Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly Horoscope Sept 06 - Sept12

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Book Review - Dasarathi Sahityam

పుస్తకం: దాశరథి సాహిత్యం-2
వెల: 250/-
లభించు చోటు: విశాలాంధ్ర షాపులు

గంగా నదిలో ఏ పక్కనుంచి మునిగినా పుణ్యమే అయినట్టు, ఈ పుస్తకాన్ని ఎక్కడ నుంచి మొదలుపెట్టి చదివినా ధన్యమే. కవి దాశరధి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్యం, గేయం, గజలు, రుబాయి, సినీ గీతం...ఇలా అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లోను కవితా సేద్యం చేసి మెప్పించిన అద్వితీయమైన ప్రతిభాశాలి. "ఖుషీ ఖుషీగ నవ్వుతూ..చలాకి మాటలు రువ్వుతూ..." వంటి పాటలు ఎన్నో రాసి పామరుల్ని కూడా తనవైపుకు తిప్పుకున్న కవి.

దాశరధి అనగానే "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అన్నాడని ఈ మధ్య కొందరు ఆయన్ని తెలంగాణా వేర్పాటు వాద ఉద్యమ కారుడన్నారు. విషయం తెలియని చాలా మంది నిజమనుకున్నారు. ఇంతకీ దాశరధి ఏ సందర్భంలో ఆ పద్య పంక్తి పలికాడు అనే అంశంతో పాటు ఆయన రాసిన అనేక చమత్కార కవిత్వాలు రాసులుగా పొసేసారు ఇందులో. కొన్ని అర్థ చమత్కృతులు, కొన్ని శబ్ద చమత్కృతులు, కొన్ని అధిక్షేపాలు, ఇంకొన్ని కాలాక్షేపాలు...మొత్తానికి అన్నీ పదికాలాల పాటు నిక్షేపాలుగా ఉండే అక్షరాలు.

ప్రక్రియకి ఒకటి చొప్పున ఉదహరించి ఊరించే ప్రయత్నం చేస్తాను.

పద్యం:
నాల్క ఒకటెగాని నన్నూరు భాషలు
నరుని భాష నరుడె ఎరుగలేడు;
భూమి ఒకటెగాని భూనేతలెందరో
ఒకని జూచి ఒకడు ఓర్వలేడు

రుబాయి:
శిలనే ఒక అప్సరగా మలిచే వారు
చెలినే ఒక దేవతగా కొలిచేవారు
ఉన్నారు కొల్లలుగా ఈ లోకంలో
సతినే ఒక దెయ్యంలా తలిచే వారు

లయాత్మక వచన కవిత:
గన ఫూతృత వాయువీచిక
జగమునూయలలూపుచున్నది;
పవన చక్రిక తిరుచున్నది
జవన హయమై దుముకుచున్నది;
నీలనీరద దుకూలాంచల
కేళిలో సగభాగమేమో
తెలిసికొనుటకు మాటిమాటికి
దివికిలుంగలు వేయుచున్నది..

.......................
గాలిలేనిది బతుక జాలదు
కాంచనముపై ఆశ వీడదు.

అనువాదం:
తెలుగు సగం నలుపు సగం
గల ముత్యం ఏది?
కాటుక కన్నుల నుండి జారిన
కన్నీటి కణమే అది (ఫార్సీ నుంచి)

గేయం:
తెల్లవాడు మనయింటిని గుల్ల చేసెను
నిజాం రాజు మన భాషకు నిప్పు పెట్టెను
ముక్కలైన తెలుగుజాతి ఒక్కటాయె తుదకు
నీవు నేను కన్న కలలు నిక్కమాయే తుదకు

వీటితో పాటు వివిధ రకాల శతకాల గురించి విస్తృతమైన సమాచారం కూడా ఉంది. సాహితీ ప్రియుడైన ప్రతివాడు అక్కున చేర్చుకునే స్థాయి ఉన్న పుస్తకం ఈ దాశరథి సాహిత్యం రెండో సంపుటం.. మొదటి సంపుటం గురించి త్వరలో రాస్తాను.

మరిన్ని శీర్షికలు
vinayaka chavithi special