Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఫిదా చిత్రసమీక్ష

fidaa movie review

చిత్రం: ఫిదా 
తారాగణం: వరుణ్‌ తేజ, సాయి పల్లవి, రాజా, సాయిచంద్‌, శరణ్య ప్రదీప్‌, గీతా భాస్కర్‌, హర్షవర్ధన్‌ రాణే, నాథన్‌ స్మేల్స్‌ తదితరులు. 
సంగీతం: శక్తికాంత్‌ 
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి కుమార్‌ 
దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల 
నిర్మాత: దిల్‌ రాజు, శిరీష్‌ 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 21 జులై 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
వరుణ్‌ (వరుణ్‌ తేజ) అమెరికాలో ఉంటాడు. అన్నయ్య పెళ్ళి చూపుల కోసం వరుణ్‌, ఇండియాలోని తెలంగాణలోగల బాన్సువాడ ప్రాంతానికి వెళతాడు. అన్నయ్య పెళ్ళి నిశ్చర్యమవుతుంది. పెళ్ళికూతురి చెల్లెలు భానుమతి (సాయిపల్లవి)ని ఇష్టపడతాడు వరుణ్‌. భానుమతి - వరుణ్‌ మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే భానుమతికి సొంత ఊరు, సొంత మనుషులు, సొంత ఇల్లు అంటే ఎంతో ఇష్టం. వరుణ్‌ ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. దాంతో మనస్పర్ధలు తలెత్తుతాయి భానుమతి - వరుణ్‌ మధ్య. ఆ తర్వాత భానుమతి, ఊళ్ళోనే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించేసుకుంటుంది. ఇంకో వైపున వరుణ్‌ కూడా భానుమతికి దూరమవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. 
మొత్తంగా చెప్పాలంటే 
వరుణ్‌ మంచి నటుడు. తొలి సినిమాతోనే ఆ విషయం అందరికీ అర్థమయ్యింది. ఫీల్‌గుడ్‌ సినిమాలకి వరుణ్‌ బాగా సూటవుతాడు. ఈ సినిమాలో వరుణ్‌ తనకి సూటయ్యే పాత్ర దక్కడంతో అందులో ఒదిగిపోయాడు. మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్‌లో బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ని గుర్తుకు తెస్తాడు. 
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయిపల్లవి నటన గురించి. మలయాళ 'ప్రేమమ్‌' సినిమా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళ అమ్మాయే అయినా, తెలుగు అస్సలు రాకపోయినా, అద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటుంది ఈ చిత్రంలో సాయి పల్లవి. తెలుగులో ఆమె తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోవడమంటే చిన్న విషయం కాదు. డైలాగ్స్‌, డిక్షన్‌ అన్నీ బాగా కుదిరాయి. 
వరుణ్‌ తల్లిదండ్రులుగా రాజా, శరణ్య ప్రదీప్‌ ఆకట్టుకుంటారు. సాయిచంద్‌, గీతా భాస్కర్‌ బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా నటించారు. 
కథ, కథనం పరంగా దర్శకుడు సింపుల్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫార్మాట్‌నే ఎంచుకున్నా, ఫీల్‌గుడ్‌ అంశాలతో క్లీన్‌గా సినిమాని తెరకెక్కించిన వైనం ఆకట్టుకుంటుంది. మాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. అక్కడక్కడా కొంచెం అవసరమన్పిస్తుంది. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆహ్లాదంగా అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి. 
శేఖర్‌ కమ్ముల సినిమా అనగానే ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ అనే భావన బలంగా నాటుకుపోయింది తెలుగు ప్రేక్షకుల్లో. ఏ సినిమా చేసినా శేఖర్‌ కమ్ముల సినిమాల్లో 'ఫీల్‌ గుడ్‌' అన్న భావన అయితే మిస్‌ అవదు. ఈ సినిమా కూడా అంతే. డైలాగ్స్‌ సింపుల్‌గానే ఉన్నా మనసుని టచ్‌ చేస్తాయి. లొకేషన్స్‌, ఎమోషన్స్‌, ఎటాచ్‌మెంట్స్‌ అన్నీ శేఖర్‌ కమ్ముల మార్క్‌ అన్నట్లే ఉన్నాయి. అందమైన పల్లెటూరు, అందమైన సన్నివేశాలు, అందమైన ప్రేమ జంట, అందమైన అనుబంధాలు ఇలా సాగిపోయే సినిమా ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటుంది? ఓవారల్‌గా సినిమా పూర్తయ్యేసరికి మంచి ఫీల్‌ మిగులుతుంది. అంటే శేఖర్‌కమ్ముల దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించినట్లే కదా! 
 
ఒక్క మాటలో చెప్పాలంటే 

ఎవరైనా 'ఫిదా' అవ్వాల్సిందే..!

 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
hot sensation samanta