Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
smt. bhanumati ramakrishna biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

నలుగురితో నారాయణా... - భమిడిపాటి ఫణిబాబు

Nalugurito Narayana

ఈ రోజుల్లో ఐటీ రంగంలో చేసే పనులు, ఒకవిధంగా చూస్తే "వెట్టిచాకిరీ" లోకే వస్తాయి. జీతాలు అవసరం ఉన్నదానికంటే ఎక్కువే వస్తాయి, కానీ క్రెడిట్ అంతా ఎవడికోసంచేస్తున్నామో వాడికేకదా వచ్చేది. అందుకే "వెట్టిచాకిరీ" అన్నాను. ఐటీ అనే ఏమిటిలెండి, ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఇలాటివే. ఏదో వినేవాళ్ళకి బాగుండాలని, దానీకో పేరు పెట్టారు.Outsourcing అని.చేసేది వెట్టిచాకిరీయే అయినా, దానికో ప్రతిష్ఠాత్మకమైన పేరుంటే, అదో తృప్తీ. మార్కెట్ లో వచ్చే బ్రాండెడ్ బట్టలు చూడండి, వాటన్నిటినీ ఈ కంపెనీలవాళ్ళు తయారుచేస్తారా ఏమిటీ, ఎక్కడో కోయంబత్తూరు లోనో, ఈరోడ్ లోనో తయారుచేయించడం,  కంపెనీ లేబుల్ అతికించడమూనూ.ఆంధ్రదేశంలో ఎక్కడో jeans తయారుచేస్తారుట, ఏ రంగం తీసికోండి, ప్రతీదీ ఎవడోఒకడిచే తయారుచేయించేసికోవడమూ, అదంతా మన ఘనతే అని చెప్పుకోవడమూనూ.

అంతదాకా ఎందుకూ, పెద్దపెద్ద నాయకులు ప్రత్యేక సందర్భాల్లో ప్రసంగాలు చేస్తూంటారు. అదంతా వాళ్ళ ఘనతే అంటారా, ఎవడో మీలాటివారిచేత వ్రాయించేసికోవడమూ, ఓ పోజెట్టేసి చదివేయడమూ. పైగా ఆ వ్రాసుకొచ్చిన కాగితాలు కనిపించకుండా, ఓ పోడియం ముందర నుంచోవడం. ఆ నాయకుడి ఉద్దేశ్యాలే వ్రాస్తారనుకోండి, ఉద్దేశ్యాలూ, ఊహలూ అయితే ఉంటాయికానీ, వాటికి అక్షరరూపం కలిపించొద్దూ, అలా కలిపించడానికి Outsourcing అన్నమాట ! ఆ తెరవెనుక పెద్దమనిషిని అదేదో speech writer అంటారుట. మహామహులు ఆత్మకథలో ఏవో వ్రాసుకుంటూంటారు, మహాభారతం, వ్యాసభగవానుడు చెప్పగా గణపతి ఎలా వ్రాశారో అలాగ ఆ కథ చివరన as told to.. అని వ్రాసేసి చేతులు దులిపేసుకుంటూంటారు. వాళ్లని ghost writers అంటారుట.

సినిమాల్లో చూడమూ, వాళ్ళెవరో dupe అంటారుట, యుధ్ధాలూ, గెంతడాలూ, దూకడాలకీ పాపం వీళ్ళూ, హీరోయిన్ ని మీద వేసికోవడం, కౌగలించుకోవడం లాటి మహత్తరకార్యాలకి ఈ హీరోలూనూ. అంతేలెండి చేసికున్నవాడికి చేసినంతా .. అని సామెత వినలేదూ?

పైన చెప్పినవన్నీ దేశంలోనూ, అంతర్జాతీయంగానూ, వివిధ రంగాలకీ  సంబంధించినవి. పేరు లాటిది వచ్చినా రాకపోయినా, కిట్టుబాటవుతోంది, జీతాల్లాటివి వస్తున్నాయి, ఏదో సంసారాలు లాక్కొచ్చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ మించినది, సాధారణ మానవుల జీవితాల్లో కూడా ప్రతీ రోజూ అనుభవంలోకి వచ్చేదీ మరో ముఖ్యమైన రంగం ఒకటుంది, దాన్నే "జీవితరంగం" అంటారు. ఇదేమీ సినిమా పేరుకాదు. జీవితం అన్న తరువాత వివిధరకాలైన స్టేజీలుంటాయికదా. ఏదో ఉద్యోగం చేస్తున్నంతకాలం ఫరవాలేదు, ఆఫీసుల్లో  రోజంతా బిజీగా ఉన్నట్టు పోజెట్టేసి, కాలం గడిపేయొచ్చు.రిటైరయిన తరువాతే తిప్పలన్నీనూ. రోజంతా కొంపలోనే కూర్చోవడంతో అందరి కళ్ళూ వీళ్ళమీదే పడతాయి.అన్ని సంవత్సరాలు "చెమటోడ్చి" ( ఆఫీసుల్లో ఫాన్లు లేక), నడుంవంగేలా ( కుర్చీలో కూర్చుని..కూర్చుని..), సంసారసాగరాన్ని ఈది, గట్టెక్కడానికి అంత కష్టపడ్డాడే, ఆమాత్రం కృతజ్ఞత ఉండొద్దూ, అని ఈ రిటైరయినాయన అనుకుంటాడు. కానీ అన్నేళ్ళూ, అలుపనేది ప్రదర్శించకుండా, అన్ని సంవత్సరాలూ శ్రమపడిన ఇంటి ఇల్లాలు మాటేమిటీ? కాపరం సరీగ్గా వెళ్తూందంటే ఎక్కువ క్రెడిట్ వారికే ఇవ్వాలి.

పెద్దచదువులు చదువుకుని ఉద్యోగాల్లో ఉంటున్న కొడుకుల్నీ, కూతుళ్ళనీ, కోడళ్ళనీ, అల్లుళ్ళనీ చూసి చూసి ఈవిడకీ కొన్ని ఆలోచనలు వచ్చేస్తాయి," ఇలా చేస్తే బాగుంటుందేమో.." అని ! ఆ ఆలోచనలే ఈ పెద్దాయన ప్రాణం మీదకొచ్చేస్తాయి. ఎప్పుడూ నడుంవంచి పనిచేసిన పాపానపోలేదాయె, "ఎవరికీ..ఎవరికీ..తలవంచడూ.." అని పాటలు పాడేస్తూనే అరవై ఏళ్ళూ లాగించేశాడు. భార్య అప్పుడప్పుడు చెప్పే పనులు కనిపించడానికి harmless గానే కనిపిస్తాయి మొదట్లో. మరీ పెద్దపెద్ద పనులు చెప్తే మొండికేస్తాడేమో అని, ఆవిడకూడా మొదట్లో.. సున్నితంగానే చెప్తుంది, ఏ మనవడికో మనవరాలికో స్నానం చేయించమంటే కష్టం కానీ, ఓ పాతచీరో, బొంతో వేసి, పక్కవేయడం, ఆవిడ దృష్టిలో పెద్దపనేమీకాదు.అ..లా..లా.. మొదలవుతుంది, ఈవిడ implement చేసే outsourcing ! క్రమక్రమంగా బాల్కనీలో ఆరేసిన బట్టలు మడతపెట్టడమూ, పసిపాప పాలు త్రాగేసినతరువాత ఆ పాలసీసాలు కడిగించడమూ, ఇవన్నీ ఆ ఖాతాలోకే వస్తాయి. భోజనానికి ముందర కంచాలూ, మంచినీళ్ళూ ఇదివరకైతే పాపం ఆవిడే చూసుకునేది, ఖాళీగా ఇంట్లో ఓ ప్రాణి ఉన్నాడుగా, ఆమాత్రం చేయలేడా ఏమిటీ?

ఇదివరకటి రోజుల్లో అయితే, ఏ ఆకుకూరో తెస్తే, దాన్ని బాగుచేసి ఏ కూరో, పులుసో పెట్టి పెట్టి నడుం ఒంగిపోయేది. ఈ కొత్తప్రణాలికలో ఈ ఆకుకూరలు బాగుచేయడమనే కార్యక్రమం,ఈ పెద్దాయన నెత్తికి చుట్టుకుంటుంది. జిహ్వచాపల్యంతో ఏ తోటకూరో, గోంగూరో, మెంతికూరో బజారునుండి తేవడంతోనే సరిపోతుందా మరి? చెప్పానుగా ఇవేవీకూడా పెద్ద పనుల్లోకి రావాయె. అలాగే ఇదివరకటిరోజుల్లో ఆఫీసుకి వెళ్ళడానికి రెడీఅయ్యేసరికల్లా టేబుల్ మీద కాఫీ రెడీ. ఇప్పుదు అలా జరగాలంటే ఎలా మరి? ఉదాహరణకి పంచదార డబ్బాలోనో, కాఫీపౌడర్ డబ్బాలోనో సరుకు అడుగంటిందనుకుందాము, ఒంగి పెద్దడబ్బాలోంచి పంచదారో, కాఫీ పొడో తీసి ఈ చిన్నడబ్బాలో నింపే పని చేయడానికి ఓపికుండదనుకోండి,భోజనం అవగానే, ఓ కునుకు తీద్దామని, నడుంవాల్చడం, నాలుగయ్యేసరికల్లా ఈ పెద్దాయనకి కాఫీ అలవాటాయె, ఆవిడేమో నిద్రపోతోంది, ఎలాగా, పోనీ మనమే పెట్టేసికుని తనకీ ఉంచుతే సరీ, అనుకుని కిచెన్ లోకి వచ్చి చూస్తాడు. ఏముందీ, డబ్బాలు ఖాళీ. చచ్చినట్టు పెద్దడబ్బాలోంచి ఆ పంచదారా, కాఫీపొడీ తీసి, కాఫీపెట్టుకోడం. కళ్ళు చిట్లిస్తూ ఆ మంచం మీద నడుం వాల్చినావిడ చూస్తూనే ఉంటుంది, ఈ తతంగం అంతా.అయినా మధ్యలో లేవదు! ఓ వారం పదిరోజులదాకా డబ్బాలో ఉన్న పంచదారతో లాగించేయొచ్చు.అప్పుడే నిద్రలేచినట్టుగా, " అయ్యో అదేమిటండీ,.. మీరు కాఫీ పెట్టారూ.. ఇప్పుడే కునుకుపట్టిందీ..." అంటూ ఎక్కడలేని ఆపేక్షా ప్రదర్శించేయడం.ఇలాటి ప్రక్రియని subtle outsourcing అంటూంటారు. పోలీసాడి దెబ్బలలాగ కనిపించవు.

ఇలా అడుగడుగునా ఎక్కడచూడండి, ఈ   ఔట్ సోర్సింగే, పధ్ధతులు తేడా అంతే. అయినా అనుకుంటాముకానీ, ఇంట్లో భార్య చెప్పకుండా చెప్పే పనులూ ఒక పనులేనా? ఇన్నాళ్ళూ తను శ్రమ పడింది, ఇప్పుడు ఖాళీగా కూర్చోడంకంటే ఓ చెయ్యేస్తే ఏంపోయిందీ? బయటి కంపెనీల్లోలాగ pink slip ఏమీ ఉండదూ.

నలుగురితో పాటూ నారాయణా అనుకోవడం, " జయమ్ము నిశ్చయమ్మురా.." అంటూ పాడుకుంటూ పోవడమూనూ...




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
weekly Horoscope Sept 06 - Sept12