Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu .. aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి  ..... http://www.gotelugu.com/issue222/621/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

( గతసంచిక తరువాయి )..‘‘ఊహూ....’’

‘‘మరి?’’ తీవ్రంగా వుంది ఆమె స్వరం.

‘‘చెన్నై వెళ్ళింది.’’

‘‘చెన్నై...ఎందుకు?’’ కఠినంగా అంది.

‘‘టోర్నమెంట్ కోసం’’

‘‘బయటి ఊరికి ఒక్కదాన్ని పంపించావా?’’

‘‘ఒక్కతీ కాదు పిన్నీ! కోచ్ వుంటాడు. టీమ్ మేట్స్ వుంటారు’’ వివరించ బోయాడు.

‘‘ఊర్ల వెంబడి తిరుగుతున్నారంటే వాళ్ళూ ఇలాంటి వాళ్ళే అయ్యుంటారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందని, అలాంటి వాళ్ళందరూ కలిసి వెళ్ళారన్న మాట.’’

‘‘కీర్తన గురించి వాళ్ళందరినీ అనడం దేనికి పిన్నీ?’’ మెల్లగానే అన్నాడు.

‘‘అనమా మరి? అయినా అసలు ఆటలు, గంతులూ మానెయ్యమని ఎన్నిసార్లు చెప్పాను? మన లాంటి జమీందారీ కుటుంబాల్లో ఆడపిల్లలు బయటకి రావడమే గగనం! అలాంటిది ఈ ఆటలూ, చదువులూ యివన్నీ....అయితే రేపు దానికి పెళ్ళవుతుందా? మంచి సంబంధాలు మనింటి గుమ్మం వరకైనా వస్తాయా? అలా జరిగితే, సవతి తల్లి సరిగా చూసుకో లేదని అందరూ నన్నాడిపోసుకుంటారు’’ గుక్క తిప్పుకోకుండా అంది.

‘‘అలా మేమెప్పుడూ అన లేదుగా పిన్నీ!’’ అశోక్ ఆవేదనగా అన్నాడు.

‘‘మీరు ఎదురుగా ఎందుకంటారయ్యా! చెయ్యాల్సినవన్నీ వెనక వెనక చేస్తూ వుంటారు. నన్ను వూరు వెళ్ళనిచ్చి, చెల్లెల్ని తిరగడానికి పంపించావు.’’

‘‘పిన్నీ....’’ గట్టిగా అరిచాడు అశోక్.

‘‘నా మీద అరిచి ఏంటి లాభం? లోకమంతా కోడై కూయకుండా చూసుకోండి ముందు’’ కోపంగా అంది.

‘‘అసలు ఇప్పుడేమయింది పిన్నీ? ఈ కాలంలో ఆడపిల్లలు ఆటలు ఆడటం తప్పేం కాదు. పైగా ఎంతో పేరు కూడా! మనం సంతోషించి తనని ఎంకరేజ్ చేయాలే గానీ....’’

అతని మాట మధ్యలోనే ఆపేసి...

‘‘ఆ...ఆ...నువ్వు చేస్తున్నది చూస్తున్నాంగా! ఇంకా నేను కూడా ఎందుకులే! అయినా ఈ మాటలన్నీ అనవసరం. కీర్తనకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు.’’

‘‘.........’’

‘‘నువ్వు చేస్తావా? నేను చెయ్యనా?’’ బెదిరింపుగా అంది.

‘‘నేను చేస్తానులే పిన్నీ!’’ చెప్పాడు.రిసీవర్ టప్ మని పెట్టిన శబ్దం వినిపించింది. బాధగా మొహం చేతుల్లోకి దించుకొని కూర్చున్నాడు.
ఒకరిది ఆట పట్ల మమకారం.

మరొకరిది అర్ధం లేని ప్రతీకారం.

రెండింటినీ, యిద్దరినీ బాలెన్స్ చేసుకుంటూ రావడం చాలా కష్టంగా వుంటుంది.

కీర్తనకి ఇప్పుడు ఫోన్ చేసినా రాదు.

ఆ సంగతి తెలిసి తను ఫోన్ చేస్తే ఆమెని బాధ పెట్టిన వాడవుతాడు.

అటు మ్యాచ్ లు వదులుకొని రాలేకా....

ఇటు తన మాట విన లేకా సంఘర్షణకి లోనవుతుంది.

ఇప్పటికిపుడు కీర్తనని రమ్మనక పోవడమే బెస్ట్.

ఎలాగో రెండు మూడు రోజుల్లో కీర్తన వచ్చేస్తుంది. ఈ లోపు పిన్ని ఫోన్ చేస్తే ఎలాగో ఒకలా మానేజ్ చెయ్యాలి.

అసలు కీర్తన గురించి తనకి రెండేళ్ళ నుంచీ దిగులు గానే ఉంది. ఏం చెయ్యాలా అని తను మధన పడుతుంటే పిన్నిది మరో రకం మనస్తత్వం.
కీర్తన విషయంలో ఎలాగైనా తను అనుకున్నది సాధించాలి. అందుకు కీర్తన బాధ పడినా ముందు ముందు సుఖ పడుతుంది.
తను బాగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాడు. తను చేస్తున్నది తప్పేమీ కాదు. తనని తాను సమర్ధించు కుంటూ చాలా సేపు పని వదిలేసి అలాగే కూర్చుండి పోయాడు.

ప్రకాష్ వచ్చి ఏదో అడిగే వరకూ తేరుకో లేక పోయాడు.

***************

సౌతిండియా టోర్నమెంట్స్ లో హైదరాబాద్ జట్టు, రైల్వేస్ జట్టు ఫైనల్స్ చేరుకున్నాయి.

మ్యాచ్ మరీ హోరా హోరీగా సాగక పోయినా రసవత్తరం గానే సాగింది.

ఫైనల్స్ లో హైద్రాబాద్ స్త్రీ జట్టు రైల్వేస్ స్త్రీ జట్టు మీద 15`10, 18`16, 15`8 తేడా తో విజయం సాధించింది.

నేషనల్ గేమ్స్ లో   ఫేవరేట్ గా హైద్రాబాద్ జట్టుని చాలా మంది క్రీడా పండితులు ఎంపిక చేసేసారు.

ముఖ్యంగా కీర్తన ఆట తీరు గురించి చెన్నై సిటీ ఎడిషన్స్ లో బాగా రాశారు.

ఆట పట్ల ఆమెకి వున్న అంకిత భావం, పట్టుదల, ప్రతిభ సాటి లేనివని కీర్తించారు.

ఇంత వరకూ ఎన్ని టోర్నమెంట్స్ గెలిచినా, ఈ గెలుపు ప్రత్యేకమైనదిగా అనిపిస్తోంది కీర్తనకి.

ఎందుకంటే ఆకాష్, తన ఆటని అభిమానించే ఆకాష్, తనని ప్రోత్సహించే ఆకాష్ సమక్షంలో తను గెలిచింది.

ఈ అనుభూతి మరువ లేనిది.

అందుకే మనసు లోనే ఈ విజయాన్ని అతనికి అంకితం చేసింది.

అతనున్నా, లేక పోయినా తను గెలిచి తీరుతుంది. కానీ అతని ప్రోత్సాహం సహజ లావణ్యానికి మరింత మెరుగు దిద్దినట్లుగా మురిసి పోతోంది.

తన టీమ్ గెలవ గానే, చాలా మంది చుట్టు ముట్టి అభినందనలు తెలియ జేశారు.

కానీ ఆకాష్ మాత్రం అక్కడే ఆ స్టేడియం మెట్ల మీద కూర్చుని దీర్ఘంగా తన వంకే చూస్తున్నాడు.

అతన్ని అలా చూస్తుంటే మనసంతా చెప్ప లేని బాధ. పరుగెత్తు కొని వెళ్ళి అతన్ని హత్తుకు పోవాలనిపించింది.

ఎందరు కంగ్రాట్స్ చెపుతున్నా అతను చెప్పని లోటు బాగా తెలుస్తోంది.

ఆ కోలాహలం నుంచి తప్పించు కొని వెళ్ళే సరికి ఆకాష్ కన్పించ లేదు. రూం కి వెళ్ళి పోయినట్లున్నాడు.

ఎందుకు అతను అంత డల్ గా, నీరసంగా కనిపించాడు? అతని కోసం ఎదురు చూస్తోంది అన్న విషయం గ్రహించకుండా ఎలా వెళ్ళి పోయాడు?

మరో గంటలో ప్రెజెంటేషన్ సెర్మనీ వుంది. అంత వరకు అతన్ని చూడకుండా ఎలా? వెంటనే వెళ్ళి పోవాలని వుంది.

కానీ తను కెప్టెన్...ట్రోఫీ తీసుకోకుండా తను అర్ధాంతరంగా వెళ్ళి పోతే తమ జట్టు పరువు సంగతి ఏంటి? అయినా వ్యక్తిగత జీవితం కోసం ఆటని అవమానించ కూడదు. ఆకాష్ తో తను తర్వాతయినా మాట్లాడొచ్చు. మనసు కంట్రోల్ చేసుకుని వుండి పోయింది.

టీమ్ మేట్స్ అందరూ గెలిచిన ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.

అందరి మొహాలూ దీప్తితో వెలిగి పోతున్నాయి. గెలుపు తాలూకు దరహాసం మనోహరంగా వారి పెదాలపై లాస్యమాడుతోంది.
అది చూసి తాత్కాలికంగా ఆకాష్ సంగతి పక్కన పెట్టింది.

సాయంత్రానికల్లా సందడి సద్దుమణిగింది. అందరూ కలిసి హోటల్ కి వచ్చారు.

కీర్తన మనసు ఎప్పుడెప్పుడు ఆకాష్ ని చూడాలా అని తపించి పోతోంది. రాగానే అతని రూంకి వెళ్ళాంటే ఫ్రెండ్స్ ఏమనుకుంటారోనని భయం.కోచ్ కాస్త నెమ్మదస్థుడు. పేరుకే కోచ్ కానీ, ఫ్రెండ్ లానే వ్యవహరిస్తాడతను.

ముప్పయి అయిదేళ్ళ వయసుంటుంది. జనరల్ గా బయటకి వచ్చినపుడు ఫ్రీగానే వదిలేస్తాడు.

అందకే అమ్మాయిలు అతన్ని బతకనిచ్చారు. లేకపోతే ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టించే వారు. మర్నాడు రాత్రి ట్రెయిన్ కి రిజర్వేషన్ దొరికింది.

ఇంకో ఇరవై నాుగు గంటలు హాపీగా గడపొచ్చు అంటూ అమ్మాయిలు ఆనందంతో కేరింతలు కొట్టారు. రేపు పగలంతా ఏం చెయ్యాలా అని ప్లాన్స్ వేసుకుంటూనే వున్నారు.

కీర్తన డల్ గా వుండటం చూసి అమ్మాయిలు ఆశ్చర్య పోయారు. ఏదైనా పెద్ద ట్రోఫీ గెలిచిన తర్వాత కీర్తన మొహం ఆత్మవిశ్వాసంతో వెలిగి పోతూ వుంటుంది. ఆమెని చూసి తమకే ముచ్చట వేస్తుంటుంది.

అలాంటిది ఇప్పుడిలా డీలాగా....?

‘‘కీర్తనా! వాట్ హేపెండ్?’’ ఒకమ్మాయి అడిగింది.

‘‘ప్చ్!’’ తల అడ్డంగా తిప్పుతూ అంది.

అమ్మాయిలంతా అనుమానంగా చూశారు. అంతా నిశ్శబ్దమయి పోయి తన వంక అలా చూస్తుంటే బిక్క మొహం వేసి చూసింది కీర్తన
ఆ నిశ్శబ్దం లోంచి ఓ అమ్మాయి శ్రావ్యంగా...

‘‘ఎటో వెళ్ళి పోయింది మనసు...యిలా ఒంటరయ్యింది వయసు... ఓ చల్ల గాలీ...! ఆచూకీ తీసి...’’ అంటూ పాడటం మొదలు పెట్టగానే అందరూ తాళం వెయ్య సాగారు.

‘‘ఏంటిది చిరాగ్గా!’’ అంది. ఆ మాట అంటున్న ఆమె వంక ఆశ్చర్య పోయి చూశారు. ఆ మాట అంత ముద్దుగా, అంత అందంగా, అంత బలంగా అనగలదని ఎవరూ అనుకోలేదు.

ఆమె చెంపలు కెంపులయ్యాయి.

కళ్ళు అరమోడ్పులవుతున్నాయి.

పెదాలు సంచరిస్తున్నాయి.

వాళ్ళందరికీ విషయం అర్ధమై పోయింది. ‘‘అమ్మో! ఆకాష్ సామాన్యుడు కాదు’’ సడెన్ గా అంది ఓ అమ్మాయి.

‘‘ఏం?’’ చురుగ్గా చూస్తూ అంది కీర్తన.

‘‘నిన్ను...‘ ఏంటది చిరాగ్గా’ అనే నిన్ను, ఇలా మార్చేశాడంటే సామాన్యుడా! మాకేదో డౌట్ గా వుంది. అసలు విషయం ఏంటో చెప్పు’’ ఒకమ్మాయి నిగ్గదీస్తూ అంది.

అమ్మాయిలందరూ కార్నర్ చెయ్యడం చూసి తట్టుకో లేక బయటకు వచ్చేసింది కీర్తన.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్