Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు ఆమె ఒక రహస్యం

atadu aame oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue219/614/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి ).. 

పోలీసుల దగ్గర కూడా ఉండనంత పకడ్బందీ నెట్ వర్క్, అంతకన్నా వేగవంతమైన అతడి ప్లానింగ్...  చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది.

“మావాళ్ళకి దొరికిన సమాచారం ప్రకారం బంగారు లక్ష్మి ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఆఫీసు వాళ్ళకి కానీ, కనీసం చుట్టుపక్కల వాళ్ళకి  కానీ ఎవరికీ తెలియదు!  అందుకే ఆమె వజ్రాలతో పారిపోయిందేమోనన్న అనుమానం వచ్చి అలా అన్నాను నేను”

  ఇంద్రనీల ఏదో మాట్లాడే లోగా పాణి మొబైల్కి ఫోన్ వచ్చింది.  ఎవరా అని చూసిన పాణి ఆశ్చర్యపోయాడు.  కాల్ చేస్తున్నది తన భార్య అంజలి !!

పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేని ఆమె ఆ సమయంలో ఫోన్ ఎందుకు చేస్తోందా అని ఆశ్చర్యంగా ఫోన్ ఎత్తి “గుడ్మాణింగ్. ఏమిటింత పొద్దున్నే  లేచి ఫోన్ చేసావు?” అన్నాడు.

“పొద్దున్నే లేవడానికి రాత్రి అసలు నేను నిద్రపోతే కదా?”

“నిద్రపోలేదా? ఎందుకని? ఏం చేసావు పడుకోకుండా?”

“ఆన్లైన్లో మీ  రాసలీలలు చూస్తూ కూర్చున్నాను”  కోపంగా అంది.

ఆమె ఎందుకలా మాట్లాడుతోందో అతడికి అర్ధం కాలేదు. తన మాటలు ఇంద్రనీలకి వినపడకుండా  సిగ్నల్ కోసం గది  కిటికీ దగ్గరకి నడుస్తున్నట్టుగా దూరంగా నడిచి అన్నాడు “ఏమైంది అంజలీ... రాసలీలలేమిటి? నేను  కేసు పనిలో బిజీగా ఉన్నాను.  నామీదే అనుమానమా?”

“ఆపండి మీ నాటకాలు”

“నాటకాలేమిటి అంజలీ... నేను నిజంగానే కేసు పని మీద...” అంటూ ఏదో చెప్పబోయాడు..

 “నేను కొన్ని ఫోటలని పంపిస్తునాను చూడండి. నాటకాలని ఎందుకంటున్నానో మీకే అర్ధమౌతుంది” అని ఫోన్ పెట్టేసింది.

ఆమె ఫోన్ పెట్టేసిన  మరు క్షణంలో అతడి సెల్లో  వాట్సప్ కి ఫోటో మెసేజిలు రాసాగాయి.  ఒక్కో ఫోటో  చూస్తున్న కొద్దీ పాణి ముఖం ఎర్రబారసాగింది. ముందు రోజు రాత్రి రాజేంద్ర గదిలో తనకి వినిపించిన ‘చిక్ చిక్’ మన్న శబ్దాలు ఏమిటో అప్పటికి కానీ అర్ధం కాలేదు.  తనూ ఇంద్రనీల క్లోజ్ గా ఉన్న  సమయాన్ని అవకాశంగా తీసుకుని దాన్ని వేరే అర్ధం వచ్చేలా ఆ చీకట్లో సైతం ఫోటోలని తీసి వాటిల్ని అంజలికి పంపారెవరో.  ముందురోజు తాను ఇంద్రనీలతో గార్డెన్లో   జాగింగ్ చేసినప్పుడు కూడా తనకి తెలియకుండా ఫోటోలు తీసి ఎవరో ఆమెకి పంపారనీ,  అందుకే అంజలి ఫోన్ చేసి వాకింగ్ గురించి అడిగిందన్న విషయం  అర్ధమైంది అతడికి.  ఆ ఫోటోలు ఆమెకి  ఎవరు పంపారు?  ఎందుకు పంపారు? 

అతడి ఆలోచనలు పూర్తికాక ముందే అంజలి నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. పాణికేమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. 

“అంజలీ... ఆ ఫోటోలో ఉన్న ఆమె ఎవరో కాదు.  పోలీసాఫీసర్ ఇంద్రనీల” అంటూ ఆగాడు.

“ఆ విషయం నాకు తెలుసు. బయలుదేరే ముందర మీ సెక్రెటరీ రమణ మీ ఫోన్కి ఆమె ఫోటో వాట్సప్ లో పంపాడు” 

తల కొట్టుకున్నాడు పాణి. అప్పుడు రమణ పంపిన ఫోటో కూడా ఆమె చూసిందన్నమాట !  అసలు తను  ఇక్కడికి వచ్చినది కేసు పని మీద కాదనీ, ఆమె కోసమే వచ్చానని అనుకుంటోందా అమె? ఇప్పుడేం  చెప్పి ఆమెని నమ్మించాలి?

“అంజలీ... ఆమె కూడా నాతో పాటూ ఈ కేసులో వర్క్ చేస్తోంది. ఇదంతా కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగ జరిగింది. ఆ ఫోటోలని ఎవరు ఏ పరిస్థితుల్లో తీసారో, ఆమె నాతో ఎందుకలా క్లోజ్ గా ఉన్నట్టు నటించాల్సి వచ్చిందో అన్నీ  చెప్పాలంటే అసలు నీకు మొత్తం కేసు  గురించి చెప్పాలి. అయినా నామీదే నీకు అనుమానమా?” అన్నాడు ఆమెని  అనునయిస్తున్నట్టుగా.  

“సరే,  మీరు చెప్పినది నమ్ముతాను.  ఇప్పుడు సూటిగా ఒక్క ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి. ఇప్పుడు  మీరు కాకుండా మీ గదిలో మీతోపాటూ ఎవరు ఉన్నారు?”

గతుక్కుమన్నాడు పాణి. అతడు గొంతు సవరించుకునేలోగానే,  షార్ప్ గా మళ్ళీ అంది ఆమె “ఎవరూ లేరని అబద్దం మాత్రం చెప్పద్దు”

 “ఇంద్రనీల ఇక్కడే ఉంది. కేసు విషయం డిస్కస్ చెయ్యడానికి...”

అతడిని పూర్తిగా చెప్పనివ్వలేదు ఆమె “చాలు. ఇంకేమీ చెప్పకండి” అంది కోపంగా. 

“అది కాదు అంజలీ” అన్నాడు పాణి సర్ది చెప్పే ధోరణిలో.

“నేను ఇంకేం విన దల్చుకోలేదు. చేసిన డిస్కషన్ ఇపటికైనా  ఇంక ఆ కేసుని వదిలేసి ముంబై రండి.  మధ్యాహ్నానికల్లా  నా ముందర ఉంటే, మీరు నాతో మాట్లడే అవకాశం ఉంటుంది. లేకపోతే, మీకు ఆ అవకాశం ఉండదు.  మీరు మాట్లాడాల్సింది  విడాకుల కోసం నా కేసు వాదించే అడ్వకేట్తో మాత్రమే.  ఆ తరువాత హాయిగా  ఆ పోలీసాఫీసర్ తోనే...” ఆమె గొంతు దుఃఖంతో బొంగురుపోతుంటే, ఫోన్ కట్టయ్యింది.

వెంటనే మళ్ళీ  ఆమె నెంబరుకి ట్రై చేసాడు పాణి.   అతడికి తెలుసు... ఆమె ఇంక  తన నుంచి ఫోన్ వెడితే లిఫ్ట్ చెయ్యదు.  తను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నానికల్లా  ముంబైలో ఉండాలి.   ఆమె చెప్పిన సమయానికి ముంబయిలో ఉండాలంటే, ఇప్పుడు ఇక్కడ్నుంచి బయలుదేరాలి.  

అతడింకా  ఆలోచనల్లో ఉండగానే  అతడి సెల్ ఫోన్ మళ్ళీ రింగయింది.  అంజలి మళ్ళీ ఫోన్  చేసిందేమోనని ఆశగా సెల్ వంక చూసాడు.

ఫోన్ చేస్తున్నది డి.ఎస్పీ ప్రసాద్ !

ఫోన్ ఎత్తి “హలో” అన్నాడు పాణి అనాసక్తంగా.

“నువ్వు వెదుకుతున్న యాదగిరి దొరికాడు. మా కస్టడీలోనే ఉన్నాడు. నువ్వు వెంటనే వచ్చి మాట్లాడచ్చు” అన్నాడు అవతలనుంచి ప్రసాద్.

పాణికేమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.  నిజామాబాద్ వెళ్ళి యాదగిరితో మాట్లాడడమా లేక  ముంబై ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవడమా?!

రెండు క్షణాలు కళ్ళు మూసుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు పాణి.  ఊపిరి వదిలి, కళ్ళు తెరిచి అన్నాడు ప్రసాద్ తో  “హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్ళడానికి మధ్యాహ్నం లోపూ ఫ్లైట్ ఎన్నింటికి ఉంది?”

పాణి అడిగిన ప్రశ్నకి విస్తుపోతూ అన్నాడు ప్రసాద్ “బహుశా పన్నెండింటికి ఒక ఫ్లైట్ ఉన్నట్టుంది. ఎందుకు?”

“నాకొక చిన్న సహాయం చెయ్యగలవా?” అన్నాడు పాణి. 

“చెప్పు. ఏం చెయ్యాలి?” అడిగాడు ప్రసాద్.

“ఈ రోజు పన్నెండింటి ఫ్లైట్ కి ముంబయికి నాకొక టికెట్  బుక్ చెయ్యగలవా?”

“అదేమిటీ? ఇక్కడ ఈ కేసుని ఇలా అర్ధాంతంగా వదిలేసి ముంబయి వెళ్ళిపోతావా?” ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్.

“అర్ధాంతంగా  వదిలెయ్యాల్సిన అవసరం లేదు.  పదకొండింటి లోపలే ఈ కేసుని సాల్వ్ చేసి నేను ముంబై  ఫ్లైట్ ఎక్కుతాను.  నువ్వు నాకు టికెట్ బుక్ చెయ్యి.  నేను ఇప్పుడే నిజామాబాద్ బయలు దేరి వస్తున్నాను యాదగిరితో మాట్లాడడానికి” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు పాణి.

ఆ తరువాత ఇంద్రనీల దగ్గరకి వచ్చి అన్నాడు “మీరు నాతో రండి” 

“ఎక్కడికి?”  అంది ఆశ్చర్యంగా ఇంద్రనీల.

“ఈ కేసులో కొన్ని నిజాలని చెప్పగలిగిన ఒక ముఖ్యమైన వ్యక్తి దొరికాడు. అతడితో మాట్లాడడానికి మనం నిజామాబాద్ వెడుతున్నాం.” అన్నాడు పాణి. 

“ఒక్క నిమిషం. బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయి వస్తాను”  అంది ఇంద్రనీల.

పాణి ఆమె వంక చూసాడు.  రాత్రంతా నిద్ర  పట్టక దొర్లినట్టుగా ఆమె నైట్ డ్రెస్ నలిగిపోయి  ఉంది.  జుట్టు చెదిరి ముఖమ్మీద పడుతోంది.  అయినా సరే అందంగానే ఉందామె.  ‘అంజలికి అనుమానం రావడంలో అర్ధం ఉంది’  అనుకున్నాడు. 

“మనం వెళ్ళేది పిక్నిక్కి కాదు.  అంతే కాదు. ఇంక ఫోటోలు తీయించుకొవాల్సిన అవసరం కూడా లేదు. తియ్యాల్సినవన్నీ  ఎప్పుడో తీసేసారు.  మీరు ఇప్పుడు మేకప్ వేసుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. పదండి” అన్నాడు ఆమెకి మరో మాట  మాట్లాడే ఆస్కారం ఇవ్వకుండా.

 “ఫోటోలు తియ్యడమేమిటీ?” అతడు గది తలుపు వేస్తుంటే  అడిగింది అర్ధం కాక.

“మీకు నిజంగా తెలియకపోతే దారిలో చెబుతాను, ముందు పదండి” అన్నాడు పాణి.  

అతడి గొంతులోని కమాండ్కి ఆమె ఏమనుకుందో ఏమో లేచి నిలబడి అలాగే అతడితో బయలుదేరడానికి సన్నద్ధమైంది.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్