Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

సినిమాల్లోకి కొత్తగా రావాలనుకునే వారి కోసం... (పార్టు - 2)

అనగనగా హైదరాబాద్ లో ఓషూటింగ్ లొకేషన్. పదిహేనేళ్ళుగా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ లు ఇచ్చిన దర్శకుడు "కమాన్... క్లాప్... ఇన్" అని అరిచారు. అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ బోర్డు హీరో ఫేసు ముందు పెట్టాడు. డైరెక్టర్ 'స్టార్ట్ కెమెరా' అనేలోపు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సెల్ ఫోన్ రింగయింది. వెంటనే అతను డైరెక్టర్ ని 'వన్ మినిట్ సర్' అని, పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడి, మధ్య మధ్యలో డైరెక్టర్ ని 'వన్ మినిట్' అని మళ్లీ అని, షూటింగ్ చూడడానికొస్తానన్న తన ఫ్రెండ్ కి లొకేషన్ ఎడ్రస్ చెప్పాడు. ఆ డైరెక్టర్ కొచ్చిన కోపానికి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కంటిచూపుతోనే కాలిపోయి ఉండేవాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన.

మన ప్రయారిటీలో సినిమా పని, టాప్ వన్ గా ఉండకపోతే, ప్రేక్షకుడి ప్రయారిటీలో సినిమా టాప్ లిస్ట్ లో ఎలా ఉంటుంది? కథలు చెప్తామని కొత్తగా వచ్చేవాళ్ళకి, పాటలు రాస్తామని కొత్తగా వచ్చేవాళ్ళకి తెలుగు అక్షరాలు ప్రూఫ్ రీడింగ్ చేయాల్సిన పరిస్థితికి ప్రూఫ్ నేనే. అసిస్టెంట్ డైరెక్టర్లకి తెలుగు సినిమా స్క్రిప్ట్ తెలుగులో రాయడం రాదు. పరభాషా ఆర్టిస్టులతో పనిచేసిన అలవాటు వల్ల పరభాషా తెలుగు కథా రచయితలు, పాటల రచయితలు, సహాయ దర్శకులతో కూడా పనిచేయడం అలవాటు చేసుకోవలసి వస్తోంది. బాగా చదువుకోమంటే పిల్లలకి కోపం. మాకు తెలీదా అంటారు. పోనీ మీకు తెలిసింది చెప్పమంటే, రాజమౌళి మగధీర ఇంకా బాగా తియ్యాల్సింది. ఫస్టాఫ్ చెడగొట్టేశాడు. పూరి 'పోకిరి' అలా తీశాడేంటి? వినాయక్ కి కథలెంచుకోవడం రాదు. శ్రీనువైట్ల హీరోల సినిమాలు కూడా కామెడీగా తీసేస్తాడేంటీ? మీరు (వి. ఎన్. ఆదిత్య) అయితే, టోటల్ గా వేస్ట్. 'మనసంతా నువ్వే' ఏదో పర్లేదు కానీ, తర్వాత ఏం తీశారు పన్నెండేళ్ళయిపోలేదు - ఇవీ నేను విన్న కామెంట్లు. మరి, మీరు విమర్శించినవన్నీ బాగా ఆడాయి కదయ్యా అంటే, ఆ... ఏదో జనం వేరే ఆప్షన్ లేక మీరు తీసింది చూస్తున్నారు కానీ, ఇదే మేం తీస్తే తెలుస్తుంది జనానికి సినిమా ఎలా ఉండాలో, ఎలా చూడాలో - వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ ఉండాలి... మంచిదే. అది మనని మనం విమర్శించుకొని ఎదగడానికి ఉపయోగపడాలి కానీ, ప్రజామోదం పొందిన వాళ్లని విమర్శించి మన 'ఈగో'ని శాటిస్ఫై చేసుకోవడానికి కాదు.

పబ్లిక్ పల్స్ ని పట్టుకోవడం ప్రతి సినిమాకీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నంలో పరిశ్రమలో ఉన్న ఆనకట్టల కట్టలు తెంచుకొని రావడం మరీ సాధ్యం కాదు. అన్ని చేయాలంటే మనం ఎన్ని చేయాలన్న ఇంగితం కూడా రాబోయే తరానికి లేదు. సహాయదర్శకుడి మీద రచయిత, నిర్మాత, దర్శకుడు, నటులు ఆధారపడేంత రిలయబిలిటీ పరిశ్రమలో పోయి పదేళ్ళవుతోంది.

సినిమా ఇవాళ ప్రేక్షకుడి ప్రథమ ప్రయారిటీ కాదు. ఇంట్లో టెలివిజన్, మొబైల్ లో ఇంటర్నెట్, థియేటర్లో గేమ్స్ రూమ్స్, షాపింగ్ లు, పండగలకి పబ్బాలకి మునుపెన్నడూ లేనంత ఉత్సవాలు, ఈవెంట్ లు, ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్ లు. ఇవికాక థీమ్ పార్కులు, చవక ధరలకే ఫారిన్ టూర్ లు, ఇంటి లోన్లు, కారు లోన్లు, బైక్ లోన్లు, ఈ.ఎమ్.ఐ.ల జీవితంలో ఏ.టి.ఎమ్.కార్డుల ప్లాస్టిక్ లైఫ్ లో సినిమాని సినిమాకోసం చూసే ప్రేక్షకుడి శాతం విరివిగా తగ్గిపోయింది.

ఆ దేవుడ్ని ప్రసన్నం చేసుకోవాలంటే మనం చెయ్యాల్సిన తపస్సెంత? మన తాహతేంటి? ఇవేవీ అవసరం లేదు.

సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ తెలియడమే ఇవాళ అసిస్టెంట్ డైరెక్టర్ల మేథస్సుకి కొలమానం. క్రియేటివ్ కంటెంట్ అవసరం లేదు. పెద్ద రచయితలకి మర్యాద ఇవ్వక్కర్లేదు. పెద్దవాళ్ళతో తిరిగి వారి అనుభవాల నుంచి పాటాలు నేర్చుకోనక్కర్లేదు.

జంధ్యాలగారి లాంటి రచయిత దగ్గర పదిహేడు సంవత్సరాలు పనిచేశారు కాబట్టి క్వాలిఫైడ్ చదువు లేకపోయినా ఇ.వి.వి గారు పెద్ద దర్శకుడిగా ఎదిగారు. అంతమాత్రాన ఇ.వి.వి గారేం చదువుకున్నారని పెద్ద దర్శకుడయ్యారు అని వితండవాదం చేసేవాడికి, ఆయన పదిహేడు సంవత్సరాల జర్నీని విస్మరించడం మాత్రమే తెలుస్తుంది.

నేర్చుకోవాలంటే ఓపిక కావాలి. నేర్పించడానికి అవసరం లేదు. ఓ డైరెక్టర్ విసుక్కున్నాడని స్క్రిప్ట్ పారేసి, క్లాప్ బోర్డ్ విసిరేసి సినిమా నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్లు కోకొల్లలు. ప్రేక్షకులు రెండున్నర గంటలపాటు అనుభవజ్ఞులైన నటీనటుల హావభావాలు మాత్రమే చూస్తారు కాబట్టి వాటిని 'లైక్' చేస్తారు. కానీ మేం ఆర్నెల్లపాటు ఎంతోమంది అమెచ్యూర్ ల హావభావాలు, అరివీర భయంకర నటనలు చూస్తాం. అప్పుడప్పుడైనా చిరాకు రాదా? బ్యాటింగ్ కి అందరూ నెట్స్ లోనే ప్రాక్టీస్ చేసినా, మ్యాచ్ లో దిగాక టెండూల్కర్ ఒకరకంగా, ధోనీ మరోరకంగా, యువరాజ్ సింగ్ ఒక రకంగా, కోహ్లి ఒక రకంగా షాట్లు ఆడతారు. థియరీలు ఎన్ని నేర్చుకొన్నా సినిమాలు కూడా ఒక్కో దర్శకుడు, ఒక్కో నటుడు సొంతబాణీలు ఏర్పరచుకుని ప్రేక్షకుల్లోకి రావాలి. వస్తారు. ఔట్ అయితే మళ్ళీ ఇంకోసారి నిరూపించుకోవాలి, హిట్ అయితే, మళ్లీ జాగ్రత్తగా ఆడాలి. ఇది కామన్.

కథ ఆలోచించాలంటే పాత్రల్ని నిర్వచించడం తెలియాలి. ఏ పాత్ర స్వభావాన్ని బట్టి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే సాహిత్యమూ చదవాలి. జీవితంలో పాత్రల్ని పరిశీలించాలి. వాటికి మన సొంత 'టచ్' ఇవ్వాలి. ఒక్క సినిమాకో, ఒక్క షెడ్యూల్ కో వచ్చేసి, ఇంతేనా షూటింగ్ అంటే అనుకొని ఆ పరిచయాలతో ఓ ఫైవ్ డి కెమెరా పట్టుకుని డబ్బులడగవని నలుగురు ఔత్సాహికులకి వేషాలిచ్చి, దర్శకుడినో, రచయితనో, నిర్మాతనో, హీరోనో అయిపోయానని అనేసుకోవడమే నా దృష్టిలో పెద్ద వెర్రి వేషం. ఈ వేలంవెర్రి వేషాలకి బలైపోయిన మూగ సినిమాలు ప్రసాద్ ల్యాబ్ లోను, రామానాయుడు ల్యాబ్ లోను, జెమిని ల్యాబ్ లోను ప్రతి ఏడాదీ నూట యాభైకి పైగా పేరుకుపోతున్నాయి. శ్రీ శ్రీ గారన్నట్టు "ఏ వెలుగులకీ ప్రస్థానం?" నా డౌట్ ఏంటంటే ఏ వెండితెర వెలు'గుల'కీ ప్రయాణం? కొంచెం హార్ష్ గా ఉన్నట్టుంటే క్షమించండి...

వాదంలో తీవ్రత ఉంటే, తీవ్రవాదిలానే మాట్లాడాలన్న సామాజికన్యాయం అనుసరించి ఈ వారం ఇలా రాయాల్సి వచ్చింది... ఇంకా అయిపోలేదు...





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Raja Music Muchchatlu