Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutudi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.  ..... http://www.gotelugu.com/issue225/628/telugu-serials/naadaina-prapancham/nadina-prapancham/ 

( గతసంచిక తరువాయి )..‘‘అది కేవలం అంటారేంటి? నాకు అదే ముఖ్యం.

నా అభిరుచి మీ యిష్టం కాబట్టే మనిద్దరం ఒకటయ్యాం. లేక పోతే నేనసలు మీతో మాట్లాడే దాన్నే కాదు.’’

ఆమె చెబుతుంటే మనసంతా భగ భగా మండి పోయింది. అసలు ఇలాంటమ్మాయిని ఎవరయినా ప్రేమిస్తారా?

‘ఛ’ తన బుద్ధి తక్కువ....కసి కొద్దీ తనని తనే తిట్టుకున్నాడు.

కాసేపాగి ‘‘ఎందుకు అలా వున్నారు?’’ అతని చేతిని తన బుగ్గకి ఆనించుకుంటూ అమాయకమైన కళ్ళతో అడిగింది.

గాయానికి వెన్న రాసినట్లు కొంచెం శాంతించాడు.

‘‘ఏం లేదు’’ తల అడ్డంగా ఆడించి,

‘‘వెళ్ళి పోదామా?’’ లేవడానికి సిద్ధమవుతూ అన్నాడు.

‘‘కాసేపు మీతోనే వుండాలని వుంది’’ మొహమాట పడ్తూనే అంది.

‘‘నీకూ అన్పిస్తోంది కదూ! నాకూ అనిపించింది. నిన్న గేమ్ ఆడటానికి వెళ్ళినప్పుడూ అనిపించింది.

నువ్వు ఒప్పుకోవు కాబట్టి అన లేదు.
గేమ్ అవగానే అనిపించింది. నేనే మొదట విషెస్ చెప్పాలని, మనిద్దరమే కలిసి ఆ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలని.

సాధ్యం కాదు కాబట్టి అడగ లేదు.

కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో! నీకు ఖాళీ దొరికినప్పుడు కలిసి వుండాలనిపించడం ప్రేమ కాదు.

నా కోసం ఏదయినా వదులుకోవాలి. ఏదయినా అంటే అదీ వాలీ బాల్ అయినా కావచ్చు. అదే ప్రేమ’’

అంటూ ముందుకు అడుగు వేశాడు.

ఆమె మొహం చూసే ధైర్యం లేక పోయింది. చూసుంటే ఆమె మోములో మారుతున్న రక రకాల భావాల్ని చూసి

తట్టుకో గలిగే వాడు కాదు.అతను సరా సరి వెళ్ళి కార్ లో కూర్చున్నాడు. మౌనంగా వెళ్ళి అతని పక్క సీట్లో కూర్చుంది.

కానీ తల తిప్పి అతని వంకే చూస్తోంది. ఆమె కళ్ళలో ఇంకా అప నమ్మకం....ఏవేవో ప్రశ్నలు ఆమెను చుట్టుముడుతున్నాయి.

తల తిప్పి చూడటం లేదతను. చూస్తే గాయ పడిన హృదయం ఆమె విశాలమైన కళ్ళలో రెప రెప లాడుతూ కనిపించేది.

కానీ తనేం తప్పు విషయం అన లేదు. ఆమెకి వాలీ బాల్ ప్రాణం కావచ్చు.

కానీ తమ ప్రేమ కన్నా ఎక్కువ కావడం ఎవరికైనా నచ్చ వచ్చేమో! కానీ తన వల్ల కావడం లేదు.

విశాలమైన ఆ వీధుల్లో కారు వేగంగా పోతోంది.

అతని మనసంతా ఆ డ్రైవింగ్ లోనే తెలుస్తోంది.

‘‘నాలో ఏమన్నా తప్పుందా?’’ అంది కీర్తన.

‘‘ఎవరన్నారు?’’

‘‘మరి ఇందాక మీరు అలా అన్నారేంటి? మీరంటే ప్రేమ లేక పోవడం ఏం లేదు. అసలు గేమ్ కీ, మీకూ ముడి పెట్టొదు.

మీరు గానీ పరిచయం కాక పోతే నేను జీవితంలో పెళ్ళి చేసుకునే దాన్ని కాదు. ప్రేమ అన్న పదానికే తావుండేది కాదు.

మీకు దూరమవటం అన్న విషయం నేను వూహించ లేను. దయ చేసి మీరు ఇందాకటిలా మాట్లాడొద్దు.

ఇప్పటి వరకూ పరోక్షంగా నైనా, ప్రత్యక్షంగా నైనా ఎలా నన్ను ప్రోత్సహించారో, ఇప్పుడూ అలాగే వుండండి.

ఇందుకు విరుద్దంగా ఏం జరిగినా నేను తట్టుకో లేను’’ అతని భుజం మీద తలాన్చింది.

వెచ్చని కన్నీరు అతని షర్టుని తడిపేస్తోంది.

ఆమె చెంప మీద తట్టాడు.

కాసేపు మౌనంగా గడిచి పోయింది. అతని కోపం లాగే డ్రైవింగ్ స్పీడ్ కూడా తగ్గింది.

కారు మెల్లగా పోనిస్తున్నాడు. ‘‘ఏదైనా చెప్పండి’’ భుజం మీద నుంచి తలెత్తకుండానే కళ్ళు పైకెత్తి చూస్తూ అంది.

కొంచెం తల పక్కకి తిప్పి ఆమె నుదుటిని చుంబించి ‘‘ఈరోజు చాలా బావున్నావు’’ చెప్పాడు.

‘‘అవునూ! ఎందుకు నా కోసం ఇంత ఖర్చు చేశారు?’’ చీర, నగలు చూపిస్తూ అంది.

‘‘కాబోయే భార్య కోసం ఈ మాత్రం కొని పెట్ట గల స్థోమత వుందిలే’’ అన్నాడు.

అప్పుడు గుర్తొచ్చింది కీర్తనకి. అతని వివరాలు తనకేమీ తెలియవని.

‘‘మీ గురించీ, మీ ఫ్యామిలీ గురించీ చెప్పొచ్చు కదా?’’ ముద్దుగా అడిగింది.

‘‘ఏం చెప్పాలీ?’’ అడిగాడు.

‘‘మీరే బిజినెస్ చేస్తున్నారు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించీ.....’’ ఆసక్తిగా అతని వంక చూస్తూ అడిగింది.
కొంచెం సేపు ఆలోచనలో పడినట్లు ఆగాడు.

‘‘అవన్నీ చెప్పడానికి ఇంకా టైముంది’’ గంభీరంగా అన్నాడు.

‘‘కాబోయే భార్యనని అన్నారు. నా దగ్గర దాపరికమా?’’ నిష్ఠూరంగా అంది కీర్తన.

‘‘మహా తల్లీ! నీతో చాలా కష్టం. మనం హైద్రాబాద్ వెళ్ళాక మంచి రోజు చూసి మా యింటికి తీసుకెళ్ళి,

నేనే నీకు అన్నీ చెపుతాను. సరేనా?’’ బుజ్జగింపుగా అన్నాడు.

రాత్రి ఒంటి గంటకి హోటల్ కి తిరిగొచ్చారు.

లిప్టులో నిల్చున్నాక ఆమె వంక చూస్తూ....

‘‘నీతో బాల్ గేమ్ ఎప్పుడెప్పుడు ఆడతానా అని కోరికగా ఉంది’’ అన్నాడు.

‘‘అంటే...ఏం గేమ్....? యిది వరకు ఓసారి అన్నారుగా నాకు అర్ధం కాలేదు’’ అంది.

సమాధానం చెప్ప లేదతను. కొంటెగా నవ్వుతూ చూస్తుండి పోయాడు.  అతని చూపులు ఎక్కడ వున్నాయో గమనించి పైటని సరిగ్గా సర్దుకుంది.

ఏదో అర్ధమయ్యి కానట్లుంది. మొహం మందారంలా మారింది.

సిగ్గుతో రాగ రంజితమైన మొహాన్ని అపురూపంగా చూశాడు.

లిప్టు ఆగింది. డోర్ తియ్య బోయింది. చేతులు అడ్డు పెట్టి ఆపేశాడు.

‘‘ఎప్పుడో చెప్పు’’ అడిగాడు.

‘‘నాకు ఆ గేమ్ గురించి తెలీదు’’ గొంతు పెగుల్చుకుని అంది.

‘‘నేను నేర్పిస్తాను’’ మొండిగా అన్నాడు.

‘‘పెళ్ళయ్యాక’’ మెల్లగా అంది.

‘‘ఊహూ....’’

‘‘హైద్రాబాద్ వెళ్ళాక....’’ అలాగంటేనన్నా వదులుతాడేమోనని అంది.‘‘ఊహూ!....’’

‘‘మరి?....’’కళ్ళెత్తి చిరు కోపంగా అంది.

‘‘ఇప్పుడే!....’’‘‘ఆ?.....’’ భయంగా వెనకడుగు వేసింది.

‘‘ఇక్కడే!.....’’ అతని చేతులు ఆమె నడుం మీదకి చేరి మరింత పైకి ఎగబాకడానికి ప్రయత్నిస్తుండగా,

కింద ఎవరో లిప్టు ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్న శబ్దం వినిపించింది.

అంతే! చటుక్కున అతని చేతులు తోసేసి ‘‘గుడ్ నైట్!’’ అంటూ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేసి,

పరుగు లాంటి నడకతో తన రూం వైపు వెళ్ళి పోతుంటే నవ్వుతూ చూస్తుండి పోయాడు ఆకాష్.

****

కీర్తన యింటికి వచ్చే సరికి ఎప్పటిలా ఇల్లూ, తండ్రి, నానమ్మ అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా వుంది.

యింట్లో అడుగు పెట్టగానే ప్రాణం లేచొచ్చినట్లుగా వుంది. కానీ ఆ ప్రశాంతత లోనే ఏదో అసంతృప్తి పైకి లేస్తోంది.

ఇప్పటికీ అశోక్ తనని రిసీవ్ చేసుకోడానికి రాలేదు.

తన ట్రోఫీని సగర్వంగా పైకెత్తి ముద్దు పెట్టలేదు. ఎవరూ లేని దానిలా ఒంటరిగా ఇంటికి వచ్చింది.

ఇప్పటి వరకూ ఆకాష్ ప్రేమ జలపాతంలా ముంచెత్తింది. ఆ హోరు యింకా మనసులో ప్రతిధ్వనిస్తూనే వుండగా ఇంటికి వచ్చింది.
తండ్రి దప్పిక గొన్న వాడిలా తన మొహం వంకే చూస్తూ వుండి పోయాడు.

కళ్ళలో నీళ్ళు నిలిచాయి. ఆయన నుదుటి మీద ముద్దు పెట్టింది.

బావున్న చేత్తో చెంపలు సవర దీసి ప్రశ్నార్ధకంగా చూశాడు.

ఆయన మనసు అర్ధం చేసుకున్నట్లు సగర్వంగా తను గెలిచిన కప్ను చూపించింది.

ఆయన కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి.

నానమ్మ దగ్గర కెళ్ళి భుజాల చుట్టూ చేతులు వేయ బోగా ఆవిడ విడిపించేసుకుంది.

‘ఏమయింది నానమ్మా!’’ ఆశ్చర్యంగా అంది.

‘‘అయ్యాయా నీ తిరుగుళ్ళు?’’ పెడసరంగా అంది.

‘‘తిరుగుళ్ళా?.....’’ విస్మయంగా అంది.

‘‘ఆ!....తిరుగుళ్ళే. నీ దోవన నువ్వు ఆటలు, పాటలంటూ తిరుగుతున్నావు.

అక్కడ్నించి మీ పిన్ని ఫోన్ చేసినప్పుడల్లా సమాధానం చెప్పలేక మీ అన్న తంటాలు పడుతున్నాడు.

మీ పిన్ని సంగతి తెలుసు కదా...

అయినా మనకు ఈ ఆటలు ఎందుకమ్మా? మీ అన్నయ్య చక్కని సంబంధం ఏదన్నా తెస్తాడు.

పెళ్ళి చేసుకొని చక్కగా పిల్లా పాపలతో గడపడం కన్నా ఆడదానికి కావలసింది ఏముంది?

నువ్విలా ఆటలంటూ తిరుగుతుంటే చుట్టాలంతా రక రకాలుగా అంటున్నారు.

చిన్నప్పటి సంగతి వదిలేయి. నువ్విపుడు పెళ్ళీడుకి వచ్చావు. ఇకనైనా అలాంటివి తగ్గించు కోవడం  మంచిది.

పిన్ని అందంటే అందని కాదు కానీ నాకూ సుతరామూ నచ్చటం లేదు’’

కుండ బద్దలు కొట్టినట్లు చెపుతుంటే అచేతనురాలయి వింది కీర్తన.
ఎన్ని ఆశలతో ఇంటికి వచ్చింది?

తన విజయానికి అందరూ మురిసి పోతారని, ఆనందంతో స్వాగతం చెపుతారని ఎంత ఆశించింది? అన్నీ కల్లలేనా?

ఎప్పుడూ తన గురించి ఇలా యింట్లో పిన్ని తప్ప ఎవరూ మాట్లాడ లేదు.

నానమ్మ ఎందుకిలా అంటోంది?

(ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్