Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
aa pape  spoorti

ఈ సంచికలో >> కథలు >> పడవ శివుడు.

padava sivudu

ఎందుకు నాన్నా?ఇంకా రోజూ ఆ డొక్కు నాటు చెక్క పడవ నడుపుతావు.వదిలేయి రాదూ.అందరూ మోటారు బోటు మీదే గోదారి దాటుతున్నారు.నీ పడవ,బ్రతిమాలి ఎక్కమన్నా ఎవరూ ఎక్కరు.అదీ కాక నీ ఆరోగ్యం కూడా సరి లేదు కదా.అందుకని నువ్వు ఈ పడవ నడపడం మానేసి,ఆ సుబ్బారావు గారి కొబ్బరి తోటలో, కొబ్బరి కాయలు దింపింఛే పనిలో చేరొచ్చుగా.అడిగాడు శ్రీను, కాలేజీ పుస్తకాలు సర్దుకుంటూ.

అలా నా పడవని ఏం అనమాకరా అయ్యా.తల్లి వయసు మళ్లిందని వేరొక మారు తల్లిని తెచ్చుకుంటావా?నా వృత్తి కూడా అంతేరా.నాది సేదస్తవో, పిచ్చో,ఎర్రో,ఆ నాటు పడవని నమ్ముకునే మిమ్మల్ని పెంచాను, పెద్ద సేశాను.మీ అక్కని ఓ అయ్య సేతిలో పెట్టాను.ఆ పడవ నడిపే నిన్నూ సదివిత్తనాను.అది నా సొంత పడవరా.అదీ నా బిడ్డ లాంటిదే.

ఆ,ఆ,చాల్లే నాన్నా .ఆ పడవనంటే చాలు నీకు పొడుచుకొస్తుంది.అయినా,రోజంతా పడవ అటూ,ఇటూ, తిప్పినా నీకు రోజుకి వంద రూపాయిలు రావడం లేదు.నీకు తోడుగా ,నీలాంటి పిచ్చోడే ఆ ఎంకడు కూడా.చెప్పాడు శ్రీను అసహనంగా.

అవున్రా.ఆడూ,నేనూ ఒకేసారి పడవలు తిప్పడం మొదలెట్టాం.ఇప్పుడంటే మోటారు బోట్లు,స్టీమర్లూ వచ్చినై గానీ ,అప్పుడు అలా కాదు.పెళ్లి జంటల్ని ఇటు నుండి అటు ,అట్నుండి ఇటు దింపాలన్నా,పెద్ద మడుసులు ఎవరైనా పక్క ఊళ్లనుండి ఈ గోదారి దాటి మనూరు రావాలన్నా ఓ రెండ్రోలు ముందే నాకు గానీ,ఎంకన్నకి గానీ సెప్పేవారు.అలాటి పెద్ద,పెద్దోళ్ళు తిరిగిన పడవల్లో నీలాటి ,నీ స్నేహితుల్లాంటి పిల్లలు ఎక్కలేకపోతున్నానంటన్నారు.అదేవంటే ఆలస్యం, నెమ్మదిగా తీసుకెల్తాది.మోటు పడవ అంటన్నారు.చెప్పాడు చిన్న నవ్వుతో.
పోన్లే నాన్న .నీ మాట నీదే.అవన్నీ వదిలేయి .అన్నం వార్చిన గంజి కుండలో ఉంది.తాగడం మర్చిపోకు.నేను కాలేజీకి వెళ్లొస్తాను.చెప్పాడు శ్రీను.

అదేందిరా .ఇంత బేగినా .?

అవును మరి.ఇవాళ పరీక్ష ఉంది కదా.అందుకే .

అట్టనా.ఎల్లిరాయ్యా.పరిచ్చ బారాయి.నేను కూడా గంజి తాగి,కాసేపాగి నేను పడవ కాడికే ఎల్లాల.చెప్పాడు శివుడు.

శ్రీను వెళ్ళిన కాసేపటికి,శివుడు కూడా పడవ దగ్గరకే వెళ్ళాడు.ఓ వైపుగా ధీర్ఘంగా చూశాడు శివుడు.శ్రీను,అతని స్నేహితులు ,ఇంకా అక్కడే ఉన్నారు.వాళ్ళని చూసిన శివుడు, ఆశ్చర్యంగా పరుగున కొడుకు దగ్గరికి వెళ్ళి ,

ఏందిరయ్యా! ఇంకా నువ్వు పరిచ్చకి పోలా.అడిగాడు, ఆతృతగా.

లేదు నాన్నా.మోటారు బోటు పాడయిందట.ఇంకోటి అవతలికి వెళ్ళి ఇంకా రాలేదు.అందుకే ఇక్కడే ఉండిపోయాం. అట్టనా!రండి నా పడవలో దిగబెడతా.అంటూ పరుగున వెళ్ళి ,పడవ కట్టిన తాడు విప్పి,చుక్కాని తీశాడు. కానీ ,శ్రీను స్నేహితులు మాత్రం ,ముందుకు కదలకుండా, ఏమి అనుకోకు శ్రీను .ఆ పడవలో వెళితే ,ఆలస్యం అయిపోవచ్చు.అలా జరిగితే మన సంవత్సరం చదువు మొత్తం పోతుంది.
ఆ మాటలు విన్న శివుడు,బాబూ ,అలా అనమాకండి.నా పడవ కారణంగా,ఎప్పుడూ,ఎవరికీ ఏ విదమైన నష్టం కాలేదు.నిజం బాబూ.ధైర్నింగా రండి బాబూ.అట్టా దింపేత్తాను.చెప్పాడు శివుడు.

శ్రీను,అతని స్నేహితులూ,కాస్త మొహమాటంగానే పడవెక్కారు.శివుడు, పడవని వేగంగా తెడ్డు వేస్తున్నాడు.దాంతో కొంచెం ఆయాసం అనిపించి,ఛాతీ మీద చేయేసుకుని ఆయాసపడుతున్నాడు.అది గమనించిన శ్రీను,నాన్నా ,నీకు నలతగా ఉంటే ,పడవ కాసేపు ఆపేసి స్తిమిత పడు.చెప్పాడు.వద్దులేయ్యా .మీకు అవతల పరిచ్చకి ఆలశ్యమైపోతాది.అలా గాని జరిగి,మీరు పరిచ్చకి ఎల్లలేకపోతే ,నా పడవకి ఎంత సెడ్డ పేరు.నా పడవకి సెడ్డ పేరొత్తే నాకు సెడ్డ పేరొచ్చిన్నట్టే, అంటూ మరి కాస్త వేగంగా తెడ్డు వేయసాగాడు.ఒడ్డు వచ్చేసింది.శివుడు ఒక్కసారిగా కూలబడి కూర్చుని,గుండె పట్టుకున్నాడు.

ఏమైంది నాన్నా,కంగారు పడ్డాడు శ్రీను.

ఏం లేదురాయ్యా.గబా,గబా తెడ్డు ఏసాగా .అందుకే కొంచెం ఛాతీ నెప్పి.ఏం కాదులేయ్యా.అంతగా కాదంటే మన ఆర్.ఎం.పి డాట్టర్ కాడికి పోయి వస్తాలే.నువ్ గాబరా పడమాకయ్యా.పరిచ్చకి ఎల్లిర.ఒకేల నాకేదైనా జరిగినా,నువ్వు సదువు ఆపి పడవ నడపమాక. పడవమ్మి,ఆస్టల్ లో సేరు.అక్కా బావల సలహా అడుగు.సరేనా. అప్పుడప్పుడూ అయినా నువ్వు,నీ స్నేహితులూ,మన ఎంకడి పడవెక్కుతుండడయ్యా.మీరిచ్చే రూపాయి వాడికి అక్కరకొత్తాది.పాపం ఆడి కూతురి పెల్లికి సేసిన అప్పు ఇంకా రెండు,మూడేలుంది.అదైనా అట్టా,ఇట్టా తీరతాది.ఏయ్యా.అడిగాడు శివుడు,కొడుకు గడ్డం పట్టుకుంటూ,చిన్న ఆయాసంతో.

ఏదేదో మాట్లాడకు నాన్నా. నువ్ చెప్పింది నేను పాటిస్తానుగా.నువ్ ముందు స్తిమితంగా ఉండు.నీకు బానే ఉందా ఇప్పుడు.అడిగాడు చెమర్చిన కళ్ళతో.

నాకేట్రా.ఉక్కు ముక్కలాగున్నాను.సర్లేయ్యా.ఇక పోయిరా.పరిచ్చకి టైమైనాది.చెప్పాడు కొంచెం ఆయాసం అణుచుకుంటూ.
శ్రీను వెళ్లిపోయాడు.అతను వెళ్లిపోగానే, శివుడు మరి కాస్త భాధగా గుండెని అరచేతిలో పట్టుకుని ,మరో చేత్తో తన పడవని ప్రేమగా తాకి, తరువాత అదే చేత్తో,కొంచెం నది నీళ్ళు తీసుకు తాగి, గోదారమ్మా, నిన్ను నమ్ముకున్నోల్లందర్నీ సల్లగా సూడమ్మా.అంటూ నిర్జీవంగా ఓ పక్కకి ఒరిగిపోయాడు.

మరిన్ని కథలు