Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( కేదార్నాధ్ ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

యధా ప్రకారం పొద్దన్నే బయలు దేరేం . పొద్దున అంటే 7 , 7-30 కి , అయినా టీ లేకుండా ఒకటో రెండో గంటలు ప్రయాణంచ వలసి వచ్చేది .   అసలే చలి గా వుంటుంది , దానికి తోడు వాన ఒకటి . మా ప్రయాణం కేదార్ నాధ్ వైపు మొదలయింది . వేడినీరు పడక పోయే సరికి కాస్త చిరాకు పరాకు తప్పవుగా ? యీ సారి ప్రయాణానికి టీ , కాఫీ సరంజామా తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాం . ముందు రోజు గంగోత్రి వెళ్లినపుడు యెదురైన పరిస్తితులను తలచు కుంటూ ప్రయాణం సాగించేము .

ఆ రోజు మేము సుమారు 340 కిలో మీటర్లు ప్రయాణించాలి , అంటే ఉత్తరాంచల్  కొండలలో పెద్ద ప్రయాణం కిందే లెక్క . చీకటి పడేలోపు ' గౌరికుండ్ ' చేరుకోవాలనేది మా అంచనా . కొండలలో మన అంచనాలు యెప్పుడూ తప్పుతాయి అనే విషయం అనుభవం మీద తెలుసుకున్నాం .

మేం టాక్సీ యెక్కగానే డైవరు కి చెప్పే మాట మరొకటుందండోయ్ , అదేంటంటే అతనికి టీ యెక్కడ తాగాలనుంటే అక్కడ ఆపమని , యెక్కడ భోంచెయ్యలనుంటే అక్కడ చెయ్యమని , నిద్ర వస్తున్నట్లంటే ఓ అరగంట యే చెట్టుకిందనైనా రెస్టు తీసుకోమని చెప్తాం .

మంచి స్వామి భక్తుడిగా మా డ్రైవరు మంచి టీ దుకాణాలలోనే ఆపేవాడు . తొమ్మిది దాటాకే మాకు టీ ప్రాప్తమయేది . బ్రెడ్డు బటరే మా బ్రేక్ ఫాస్ట్ .

ఉత్తర కాశినుంచి కేదార్ నాధ్ వెళ్లేదారి టిహ్రి మీదుగా వెళ్తుంది , ఉత్తర కాశి నుంచి సుమారు 90 కిలో మీటర్లు ప్రయాణం తరువాత టెహ్రిచేరుకుంటాం . టెహ్రి డేమ్ నిర్మాణానికి ముందు గంగోత్రి వెళ్లేం , నిర్మాణం జరుగుతూ వుండగా కూడా వెళ్లేం , మొదటి విడత నిర్మాణం 2006 లో పూర్తయింది , రెండవ విడత 2018 లో పూర్తవుతుంది .

ఆనకట్ట నిర్మాణానికి ముందు యీ ప్రదేశం అంతా పచ్చని చెట్లతో కూడుకొని వున్న పర్వతాలతో వుండేది , యిప్పుడు ఆనకట్ట బేక్ వాటర్స్ , వాహనాలరాకపోకలకై వెడల్పుగా నిర్మించిన రోడ్లు , కొండలపై కాలనీలు కొన్ని కొండలు కాంక్రీటు జంగల్ గా మారడం మనసుకి కాస్త కష్టాన్ని కలిగించింది . చాలా మటికి యాత్రీకుల కు సౌకర్యాలు పెరిగాయని చెప్పుకోవచ్చు . పూర్వం టీ దుకాణం కూడా కనిపించని యీ ప్రదేశాలలో భోజన వసతి సదుపాయాలు లభించడం ఆనకట్ట మహిమ అని చెప్పక తప్పదు . 

ఈ టెహ్రి ఆనకట్ట భారతదేశం లో నిర్మింపబడ్డ అతి యెత్తైన ఆనకట్ట , కొంత బాగం కొండల మీద కొంత మైదానం లోనూ దీని నిర్మాణం జరిగింది 

టెహ్రి తరువాత కొండ మలుపులలో యేవో చిన్న గ్రామాలు తప్ప పెద్దగా గ్రామాలు లేవనే చెప్పుకోవాలి .

మధ్యాహ్నం చెట్ల కింద మా భోజనం చేసుకున్నాం .

అగస్త్యముని , గుప్తకాశి , సోన్ ప్రయాగ ల మీదుగా రాత్రి యెనిమిదింటికి ' గౌరికుండ్ ' చేరుకున్నాం .

గౌరికుండ్ లో ఘరెవాల్ వికాశ్ మండలి వారి గెస్ట్ హౌసులో బస చేసుకున్నాం .

గంగోత్రి నుంచి వచ్చేటప్పుడు ఉత్తర కాశి దాటాక చలి కాస్త తగ్గుతుంది . టెహ్రి వచ్చేటప్పటికి వేడి యెక్కువవుతుంది . తిరిగి అగస్త్యముని వచ్చేటప్పటికి చలి మొదలయి , గుప్తకాశి చేరేసరికి బాగా చలి పెరుగుతుంది . అగస్త్యముని , గుప్తకాశీలు కేదార్ నాధ్ నుంచి వచ్చేటప్పుడు దర్శించు కుందాం అని నిర్ణయించు కున్నాం .

గెస్ట్ హౌసులో వేడివేడి రొట్టె కూర తిని పడకలు చేరేం , ఆ రాత్రే తలుపులు కొట్టి గౌరికుండ్ లో పూజలు చేయించే పూజారులు బేరాలు కుదుర్చుకొని వెళ్లేరు .

పొద్దున్నే అయిదుకల్లా వచ్చి వేడి వేడి టీ తీసుకు వచ్చి లేపి మరీ గౌరికుండ్ కి తీసుకు వెళ్లేరు . ఇక్కడ ఆడ మగ అంతా అక్కడే స్నానాలు , బట్టలు మార్చుకోడానికి మేం దుప్పటి తీసుకు వెళ్లి డేరాలా పట్టుకొని బట్టలు మార్చుకున్నాం . తడి బట్టలతోనే పూజలు చేయించేరు .

తడి బట్టలు రూము లో పడేసి కేదార్ కి బయలుదేరేం .

గౌరీ కుండ్ నుంచి సుమారు 14 కిలోమీటర్లు నడక దారిన కేదార్ నాధ్ మందిరం చేరుకుంటాం .

ఈ దారంతా బురదతో వుంటుంది , ఈ కొండల మీద ప్రతీ పది నిముషాలకు వాన పడుతూ వుంటుంది , యూజ్ అండ్ త్రొ వాన కోటు ఓ పదిరూపాయలు పెట్టి కొనుక్కొని బయలుదేరేం . మేం రాను పోనూ గుర్రాలు మాట్లాడుకున్నాం . గుర్రాలు యెక్కేముందరే మా బట్టల మీద వాన కోట్లు వేసుకొని కూర్చున్నాం , గుర్రాలవాళ్లు చెప్పే సలహాలను పాఠిస్తూ  యెత్తు యెక్కేటప్పుడు ముందుకు వంగి , దిగేటప్పుడు వెనుకకు వంగి ప్రయాణం చేసేం . 1997 లో మొదటి మారు కేదార్ వెళ్లినప్పుడు నడిచే యెక్కేం సుమండీ . తర్వాత అంత సాహసం చెయ్యలేదు .

గౌరికుండ్ లో మొదలయే మన నడక ప్రయాణం లో ముందు సుమారు సగం దూరం ప్రయాణించిన తరువాత ' రాంబారా ' చేరుతాం , అక్కడే అరగంట ప్రతీ గుర్రం వాడు ఆగుతారు . గుర్రానికి రెస్ట్ అన్నమాట , గుర్రాలకు బెల్లం , శనగలు తినడానికి పెట్టి , నీళ్లు తాగించి తిరిగి ప్రయాణం మౌతారు . ఇక్కడ మనం కూడా యేదైనా వేడివేడిగా తిన దలుచుకుంటే దొరుకుతుంది . ఆ చలిలో నమిలి తినే ఓపిక వుండదు . ఏదో వేడి టీ తాగి బ్రెడ్డో , బస్కెట్సో తప్ప మరేమీ తిన బుద్ది కాదు .

రాంబారా తర్వాత ఒకటో రెండో టీ దుకాణాలు తప్ప మరేమీ వుండవు . గుర్రాలు కాక డోలీలు , పిట్టూలూ కూడా వుంటాయి . సాధారణంగా పిట్టూలు చిన్న పిల్లలని , సామానులను మొయ్యడానికి వుపయోగిస్తారు .

రాంబారా నుంచి సుమారు మూడు కిలోమీటర్ల తరువాత జంగిల్ చట్టి తరువాత కేదార్నాధ్ .

మొత్తం ప్రయాణం మందాకినీ నది వొడ్డునుంచి సాగుతుంది , పిల్ల సెలయేళ్లు దాటుకుంటూ కొండ గుహల పక్క నుంచి , గుర్రాలు తోసేసిన సహ యాత్రీకుల చూసి భయపడాలో , వెకిలి నవ్వులు నవ్వుతున్న వాళ్లని కాల్చి పారేయాలో తెలీని స్థితిలో ప్రయాణం , యెందుకొచ్చిన గోల అని లలిత సహస్ర నామం , విష్ణు సహస్రనామం చదువుకుంటూ వుంటే పెద్ద అనుమానం , శివ మందిరానికి వెళుతూ యిలా చదవొచ్చా ? అయినా దేవుళ్లంతా ఒకటే ఫరవాలేదనుకొని లెంపలు వేసుకొని పంచాక్షరీ మంత్రం చదువుకుంటూ ప్రయాణం సాగించేం .

డోలీలు నాలుగయిదు చోట్ల ఆపి తీసుకు వస్తారు , గుర్రాలయితే తొందరగా చేరుస్తాయి .

సామానులతో వచ్చే గుర్రాలు , ఖాళీ గుర్రాలు యాత్రీకులను యిబ్బందులకు గురిచేస్తాయి .

గేస్ సిలిండర్ల దగ్గర నుంచి కర్రలు , చల్లపానీయాలు , త్రాగేనీరు అన్నీ కిందనుంచే వస్తాయి మరి . అందుకే కొండలలోధరలు యెక్కువగా వుంటాయి .

మిగిలిన మూడు కిలో మీటర్లూ యేదోలా పూర్తి చేసి బ్రతుకు జీవుడా అని గుర్రాలమీంచి దిగి మందిరం వరకు వున్న కిలో మీటరూ నడిచి మందిరం చేరుకొని పూజారి సహాయాన కేదార్ నాధుని దర్శించుకొని , పూజలు చేసుకొని ,  మందిరం వెనుకవైపు వున్న ' శంకరాచార్యుల ' వారి సమాధి మందిరం దర్శించుకొని , మందాకిని నీరు తలపై జల్లుకొని మందిరానికి దగ్గరగా వున్న టీ షాపులో వేడి టీ తాగి , వేడి వేడి రొట్టి కూర తిని మంటదగ్గర చలి కాచుకొని తిరిగి ప్రయాణమై రాత్రి కి గౌరీ కుండ్ లో మా బస చేరుకున్నాం . అప్పట్లో యే సమయం లో వెళ్లినా శివునికి అభిషేకాదులు స్వయంగా చేసుకొనే వీలుండేది , రానురాను ఒక్క ప్రొద్దున్న వచ్చిన యాత్రీకులకు మాత్రమే ఆ సౌకర్యం వుంచి అలంకారణానంతరం అభిషేకాలను రద్దు చేసేరు . అభిషేకం చేసుకోవాలను కునే వారు ప్రొద్దున్న 8 గంట లోపున అక్కడుండాలి .

చాలా సార్లు  కేదార్ లో బస చేసుకొని ప్రద్దున్నే అంటే నాలుగింటికి దర్శనం క్యూలో నిలబడి మంచుతో కట్టుకున్న బట్టలు తడిసిపోయి , చలిపట్టిపోయి మందిర ద్వారాలు తెరవగానే లోపలకి వెళ్లి లింగానికి అభిషేకం , పంచామృతాలతో అభిషేకం , ఘృత లేపనం వంటి సేవలు పూజారుల ఆధ్వైర్యం లో చేసుకున్నాం . శివుడికి చేసుకున్న సేవలు తృప్తి నిచ్చేయి కాని ఆ చలి భరించలేక వచ్చిన చిరాకు పై వాక్యాలలో బైటకు వచ్చింది .

సన్నని సూర్యకిరణాలు మంచుకొండలను తాకేటప్పటికి మా పూజ ముగించుకొని మందిరానికి ప్రదక్షిణ చేసుకున్నాం .

మందగమనంతో ప్రవహించే మందాకినీ నదీ తీరాన వున్న మందిరం , చలికి భయపడకుండా మందాకిని లో స్నానాలు చేస్తున్న భక్తులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది . సూర్యకిరణాల కాంతిలో వెండి కొండలు బంగారు రంగులో కనిపించి మనని అబ్బురపరుస్తాయి .

ముందు రాతి మందిరం , చుట్టూరా రాతి పలకలు పరచిన నేల వుండేది , ప్రతీ సంవత్సరం మార్పులు చేర్పులు జరిగి చాలా కొద్ది సంవత్సరాలలోనే పాలరాతి పలకలు పరిచి పెద్ద పెద్ద అరుగులు నిర్మించేరు . అరుగులకు పక్కగా బదరీనాధ్ కేదార్ నాధ్ మందిర ట్రస్ట్ వారి ప్రసాద  , రుద్రాక్షల విక్రయశాల ని నిర్మించేరు .

మందిరం లో లింగం గా కొండ శిఖరం పూజలందుకుంటోంది .

కేదార్ కధ చెప్పుకుందాం .

బదరీనాధ్ లో  శివు పార్వతుల నివాసాన్ని  కపటం తో విష్ణుమూర్తి  ఆక్రమించుకోగా ( పూర్తి కథ చదవాలను కుంటే బదరీనాధ్ యాత్రా విశేషాలలో చదవొచ్చు ) శివపార్వతులు కేదార్ ని తమ శీతాకాలములు నివాసంగా యెంచుకున్నారు .

పాండవులు కురుక్షేత్ర యుధ్దం లో జరిగిన జ్ఞాతుల , గురువుల సంహారం వలన సంభవించిన పాప పరిహారానికి కృష్ణుని సలహా అనుసరించి పాండవులు శివుని కొరకై కేదార్ బయలుదేరుతారు . పాండవులు గురువులను సంహరించడం నచ్చని శివుడు వారి చే పూజలందుకొనడానికి నిరాకరించి  నంది రూపం లో వారినుంచి పారి పోతాడు . భీముడు నందిరూపంలో వున్న శివుని గుర్తించి నందిని వెంటాడుతాడు . నంది గుప్తకాశిలో పాతాళానికి వెళ్లిపోవాలని ప్రయత్నించగా భీముడు నంది వెనుక కాళ్లు పట్టుకొని బయటకు లాగుతాడు , ఆ వూపుకు నంది అయిదు ముక్కలుగా అయి అయిదు ప్రదేశాలలో పడ్డాయి , మూపురం పడ్డ భాగమే కేదార్ . ఇక్కడ లింగం మూపురం ఆకారంలో వుండడం విశేషం .

ఇక్కడ చాలా సంవత్సరాలు పాండవులు శివుని పూజించుకొని తమ పాపాలను పోగొట్టుకొని కలికాలం లో మానవులకు కూడా పొద్దున్న , సాయంత్రం హారతి సమయంలో మందిరానికి వచ్చే భక్తుల పాపాలను పోగొడట్టాలనే  వరం పొంది స్వర్గారోహణం వైపుగా సాగిపోతారు .

కోవెల లోపల అఖండ దీపం , పాండవులు , కుంతి , ద్రౌపతులను దర్శించుకోవచ్చు .

మందిరం వెనుకగా వున్న కొండ పైకి ఓ రెండు ఫర్లాంగుల దూరం లో శంకరాచార్యుల వారి సమాధి వుంది . అక్కడ వున్న వారి శిష్యుల కథనం ప్రకారం శంకరులవారు ఆ ప్రదేశం లో అంతర్ధనమయేరు అని చెప్పేరు . కాబట్టి ఆ ప్రదేశాన్నే అతని సమాధిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు మీరు చదివిన వివరాలు 2013 వరదలకు ముందు వున్న కేదార్ గురించి , 2013 తరువాతి కేదార్ గురించి యిప్పడు చదువుదాం .

2013 వరదలలో మొత్తం యీ పర్వతాలు చెట్టు చేమలు యిళ్లు అన్నీ కొట్టుకు పోయేయి . సాధారణం గా ప్రతీ యేడాది యాత్ర మొదలయే సమయానికి కొత్తరోడ్లు నిర్మిస్తారు . వరదల తరువాత రోడ్డు నిర్మాణం చేపట్టేటప్పుడు ఎక్సపర్ట్స్ సలహాల ననుసరించి , నెహ్రూ యిన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింర్ వారి సహాయంతో కొత్త రోడ్డు నిర్మించేరు . గౌరికుండ్ నుంచి సుమారు 16 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే కేదార్ మందిరం చేరుకుంటాం . ప్రస్తుతం రాంబారా గ్రామం పూర్తిగాకొట్టుకుపోగా కొత్తగా వేసిన చిన్న వంతెన తప్ప మరేదీ లేదు , ఇదే రాంబారా వంతెన గా గుర్తింప బడుతోంది .

మందిరానికి ఓ కిలోమీటరు ముందుగానే గుర్రాలు ,  డోలీలు ఆపేస్తారు . కేదార్ కొండమీద రాత్రి నివాసం లేదు తప్పనిసరి పరిస్తితులలో వుండవలసి వస్తే ఆర్మీ వారి టెంట్లే సరణ్యం . సాయంత్రానకల్లా తిరిగి రాగలిగేటట్లు సమయం వుంటేనే పైకి వెళ్లడానికి అనుమతి లభిస్తుంది . మొత్తం యాత్ర అంతా ఆర్మీ వారి నేతృత్వం లో జరుగుతోంది .

గౌరి కుంఢ్ ని గురించి పురాణ కథ తెలుసుకుందాం .

పార్వతీ దేవి ఓ రోజు శివుడు బయటకు వెళ్లిన సమయంలో స్నానానికి వెళ్లి సున్న పిండితో బొమ్మను చేసి , ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకలి వద్ద కాపలాగా వుంచి యెవరినీ లోనికి రానివ్వద్దని చెపుతుంది . ఆ బాలుడు శివుని ని కూడా లోనికి రానివ్వడు , శివుడు ఆగ్రహించి బాలుడి తల నరికి లోనికి వస్తాడు . బయట కావలిగా వున్న బాలుడు యెలా రానిచ్చేడు అని పార్వతి పరమేశ్వరుడి అడుగగా , నియంత్రించిన బాలుడి తల నరికి వచ్చేనని చెప్పగా పార్వతి దుఃఖిస్తుంది . పార్వతి దుఃఖాన్ని చూడలేని శివుడు తన గణాలను పంపి ఉత్తరాన తల పెట్టుకొని నిద్రిస్తున్న వారి తల తెమ్మని పంపుతాడు . ఉత్తరాన తల పెట్టుకొని నిద్రిస్తున్న ఏనుగు తలను వారు తేగా ఆ శిరస్సు ను బాలునకు పెట్టి ప్రాణం పోస్తాడు పరమేశ్వరుడు అనంతరం అతనిని గణాలకు అధిపతిని చేస్తాడు . అతను వినాయకుడు , గణేషుడు గా పిలువబడసాగేడు .పార్వతీ దేవి స్నానం చేసిన కొలనే యిప్పడు గౌరికుంఢ్ గా పిలువబడుతోంది .

వినాయకుని శిరస్సును పరమశివుడు ఖండించిన ప్రదేశం కేదార్ నాధ్ కి వెళ్లే కొత్త దారి మొదలయే చోట చిన్న గుట్టమీద  వుంది. అక్కడ గణేశ మందిరం వుంది . అంటే గౌరి కుంఢ్ కి యెదురుగా వున్న చిన్న కొండమీద అన్న మాట . మందిరం చెట్ల మధ్య నుంచి కనబడుతుంది . ఇది యీ మధ్య దక్షిణ భారత దేశానికి చెందిన స్వామీజీ నిర్మించినట్లు చెప్పేరు .

ఆ రోజు రాత్రి గౌరీ కుంఢ్ లో బస చేసి మర్నాడు యధాప్రకారం పొద్దునక్నే ప్రయాణం మొదలు పెట్టేం .

మరునాడు గుప్తకాశి , అగస్త్యముని చూసుకొని బదరీ వైపు వెళ్లాలి .

వచ్చేవారం మిగతా వివరాలు అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscope from 4th august to 10th august