Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram telugu serial eleventh part

ఈ సంచికలో >> సీరియల్స్

శత్రువు - చంద్ర

shatruvu telugu stroy by chandra

ఎండలు పోయినాక తొలకరి రోజులు, మూడ్రోజులుగా మత్తుగా ముస్తాబుగా వున్న ఆకాశంలో అప్పుడే పడమటి వేపు సన్నటి మబ్బుల వెనుక సూర్యుడు కనిపించేడు.

మూడ్రోజులుగా పట్టుకున్న వర్షం తగ్గి, ఇంకా అప్పుడప్పుడూ జల్లు కొడుతూనే వుంది. పొలాల్లో నీళ్ళు రెండంగుళాల మేర నిలిచేవుంది. దారంతా చిత్తడిగా వుంది. అక్కడక్కడా రేగడి వున్న చోటల్లా కాలుపెడితే సర్రున జారిపోయేటట్లుంది.

వూళ్ళో జనం అవసరమైన పనులకి తప్ప, బయటకి రావటం లేదు. జీతగాళ్ళు మటుకు తలల మీద దుప్పట్లో గొంగిల్లో కప్పుకుని పొలాలకు వెళ్లి వస్తున్నారు.

రాజయ్య పెంకుటిల్లు - పెద్ద వీధికి చివర తూరుపువేపు పసుపుతోటలు తగిలే చోటుంది. రాజయ్య ఇంటి తలుపులో నుంచుంటే చూపుకు చివరగా కనిపించేది అల్లంత దూరాన పచ్చకొండ! ఇప్పుడది మత్తుగా వున్న వాతావరణంలో మబ్బుపట్టి మబ్బుమబ్బుగా మబ్బులా వుంది.

అదిగో ఆ కొండ పక్కదారమ్మటే మూడామడ వెళితే గైరమ్మ అత్తారూరు - కొత్తూరు.

రాజయ్యకు ముగ్గురాడపిల్లలు. పెద్దాళ్ళకిద్దరిక ఎప్పుడో పెళ్ళాం పోయేకే పెళ్ళిళ్ళు చేసేడు. వాళ్లనిచ్చిన వూళ్ళు దరిదాపుల్లో లేవు. ఎక్కడో దూరాన్నున్న అల్లుల్లనే ఎంచాడు. కాని కడగొట్టు పిల్ల గైరమ్మకి దగ్గర్లోనే కొత్తూరు సంబంధాన్ని చూసేడు. మెళ్ళో బేడెత్తు బంగారపు మంగళసూత్రాలు వేలాడే వేళకి గైరమ్మకి పదిహేను నిండి పదహారొచ్చినయి.

పెద్దమనిషై ఏడాది తిరక్కుండానే ముగ్గురు బిడ్డలకీ ఉన్న ఆరెకరాలూ కట్నాలకింద ఇచ్చి, పెళ్ళిళ్ళు చేసి ఋణం తీర్చుకున్నాడు రాజయ్య.

గైరమ్మని అత్తారూరు పంపి ఇంకా నెల కాలేదు. ఇంటి తలుపులకూ, కిటికీలకూ, అరుగులకూ వేసిన మొదుగు రంగులూ, సున్నపు ముగ్గులూ ఈ మూడ్రోజులి వానకి కొట్టుకుపోయినయి.

అసలే తాతల నాటిది ఆ పెంకుటిల్లు. ఎప్పుడో పెద్దబిడ్డ పెళ్ళినాడు కప్పుమీద పెంకు తిరగేశాడు. ఆ తర్వాత లేదు. అక్కడక్కడా పెంకు పగిలిపోయింది. ఆ సందుల్లోంచి జల్లు పడుతోంది.

నులకమంచంలో వెల్లికితలా పడుకున్న రాజయ్య పెంకు సందుల్లోంచి లేలేత వెలుగున్న ఆకాశాన్ని చూస్తున్నాడు. రాజయ్య కడుపునిండా అన్నం తిని మూడ్రోజులవుతుంది. మరీ నీరసంగా వున్నప్పుడు మటుకు నాలుగు మెతుకులు ఉడకేసుకున్నా సయించక చేయి కడుక్కుంటున్నాడు.

గైరమ్మకి రెన్నెల్లనాడు పెళ్ళిచేసి నెలక్రితం అత్తాలూరు పంపినా రాజయ్యకి ఏనాడూ ఒంటరిగా ఉన్నట్టుగా లేదు. గైరమ్మ పుట్టిన కాన్నించీ తండ్రిచాటు బిడ్డే! అవటానికి ముగ్గురూ ఆడపిల్లలే అయినా రాజయ్యకి గైరమ్మంటేనే ప్రేమ.

పెద్దపిల్ల రత్నమ్మకి రెండెకరాలిచ్చి దూరంగా కాపరానికి పంపినా, రెండోదానికి ఇంకో రెండెకరాలిచ్చి దూరదేశానికిచ్చినా, మిగిలివున్న రెండెకరాల్తోనూ, ముద్దుల కూతురు గైరమ్మతోనూ తృప్తిగానే మిగిలిపోయేడు. గైరమ్మక్కూడా సంబంధం చూసి ఆ రెండెకరాలూ యిచ్చి కొత్తూరు పంపేక రాజయ్యకిప్పుడు గుండెలమీద ఇంకే బరువూ లేక హాయిగానే వున్నాడు.

కానిప్పుడు - మూడ్రోజులుగా - రాజయ్య ఆ పెంకుటింట్లో - ఒంటరిగా ఏకాకిగా చిక్కుకుపోయినట్లుంది. భయంకరమైన ఒంటరితనాన్ని భరించలేకుండా వున్నాడు.

మూడ్రోజుల నాడు - ఈ ముసురు యింకా పట్టకముందు పొద్దున్నే మామూలుగా పొలానికెల్లేడు.

పసుపుతోటలూ, మామిడితోపూ దాటి చెరువు గట్టేక్కేసరికి తమ పొలంలో ఎవరో అప్పటికే నాగళ్ళు కట్టేరు. గట్టు చివరికంటా పోయి వాలుగా వున్న ఊగుడు కొమ్మల్ని పక్కకి తప్పించి మరీ చూసేడు. అయినా ఆనవాలు పట్టలేకపోయాడు మరుక్షణం గబగబా అంగలేస్తూ దాదాపు
పరుగెత్తినంత వేగంగా గుట్లమ్మట నడిచేడు.

పరిమళ్ళు దాటేక అక్కడ మనుషులు స్పష్టంగా కనిపించేరు. అప్పలయ్యా, వాడి జీతగాళ్ళూ! రాజయ్యకి కోపం వచ్చింది.

దగ్గరిగా వెళ్ళి అప్పలయ్య గాలి కెదురుగా నుంచుని, "ఏందిరో అప్పలా! ఏంది కత. తాగితాగి అందరి పొలాలు నీ పోలాలక్కనే కనిపిస్తున్నాయి!" అనడిగేడు కోపంగా తలకు చుట్టుకున్న కండువాని తీసి భుజాన్నేసుకుంటూ.

అప్పలయ్య నాగల్నెత్తి భూమిలోకి దిగేసి బురద చేతుల్ని దులుపుకుంటూ "గిట్లరాయే రాజన్న" అంటూ రాజయ్యని గట్టుమీద జువ్విచెట్టు కిందకు పిలిచేడు.

రాజయ్య ఓ సారి జీతగాళ్ళ కేసి చూసి విసురుగా అప్పలయ్య దగ్గరికెళ్ళాడు.

"ముందు నువ్వు నాగిళ్లిడిసి పోతావా లేదా?" రాజయ్య, అప్పలయ్యని కోపంగా అడిగేడు.

"ఎందుకే రాజన్న... ముందు నువ్వు కోపం యిడవరాదు? తర్వాత నేం జెప్పిందిను. ఇప్పుడు నీ పొలం నాకొచ్చింది" అన్నాడు అప్పలయ్య.

రాజయ్యకు ఒళ్ళు మండుకొచ్చింది.

"నీయవ్వ! నేనేమన్నా సచ్చిన్ర ఏందిర? నా పొలం నీకెట్లయే? అ..."

"నన్నడుగుతవేంది? పోయి నీ అల్లున్నడుగు. నన్ను దున్నుకోమన్నాడు, ఏడాది కింతియ్యమన్నాడు" రాజయ్య ఎంత కోపంగా అడిగేడో అప్పలయ్య అంత తాపీగానూ సమాధానమిచ్చాడు.

రాజయ్యకు విషయం తెలియగానే తన చిన్నల్లుడు సాచి చెంపమీద కొట్టినట్లనిపించింది. రవంత సేపు అప్పలయ్యని చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగి పొలంకేసి చూసేడు.

తన పొలంలో మూడు నాగళ్ళూ ముప్పయి నాగళ్ళుగా కనిపించినయి. రాజయ్యకి ఒక్కసారిగా ముసలితనం వొచ్చినట్టుగా ఉంది. కళ్ళకి సరిగా ఏమీ కనిపించకుండా నిండా నీళ్ళు నిండినయి.

గబగబా అక్కణ్ణుంచి వెళ్లిపోయేడు. అప్పటికి సూర్యుడు తూరుపువేపు నిండుగా పైకొచ్చి నెమ్మదిగా కదులుతున్నాడు.

చుట్టూ వున్న భూముల్ని గళ్ళుగళ్ళుగా విడదీసినట్టు గట్లమ్మట మొలిచిన గడ్డి పసుపాకుపచ్చని గీతల్లా వుంది. రాజయ్యకి - తన గుండెని చిన్నల్లుడు ముక్కలు ముక్కలుగా కోసినట్లుగా వుంది.

ఓ వేపు దుఖమూ, మరోవేపు కోపమూ - అలా యింటికొచ్చిన రాజయ్య మూడ్రోజులుగా ముసురు మూలాన యింట్లోంచి బయటకు కదలకుండా వుండిపోయేడు.

బయట ఆకాశంలో మబ్బుగా వున్న మబ్బులు యింకా విచ్చుకుని తెల్లటి వెలుగొచ్చింది. రాజయ్యకి మూడ్రోజులుగా మనసులో గూడుకట్టుకున్న ఆలోచనలు విచ్చుకున్నయి. వెంటనే మంచంలోంచి లేచి బయటకు వొచ్చేడు.

ఎదురుగా కంచెల కవతల పసుపుతోటలో తడితడిగా వున్న ఆకులు సన్నగా వీస్తున్న గాలికి పసిబిడ్డ ఉయ్యాలలా ఊగుతున్నయి.

గొళ్ళెంపై మూత తీసి అందులోంచి నీళ్ళు తీసుకుని ముఖం కడుక్కుని లోపలికొచ్చి చిలక్కొయ్యకి వున్న చొక్కాని తీసేడు. తలకి కండువా చుట్టేడు. గూట్లోంచి కప్ప తాళం తీసి తలుపులు బిగించి చెప్పులేసుకుని కదిలేడు.

అప్పటికే వీధిలో భుజాల మీద నాగళ్ళతో కొందరు పొలాలనుంచి తిరిగి వస్తున్నారు.

ఓసారి ఆకాశం వంక చూసేడు రాజయ్య.

అప్పుడే ఒకటి గొడ్తాన్రేమో! నీ యవ్వష బొత్తిగా ఈ మూడ్రోజులకెల్లి పొద్దుగూడ తెలుస్తలేదు" అనుకున్నాడు.

నడక సాగించేడు. రెడ్డిగారి మామిడితోపు దాటేసరికి వెచ్చవెచ్చగా వుంది ఒళ్ళు. కడుపులో ఆకలి ఉన్నట్టుగా అనిపించింది.

వెంటనే అతనికి గైరమ్మ గుర్తొచ్చింది.

ఓ రోజు -

ఇళ్ళల్లో దీపాలు వెలిగించినప్పుడు గైరమ్మ పరుగుపరుగున యింట్లోకి పరుగెత్తుకుంటూ వొచ్చింది. యింట్లోకి వచ్చీ రాంగానే "నాయ్యా! నాయ్నా!!" అంటూ తండ్రిని పిలిచింది.

"ఏందే గైరమ్మా! నేనీడుంటి - పెరట్ల!" అన్నాడు రాజయ్య. వంకర్లుపోయిన యినపబొక్కెన్లో గేదెకి కుడితి కలుపుతూ.

ఎంతసేపటికీ గైరమ్మ జబాబివ్వకపోతే పెరడులో పశువుల పని చూసుకుంటూనే ఓ సారి యింటి తలుపులు కేసి చూసేడు.

నడిమింట్లో గుంజకు వేలాడుతున్న లాంతరు తాలూకు వెలుగు పెరట్లోకి సాగిపోయి నల్లటి నేలమీద వెలిసిపోయిన ఎర్రటి జంభుఖానా పరిచినట్లుంది.

రాజయ్య గొడ్లకి గడ్డి తెచ్చి వేస్తూ మరోసారి గుమ్మంకేసి చూసాడు.

ఆకారం కత్తిరించిన తోలుబొమ్మలా గైరమ్మ నుంచుంది.

ఇప్పుడు నేలమీద జంబుఖానా లేదు. అక్కడక్కడా నాలుగైదు వెలుగుమొక్కలున్నయి.

"ఏంది బిడ్డా?" అన్నాడు కుడితిలో తడిసిన చేతుల్ని గోళెం దగ్గర నీళ్ళలో కడుక్కుంటూ.

గైరమ్మ ఏమీ మాట్లాడలేదు. యింట్లోకి కదులుతూ "ఏం లేదులేవే!" అంది. రాజయ్య తలుపు దగ్గర నాళ్లను నేలకు తాటించి యింట్లోకి అడుగెట్టి, "పిలిచినవు ఏందంటే ఏం లేదంటవేందీ?" అనడిగాడు.

"గా పుల్లిగాడు లేడె ముత్తాలమ్మ చింతకాడ ఉత్తుత్తిగానే సచ్చిండు. ఏమైందో ఏమో. నేనున్ను లచ్మక్క వొస్తాంటే చూశినం. నాకు బయమేశి యింటికొచ్చిన. లచ్చక్క గౌండ్లోలిండ్లల్ల జెప్పనికెపోయింది" అంది.

గైరమ్మ కళ్లలో భయం కనిపించింది రాజయ్యకి.

నెమ్మదిగా కూతరు దగ్గరికొచ్చి తల నిమురుతూ "బయమెందుకే బిడ్డ? నేన్లేనే?" అన్నాడు.

గైరమ్మ తండ్రికేసి చూసింది.

తండ్రి మొహంలో - కళ్ళకిందా, ముక్కుకు రెండు వేపులా ముడతలు కనిపించినయి. మీసాలు దాదాపు తెల్లబడినయి. నుదుటిమీద గీతలు - ఒకటీ... రెండూ... మూడు... అబ్బో ఎన్నో! తండ్రి కళ్ళలో ముసలితనం -

పుల్లిగాడు గుర్తువొస్తుంటే చటుక్కున "బువ్వ తిన్నావే?" అనడిగింది తండ్రిని.

"ఇంక లే, రారాదు! ఇద్దరం తింటాం" అన్నాడు రాజయ్య లాంతర్ని గుంజనుంచి తీసి వంటింట్లోకి నడుస్తూ -

గైరమ్మ కాళ్ళు కడుక్కొచ్చి తనకీ, తండ్రికీ సత్తు కంచాల్లో అన్నం పెట్టింది.

వడ్డిస్తూ, వడ్డిస్తూ తండ్రికేసి చూసింది గైరమ్మ.

గజం దూరమైనా లేని లాంతరు వెలుగులో తండ్రి ముసలి మొహం -

"నాయ్న! నాకు పెండ్లి జెయ్యకురాదె!" అంది వున్నట్లుండి.

రాజయ్య ఆశ్చర్యపోయాడు.

"ఎందుకే" అనడిగేడు అతనికి కూతరు వున్నట్టుండి తనకు పెళ్లి ఎందుకు వద్దంటూందో బోధనపడలేదు.

"అక్కలు పెండ్లిళ్ళయినంక ఎప్పుడన్న వచ్చినారె? మనమే రెండు మూడుసార్లు పోతిమి" అంది గైరమ్మ.

రాజయ్య "వాండ్లు రాకపోతే పోయిరి. ఇప్పుడు గాకుంటే వొచ్చే ఎండలనన్న నీకు పెండ్లి చెయ్యక పోతెట్లనే?" అనడిగేడు.

గైరమ్మ యింకేమి మాట్లాడలేదు. మౌనంగానే అన్నం తిన్నది.

తర్వాత తండ్రి రెండు మూడు సార్లు మాట్లాడించినా ఏమీ మాట్లాడకుండా వూరుకుంది.

రాజయ్య నులకమంచం ఆరు బయట వేసుకుని హాయిగా నిద్రపోయేడు.

కాని -

యింట్లో గొంగళిమీద పడుకున్న గైరమ్మకి చాలాసేపటి వరకూ నిద్రపట్టకపోయింది.

గైరమ్మకి కళ్ళు మూతలు పడేవరకూ పుల్లిగాడి చావు, తండ్రి ముసలితనమూ గుర్తొస్తూనే వున్నాయి.

తరువాత చలికాలమూ, సంకురాత్రి ఎండలొచ్చి గైరమ్మకు పెళ్లయిపోయింది.

****    ****   ****    ****

మూడ్రోజుల ముసురు తర్వాత ఎండ చిటచిటలాడుతోంది.

రాజయ్యకి ఆయాసంగా వుంది. ఒళ్లంతా చిరచిరలాడుతొంటే ఒక్క క్షణం ఆగేడు. కాలిబాట పక్కన వేపచెట్టు మొదట్లో రాయిమీద చతికిలబడిపోయేడు. నుదుటిమీద నుంచి కారిన చెమట కళ్ళలోకి జారిపడింది.

భుజమ్మీద కండువా చివర్లతో కల్లద్దుకుని చుట్టూ చూసేడు.

తనెప్పుడు పచ్చకొండ దాటేడు?

అప్పుడే ఆమడ నడిచేడు.

ఇంకా కొత్తూరు రెండామడుంది.

చుట్టూతా అడవి గీబురు గీబురుమంటోంది.

తన వూరు దాటేక ఒకటీ రెండూ బండ్లు ఎదురొచ్చినయి. మళ్లీ లేదు. ఇంతదూరంలో ఒక్క మనిషీ తోడు తగ్గల్లేదు.

రాజయ్యకి ఎందుకనో ఉన్నట్టుండి తను "ఒక్కడే" అయిపోయినట్టుగా అనిపించింది. మెదడంతా ఏ ఆలోచనా లేకుండా శూన్యంగా వుంది.

తలెత్తి ఆకాశం కేసి చూసేడు. "టైమ్ మూడైంది. ఇంకా రెండామడ!" అనుకున్నాడు.

పడమటి దిక్కుగా కదులుతున్న సూర్యుడు నిండుగా, ఎండగా వున్నాడు.

రాజయ్య చటుక్కున లేచి మళ్ళీ నడక సాగించేడు.

పోను పోను పోయిన ఎండలకి ఎండిపోయి వచ్చిన, తొలకరికి పచ్చ పచ్చగా వుంది అడవి.

బాట మరీ ఇరుకైపోయింది.

కాళ్ళకింద రాలిపోయిన ఎండాకులు వర్షానికి మెత్తబడి సన్నగా శబ్దం చేస్తున్నాయి.

రాజయ్య నడక వేగం పెంచేడు.

ఇంకా రెండామడ... రెండామడ...

పొద్దునెప్పుడో ఉడకేసుకున్న కూడు... అదీ సయించలేదు! రాజయ్య కడుపులో ఆకలి సన్నటి నీరసాన్ని రేపుతోంది.

నడుస్తున్న కొద్దీ కడుపులో ఆకలీ... ఆలోచనల్లో గైరమ్మా...

తులమెత్తి బంగారపు గొలుసు మెళ్ళో వేసుకుని బేడెత్తు మంగళసూత్రాలు గుండెలమీద వేలాడుతుంటే, ముప్పయి రూపాయల జరీఅంచు నేత చీరెలో బుట్ట బొమ్మలాగున్న కూతుర్ని చూస్తుంటే... పెద్దబిడ్డలని అత్తారింటికి పంపినప్పుడు కూడా ఏడవని రాజయ్యకి, పెళ్ళాం పోయినప్పుడు ఏడ్చిన రాజయ్యకి - ఏడుపొచ్చింది.

"గైరమ్మా" అని కూతుర్ని గుండెలకి హత్తుకున్నాడు.

కడగొట్టు పిల్లకూడా పెద్దదై, పెళ్లిచేసుకుని అత్తారూరు వెళ్లిపోతుంటే ఎందుకో కళ్లకి నీల్లొచ్చినయి.

"నాయ్నా" అని తండ్రి గుండెల్లో తలపెట్టుకుని బావురుమంది గైరమ్మ.

"నేను గూడ నీకు దూరమైతాన! నువ్వొక్కని వెట్లుంటవె?" అంది.

"ఆడపిల్లవైతివి. దూరం కాక ఏమైతవ్? నీకు పెండ్లి జెయ్యకుంటే ఊళ్ళో ఊరుకుంటారే బిడ్డ?" అన్నాడు రాజయ్య.

"పాండ్రి పాండ్రి! వర్జమొస్తది మల్ల" అంది గైరమ్మ అత్త సోవమ్మ.

అప్పటికే వీధిలో గైరమ్మ మొగుడు పాపయ్య బండెక్క కూచున్నాడు.

తండ్రిని విడవలేక విడవలేక బండెక్కింది.

బండి కదిలినప్పుడు గైరమ్మకి ఎందుకో దగ్గర ఎవరూలేక ఊరుచివర ముత్తాలమ్మ చింతకింద దిక్కులేని చావు చచ్చిన పుల్లిగాడు గుర్తుకొచ్చేడు.

చివ్వున కళ్లలోకి నీళ్లు చిమ్మినయ్.

దూరంగా తను ఇన్నాళ్ళూ పెరిగిన ఇల్లు. ఇంటిముందు తండ్రి ఒక్కడూ ఎండిన ఆముదం చెట్టులాక్కనిపించేడు.

బండిలో ఊరి పొలిమేర వరకూ గైరమ్మ బెక్కుతూనే వుంది.

****    ****   ****    ****

పంట కాలవ సవ్వడి సన్నగా వినబడుతోంది. చుట్టూతా చీకటి. ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల వెనక ఎక్కడున్నాడో తెలీటం లేదు. అక్కడక్కడా మబ్బులేని చోట్ల చుక్కలెక్కువగా కనిపిస్తున్నాయి.

ఊరికి ఎడంవేపు లంబాడీ తండలోంచి కుక్కల అరుపులు వినబడుతున్నాయి. ఎదురుగా ఊళ్ళో అక్కడక్కడా ఒకటీ రెండూ దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి. చెప్పులు చేతందుకుని దారికడ్డంగా వున్న కాలవ దాటేడు. కాళ్ళకి నీళ్ళు తడితడిగా తగిలేసరికి రాజయ్యకి ప్రాణం లేచొచ్చినట్లుంది. వొంగి దోసిట్లో నీల్లందుకు ముఖం తడుపుకున్నాడు. కండువాతో మొహాన్నద్దుకుని మళ్ళీ చెప్పులు తొడుక్కుని ఊళ్లోకి కదిలేడు. దారికి రెండు పక్కలా పరిమళ్ళు, చల్లటి గాలి మొహాన్ని సాచికొడుతుంది. చలిచలిగా వుంది.

మాలగూడెం దాటేడు. ఇంక ఊళ్లోకి వచ్చినట్టే!

ఎదురుగా మర్రి కింద కచ్చేరీ సావిట్లో ఎవరో లాంతరు వెలుగులో ఐదారుగురు మనుషులు కూచున్నారు.

రాజయ్య అక్కణ్ణుంచి వొస్తుంటే అందులో ఒకరు "ఎవరూ?" అనడిగేడు.

రాజయ్య క్షణం ఆగి కొంచెం సావడికి దగ్గరగా నడిచేడు.

"ఎవలారు? పెంటయ్యా?" సావిట్లో లాంతరుకెదురుగా కూచున్న మనిషడిగేడు.

"కాదయ్యా. నేను బేర్వాడ నుంచొస్తున్న పాపయ్య మావను!" అన్నాడు రాజయ్య.

"ఆహా" అన్నారక్కడ కూచున్నవాళ్ళు. "మంచిగున్నావా?" అనడిగేడు.

"మంచిగున్న" అనేసి కూతురింటివేపు నడిచేడు రాజయ్య.

ఊరంతా అప్పుడప్పుడే నిద్రపోతోంది. కరణం ఇంట్లో, కోమటింట్లో, సాయెబు గారింట్లో మటుకు తెరిచిన గుమ్మాల్లోంచి లాంతర్ల వెలుగులు వీధిలోకి చారలు చారలుగా కట్లపాము ఒంటిమీద గీతల్లాగున్నాయి. కాపువారి సందులోకి తిరగలేదు.

అదిగో ఆ మూడోయిల్లే... గైరమ్మిల్లు. రాజయ్య మెట్టెక్కి తలుపు తట్టేడు. ఆ యింటి తలుపులు మొద్దుచెక్కతో లావుగా, బలంగా వున్నయి. రాజయ్య పిలుపు యింట్లోకి వినిపించినట్టుగా ఎవరూ వొచ్చిన సందడవలేదు. మళ్లీ గొళ్ళెం చప్పుడు చేసేడు.

"ఆ... ఆ..." అని ఓ ఆడగొంతు వినిపించింది.

రాజయ్య తలక్కట్టుకున్న కండువాని భుజంమీదకు జార్చేడు.

ఇంతలో తలుపు తెరుచుకుంది.

ఎదురుగా చేతిలో లాంతర్తో కూతరు గైరమ్మ!

రాజయ్య కళ్ళు ఒక్కసారిగా వెలిగి చూపుకి ఏమీ కనిపించలేదు. కళ్ళలోకి సూదులు పొడుచుకున్నట్లయి కళ్ళు చిట్టించుకుని "నేం బిడ్డా!" అన్నాడు.

"నువ్వానె. రా! రా! అంది గైరమ్మ లోపలికి నడుస్తూ.

తలుపు నుంచి యింటివరకూ వేగంగా కొట్టుకూంటున్న గుండెతో అడుగులు లెక్కపెట్టేడు. ఇరవై ముప్పయి గజాల లోగిలి. చుట్టూతా చీకట్లో కనీకనిపించకుండా మూసిపోయిన తెల్లటి నిలువెత్తు గోడలు.అరుగుమీద మెట్లపక్కన మంచంలో పాపయ్య తండ్రి చుట్ట కాల్చుకుంటున్నాడు.

"నువ్వనె రాజయ్య రారా!" అన్నాడాయన చుట్టని పక్కకి విసిరి తుపుక్కున ఊస్తూ.

ఇంతలో గైరమ్మ అత్త సోవమ్మ ఇంట్లోంచి బయటకు వొచ్చింది.

"ఇప్పుడేనానె రాక!" అనడిగింది.

"ఆ. ఇప్పుడే వొస్తాన్న!" అన్నాడు రాజయ్య.

"అన్నం తింటావే. లేక అల్లుడొచ్చినంక తింటావ!" అనడిగింది గైరమ్మ.

"ఇప్పుడొద్దులే. పాపయ్యొచ్చినంకనే తింట" అన్నాడు రాజయ్య.

గైరమ్మ మారు ఏమీ మాట్లాడలేదు. మంచంలో అటుతిరిగి పడుకున్నాడు. సోవమ్మ లోపలికి పోయింది. గైరమ్మ అరుగు మెట్లకు రెండోవేపు మంచం వాల్చింది.

"తలాపుకు ఎమన్నా య్యిమన్నవా?" అంది.

"ఎందుకొద్దులే!" అని మంచంమీద కూచున్నాడు రాజయ్య. రాజయ్య ఊళ్ళోకచ్చినప్పుడున్నంత ఉత్సాహంగా ఇప్పుడు లేడు.

ఇంట్లో అందరూ తప్పనిసరయి మాట్లాడినట్టుగా వుంది.

గైరమ్మ యింట్లోకి వెళుతూ అరుగుమీదున్న లాంతర్ని తీసుకుపోయింది.

రాజయ్య చుట్టూతా మళ్లీ చీకటి! నెమ్మదిగా మంచంలోకి వాలేడు. కాళ్లు పీకుతున్నట్టుగా వుంది. మంచం పట్టెల మీద పిక్కలుండేలా కాళ్లని బయటకు పెట్టి వెల్లకితలా పడుకున్నాడు.

ఇంకా మబ్బుల్లో చంద్రుని జాడలేదు. ఇందాకటికన్నా మబ్బుల్లేని చోట్ల చుక్కలెక్కువగా కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి చలిగాలి మొదలయింది. వీధిలోనూ, ఊళ్లోనూ కుక్కలు మొరుగుతున్నాయి. ఊళ్ళో చీకటి కీచురాళ్ళ సంగీతానికి దరువేస్తోంది. రాజయ్య మనసు మనసులో లేదు. విషయం ఎలా అడగాలో తెలీటం లేదు. అల్లుడచ్చేలా వుంది. అతనొచ్చేలోగానే అడగాల్సిన విషయం ఎలా మొదలెట్టాల నిర్ణయించుకోవాలి. కాని... కొసా ముడీ తెలీటం లేదు.

ఇంతలో తలుపు తట్టిన శబ్దం -

రాజయ్య చటుక్కున మంచంలోంచి లేచేడు. గబగబా వెళ్లి తలుపు తీసేడు.

చీకట్లో సరిగా గుర్తుపట్టలేదు.

వొచ్చినతను తనల్లుడు పాపయ్య మటుకు కాదు.

"ఎవరు?" అనడిగాడు రాజయ్య.

"నేను కొడణ్ణి. పాపయున్నాడా? మా దొర ముత్రాసాయన పిలుస్తాండు" అన్నాడు వొచ్చినవాడు.

"యింట్ల లేడు. వొచ్చినంక చెప్తలే" అన్నాడు రాజయ్య.

కొండడెల్లిపోయేడు. రాజయ్య తలుపేసి వొస్తుంటే యింటి గుమ్మంలో సోవమ్మ లాంతర్తో నిలబడింది.

"ఎవరన్నా వొచ్చింది!" అనడిగింది.

"ముత్రాసాయన పాపయ్యను పిలిపించాడు." నెమ్మదిగా వొచ్చి మంచంలో కూర్చుంటూ జవాబిచ్చాడు. రాజయ్యకు ఉన్నట్టుండి ఆకలి గుర్తొచ్చింది.

పొద్దున ఆరీ ఆరని ఆకలి. పైటా మూడామడ నడిచిన నిస్సత్తువ. ఇవేమీ కాకుండా తన గుండెల్లో అల్లుడు రేపిన మంటలు.

రాజయ్యకు నీరసం వొచ్చింది. మంచం మీద కూచున్నాడన్న మాటేగాని కళ్ళు తిరుగుతున్నట్టూ, గాల్లో తేలిపోతున్నట్టూ అనిపించింది. నెమ్మదిగా మంచంలోకి జారి పడుకున్నాడు.

క్షణం సేపు కళ్ళు మూసుకుని గుండెని, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుందికి ప్రయత్నించేడు.

"అవునవును...నువ్విట్లు మారాజులక్క పొద్దస్తమానం పండుకో - కొడుకేమో ఆట్ట సావనీ..." అంటూ మొగుణ్ణి దులిపేస్తోంది సోవమ్మ.

ఆయన పెళ్ళాం మాటలు లక్ష్యపెట్టనట్టుగా కదలకుండా పడుకునే వున్నాడు.

రాజయ్య తలతిప్పి సోవమ్మ కేసి చూసేడు.

ఆమె యింకేమీ చేయలేనట్లుగా, "సావనీ... సావనీ! మూత్రాసోన్తోని గూడ తిట్లుతినాలంటే నువ్వు మటుకే జేస్తవ్ లే! ఇంత పుట్టుక పుట్టి... అవ్వ... మూత్రాసోన్తోని కాపోడు మాటలు పడాల్సోచ్చే..." అని గొణుక్కుంటూ లాంతర్తో సహా లోపలికెల్లిపోయింది.

రాజయ్య గుండెలో గుండెలేదు.చూస్తే ఇప్పుడప్పుడే అల్లుడొచ్చేలా కనిపించలేదు.ఆకాశంలో చీకటి రెండో జాములోకి నడుస్తోంది. రాజయ్య ఇంకా కూచోలేకపోయేడు. లేచి నెమ్మదిగా యింట్లోకి నడిచేడు. వంటింట్లో సోవమ్మ పొయ్యి ముందరుంది. దొడ్డి తలుపులోంచి పెరట్లోకి నడిచేడు. అక్కడ గైరమ్మ చూరుకు తగిలించిన లాంతరు వెలుగులో గేదెపాలు పిండుతోంది.

ఓ వేపు గుండెలదురుతూంటే నెమ్మదిగా అడుగులు వేసీ వేయనట్టుగా కూతరు పక్కకెళ్ళి నుంచున్నాడు.క్షణం సేపు నీడలో కరిగిపోయి తేరుకుని పక్కకు తిరిగి చూసింది గైరమ్మ.

"రాయె రా! చూడటానికే చిన్న కొంప, చిన్న సంసారం... గని ఎప్పుడు జూసినా చేతినిండ పనే!" అంది గైరమ్మ పాలు పితుకుతూనే.

రాజయ్యకి వెంటనే గొంతు పెగల్లేదు.

"అడగాలి... అడగాలి..." అనుకున్నాడు. కాని అలాగే నిలబడిపోయేడు. గైరమ్మే చెప్పుకుపోతోంది.

"మా వున్నాడు ఎందుకు? ఏం పన్జెయ్యడు. అన్నీ నీ అల్లుడే చూసుకోవాలె. ఇంట్ల పెత్తనం అంతా అత్తదే - గని మంచిదేలే! నన్ను బాగానే చూస్తది. కొడుకంటే ప్రేమే..."

రాజయ్యకి గైరమ్మ మాటలు ఏమీ వినిపించటం లేదు. అతనికి గైరమ్మ ఇదివరలో అన్నమాటలే వినబడుతున్నయి. "నాయ్న నాకు పెండ్లి చెయ్యకురాదె!" అయ్న నాకు పెండ్లి జెయ్యకురాదె"

రాజయ్యకి కన్నీల్లొచ్చినయి.

గైరమ్మ తండ్రిని గమనించకుండానే, "సూడ్రాదుగా మూత్రాసోన్తాన బాకీ తీసుకున్నారంట, ఆరు ఏలాపాలా లేకుంట పైసలడుగుతాండు. ఉన్నప్పులన్నీ తీర్చాలంటే రెండెకరాలన్న అమ్మొచ్చేటట్టున్నది. ఇయ్యన్ని నీ అల్లుడే చూసుకోవాలె..." అంటున్నది.

రాజయ్యకి కడుపులో ఆకలి సెగలు కక్కుతోంది.తప్పదు... తప్పదు... అడగాలి... అడగాలి.

కడుపులో ఆకలి తల్లిపేగుని మెలికలు తిప్పుతోంది.

"బిడ్డా..." అన్నాడు. ఆ పిలుపు అతని గొంతులోనే ఉండిపోయింది. నాలుక పిడచగట్టుకపోయింది.

"గైరమ్మా..." అన్నాడు కొంచెం హెచ్చుస్తాయిలో.

గైరమ్మ చటుక్కున తలెత్తి తండ్రిని చూసింది.

తండ్రి ఎందుకలా గొంతుచించి అరిచేడో తెలీలేదు.

"ఏందే" అనడిగింది.

రాజయ్యకి మాటలు దొరకలేదు. ఎడం చేత్తో గుంజని పట్టుకుని నెమ్మదిగా కిందకు జారి గైరమ్మ పక్కనే గొంతుక్కూన్నాడు.

"పొలం అప్పలయ్యకు ఇచ్చిండ్రంట!"

గైరమ్మ తండ్రి ప్రశ్న విని కొంచెం తడబడింది. వెంటనే జవాబివ్వకుండానే పాలు పితుకుతూంటే రాజయ్యే మళ్లీ...

"నా కిప్పుడెవలున్నరె. ఒకన్నెగాదె. ఇదివరకెప్పుడన్న ఎవనితానన్న పనిజేసినానే? పొలం నేనే జేసి ఇస్తనన్నగాదె? ఇంకొని కిచ్చేది నాకిస్తే నేను కాదన్నానే బిడ్డ! అల్లున్తో ఆనాడే జెప్పలేదు! అప్పుడొప్పుకుని, ఊ అని ఇప్పుడిట్లజేస్తే..." రాజయ్యకిక గొంతు పెగల్లేదు. తల వంచుకున్నాడు.

పాలచెంబుని పక్కకు పెట్టి తండ్రికేసి చూసింది గైరమ్మ.

"నేనేం జెయ్యనె నాయ్న! నీ అల్లుడు నాతోని జెప్పే అప్పలయ్య కిచ్చిండు..." అంది.

రాజయ్యకి కోపం వచ్చింది.

"అదేంటే. నువ్వెట్ల ఒప్పుకుంటివి? ఇంత కాలానికి నేనింకోని కింద పనిచేసి పొట్ట నింపుకొమ్మంటావే? అదేందో, ఆ కౌలుకిచ్చేదేందో నాకే యియ్యరాదుండి." అన్నాడు విసురుగా.

గైరమ్మ వెంటనే "నువ్వట్ల కోపం తెచ్చుకుంటే ఎట్లనే నాయ్న? రోజులు సూడ్రాదు? ఎట్ల మండుతున్నయో? అన్ని పిరమెపాయె. రోజురోజుకీ కష్టాలు పెరుగుతాండే?... ఎవరి కష్టాలు వాళ్లయి...!" అంది.

రాజయ్యకి తన కూతరు ఏం మాట్లాడుతుందో అర్ధం కాలేదు. ఆశ్చర్యం గానూ, అర్ధం కాక కూతురి కేసి వెర్రిగా చూసేడు.

"ఒక్క మాటనే నాయ్న! పొలం తెల్సినోళ్ళకిస్తే మాటా ఖరాఖండిగా వుండలేంగదే... అదే తెల్వనోనికిస్తే అటయినా నిలదీసి మాట్లాడొచ్చు..." అంది గైరమ్మ పొడిపొడిగా. రాజయ్యకి గుండె పగిలింది.

"అయిపొయింది... అయిపొయింది..." అనుకున్నాడు.

కూతుర్ని యింకేం అడగాలో తెలీటం లేదు. మెదడు చిట్లిపోయింది. ఏడుపొచ్చింది. మెల్లిగా లేచి నిలబడ్డాడు.

గైరమ్మ కూడా పాలచెంబు తీసుకుని లేచింది.

"ఆకలేస్తలేదె! రారాదు. అన్నం పెడత. నీ అల్లుడెప్పుడొస్తాడో రా" అంటూ లాంతరు పట్టుకుని యింట్లోకి పోయింది.

రాజయ్యకు ఇప్పుడు ఆకలి లేదు. కూతరు లేదు.

అతనికి - ఆరోజు పుల్లిగాడి చావు గురించి చెప్పటం గుర్తొచ్చింది.నెమ్మదిగా వీధిలోకి, చీకట్లోకి నడిచేడు రాజయ్య.

****    ****   ****    ****

మరిన్ని సీరియల్స్