ బిజినెస్ మేనేజ్ మెంట్ అంటే ఇష్టం. హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ జరగాలంటే అనంత్, శివానీలకు తమ బాధ్యతలు తెలియాలి. తెలిసేలా చేస్తాను" అంటూ మనసులో మాటను అన్నయ్యకు వివరించాడు గోపాల్.

అంతా విని బాధగా తల విదిలించాడు రామలింగేశ్వర్రావు.

"నువ్వు చెప్పింది బాగానే వుంది. కాని వీళ్లు దారికొస్తారన్న నమ్మకమే నాకు లేదు. వచ్చావ్ గా, ప్రయత్నించి చూడు" అన్నాడు చివరకు.

మధ్యాహ్నం భోజనం కూడా హోటల్లోనే తీసుకొని రెండు గంటల తరువాత తీరిగ్గా బయలుదేరారు. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ నుంచి మున్నలూరు చేరుకునేసరికి ఆరు గంటలు కావస్తోంది. శీతాకాలం గాబట్టి అప్పటికే చీకటిపడింది.

అమెరికా నుంచి గోపాల్ వస్తున్న సంగతి ఇక్కడ ఎవరికీ తెలీదు.

పొరబాటున అమెరికా నుంచి తన తల్లిగాని, భార్యగాని మున్నలూరు ఫోన్ చేస్తే తను బయల్దేరింది జర్మనీకి కాదు ఇండియా అని వాళ్లకు తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ముందే రామలింగేశ్వర్రావుని హెచ్చరించడం వలన అతడు కూడా ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అందుకే సడన్ గా వచ్చిన గోపాల్ ని చూడగానే అందరికీ ఒకటే షాక్.

ఒక్కసారిగా అక్కడ హడావుడి మొదలైంది.

ఆ సమయంలో బావ రఘునాథ్, చెల్లెలు భ్రమరాంబ అంతా అక్కడే ఉన్నారు. కుశల ప్రశ్నలు, పలకరింపులు అవగానే గోపాల్, తన పిల్లలు అనంత్, శివానీల కోసం చూసాడు. వాళ్ళక్కడ లేరు.

"వీళ్ళిద్దరూ ఎక్కడ?" వదిన మహాలక్ష్మీని అడిగాడు.

"ఉదయం బయటకెళ్ళిన వాళ్ళు భోజనానికి కూడా ఇంటికి రాలేదు. మధ్యాహ్నం అనంత్ సెల్ కి ఫోన్ చేసాను. విజయవాడలో వున్నాం పెద్దమ్మా. సాయంత్రానికి వచ్చేస్తామన్నారు. కానీ ఇంతవరకు రాలేదు. ఏమిటో వీళ్ళ పద్ధతులు ఎంత చెప్పినా వినడం లేదు." అంటూ మరిదితో చెప్పి బాధపడిందావిడ.

ఇంతలో రామలింగేశ్వర్రావుకి ఫోన్ వచ్చింది.

ఫోన్ చేసింది విజయవాడలోని డి.వి. మేనర్ హోటల్ మేనేజర్. విషయం ఏమిటంటే అనంత్, శివానీలు ప్రస్తుతం హోటల్లో వున్నారు. బిల్లు పే చేయమని రిక్వెస్ట్.

విషయం తెలీగానే గోపాల్ కి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపంలోనే వేగంగా బయటకొచ్చి, కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.

రామలింగేశ్వర్రావు వెనకనుంచి పిలుస్తున్నా విన్పించుకోలేదు. ఎందుకయినా మంచిదని వెనకే తనూ బైక్ తీసుకుని విజయవాడ వచ్చేశాడు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఇద్దరూ హోటల్ డి.వి. మేనర్ కు చేరుకున్నారు.

వస్తూనే హోటల్ లాంజ్ లోను, రిసెప్షన్ హాల్లోనూ చూసాడు. గోపాల్ కి అక్కడ వాళ్ళిద్దరూ కనబడలేదు. చివరకు డిస్కోథెక్ లో బీరు తాగి డాన్స్ చేస్తున్న జంటల మధ్య వాళ్ళిద్దరూ ఎవరితోనో చిందులేస్తూ కన్పించారు.

ఆయనకోస్తున్న కోపానికి అక్కడే లోనకు వెళ్లి వాళ్ళిద్దరి చెంపలు పగలగొట్టాలన్నంత ఆవేశం ముంచుకు వచ్చింది. లోనకు వెళ్ళిపోయాడు కూడా. కానీ అంతలోనే వెనకే వచ్చేసిన రామలింగేశ్వర్రావు తమ్ముడి భుజం మీద చేయివేసి వెనక్కి తీసుకొచ్చేశాడు.

"మనం ఇక్కడ గొడవపడితే పోయేది మన పరువే. ప్రశాంతంగా ఉండు తమ్ముడూ! వాళ్లని నేను పిలుచుకొస్తాను" అంటూ అతడ్ని రిసెప్షన్ హాల్లోని సోఫాలో కూర్చోబెట్టి హోటల్ మేనేజర్ని పిలిచాడు.

"మావాళ్ళు కట్టాల్సిన బిల్లు ఎంత?" అడిగాడు.

"మీరే చూడండి" అంటూ బిల్లు చేతికిచ్చాడు మేనేజర్.

చూస్తే కళ్ళు తిరిగే అమౌంట్ వుంది బిల్లులో.

కొంచెం తక్కువ. అంతే!

ఒక్కరోజు కాదు. ఉదయం నుంచి ఇప్పటికి అంటే సుమారు పది పన్నెండు గంటల లోపలే ఇరవై వేలు ఖర్చుచేశారంటే ఇంతకన్నా బాధ్యతారాహిత్యం మరోటి ఉండదు. ఆ బిల్లులో ఇక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ కోసం తాగడానికి, తినడానికి అయిన ఖర్చే చాలా వుంది అందులో.

ఆ బిల్లు చూసి తల పట్టుక్కూర్చున్నాడు గోపాల్.

రామలింగేశ్వర్రావు బిల్లు డబ్బులు కట్టేశాడు.

వెయిటర్ ని డాన్స్ హాల్లోకి పంపించి అనంత్, శివానీ లను పిలిపించాడు. అప్పుడు కూడా పెదన్నాన్న వచ్చాడనే అనుకున్నారు గానీ తండ్రి అమెరికా నుంచి వచ్చిన విషయం అన్నాచెల్లెళ్ళకు తెలియదు. బయటకు వస్తూనే అక్కడ పెదన్నాన్నతో పాటు తండ్రిని చూసి  షాక్ అయ్యారు.

"డాడీ! మీరు ఎప్పుడు వచ్చారు?" అంటూ దగ్గరకొచ్చాడు అనంత్.

"డాడీ!" అంటూ ఆనందంతో పరుగున దగ్గరకొచ్చింది శివాని.

ఇద్దర్నీ అసహ్యంగా చూస్తూ, చివ్వున లేచాడు గోపాల్.

"అన్నయ్యా! వీళ్ళిద్దర్నీ వచ్చి కారెక్కమను" అంటూ కనీసం వాళ్ల ముఖం కూడా చూడకుండా బయటకొచ్చేసి కార్లో కూర్చున్నాడు.

కిక్కురుమనకుండా, తండ్రి వెనకే వచ్చి కార్లో కూర్చున్నారు ఇద్దరూ.

కారు బయలుదేరగానే బైక్ స్టార్ట్ చేసి తనూ కారును అనుసరించాడు రామలింగేశ్వర్రావు.

"ఇక్కడికి మీ ఇద్దర్నీ ఎందుకు పంపించాను. ఇక్కడికొచ్చి మీరు చేసున్నదేమిటి? సిగ్గుపడాలి...  షేం టూ యూ!" తనలోని అసహనాన్ని కోపాన్ని మాటల్లో ప్రస్ఫుటం చేస్తూ అడిగాడు గోపాల్.

అప్పటికే రాత్రి పదిగంటలు దాటింది సమయం.

డాబా ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు గోపాల్.

ఎదురుగా ఎడంగా నిలబడున్నారు అనంత్, శివానీలు.

(... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram telugu serial eleventh part