Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
WRITER || Telugu Independent Film 2017 || By Siva Krishna

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

ఈ మధ్యన రిలయన్సులూ, డీమార్టులూ, నేచర్ బాస్కెట్లూ వచ్చిన తరువాత, చాలా మంది కూరలకోసం వాటిల్లోకే వెళ్తున్నారు. అన్నీ నీట్ గా పెట్టి, వాడేం చెప్తే ఆ ధరకే కొనుక్కోవడం. దానితో బయట అమ్మేవాళ్ళదగ్గర కూరలు తీసికోవడం బాగా తగ్గింది. మా చిన్నతనంలో, శనివారాల్లో ఒకచోటా, ఆదివారాల్లో ఇంకో చోటా సంతలుండేవి. చుట్టుపక్కల పొలాల్లోంచీ, తోటల్లోంచీ కూరలూ, పళ్ళూ వగైరాలు తెచ్చి అమ్మేవారు.ఆ సంతకెళ్ళడం ఓ అద్భుతమైన జ్ఞాపకం. అక్కడ కూరలూ పళ్ళే కాకుండా మిగిలిన సరుకులు కూడా దొరికేవి.ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది,తూకాలూ అవీ అంత సరీగ్గాఉండేవి కావేమో అని.

ఇప్పటికీ చూస్తూంటాము, రోడ్డు పక్కన బండిలో అమ్మేవాళ్ళు, చవగ్గా ఎందుకిస్తారూ? కాటాలో ఏదో గోల్ మాల్ ఉందన్నమాట.వీధిలోకి అమ్మడానికి వచ్చే కరివేపాకు, ఓ గిద్దెడు బియ్యం ఇస్తే ఇచ్చేవాడు. ఇప్పటి ధరలనుబట్టి, బియ్యం ఇచ్చుకోడం కంటే, హాయిగా డబ్బులిచ్చే కొనుక్కోడం హాయి. మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు ( క్రిందటేడాది), ప్రతీరోజూ ఒకతను సైకిలుకి బుట్ట తగిలించుకుని కూరలు తెచ్చేవాడు. ఏదో దూరం వెళ్ళఖ్ఖర్లేకుండా, ఇంటి దగ్గరే దొరుకుతున్నాయికదా అని, అతనిదగ్గరే కొనడం మొదలెట్టాను.బేరం ఆడేవాళ్ళకి తక్కువచేసిచ్చేవాడు. ఓ నాలుగురోజులు చూసి, మానేశాను.రాజమండ్రీ మెయిన్ రోడ్డులో ఒక బండివాడుండేవాడు. అతనిదగ్గర కొద్దిగా ధర ఎక్కువైనా, కూరలు ఫ్రెష్ గా ఉంటాయి కదా అని, అక్కడే తీసికునేవాడిని. మా కజిన్ తో ఒకసారి వెళ్ళినప్పుడు, తీసికోరా అంటే, ' వద్దూ, వీడిదగ్గర ఖరీదెక్కువా 'అని తీసికునేవాడు కాదు.I think one has to pay the price for the quality..

కొంతమందంటారు ఫలానా పెద్ద మార్కెట్ లో చాలా చవకండీ, అన్నీ హోల్ సేల్ ధరలకే ఇస్తారూ అని.ఏదో పనిమీద ఆవైపుకి వెళ్తే కొనుక్కోవాలికానీ, చవగ్గా ఇస్తారు కదా అని అంతదూరం వెళ్ళడంలో అర్ధం లేదు.రానూ పోనూ అయే ఖర్చు కూడా చేరిస్తే, దగ్గరలో ఉన్న బండి వాళ్ళ దగ్గర కొనుక్కోవడమే హాయి! వచ్చిన గొడవల్లా, తూకాలదగ్గరే. ఆతూకంరాళ్ళు ఏ గుప్తులకాలానివో ఉంటాయి. ఒక్కొక్కప్పుడు, ఏవో నట్లూ, బోల్టులూ వేసి, తూస్తూంటారు. మాల్స్ లోకి వెళ్తే ఈ తూకం మాత్రం డిపెండబుల్ గా ఉంటుంది.

మా ఫ్రెండోడుండేవాడు, మార్కెట్ మూసే సమయానికి వెళ్ళేవాడు, కొట్టు మూసేస్తూ, రోజులో అమ్మగా మిగిలిన కూరలన్నీ, హోల్ సేల్ గా తోచిన ధరకిచ్చేస్తారని!ఆ కొట్లవాళకేమైనా కూలింగ్ ఛాంబర్సూ అవీ ఉంటాయా ఏమైనా? ఇంక ఆకు కూరల విషయానికొస్తే,ఆ కట్టల్లో ఏవేవో కలిపేసి కట్టి అమ్ముతారు. కొంపకొచ్చి చూస్తే, అందులో సగం అవతల పడేసేవే! ఈ మాల్స్ లో కొనడం అదీ మంచి stylish గానే ఉంటుంది.కానీ అక్కడ బిల్లింగు చేసేటప్పటికి ప్రాణం మీదకొస్తుంది. అదే బయట అమ్మే కొట్లవాళ్ళదగ్గర అయితే यूं गया यूं आया ! చారులోకి ఏ కొత్తిమిరో కావాలంటే, ఈ చిన్న దుకాణాలే హాయి! పైగా ఈ మాల్స్ లోకి వెళ్ళామంటే, తీసికోవాల్సిన కూరలతో పాటు, ఇంకా అవసరం ఉన్నవీ, లేనివీ తీసికోవాలనిపిస్తుంది.అదేదో పిల్లలకిష్టం, ఇంకోటేదో ఇంటావిడకిష్టం అనుకుంటూ! పైగా అక్కడుండేవన్నీ తళతళా మెరుస్తూంటాయి లైట్లలో!కూరలకోసం వెళ్ళడమూ, ఓ యాపిల్ బావుందని, ఇంకో పైనాపిల్ బాగుందనీ,లేకపోతే ఇంకో ఫలానాది బావుందనీ అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం.పోనీ తెచ్చాము కదా అని ఇంట్లో వాళ్ళేమైనా తింటారా అంటే,వాటిని ఓ బుట్టలో పెట్టి పూజచేయడమే.చివరకి ఆ పళ్ళకి ముసమలొచ్చేసి, మిగలముగ్గిపోతాయి. పైగా కొంతమందికి పదునులూ, అంతలా ముగ్గితే టేస్టుండదూ అని! కూరలనండి, పళ్ళనండి, మార్కెట్ నుంచి తెచ్చినవి పూర్తిగా ఏ ఇంట్లోనూ సొమ్ము చేయరు. ఏదో అది కొనేద్దామూ, ఇదికొనేద్దామూ అని యావే కానీ ఇంకెమీ కాదు.

అన్నిటిలోకీ తక్కువ shelf life ఉన్నది అరటి పండు.బావున్నాయికదా అని ఓ అరడజను తెచ్చామనుకోండి, రెండో రోజుకల్లా రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. ఎవరైనా వచ్చినా చేతిలో కూడా పెట్టలేము.అన్నిటిలోకీ, దేవాలయాల దగ్గర అమ్మే అరటిపళ్ళు చూస్తే నవ్వొస్తుంది- ఓ రుచీ పచీ ఉండవు, అందుకే కాబోలు దేముడరిటిపళ్ళంటారు! అలాగే గుళ్ళల్లో ఇచ్చే పళ్ళన్నీ ప్రత్యేకం దేముడికోసమే పండించారా అనేట్లుంటాయి.కొంతమంది శ్రావణమాసం వాయినాల్లో ఇస్తూంటారు- ఓ పండూ, శనగలూ, ఓ వక్కపొడి పొట్లం.అన్నిటిలోకీ funny character ఆ వక్కపొడి పొట్లం, దానికి ఓ ఉల్లిపొరకాయితం తోపాటు ఓ వక్క పలుకోటుంటుంది. ఎందుకూ ఉపయోగించదు. ఈ వాయినాల్లో ఇచ్చే, దేముడుగుళ్ళల్లో ఇచ్చే పళ్ళూ, ఈ వక్కపొడి పొట్లాలూనూ. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదంటే లేదూ!! పైగా శ్రావణమాసంకూడా వచ్చేసింది. పేరంటాల హడావిడి. వాయినాల్లో వచ్చిన శనగలతోనే ఇంట్లో ఏం చేసినా, ఈ నెలంతా….

సర్వేజనా సుఖినోభవంతూ…..

మరిన్ని శీర్షికలు
uttarakhand tourism