Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> శరణమయ్యప్పా

saranamayyappa

ఆకాశమంతా చిక్కని చీకట్లుపరుచుకొని వుంది . వీధిలో అక్కడో దీపం యిక్కడో దీపం వెలుగుతూ చీకటితో పోరాడలేక నీడలను పొడుగ్గా చేసేయి . నిన్న సాయంత్రం పెట్టిన గొబ్బెమ్మల మీద బంతి పూలు యింకా తాజాగా వున్నాయి . ఆ మసక వెలుగులో ఓ ఆకారం   అడుగులు గోబ్బెమ్మలపైన పడకుండా జాగ్రత్తగా నడుస్తూ వస్తోంది .

" ఛట్ .. బస్సు తలుపు తియ్యరా , పంతులు సామికి నిద్దరట్టింది కాదు గవాల " అన్నాడు డ్రైవరు అప్పలరాజు .

" గురూ తాగుబోతోడేమోనేస్ " హెల్పరు సింహాచలం సందేహం .

" సాములు మామూలు జోళ్లు యేసుకోరుగదేటి , కర్రజోళ్లు యినాగే సబ్దం సేత్తాయిగాని యెల్లి నువ్వుకూడా సామి తో పాటు బస్సులో తొంగో " " యేటి పంతులు సాములూ నిద్దరరాలేదేటి ? , నిన్నొగ్గేసి యెలిపోతామని భయమేసినాదేటి ? యింత బేగిన పారొచ్చేసినావు " అంటూ రామారావు చేతిలో సామానందుకొని బస్సులోపలకి దారితీసేడు సింహాచలం .

" అదేమీ కాదోయ్ , శరణు ఘోష కి అందరూ లేచిపోతారని " అంటూ ముందుసీట్లో చారబడి కూర్చున్నాడు రామారావు .

బయట కన్నా బస్సులో చలిగావుంది . డిసెంబరు మూడో వారం గుండెలను వణికించే చలి , షాల్ ని పొడుగ్గా కాళ్లమీంచి కప్పుకొని సీట్లో చారబడ్డాడు .గత కొద్దిరోజులుగా రామారావు జీవితంలో జరిగిన మార్పులు అతనిని వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి . ఈ ప్రయాణం ఒక కలలా వుంది , మరో రెండు గంటలలో బస్సు బయలు దేరబోతున్నా అతనికి అపనమ్మకం  గానే వుంది . ఆ సందిగ్దాన్ని తట్టుకోలేకే నాలుగైనా కాకుండా వచ్చి బస్సు లో కూర్చున్నాడు .

యాభైఅయిదేళ్ల రామారావు  యిన్ని సంవత్సరాలుగా తనలో నిక్షిప్తంగా వుంచుకొన్న కోరికని నెలరోజులనుంచి  ఆచి తూచి జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తూ గమ్యానికి  చేరువగా తెచ్చేడు . ఆఖరి ఆ వొక్క అడుగూ సవ్యంగా పడి బస్సు బయలుదేరిపోతే చాలు .

పెళ్లి కానంతవరకు హానీమూన్ కి భార్యతో కలిసి వెళ్లాలని కలలు గన్న ప్రదేశాలు , పెళ్లైన తరువాత పై జన్మలో మంచి భార్య దొరికితే వెళ్లొచ్చులే అనే నిస్పృహ తో మనసు పొరలలో యెక్కడో సమాధి చేసేసిన కోరిక , ఇప్పుడు అనుకోకుండా యిలా నిజం కాబోతోందనే వూహే రామారావు కి వెన్నుమీద కితకితలు పెడుతోంది .

పెళ్లైన కొత్తలో బామ్మతో ' ఆనందం అప్పుడప్పుడు చెయ్యచేసుకుంటోందే ' అని సిగ్గు విడిచి చెప్పుకుంటే ,  " భడవకానా , ఏకాంతంలోపెళ్లాలు అలాగే వుంటార్రా , వెర్రినాగమ్మా , నేనైతే మీ తాతయ్యని కొరికి పడేసేదాన్ని కాదూ ? " అంటూ యెత్తుగావున్న ముందు పళ్లని నాలుకతో తడుముకుంటూ మురిపెంగా మూతి తిప్పింది .

ఇద్దరు పిల్లల తండ్రయేక నీకోజోహారురా నాయనా " యీ గయ్యాళి గంగమ్మ , యీ బూతుల బుచ్చితో యెలా వేగుతున్నావురా " అని ఆశ్చర్యపోయింది .

" అలా అయోమయంలా గుడ్లుమిటకరిస్తా వేంటిరా , వీళ్లు వాళ్ళు అని తేడా లేకుండా అమ్మా బూతులు తిట్టే వాళ్లని బూతులబుచ్చి అని అంటారులే " అనే వివరణ కూడా యిచ్చింది  .

"  నువ్వేకదే దీన్ని నా పీకకి చుట్టేవు , విడిపించుకొనే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోవే " అన్నాడు .

" పిల్ల సున్నితమైనా మాటకటువు , మనిషి కాస్త పొట్టయినా జడ పొడవు , కళ్లు చిన్నవయినా పళ్ళు పెద్దవి అని మధ్యవర్తి వర్ణిస్తే యేదో హాస్యం లే పిల్ల చూడ్డానికి చుక్కలా వుంది , పలువరస పెద్దదయినా పెదవుల లోపలే వుంటున్నాయి కదా అనుకున్నాను కానీ మరీ యింతలా అనుకోలేదురా ? అయినా మనచేతుల్లో యేం లేదురా ? అక్కడ ...... అక్కడ ముడి పెడతాడు వాడు " అని ఆకాశం వైపు చూపెట్టింది .

" మరి నా బతుకింతేనేమిటే ? "

" అన్నీ అందరికీ యివ్వడురా , మంచి తెలివి తేటలిచ్చేడా ? , మంచి బాంకిలో వుద్యోగం యిచ్చేడా ? అన్ని మంచులూ నీకే యిచ్చెస్తే మిగతా వాళ్లకో "

" ఎవడే యిచ్చేదీ , కష్టపడి పరీక్షలురాసి పాసయి సంపాదించుకున్న వుద్యోగమే "

" అయ్యో చెవలాయ్ పై వాడురా , శివునాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదుట , అంతా పైవాడి దయ  "

" మరి దీంతో యెలా వేగనే , నాకు విముక్తి లేదుటే "

బుద్ది.... బుద్ది ....." తను చెంపలు వాయించుకొని , " లెంప లేసుకో యేదో యీజన్మకి యిలా కానీ , పై జన్మలో నైనా మంచి భార్య రావాలని యేదైనా నోము ........." అంటున్నదల్లా మధ్యలోనే ఆగిపోయింది .

నిజమే మగవాళ్లు మంచి భార్యలకోసం యేనోములూ వ్రతాలూ చేసిన దాఖలాలు లేవు . ఈ జన్మకి సరే యెలాగో సర్దుకు గడిపేస్తే మళ్లా జన్మలో నైనా అణకువగా వుండే యిల్లాలు దొరుకుతుందనే గ్యారంటీ యేది ?

అదే విషయం బామ్మని అడిగితే " సన్నాసీ నీలాంటి వాడే అలాంటి నోముని కనిపెట్టాలిరా " అని యెత్తు పళ్లలోంచి క్కె........క్కె.....క్కె అని నవ్వింది .

అప్పటి నుంచి రామారావు మగనోములూ వ్రతాల పుస్తకాలకోసం వెతుకులాట మొదలెట్టేడు . పతివ్రతలకథల పుస్తకాలున్న చోట పత్నీవ్రతుల పుస్తకాల కోసం వెతకేవాడు . పడకగది భాగోతం గది బయటికి వచ్చినంత సమయంకూడా పట్టలేదు వీధికి చేరడానికి . వీధికి చేరిన తరువాత యింట్లో కాకి వాలినా , వీధి లో కుక్క తుమ్మినా ఆనందం నోరు చెలరేగి పోయేది . వాటి మీద కాదు , రామారావు మీద . పాలవాడు నీళ్లపాలు తెచ్చేడనో , పనిమనిషి ఆలస్యంగా వచ్చిందనో రామారావు బుర్ర రామకీర్తన పాడించేది .

రామారావుకు భార్య ప్రవర్తన కన్న పాలవాడు ప్రతీనెలా లెక్క తీసుకుపోతూ ' బాబుగారి మొఖం చూసి మంచి పాలుపోత్తన్నానండి ' అని కిసుక్కున నవ్వడం , పనిమనిషి అంకాలు ' మీ యింటికే బేగిబేగిన లగెత్తుకొచ్చెత్తా గదండి , బాబుగోరిమీన కోపం చేత్తారని గుబులు గందా ' అనడంవొంటికి కారం రాసుకున్నట్లు వుండేది .

భార్య మీద కోపం , వీధిలో జరిగే అవమానం వుద్యోగంలో చూపించ సాగేడు .

ఖాతాదారుల మనస్సుని యిట్టే పట్టేసి యెక్కువ డిపాజిట్స్ పెట్టించడం , టాలీ కాని బేలన్స్ షీటుని నిముషాలలో టాలీ చెయ్యడం అంతెందుకు యే సీటు పని అప్ప చెప్పినా సమర్ధవంతంగా పూర్తి చేసి మంచి పేరు సంపాదించుకునే వాడు రామారావు .

ఉద్యోగంలో ఒక్కోమెట్టు పైకి చేరుతూ డెప్యూటీ జనరల్ మేనేజరు పదవికి చేరుకున్నాడు .

జీవితంలో ఒక్కో మెట్టూ దిగజారుతూ రెక్కలొచ్చిన పిల్లలు స్వంత గూటికి యెగిరిపోగానే కుక్క కన్నా హీనమయిపోయేడు .

వీధిలో యెక్కడయినా పచ్చని తోరణం కనబడిందా యింక అంతే రామారావు తలమీద బొప్పిలు పడ్డాయన్నమాటే తరవాత తిట్లవాన ' నీ వల్లే మనయిల్లు తోరణం కట్టని గడపయింది ' అని అర్ధం వచ్చే మాటలు కొన్ని అందులో వుంటాయి .

అంతెందుకు మొన్న కార్తీకమాసంలో యెదురింటి సౌమ్య పెళ్లికి పిలవడానికి వస్తే " ఆఖరుకి యిదిగో వీళ్లు కూడా పచ్చని పందిరి , మావిడాకు తోరణాలు కట్టేరు , నీ పిండాకూడు మనయింట మాత్రం ........."  యిది మొదలు మాత్రమే , అలా అలా సాగి సాగి తలపైన నాలుగు బొప్పిలు మిగల్చలేదూ ?

పిల్లలిద్దరూ తమ జీవిత భాగస్వాములని యెంచుకొని ఆ గడపదాటి వెళ్లడంలో తన పాత్ర వుందేమో అన్న విషయం ఆమె కెప్పుడూ తట్టలేదు , తట్టదేమో కూడా .

ఉద్యోగ బాధ్యతలలో మునిగి పోయి మగనోముల విషయం మరుగున పడ్డా యీ మధ్య మళ్లా బయటపడింది .

బ్రాంచి యినస్పెక్షన్ కి వెళ్లిన ప్రతీచోటా పుస్తకాల దుకాణానికి వెళ్లి మగనోములూ పుస్తకాలు వెతకడం చెయ్యసాగేడు . మగదేముళ్ల నోముల పుస్తకాలు పుష్కళంగా దొరికేయి . చిత్రగుప్తుడి నోము , నందికేషుడినోము లాంటివి . ఆఫీస్ రూములో రహస్యంగా చదివితే తెలిసిందేవిటీ అంటే దేముళ్లు మగవారైనా అవి ఆడవాళ్లు నోచుకునే నోములని . నవగ్రహ జపాలు లాంటి పుస్తకాలు వున్నా అవి ఈ జన్మలో గ్రహశాంతికి తప్ప  పై జన్మ ఖాతాలో కి పుణ్యం ట్రాన్సఫర్ చేసే శక్తి గ్రహాలకు లేదని కొంత పరిశోధన చేసేక తెలుసుకున్నాడు .

ఈ నోములూ వ్రతాలూ మొదలు పెట్టిన కాలంలో చెడ్డ భర్తలే కాని చెడ్డ భార్యలు వుండేవారు కాదా ?

ఆపద మొక్కులవాడు యినిస్టెంటుగా కోరికలు తీరుస్తాడు కాబట్టి తనకి పనికిరాడు , వినాయకుడు అతను అంతే కార్యసిధ్ది కలుగ జేస్తాడు అంటే యీ జన్మలోనే ,

యిలా చూసుకుంటూ పోతే మనషులే కాదు దేముళ్లుకూడా మహిళా పక్షపాతులే అని తనకు పనికిరారని డిసైడ్ అయేడు .

తనకు పై జన్మలో కూడా గయ్యాళి భార్య తప్పదనే నిశ్చయానికి వచ్చి నిరాశ లో కూరుకు పోతున్న తరుణంలో చిన్న ఆశాకిరణం బ్రాంచి మేనేజరు రవి రూపంలో వచ్చింది .

" సార్ యీ ఆదివారం మధ్యాహ్నం మాయింట్లో భోజనానికి రావాలిసార్ " అన్నాడు రవి ,ఇనస్పెక్షన్ ముగించుకొని హెడ్ ఆఫీసుకి బయలుదేరుతున్న రామారావు తో .

"ఏమిటయ్యా విశేషం , స్వతంత్రం కోల్పోయిన రోజా ? "

" మాల వేసుకున్నా సార్ , అలాంటి మాటలు వినకూడదు , మట్లాడకూడదు సార్ "

రవి నల్ల దుస్తులు ధరించి వుండడం అప్పుడు గమనించేడు రామారావు .

" అయ్యప్ప బ్రహ్మచారి కదయ్యా , మాల వేసుకుంటే మాత్రం సంసారుల కోరికలు తీరుస్తాడా ? యెందుకు తీరుస్తాడు ? " రామారావు సందేహ నివృత్తికి అడిగినా రవి కాస్త తడబడ్డాడు . పక్కింటి వాడు వేసుకున్నాడని , యెదురింటివాడు వేసుకున్నాడని తాను కూడా వేసుకున్నాడు గాని యెందుకు , యేమిటీ. అనే ప్రశ్నలకి రవి దగ్గర కూడా సమాధానంలేదు . కాని పైకి " మాల వేసుకున్న నాటినుంచి బ్రహ్మచర్యం అవలంభిస్తాము కదా , అలా దీక్ష సాగిస్తే స్వామి మెచ్చుకొని మనకి కావలసినవి యిస్తాడు " అని మెల్లగా నచ్చచెప్తున్నట్టుగా అన్నాడు

" ఈ దీక్ష పుణ్యం మళ్లా జన్మ వరకు వుంటుందా "

అలా రామారావు యెందుకు అడిగేడో తెలియక పోయినా , యెక్కడో తను చదివిన  ' అయ్యప్ప మహత్యం ' కథ లో మండల దీక్ష చేపట్టిన వారి యేడు జన్మల పాపాలు పోతాయి అనే వాక్యం గుర్తొచ్చి " ఔను సార్ యేడు జన్మల పాపాలు పోవడమే కాక యీ పుణ్యం వచ్చే యేడు జన్మలదాకా వుంటుంది " సొంత పైత్యం కాస్త జోడించి నమ్మకంగా చెప్పేడు .

రవి మాటలతో యీ జన్మ కి యింతే అనే నిరాశ లో కూరుకుపోతున్న రామారావు కి గడ్డిపరక దొరికినట్లయింది . కాని శిఖండిలాంటి ఆనందాన్ని వొప్పించడం యెలా ?

రవి సహాయంతో ఆదివారం రంగం సిధ్దంచేసేడు .

ముందుగా అనుకున్నట్టుగా ఆదివారం భార్యా సమేతంగా రవి యింటికి వచ్చేడు రామారావు .

ప్రతీ నిమిషం తన భార్య కాబట్టి చేసిందిగాని మరెవ్వరూ చెయ్యరని , చెయ్యలేరనీ అంటూ అందరిలోనూ భార్యను ఆకాశానికి యెత్తెయ్యసాగేడు రవి .ఈ ట్రేప్ తనకోసమే అని తెలియని ఆనందం అందులో పడింది .

ఇరు ముడి సమయంలో కొత్త స్వాములు మాలలు వేసుకోడం ఆనవాయితీ కావడంతో మాల వేసుకొనే వారు రమ్మని పిలుపు రాగానే రామారావుని ముందుకితోసింది ఆనందం .

రవి రామారావు దంపతులని లోనికి తీసుకువెళ్లి " అక్కయ్యా నీ వల్లకాదు , ఒకటా రెండా నలభై రోజులు , పొద్దున్న సాయంత్రం చన్నీటి స్నానం , మడి వంట , చాపమీద పడక యివన్నీ నీ వల్ల కావుగాని వద్దులే , బావగారి తో ఆ మధ్య మాల సంగతి చెపితే మీ అక్క చెయ్యగలిగినా నావల్ల కాదయ్యా అన్నారు " అన్నాడు .

ఆనందానికి కోపం వచ్చింది , గొరగొరా భర్తని లాక్కెళ్లి మాల వేయించింది .

నాటకం లో రెండో అంకం రామారావుది , అనుమానం రాకుండా యెక్కడా అతి కి పోకుండా జాగ్రత్తగా ఆడి యిదిగో యిలా రక్తి కట్టించేడు .

పై జన్మ కోరిక సంగతేమో కానీ యీ జన్మలో చూడలేననుకున్న కేరళ అందాలని తనవితీరా చూసి రావాలని కలలు కనసాగేడు .

కలలలో తేలుతున్న రామారావు కి చిన్న కునుకు పట్టడంతో అనుకున్న సమయానికి అందరూ రావడం గాని బస్సు బయలుదేరడం గాని తెలియలేదు .

బయలుదేరిన అరనిముషానికి షడన్ బ్రేకు వేసిన కుదుపుకు తుళ్లి పడిలేచిన రామారావు కళ్లకి ఒకచేత్తో సూటుకేసు , మరోచేత్తో చిన్న బేగుతో బస్సెక్కిన ఆనందం కనిపించింది .

అంతే రామారావు కళ్లు పత్తికాయల్లా విచ్చుకొని , తెరచుకున్న  నోరు తెరుచుకున్నట్లగా వుండిపోయింది .

బస్సులో వారి పరిస్ధితి అంతే .

విషయం తెలీని అప్పలరాజు మంచి శకునం  " ఆడస్వామి " యెదురొచ్చినాది అని లెంపలు వేసుకొని " స్వామియే " అని గట్టిగా అంటూ బస్సు ని ముందుకి వురికించేడు . రామారావు తప్ప అన్ని గొంతులూ " శరణమయ్యప్పా " అన్నాయి .

మరిన్ని కథలు
o marugu katha