Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - Dasarathi Sahityam

ఈ సంచికలో >> శీర్షికలు >>

జై జై గణేశా, జయములిమ్ము గణేశా - లాస్య రామకృష్ణ

vinayaka chavithi special

"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"

భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం "వినాయక చవితి". శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని "వినాయక చవితి" ని జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థిన (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. ఈ పండుగని పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. మూషికవాహనుడైన గణపతిని పూజించి ఆయనకి  ఇష్టమైన ఉండ్రాళ్ళను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. వినాయక మండపాలు ఏర్పాటు చెయ్యడం, ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చెయ్యడం, వినాయకుని నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాలలో  పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. భారత దేశం లో ని వివిధ ప్రాంతాలలో ఈ పండుగని "గణేష్ చతుర్ధి" లేదా "వినాయక చతుర్ధి" అని కూడా పిలుస్తారు. ఈ పండుగని ఎంతో ఉత్సాహంగా మహారాష్ట్ర ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.

ఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు. అనుకున్న పనిని పూర్తి చెయ్యనివిధంగా విఘ్నాలు ఇబ్బంది పెడతాయి. తద్వారా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తారు. అందుకే విఘ్నవినాశకుడు అయిన వినాయకుని యొక్క పండుగ "వినాయక చవితి" కి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన గాధలు ఉన్నాయి.

ఒక సారి కైలాస నాధుడు లేని సమయం లో పార్వతీ దేవి స్నానమాచరించదలచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని అనుకుని నలుగుతో గణేశుడిని మలచి ప్రాణము పోసి అతడిని ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి తను స్నానమాచరించి బయటికి వచ్చే వరకు ఎవరినీ ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది. కొంత సమయం తరువాత పరమ శివుడు ఇంటికి వస్తాడు. గణేశుడు తన తల్లి అజ్ఞని అనుసరించి శివుడిని లోపలి కి అనుమతించడు. కోపోద్రిక్తుడైన పరమ శివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు.

శిరస్సు కోల్పోయిన గణేశుని చూసిన పార్వతీ దేవి కాళికా దేవి అవతారం ఎత్తి ముల్లోకాలను నాశనం చెయ్యడానికి సిద్దమవుతుంది. పార్వతీ దేవి ఆగ్రహానికి భయపడి అందరూ పరమ శివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమ శివుడు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తాడు. శివుని ఆజ్ఞననుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై  అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీ దేవి సంతోషిస్తుంది. ఈ విధంగా ఏనుగు శిరస్సు ని ధరించినందువల్ల "గజాననుడు" గా కూడా వినాయకుడు కొలువబడతాడు.

మరి యొక గాధ ప్రకారం గజాసురుడనే రాక్షసుని తలను వినాయకునికి అమర్చారని కూడా చెప్తారు.

విఘ్నాధిపతిగా గణేశుడిని పూజించడం వెనుక ఒక పురాణ గాధ ఉంది. ఒకసారి దేవతలు, ఋషులు శివుడిని కలిసి విఘ్నాలకు అధిపతిగా ఎవరినైనా నియమించమని అడుగుతారు. అప్పుడు శివపార్వతుల రెండవ కుమారుడు అయిన కుమార స్వామి, వినాయకుడు పొట్టిగా, లావుగా ఉన్నందువల్ల తనని విఘ్నాధిపతిగా నియమించమని అడుగుతాడు. శివుడు వినాయకుడికి, కుమారస్వామికి ప్రపంచం లో ఉన్న పవిత్ర నదులలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా తన దగ్గరికి వస్తారో వాళ్ళే విఘ్నాధిపతి అవుతారు అని చెప్తాడు.

నెమలి వాహనంపై కుమారస్వామి పవిత్ర నదులలో స్నానమాచరించడానికి బయలుదేరతాడు. తన అవతారం చూసి కొంచెం కలత చెందిన వినాయకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి "తన సోదరుని వలే వేగంగా తాను కదలలేను కాబట్టి మీరే నాకు ఈ పరీక్ష నెగ్గేందుకు మార్గం తెలియచేయ"మని ప్రార్ధిస్తాడు.

నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అన్ని పవిత్ర నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని శివుడు ఉపదేశిస్తాడు.  శివుడి ఉపదేశాన్ని గణపతి పాటించడం వల్ల కుమారస్వామి స్నానమాచరించడానికి వెళ్ళిన ప్రతి నది వద్ద గణపతి అప్పటికే స్నానం ముగించి తిరిగి వస్తున్నట్టు కనిపిస్తాడు. కైలసానికి తిరిగి వచ్చిన కుమారస్వామి తన అజ్ఞానాన్ని మన్నించి గణపతినే విఘ్నాధిపతిగా చెయ్యమని తల్లితండ్రులను ప్రార్ధిస్తాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్న నాయకుడు అయ్యాడు.

మరి యొక గాధ ప్రకారం, వినాయకుడి ఉదరం చూసి చంద్రుడు నవ్వినందుకు కోపగించిన పార్వతీ దేవి చంద్రుడిని చూసిన వారు నీలాపనిందల పాలు అవుతారని శపిస్తుంది. చంద్రుడు వచ్చి పార్వతీ దేవిని వేడుకొనగా శాంతించిన పార్వతీ దేవి వినాయక చవితి నాడు మాత్రం చంద్రుడిని చూసిన వారు నీలాపనిందలు భరించవలసి వస్తుందని చెప్తుంది.

అయితే సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడే చంద్రుడిని చూసి నీలాపనిందలకు గురి అయిన గాధ ఒకటి ఉంది.  సత్రాజిత్తు సూర్యుని వరము వలన పొందిన "శమంతకమణి" ని శ్రీకృష్ణుడు తనకి ఇమ్మని అడుగుతాడు. రోజుకు ఎనిమిది బారువులు బంగారం ఇచ్చే ఈ మణిని ఇవ్వనని పలికి సత్రాజిత్తు వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు శమంతకమణి ని మెడలో ధరించి అడవికి వేటకి వెళ్లి మరణిస్తాడు. ఇదంతా శ్రీకృష్ణుడు శమంతకమణి చెందలేదని కోపంతో పన్నిన పన్నాగమని భావించిన సత్రాజిత్తు శ్రీకృష్ణుని మీద నిందలతో చాటింపు వేయిస్తాడు. అనుకోకుండా పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూసినందుకు నీలాపనిందలు కలిగాయి అని భావించిన శ్రీకృష్ణుడు ఎలాగైనా వీటిని రూపుమాపాలి అని తన పరివారం తో అడవికి బయలుదేరతాడు.

అక్కడ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ధరించిన మణి ని చూసి మాంసం ముక్కగా భ్రమించిన సింహం అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి తన గుహకు తీసుకు వెళ్లి తన కూతురికి ఆటవస్తువుగా ఆ మణిని ఇచ్చిందని గ్రహించిన శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళగా సాక్షాత్తూ శ్రీకృష్ణుని పైనే జాంబవంతుడు యుద్ధం ప్రకటిస్తాడు. ఆ విధంగా ఇరవై ఎనిమిది రోజులు హోరాహోరి యుద్ధం జరుగుతుంది. రోజు రోజుకీ జాంబవంతుడు క్షీణించడం ప్రారంభించి తను యుద్ధం చేస్తున్నది ఎవరితోనో తెలుసుకుని త్రేతాయుగం లో తనకు శ్రీరాముల వారు ఇచ్చిన వరం కారణంగా ఈ యుద్ధం జరుగుతోందని గ్రహించి శ్రీకృష్ణుడిని వేడుకొని శమంతక మణి తో పాటు తన పుత్రిక అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చి పంపించెను.

శ్రీకృష్ణుడు జరిగిన విషయం మొత్తం సత్రాజిత్తుకి తెలియచేయగా తను వేసిన నిందలకు పశ్చాతాపం చెంది పాప పరిహారంగా శమంతక మణితో పాటు సత్యభామని అందిస్తాడు. సత్యభామని స్వీకరించి శ్రీకృష్ణుడు శమంతక మణిని సున్నితంగా తిరస్కరిస్తాడు.

అయితే, సామాన్య ప్రజలు నీలాపనిందలకు గురి కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే దేవతల మరియు ఋషుల ప్రశ్నకు 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రొద్దున గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు' అని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఆ విధంగా వినాయక చవితి పండుగకు ఏంతో ప్రాముఖ్యత ఉంది.

హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు
వినాయక చవితి అంటే ఆంధ్రప్రదేశ్ లో ని హైదరాబాద్ నగరాన్నే ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. అక్కడ ఈ పండుగ పర్వదినాలలో కనపడే సందడి మరే ఇతర ప్రదేశం లో కనపడదు. వినాయక చవితి వేడుకలని ఘనం గా జరుపుకోవాలని హైదరాబాద్ ని ఈ వేడుకలలో మించిపోవాలని ఎన్నో నగరాలూ తమ వంతు కృషి చేస్తున్నాయి.

మండప ప్రతిష్ట దగ్గర నుండి వినాయక నిమజ్జనం వరకు హైదరాబాద్ నగరం సందడితో మార్మోగుతుంది.  ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూసి ఆనందించేందుకు హైదరాబాద్ లో ని ప్రజలే కాకుండా చుట్టూ పక్కల ప్రాంతాల వారు కూడా ఆసక్తి కనబరుస్తారు. హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జనాన్ని ఇతర ప్రాంతాల వాళ్ళు చూసేందుకు వీలుగా  వివిధ ఛానల్స్ వాళ్ళు లైవ్ షోస్ ప్రసారం చేస్తారు.

ఇక వినాయక మండపాల గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ మండపాలలో నిర్వాహకుల సృజనాత్మకత ఉట్టిపడుతుంది. రక రకాల ఆలోచనలతో వినాయక మండపాలను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. కొందరు నవధాన్యాలతో వినాయక విగ్రహాలను అలంకరిస్తే మరి కొందరు పళ్ళతో అలాగే కూరగాయలతో వినాయకులని తీర్చిదిద్దుతారు. ఇలా వినాయక మండపాల సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. వీరి ని ఉత్సాహపరిచేందుకు కొందరు వినాయక మండపాల లో నుండి అత్యుత్తమమైనవి ఎన్నుకునేందుకు పోటీలు నిర్వహించి బహుమతులు కూడా ఇస్తారు. అలా, ఈ వినాయక చవితి పర్వదినం అనేక రకాల సామజిక అంశాల కలబోత. కుల బేధాలు లేకుండా ప్రజలందరినీ ఒక్క చోట చేర్చి వారి మధ్య సామరస్యం పెంచేందుకు "వినాయక చవితి"  వేడుకలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇక్కడ ప్రస్తావించదగిన మరొక ముఖ్య అంశం ఖైరతాబాద్ వినాయక మండపం. హైదరాబాద్ లో ని ఖైరతాబాద్ వినాయకుడికి విశిష్టత ఉంది. ప్రతి యేటా ఇదివరకటి విగ్రహం కంటే ఎత్తైన విగ్రగాన్ని ప్రతిష్టించడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నా ఆచారం. ఈ మండపాన్ని చూడడానికి హైదరాబాద్ నుండే కాకుండా వివిధ ప్రాంతాల ప్రజలు కూడా వస్తున్నారంటే హైదరాబాద్ లో ని ఖైరతాబాద్ వినాయకుడి కున్న ప్రాచుర్యం అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుత వినాయక చవితి వేడుకలు సాంఘిక వేడుకలుగా రూపాంతరం చెందడానికి  1893 లో జరిగిన వేడుకలని చెప్పుకోవచ్చు. భారత దేశ స్వాతంత్ర్య సమరయోధుడు అయిన లోకమాన్య తిలక్ గారు గణేష్ చతుర్థి వేడుకలను ఒక సాంఘిక వేడుకలుగా జరుపుకునే విధంగా కృషి చేసారని తెలుస్తోంది. ఆ విధంగా ఈ పండుగని కుల బేధాలు లేకుండా హిందువులు అందరూ గొప్పగా జరుపుకుంటారు.

పర్యావరణానికి హనీ కలుగని విధంగా సహజ రంగులతో అలంకరించబడిన  మట్టి వినాయకుడినే పూజకు ఉపయోగించాలన్న భక్తుల ఆలోచన ఇక్కడ గమనించదగ్గ మరొక ముఖ్య విషయం.

మరిన్ని శీర్షికలు
Remembering Old Memories