Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

దువ్వాడ జగన్నాధం చిత్రసమీక్ష

duvvada jagannaatham  movie review

చిత్రం: డిజె - దువ్వాడ జగన్నాధం  
తారాగణం: అల్లు అర్జున్‌, పూజా హెగ్దే, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, రావు రమేష్‌, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు. 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: అయనంక బోస్‌ 
దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ 
నిర్మాత లు: దిల్‌ రాజు, శిరీష్‌ 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 23 జూన్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
విజయవాడలోని సత్యనారాయణపురం అనే ప్రాంతంలోని అగ్రహారంలో ఉంటూ శాఖహార వంటల్లో దిట్ట అనే గుర్తింపు పొంది, తన అద్భుతమైన వంటకం టాలెంట్‌తో అందరి మన్ననలను అందుకుంటుంటాడు దువ్వాడ జగన్నాథ శాస్త్రి (అల్లు అర్జున్‌). అతనికి ఓ సందర్భంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ పూజ (పూజా హెగ్దే) పరిచయమవుతుంది. అది ప్రేమగా మారడం జరుగుతుంది. శాస్త్రిలో ఇంకో కోణం ఉంటుంది. అదేమిటంటే, డీజేగా మారి హైద్రాబాద్‌లో కొందర్ని ఎంపిక చేసుకుని మరీ చంపుతుంటాడు. అలా శాస్త్రి ఎందుకు చేస్తాడనేది తెరపైనే చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
అల్లు అర్జున్‌ అంటేనే ఎనర్జీ. హై ఓల్టేజ్‌ ఎనర్జీని చూపించడమే కాదు, ఎమోషనల్‌ సీన్స్‌ వచ్చినప్పుడు వాటికి తగ్గట్టుగా సత్తా చాటుతుంటాడు. ఈ సినిమాలోనూ అల్లు అర్జున్‌ భిన్నమైన షేడ్స్‌ ప్రదర్శించాడు. బ్రాహ్మణ యువకుడిగా, వంటగాడిగా అల్లు అర్జున్‌ చాలెంజింగ్‌ పాత్రనే ఎంచుకున్నాడు. పాత్రలో రాణించాడు కూడా. డిజె పాత్రలో మాత్రం అల్లు అర్జున్‌ చెలరేగిపోయాడు అది అతనికి కొట్టిన పిండే. బ్రాహ్మణ యువకుడి పాత్ర కోసం యాస, బాడీ లాంగ్వేజ్‌ ఇలా అన్నీ మార్చేసుకున్నాడు. అది అందర్నీ ఆకట్టుకుంటుంది. 

'ముకుంద', 'ఒక లైలా కోసం' సినిమాల్లో కామ్‌గా కనిపించిన పూజా హెగ్దే ఈ సినిమాలో గ్లామర్‌తో చెలరేగిపోయింది. క్యూట్‌గా హాట్‌గా పూజా హెగ్దే అప్పీయరెన్స్‌ స్పెషల్‌గా అనిపిస్తుంది. నటనకు ప్రాధాన్యత తక్కువే. గ్లామర్‌తోనే మార్కులు కొట్టేస్తుంది పూజా హెగ్దే. హీరోయిన్‌గా ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపునివ్వడం ఖాయం. 
మిగతా పాత్రల్లో రొయ్యలనాయుడుగా రావు రమేష్‌ పాత్ర బాగుంది. ఆ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించారు. మురళీ శర్మ, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు తదితరుల తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా సినిమాకి బాగానే హెల్పయ్యారు. 

కథ పరంగా చూస్తే ఇదొక రివెంజ్‌ స్టోరీ. కానీ ఆ కథలో దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దిన వైనం, సినిమాని కమర్షియల్‌ యాంగిల్‌లో ఎంటర్‌టైనింగ్‌గా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణ. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంటూ, ఒక్కోసారి సీన్స్‌ని ఎలివేట్‌ చేసేందుకు ఉపకరించింది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. 
రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కి తనదైన టచ్‌ ఇవ్వడంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ సఫలమయ్యాడు. అయితే ట్విస్ట్‌లు లేకపోవడంతో నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో ఊహించేయగలడు ప్రేక్షకుడు. క్లయిమాక్స్‌లో మాత్రం రొటీన్‌కి భిన్నంగా ఆలోచించాడు దర్శకుడు. క్లయిమాక్స్‌ని తీర్చిదిద్దిన వైనానికి మంచి మార్క్‌లు పడతాయి. హీరో హీరోయిన్ల నుంచి ఏమేం ప్లస్‌ పాయింట్స్‌ని తీసుకోవచ్చో, దర్శకుడు వాటిని బాగా వాడుకున్నాడు. జస్ట్‌ ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని ముందే చెప్పేశారు గనుక, అక్కడి వరకూ డిజె ఏమాత్రం నిరాశపర్చదు. ఓవరాల్‌గా సినిమా మంచి పబ్లిసిటీతో, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దరిమిలా మంచి మార్కులు పడటం ఖాయం. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
డిజె - బాగానే వాయించాడు 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
rangasthalam what a hipe