Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

మత్తు వదలరా - డ్రగ్స్‌ మత్తు వద్దురా!

dont take drugs

తెలుగు రాష్ట్రాల్లో యువతకి డ్రగ్స్‌ ముప్పు పొంచి ఉంది. స్కూళ్ళ నుంచే విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్స్‌ మత్తుకి బానిసలవుతున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. డ్రగ్స్‌ మాఫియా అంతు చూసే క్రమంలో పోలీసులకు డ్రగ్స్‌ సూత్రధారులు, పాత్రధారులు చిక్కారు. వీరి నుంచి నిర్ఘాంతపోయే వాస్తవాల్ని పోలీసు అధికారులు వెలుగులోకి తెచ్చారు. స్కూళ్ళు సైతం డ్రగ్స్‌కి అడ్డాలుగా మారుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ప్రజల్ని షాక్‌కి గురిచేశారు. తెలంగాణలో వెలుగు చూసిన ఈ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆందోళన కలిగిస్తున్నది. సినిమాల్లో డ్రగ్స్‌కి సంబంధించిన సీన్స్‌ చూస్తుంటాం, ఎంజాయ్‌ చేస్తుంటాం. అవే భయంకరమైన సన్నివేశాలు నిజజీవితంలో కూడా చోటు చేసుకుంటాయని తెలిసినప్పుడు గుండె గుభేల్‌మనకుండా ఉండదు. ప్రధానంగా యువత డ్రగ్స్‌కి బానిసలవుతుంటారు. ఇందులో ముఖ్యమైన కోణం ఏమిటంటే, చాలావరకు డ్రగ్స్‌ని అనుకోకుండా యువత అలవాటు చేసుకోవడం. తెలియకుండానే డ్రగ్స్‌ సేవించడం, ఆ తర్వాత వాటికి బానిసలవడం జరుగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు.

హై స్కూల్‌ నుంచి మొదలవుతున్న ఈ డ్రగ్స్‌ మేనియా, కాలేజ్‌కి వెళ్ళాక తీవ్రతరమవుతోంది. గతంలో కేవలం సంపన్న కుటుంబాలకు చెందిన యువత మాత్రమే డ్రగ్స్‌ పట్ల ఆకర్షితులయ్యే వారు. దానికి కారణం డ్రగ్స్‌ ఖరీదు చాలా ఎక్కువ ఉండటమే. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మధ్యతరగతి యువత కూడా డ్రగ్స్‌ మోజులో పడుతున్నారు. డ్రగ్స్‌కి బానిసలైపోతే, అవి లేకుండా ఉండలేరు. ఆ డ్రగ్స్‌ కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగతనాలు, హత్యలు చేయడానికి కూడా వెనుకాడటంలేదు. తద్వారా సమాజానికి భావి నిర్దేశకులు కావాల్సిన యువత, సమాజాన్ని సర్వనాశనం చేసే శక్తులుగా మారుతున్నారన్న కఠోర వాస్తవం అందర్నీ భయంకంపితుల్ని చేస్తోంది. ఈ డ్రగ్స్‌ మహమ్మారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సకాలంలో గుర్తిస్తే డ్రగ్స్‌కి బానిసలైనవారిని సన్మార్గంలో పెట్టవచ్చునని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

డ్రగ్స్‌ని సేవిస్తున్నవారిలో మార్పులు తేలిగ్గానే గుర్తించవచ్చు. డల్‌గా ఉండడమో, లేదంటే అత్యుత్సాహంతో కనిపిస్తుండడమో చేస్తుంటారు. తాము చేస్తున్నది తప్పు అని వారికి తెలుసు కాబట్టి, తప్పించుకు తిరగడానికి చూస్తుంటారు డ్రగ్స్‌కి అలవాటుపడ్డవారు. అలాంటివారిని ఈసడించుకోకుండా, నిలదీయకుండా వారిని అక్కున చేర్చుకోవాలి. వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని, నెమ్మది నెమ్మదిగా కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. డ్రగ్స్‌ సేవించడం ప్రాణానికి హానికరం, సమాజానికి నష్టం అనే విషయాన్ని వారికి తెలియజేసేందుకు చాలా జాగ్రత్తగా ప్రయత్నించడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. కౌన్సిలింగ్‌ సెంటర్స్‌ డీ - ఎడిక్ట్‌ సెంటర్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి డ్రగ్స్‌ మాన్పించవచ్చు. 

మరిన్ని యువతరం
badam is healthy food