Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Gandhari || Telugu short film 2017 || Directed by Ravindra Pulle

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థయాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

మరునాడు పొద్దున్నే రూము ఖాళీ చేసుకొని , కారులో సామానులు పెట్టుకొని బిల్లు యిస్తున్నప్పుడు మా రూము యజమాని ' త్రియుగి నారాయణ్ ' వెళ్లేరా ? అని అడిగేరు .

అప్పటివరకు వినని పేరు , మేం తెల్లమొహం వేసేం .

త్రియుగి నారాయణ్ గురించి వివరాలు తెలుసుకున్నాం . సరె ముందుగా త్రియుగి నారాయణ్ చూసుకొని గుప్తకాశి వెళ్లడానికి నిర్ణయించుకున్నాం .

నా వ్యాసాలు చదివే అందరికి మరోసారి తెలియజేస్తున్నది యేమనగా యీ యాత్రలన్నీ మేం ఒక మారు చేసినవి కావు , ఒక్కొక్కమారు గా చూసినవి , పాఠకుల సౌలభ్యం కోసం అన్నీ ఒక వరుస క్రమం లో చూసినట్లు రాస్తున్నాను .

గౌరీకుండ్ కి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో , గౌరీకుండ్ - రుద్రప్రయాగ రోడ్డుమీద వున్న సోనప్రయాగకి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో వుంది ' త్రియుగి నారాయణ్ ' . త్రియుగి నారాయణ గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రం లో రుద్రప్రయాగ జిల్లాలో సుమారు 3200 అడుగుల యెత్తులో వుంది . మందాకినీ నది సోన్ గంగతో సంగమించిన ప్రదేశాన్ని సోన్ ప్రయాగ అంటారు . గౌరీకుండ్ దగ్గరకంటే యిక్కడ చాలా చలిగా వుంది . సన్నగా వాన పడుతూనే వుంది . సోన్ గంగ వొడ్డున వున్న చిన్న గ్రామం , రోడ్డు పక్కన ఓ ఫర్లాంగ్ దూరం మెట్లమీద నడిచి యీ మందిరం చేరుకోవచ్చు .ముందుగా యీ మందిర స్థల పురాణం తెలుసుకుందాం .

ఈ కోవెలను అఖండధుని అని కూడా అంటారు .

ఈ కథ సత్యయుగానికి చెందింది . ఈ ప్రదేశం హిమవంతుని రాజ్యానికి ముఖ్యపట్టణం . దక్షయజ్ఞం లో ప్రాణత్యాగం చేసిన సతీదేవి హిమవంతునికి కుమార్తెగా జన్మించి పార్వతి అని పిలువబడుతూ శివుని  పతిగా పొందేందుకు తపస్సుచేసి శివానుగ్రహం పొందుతుంది . గుప్త కాశి లో పార్వతియే సతీదేవి అవి తెలుసుకున్న శివుడు ఆమెను వివాహమాడ దలచి విష్ణుమూర్తికి తన కోరిక తెలియజేస్తాడు . విష్ణుమూర్తి పార్వతిని వివాహమాడాలనే పరమశివుని కోరికను హిమవంతునకు తెలియ పరుస్తాడు .

హిమవంతుడు పార్వతీ పరమశివుల వివాహానికి విష్ణుమూర్తిని పార్వతి యొక్క సహోదరునిగా వుండమని కోరుతాడు . బ్రహ్మ పౌరోహిత్యం వహించగా ముక్కోటి దేవతల సమక్షంలో హిమవంతుడు పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపిస్తాడు .

కోవెల వెనుక వైపున సరస్వతి కుండం వుంది యిది విష్ణుమూర్తి నాభినుండి పుట్టినది . సరస్వతీ కుండం నుంచి నీరు రుద్రకుండం , విష్ణుకుండం , బ్రహ్మకుండాలలోకి ప్రవహిస్తూ వుంటుంది . రుద్రకుండం లో శివుడి తరఫున వచ్చిన పెళ్లివారు స్నానం చెయ్యడానికి కాగా విష్ణుకుండం లో ఆడ పెళ్లి వారు స్నానాలు చేసుకున్నారట . మిగతా ముక్కోటి దేవతలు బ్రహ్మకుండం లో స్నానాలు చేసుకున్నారట .  సరస్వతీ కుండం లోని నీరు సంతానంలేని వారు తీసుకుంటే సంతానం కలుగు తుందట .

శివపార్వతుల వివాహసమయంలో ప్రజ్వలింపజేసిన హోమకుండం యిప్పటికీ మండుతూనే వుంది . హోమకుండం లోని భస్మానికి అనేక ఔషధ గుణాలు వున్నాయట .

శివుడు పార్వతుల వివాహం జరిగిన ప్రదేశం చూడడానికి వెళుతున్నాం అనుకోగానే యేదో వుత్సాహంగా అనిపించింది .ఎక్కువ యాత్రీకుల తాకిడి లేకపోవటం వల్ల ప్రకృతి యెంతో పచ్చగా , ఫ్రెష్ గా వుంది . ఎక్కువగా వాహనాల రాకపోకలు లేని కారణంగా రోడ్లు చాలా సన్నగా వున్నాయి . తరచు కురిసే వానల వల్ల వృక్షాలు చాలా యెత్తుగా పెరిగి సూర్య కిరణాలను కప్పెస్తున్నాయి .మందిరం కేదార్ నాధ్ మందిరాన్ని పోలి వున్న చాలా పాత కట్టడం . మొత్తం యీ గ్రామం అంతా యీ కోవెల పూజారులే , వచ్చే యాత్రీకుల సంఖ్య చాలా తక్కువగానే వుంటుంది . పూజారులలో పోటీ తత్వం కాని యాత్రీకులను మోసం చేస్తే గుణం కాని లేదు ఒకరి తరువాత ఒకరుగా యాత్రీకులకు సేవలందిస్తూ వున్నారు . యాత్రీకులు యిచ్చే దక్షిణ తృప్తిగా పుచ్చుకుంటారు . అది నాకు చాలా నచ్చింది .

' త్రియుగి నారాయణ్ ' సత్య యుగానికి చెందిన మందిరం . రాతి మెట్లు రాతి చప్టా తో వున్న మందిరం .

పూజారి మమ్మలని మందుగా అక్కడున్న పవిత్ర కుండాల దగ్గరకు తీసుకు వెళ్లారు .

ముందుగా నాలుగు కుండాలను దర్శించుకొని పసుపు కుంకాలతో పూజలు చేసుకొని , వెనుకగా వున్న మండపానికి మా పూజారి దారి చూపుగా వెళ్లేం . అక్కడ నేల మీద వున్న రాతి పద్మాకారాన్ని    బ్రహ్మశిల అంటారు , ఆ శిల శాక్షిగా శివపార్వతుల వివాహాం జరిగిందట . ఆ ఆదిదంపతుల వివాహ ప్రదేశాన్ని దర్శించుకొని  పూజలు చేసుకొన్నాం . ఈ శిలకు పూజలు చేసుకుంటే వివాహం కాని వారికి వెంటనే వివాహం జరుగుతుందని , వైవాహిక జీవితంలో యేవైనా గొడవలుంటే అవి సమసిపోయి జీవితాంతం కలసిమెలసి వుంటారని స్థానికుల నమ్మకం .

బ్రహ్మశిల దర్శనం చేసుకున్నతరువాత మందిరం లోకి తీసుకు వెళ్లేరు . మందిరంలో బ్రహ్మ , విష్ణు , శివ పార్వతులను దర్శించుకొని మండపంలో వున్న అగ్నికుండం దర్శించుకున్నాం . శివపార్వతుల వివాహసమయంలో ప్రజ్వలింపజేసిన అగ్ని యిప్పటికీ వెలుగుతూ వుండడం అశ్చర్యాన్ని కలుగజేసింది . సత్యయుగం నుండి యిప్పటి వరకు ఆరకుండా వెలుగుతూనే వుందట . అందుకే దీనిని ' అఖండ ధుని ' అని , యీ మందిరాన్ని ధుని మందిరం అని అంటారు . ధుని దగ్గర యిద్దరు జటాధరులు కూర్చొని వుండడం గమనించేము . ఆ ధుని కి నూటొక్కరూపాయి యిచ్చి మా గోత్రనామాలతో ఓ సమిధను సమర్పించి , ధునిలో నుండి భస్మాన్ని తీసుకొని మాతో తెచ్చుకున్నాం . ఆ హోమకుండం లోని భస్మానికి యెన్నో ఔషధ గుణాలున్నాయట .  హోమకుండం దగ్గర కాసేపు చలికాచుకొని తిరుగు ప్రయాణమయేం . జడివాన కురుస్తూ వుండడం తో సోన్ నదివొడ్డున వున్న ఆ గ్రామానికి యేకైక టీ షాపులో వేడివేడి టీ తాగి తిరుగు ప్రయాణ మయేం .

మందిరం చిన్నదైనా మందిర విశిష్టత , మందిర పరిసరాలు మమ్మల్ని ముగ్ధులను చేసేయి . అంత చిక్కని ప్రకృతి మరెక్కడా లభించదు .    మా కారు డ్రైవరు ఉత్తరాంచల్  అబ్బాయి అవడం వల్ల  యీ ప్రాంతాలలో వుండే అన్ని ప్రదేశాలు అతనికి పరిచయమే , అది మాకు మా యాత్ర లో యెంతో సహకరించింది .

సోన్ ప్రయాగ నుంచి రుద్రప్రయాగ రోడ్డుమీద సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణానంతరం గుప్తకాశి చేరుకున్నాం .

గుప్తకాశి రుద్రప్రయాగ జిల్లాలో సుమారు 4330 అడుగుల యెత్తులో వున్న గ్రామం .

గుప్తకాశి యిప్పుడిప్పుడే పెరుగుతున్న గ్రామం . 2013 వరదల తరువాత సుమారు గౌరీకుండ్ , కేదార్ నాధ్ లలోని గెస్ట్ హౌసులు పూర్తిగా కొట్టుకు పోవడంతో ఆ ప్రాంతాలలో తిరిగి పట్టణ నిర్మాణం తిరిగి యిలాంటి పరిస్తితులకు దారితీస్తుందనే ఆలోచనతో గుప్తకాశిని సురక్షిత ప్రాంతగా గుర్తించి గుప్తకాశిలో హోటళ్ల నిర్మాణానికి అనుమతినివ్వడం జరిగింది . గుప్తకాశిలో యాత్రీకులకు కావలసిన అన్ని సదుపాయాలూ దొరకుతాయి . అలాగని యేదో పెద్ద నగరం అనుకోవద్దు . రాత్రి వుండడానికి బస , ఓ మోస్తరుగా వుండే భోజనం దొరకుతాయి . మొత్తం వూరంతా రెండు వీధులు . అక్కడే అన్ని దుకాణాలు వుండడం తో ఆ ప్రదేశం చాలా రద్దీగా వుంటుంది . మేం అక్కడకి చేరేసరికి మధ్యాహ్నం మూడు అయింది . మైన్ రోడ్డుమీద నుంచి కొండ యెక్కి మందిరం చేరాలి , పెద్దగా దూరం లేకపోయినా యెత్తు యెక్కువగా వుండడం వల్ల ఆయాసమనిపించింది . 

       ముందుగా మందిర స్థలపురాణం తెలుసుకుందాం .

        మహాభారత యుధ్దం లో జరిగిన బ్రాహ్మహత్యా పాతకం  , గోత్రహత్యాపాతకం నివారణ కొరకు శివుని సేవించు కోడం తప్ప మరో మార్గం లేదని విష్ణుమూర్తి చెప్పగా పాండవులు పరమశివుని వెతుకుతూ కేదార్ సమీపిస్తారు . పాండవుల రాక తెలుసుకున్న శివుడు వారిపై కల కోపముతో నంది రూపం దాల్చి వారినుండి పారిపోతాడు . భీష్ముడు పారిపోతున్న నందిని శివుడిగా యెరిగి వెంబడిస్తాడు . శివుడు గుప్తకాశిలో పాతాళలోకానికి పారిపోదలచి భూమిని చీల్చుకొని వెళుతూ వుండగా భీముడు నంది వెనుక కాళ్లను పట్టుకొని విసురుగా బయటకు లాగగా నంది అయిదు ఖండములుగా ఖండింపబడి ' తుంగనాధ్ ( ముందుకాళ్లు పడ్డ ప్రదేశం ) ' , కేదార్ నాధ్ ( మూపురం పడ్డ ప్రదేశం ) , మథ్య మహేశ్వర్ ( నాభి పొట్ట మొ।। ప్రదేశాలు పడ్డ ప్రదేశం ) , రుద్రనాధ్ ( వెనుక కాళ్లు పడ్డ ప్రదేశం ) , కల్పేశ్వర్ ( తల భాగం పడ్డ ప్రదేశం ) లు పంచ కేదారాలుగా పిలువబడుతూ హిందువుల పూజలు అందుకుంటున్నాయి .

 

          భీమును చర్యకు మరింత కోపగించుకున్న శివుడు కైలాసానికి మరలిపోగా పాండవులు విష్ణుమూర్తి కోరిక మేరకు పార్వతీ దేవి గురించి తపస్సు చెయ్యగా ఆ దయగల తల్లి పాండవులను కరుణించి పాండవుల పాపపరిహారం చేసి వారికి పుణ్యగతులు కలుగజేయవలసినదిగా శివుని వేడు కుంటుంది .  శివుడు పార్వతి కోరిక మన్నించి పాండవులకు అర్దనారీశ్వర స్వరూపంలో దర్శనమిచ్చి వారి పూజలందుకొని వారికి పాప విముక్తులను చేస్తాడు . 

        పాండవులు యీ ప్రదేశంలో అనేక సంవత్సరములు పార్వతీ పరమేశ్వరులను సేవించుకున్నారట . ఆ సమయంలో నిత్యావసరములకు గాని పాండవుల యమున , గంగలను ఆహ్వానించేరుట . ఇప్పటికీ ఆ రెండు ధారలు నిరంతరంగా పడుతూ గ్రామ ప్రజల అవుసరాలు తీరుస్తున్నాయి . ఈ ధారలు యెప్పుడూ యెండిపోలేదుట .

      ఈ మందిరం కేదార్ నాధ్ బదరీనాధ్ మందిర ట్రస్టు  ఆధారం లో వుంది . ట్రస్టు వారు మందిర మరమ్మత్తు పనులు చేపట్టేరు . సత్రం నిర్మాణం జరుగుతోంది .

        ఈ మందిరం కూడా కేదార్ మందిరాన్ని పోలి వుంటుంది , మందిరానికి యెదురుగా వున్న నీటి కుండంలో రెండు ధారలు పడుతూ వుంటాయి , మనకి యడమ వైపున వున్న ధార యమున ధార యేనుగు ముఖం లోంచి పడుతూ వుంటుంది ,  గోవు ముఖం లోంచి వచ్చే ధార గంగట . గంగ నీరు తాగడాలకి వుపయోగిస్తారు , యమున వీటిని మిగతా అవుసరాలకి వాడతారు గ్రామ ప్రజలు . 

         వెనుకగా వున్న మందిరం విశ్వనాధ మందిరం , యీ శివలింగం కాశీ విశ్వనాధానికి పోలి వుంటుంది . చిన్న మందిరం , పక్కగా వున్న మందిరం అర్ధనారీశ్వర మందిరం . ఇక్కడే పాండవులకు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చేరు .

       పూజారి చేత పూజలు చేయించుకుని , స్థలపురాణం విని తిరిగి మా కారు దగ్గరకు చేరుకున్నాం .

         2013 తర్వాత మేం అటువైపు వెళ్లినప్పుడు గుప్తకాశి నుంచి ' ఆణి మఠ్ ' వెళ్లేదారిలో వున్న కాస్త పెద్ద హోటల్ లో బస చేసేం .

       పై వారం మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ శలవు .

 

మరిన్ని శీర్షికలు
chamatkaram