Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadina prapancham

 గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి  ..... http://www.gotelugu.com/issue223/623/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).. ఓ నిమిషం అలాగే నిలబడింది. ఎక్కడికి వెళ్ళాలో తోచక కాసేపు ఆలోచించి సంకోచిస్తూనే పై ఫ్లోర్ కి వెళ్ళింది.

కాలింగ్ బెల్  ప్రెస్ చేసింది. అటు నుంచి రిప్లయ్ లేదు. అప్పుడు చూసింది డోర్ లాక్ చేసి వుండటాన్ని. ఉసూరుమనుకుంటూ కిందకు వచ్చింది.

ఎక్కడికి వెళ్ళి పోయాడు?

తను గెలిచినా కంగ్రాట్స్ చెప్పకుండా గ్రౌండ్ నుంచి వచ్చేశాడు.

తనే అతన్ని పకరించడానికి వచ్చినా రూం లోనూ లేడు. ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది. చిన్నపిల్లలా ఏడవాలనిపిస్తోంది.

తనేం తప్పు చేసిందని ఆకాష్ ఇలా తనకి కనిపించకుండా పోయాడు.

ఇప్పుడు రూంకి వెళితే తన ఫేస్ చూసి ఏదో జరిగిందనుకుంటారు. మనసు సంభాళించుకొని పెదాల మీద నవ్వుని బలవంతాన అతికించుకుని రూంకి వచ్చింది.

అప్పటి వరకూ గోల చేస్తున్న ఫ్రెండ్సందరూ కీర్తనని చూసి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ కామ్ అయి పోయారు.
ఏం  ఏడిపిస్తారో  ఏంటో! బెరుకుగా అనుకుంటూ తన బెడ్ వైపు నడిచింది.

అక్కడ ఒక అందమైన గిఫ్ట్ పాకెట్ కనిపించింది. పేరెట్ గ్రీన్ సిల్క్ కవర్ మీద అరవిరిసిన గులాబీలు ముద్రించబడ్డాయి.
పైన చిన్న కార్డు మీద టు, మిస్ కీర్తన....

ఫ్రమ్ ఆకాష్! అని ముత్యాల్లాంటి అక్షరాలు కనిపించాయి. ముందు కార్డ్ తీసి చూసింది. ‘కంగ్రాట్యులేషన్స్’ అన్న కాప్షన్ కనిపించింది
మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. ఈసారి ఆనందంతో....

ఫ్రెండ్స్ ఏదో ఆట పట్టించ బోయారు.

అసలే ఎమోషన్ లో ఉందేమో....‘‘ప్లీజ్!’’ చెయ్యెత్తి వారించింది. ఆమె కళ్ళలో నీరు, భావావేశంతో చెంపలు, పెదాలు వణకడం చూసి, విభ్రాంతికి లోనయ్యారు వాళ్ళు. మౌనంగా సైగలు చేసుకుంటూ ఇంకో రూంకి వెళ్ళి పోయారు.

గ్రీటింగ్ కార్డ్ లో గులాబీ రంగు కవర్ కనిపించింది.

ఆత్రుతగా విప్పి చదవడం ప్రారంభించింది.

డియర్ కీర్తనా!

నేనిలా లెటర్ రాస్తున్నందుకు ఆశ్చర్యంగా వుందా? లేకపోతే కోపమా? నేను నీకు విషెస్ చెప్ప లేదని బాధ పడ్డావా? ఐయాం సారీ! నిన్ను సర్ ప్రైజ్ చేయాలని కనిపించ లేదు. ఈరోజు నైట్ ఎయిటోక్లాక్ కి ఈ హోటల్ లోనే చిన్న పార్టీ ఎరేంజ్ చేశాను. మీ టీం కోసం, ముఖ్యంగా నీ కోసం. నన్ను డిసప్పాయింట్ చేయకుండా వస్తావు కదూ! కవర్ లో శారీ వుంది. అది నువ్వు కట్టుకోవాలి. నా కోసం ప్లీజ్!

మీ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇన్వయిట్ చేసానని చెప్పు. ఎదురు చూస్తూ వుంటాను. బై! .....నీ ఆకాష్. చదవగానే గుండె దడ దడా కొట్టుకుంది. ఏ.సి లోనూ చిరు చెమటలు కమ్మాయి.

వణుకుతున్న చేతులతో ఓపెన్ చేసి చూసింది. మొన్న షాపింగ్ లో అతను కొన్న చీర. తన కోసమే కొన్నట్లు ఊహించ లేక పోయింది.
కాపర్ సల్ఫేట్ కలర్ మీద చిన్న చిన్న జరీ పువ్వులు, లతలు అందంగా కుట్టబడి వున్నాయి. మ్యాచింగ్ బ్లౌజ్, పెటీకోట్. ఎందుకు తన కోసం ఇంత ఖర్చు పెట్టాడతను. గాభరాగా అనిపించింది.

టైమ్ చూసుకుంది. ఆరయింది. ఇంకా రెండు గంటలే టైమ్ ఉంది. అసలు ఈ చీర కట్టుకోవడం, హెయిర్ స్టయిల్, ఈ నగలు పెట్టుకోవటం తనకి తెలీవు. ఇప్పుడెలా? కట్టుకోక పోతే ఆకాష్ డిజప్పాయింట్ అవుతాడు.

ఒకవేళ కట్టుకున్నా డిసప్పాయింట్ అవుతాడు. తను కట్టుకున్న తీరు చూసి.

ఎలా? ఏం చేయాలి?

గబుక్కున ఫ్రెండ్స్ గుర్తొచ్చారు.

పరుగు లాంటి నడకతో పక్క రూం కి వెళ్ళింది. కీర్తనని, ఆమె చేతిలోని వస్తువుల్నీ ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు.

మెల్లగా అతను పార్టీ ఎరేంజ్ చేసిన విషయం చెప్పింది. వారి మొహాలూ వెలిగి పోయాయి.

‘‘కవర్ లో ఐ వ్ యూ రాసాడా....?’’ ఒకమ్మాయి ఆత్రుతగా అడిగింది.

‘‘ప్చ్!’’ పెదవి విరిచింది కీర్తన.

‘‘అయితే స్వయంగా చెప్పేస్తాడులే....’’ గ్యారంటీ ఇచ్చింది. ఆ అమ్మాయి. అయినా కీర్తన మొహం డల్ గా వుండటం చూసి....

‘‘ఏమయింది?’’ అనుమానంగా అడిగింది ఓ అమ్మాయి.

చీర, ఆర్నమెంట్స్ చూపించి...‘‘నాకు రాదు....’’ బిక్క మొహం వేసి అంది.

అందరూ గొల్లున నవ్వారు. ఇంకో అమ్మాయి అందరినీ గదిమి డోంట్ వర్రీ.... మేమున్నాం! నిన్ను చూసి ఆకాష్ మతి పోగొట్టుకునేలా చేయక పోతే ఇంకోసారి వాలీబాల్ ఆడను’’ భీషణ ప్రతిజ్ఞ చేసింది ఆ అమ్మాయి.

అంత ఒట్టు వేసినందుకు ఇంకోసారయితే కోపం వచ్చేదేమో...! ఈసారి మాత్రం నవ్వేసింది.

ముందుగా కీర్తన మొహానికి ఫేస్ ప్యాక్ వేసి తల కండిషనింగ్ కోసం రక రకాల పేస్ట్ లతో తలని మసాజ్ చేసి...కాళ్ళకి, చేతులకీ పెడిక్యూర్, మానిక్యూర్ చేశారు వెంట వెంటనే.

ఆమె తల స్నానం చేసి రాగానే, చెయిర్ లో తల వెనక్కి వాల్చి ఒత్తుగా, లావుగా, నడుం వరకూ వున్న జుట్టు పొడిగా అయ్యే వరకూ తుడిచి డ్రయ్యర్ తో ఒక వెంట్రుకకి ఇంకో వెంట్రుక అంటుకోనంత పొడిగా అయ్యేలా ఆర బెట్టారు.

నున్నగా, గట్టిగా వున్న చెంపలకి, మొహానికి క్రీమ్ పట్టించారు. స్వతఃసిద్ధంగానే షేప్ తో వున్న ఐబ్రోస్ కి అలంకరణ చేయాల్సిన అవసరం లేక పోయింది.రోజ్ పౌడర్ రాస్తుంటే ఆమె వద్దని వారించడంతో మామూలు పౌడర్ రాసారు.

విశాలంగా, నల్లగా వున్న ఆమె కళ్ళకి కాటుక మరింత అందాన్ని యిచ్చింది. పెదాలకి లిప్ స్టిక్ వెయ్యనివ్వ లేదు.  ఆకాష్ కి ఒరిజినాలిటీ ఇష్టమేమో! ఒకమ్మాయి కామెంట్ చేస్తే చిరు కోపంగా చూసింది కీర్తన.

బీచ్ దగ్గర సంఘటన గుర్తొచ్చి ఒళ్ళు జల్లుమంది.

‘ఏంటో ఇలా కొత్తగా ఈ సందడి’ గంభీరంగా అనుకుంది.

బ్లౌజ్ అతికినట్లు కరెక్ట్ గా సరి పోయింది.

‘‘సైజ్ చెప్పావా?’’ కొంటెగా అంది ఒకమ్మాయి. బుగ్గలు కంది పోయాయి కీర్తనకి.

‘‘ఛ....! నేను చెప్ప లేదు’’ కంగారుగా అంది కీర్తన ‘‘అయితే బాగానే గెస్ చేశాడు’’ నవ్వుతూ అన్నారు.

‘‘అలా మాట్లాడొద్దు’’ కోపంగా అంది కీర్తన. కానీ ఆ కోపంలో బలం లేదు.

పొడవు, పొడవుకి తగిన లావు, గులాబీ రంగు మేని ఛాయగ కీర్తనకి ఆ శారీ బాగా సూటయింది. బాంగిల్స్, నెక్లెస్, హేంగింగ్స్ సెట్ చూసి ఆశ్చర్య పోయారు వాళ్ళు.

‘‘కాస్ట్ లీ సెట్......వన్ లాక్ ఎబౌ వుంటుంది. యు ఆర్ లక్కీ కీర్తనా! అతనికి నిన్ను మారేజ్ చేసుకునే ఉద్దేశం వున్నట్లుంది’’ అని అంటుంటే అయోమయంగా చూసింది కీర్తన.

మొదటి సారిగా తన జీవితం తన చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి వెళుతున్నట్లుగా ఫీలయింది.

జుట్టంతా ఫ్రీగా వదిలేసి సైడ్ క్లిప్స్ పెట్టారు. అప్పటికప్పుడు ఒకమ్మాయి తన కాళ్ళకున్న కొత్త శాండిల్స్ త్యాగం చేసింది.

తయారు చేసి అద్దం ముందు నిల్చోబెట్టారు. తనకి తానే వింతగా వుందనుకుంది కీర్తన.

ఏంటో కొత్తగా, వింతగా, సినిమాల్లో, టి.వి.ల్లో వాళ్ళ లాగా నడుస్తూ పడ బోయింది.

‘‘మేం రెడీ అయ్యే లోపు నువ్వు నడవడం ప్రాక్టీస్ చెయ్యి....’’

స్నానం చేయడానికి హడావిడిగా వెళుతూ అన్నారు అమ్మాయిలు.

అందరూ తయారయ్యే సరికి ఎనిమిదయింది. వీళ్ళు లేట్ చేస్తున్న కొద్దీ టెన్షన్ గా వుంది.

‘‘లేటయితే నేను రాననుకుంటాడేమో!’’ ఆందోళనగా అంది కీర్తన

‘‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కొత్తగా ప్రేమలో పడితే యిలాగే వుంటుందిలే!’’ ఒకమ్మాయి వేళాకోళంగా అంది.

‘‘ప్రేమా లేదు, పాడూ లేదు. త్వరగా రడీ అవ్వండి’’ అంటూ గాభరా పెట్టింది కీర్తన.

పార్టీ కోసమని అందరూ శ్రద్ధగానే తయారయ్యారు. ఎనిమిదింపావుకి కిందికి వెళ్ళి లాంజ్ లో వెన్యూ కనుక్కున్నారు. అక్కడికి వెళ్ళే సరికి ఆ లాన్ లో, అందునా పూల తో ఏర్పాటు చేసిన ద్వారం కనిపించింది. దాని మీద పూలతోనే ‘కంగ్రాచ్యులేషన్స్’ అని కనిపించింది.

చూడగానే అమ్మాయిలందరూ ఆనందంతో నవ్వుకున్నారు. ఆ పార్టీలో దాదాపు వంద మంది వరకూ  కనిపించారు. రన్నర్స్  రైల్వేస్ టీమ్. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు, ఇంకా ఆకాష్ ఫ్రెండ్స్ వున్నారు.

లోనికి అడుగు పెట్టడం తోనే ఫుల్ సూట్ లో వున్న ఆకాష్ చిరు నవ్వుతో ఎదురు వచ్చి స్వాగతం పలికాడు. అతని కళ్ళు రెప్ప పాటులో తన మీద వాలి ఆసాంతం తనని పరీక్షించాయి. అతని కళ్ళ లోని ప్రశంస చూసి కీర్తన తల సిగ్గుతో వాలి పోయింది.

తర్వాత డయాస్ మీదకి పన్నెండు మందినీ పిలిచి ఎప్పుడొచ్చాడో గాని కోచ్ ని పిలిచి అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు.

ఇలాంటి పార్టీలూ, ఈ పరిచయాలూ ఇవన్నీ అలవాటు లేక పోవడంతో కీర్తన ముడుచుకు పోతోంది.

ఆకాష్ తన పక్కనే నిలబడ్డాడు. ‘‘మీ హెయిర్ బావుంది....’’ ఆకాష్ కామెంట్ చెయ్యడంతో ఏవో మధురోహలు చుట్టు ముట్టేశాయి.
కాసేపటికి డిన్నర్ స్టార్టయింది. అతను అన్నీ ప్రత్యేకంగా కనుక్కుంటుంటే ఉద్వేగానికి లోనయింది మనసు. పార్టీ మధ్యలో అతని ఫ్రెండ్ ఒకతను....‘‘ఆకాష్! ఏంటి ఈ హంగామా...? ఎవరి కోసం....?’’ ఓరగా తనని చూస్తూ అంటుంటే ఏదోలా అనిపించింది కీర్తనకి.
ఆకాష్ ఏమీ చెప్పలేదు. నవ్వేశాడు. పార్టీ పదింటికి క్లోజయి పోయింది. అతను అందరికీ వీడ్కోలిస్తూ వుండి పోయాడు.

దాదాపు అందరూ వెళ్ళి పోయాక, ఆకాష్ వీళ్ళు కూర్చున్న వైపు వచ్చాడు.

‘‘ఈరోజు కీర్తనని నాతో పంపిస్తారా....?’’ అడిగాడు.

‘‘నేనా....? ఎక్కడికి....’’ గాభరాగా అంది కీర్తన.

‘‘ఎక్కడికా....? స్టేడియంకి.....’’ చిరు కోపంగా అన్నాడు.

అమ్మాయిలంతా నవ్వారు. అందులో ఒకమ్మాయి....

‘‘అలా అలా కారులో ఫియాన్సీ పక్కన షికారు చెయ్యాలి. యామై రైట్...?’’ తమాషాగా అంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu .. aame..oka rahasyam