Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.  .....http://www.gotelugu.com/issue226/630/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి )...

అన్నయ్య ఎందుకు ముభావంగా వుంటున్నాడు? స్తబ్దుగా కూర్చుండి పోయింది కీర్తన. మనవరాలిని ఆ స్థితిలో చూసి నానమ్మకి జాలి కలిగింది. మళ్ళీ వెళ్ళి ఓదార్చితే ఇపుడు తనన్న మాటకి అర్ధం లేనట్లే. అందుకే అలాగే వదిలేసి కూర్చుంది.

రాత్రి ఎనిమిదింటికి అశోక్‌ యింటికి వచ్చాడు. పని ఒత్తిడిలో అతని మొహం వాడి పోయి వుంది. హాల్ లో దిగుగా కూర్చున్న కీర్తనని చూశాడు.

‘‘ఎప్పుడొచ్చావు?’’ అడిగి సమాధానం కోసం కూడా చూడకుండా లోనికి వెళ్ళి పోయాడు. స్నానం చేసి వచ్చి తండ్రి దగ్గరకి వెళ్ళి

‘‘భోజనం చేశారా?’’ అనడిగాడు.

ఆయన మాట్లాడక పోవడం చూసి కిచెన్‌ లోకి వెళ్ళి ప్లేట్‌లో రైస్‌, కర్రీస్‌ వేసి తెచ్చి స్పూన్‌తో తండ్రికి కలిపి పెడుతూ....

‘‘నాన్న గారికి బాగా యిబ్బందై పోయింది.  నాకూ ఆఫీస్‌లో పనుండి లేటుగా వచ్చే వాడిని....’’ జనాంతికంగా అన్నాడు.

కీర్తన మాట్లాడక పోవడం చూసి ‘‘భోజనం చేశావా?’’ అనడిగాడు.

ఆమె ఏమీ మాట్లాడ లేదు. అందరూ తనేదో తప్పు చేసినట్లు, ఆ తప్పుని వాళ్ళు ఉదారంగా క్షమించినట్లూ ప్రవర్తిస్తున్నారు. ఉక్రోషంగా వుంది.

‘‘నానమ్మా! మన ముగ్గురికీ కూడా వడ్డించెయ్యి. వచ్చేస్తున్నాను’’ చెప్పాడు.

తండ్రికి తినిపించి నీళ్ళు పట్టి నోరు శుభ్రంగా నాప్‌ కిన్‌తో తుడిచి పదిలంగా పడుకోబెట్టాడు.

‘‘పద భోజనానికి’’ కీర్తనతో అన్నాడు.

ఆమె లేవ లేదు. ఎవరూ మళ్ళీ అడగ లేదు. వాళ్ళిద్దరూ తింటున్నారు.

తండ్రి వంక చూసింది. ఆయన తన వంకే చూసి చేత్తో అన్నం తినమంటూ సైగ చేశారు. ఆయన పడుతున్న తపన చూసి ఇంత సేపు ఆయన్ని బాధ పెట్టినందుకు తిట్టుకుంటూ అన్నం ముందు కూర్చుంది.

మౌనంగా భోజనాలు ముగించారు. పనమ్మాయి వచ్చి సర్దేసింది. అశోక్‌ తన గది లోకి వెళ్ళి పోయాడు.

నానమ్మ పూజ గది వారగా కూర్చొని తత్త్వాలు ఏవో పాడుకుంటోంది.

కీర్తన వెళ్ళి తండ్రి మంచంలో కూర్చుంది.

‘‘నేను వాలీ బాల్‌ ఆడితే తప్పా’’ ఉక్రోషంగా అంది.

రెప్పలు ఆర్పాడాయన.

‘‘అందరూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు....?’’ ఏడుపు రాబోయింది. బలవంతాన ఆపుకుంది.

తండ్రి ముందు ఏడిస్తే, ఆయన రాత్రంతా నిద్ర లేకుండా తన గురించే ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటాడు.

చేత్తో తన చేతి మీద తట్టాడాయన.

తలెత్తి నవ్వింది. ‘‘ఎవరు ఏమనుకున్నా, నేను వాలీ బాల్‌ని విడిచి పెట్టడం అంటూ జరగదు’’ కాన్ఫిడెంట్‌గా అంది.

తండ్రి కళ్ళు మెరిశాయి.

ఆ మెరుపు ఆమె హృదయం లోకి దూసుకు పోయింది. ఆ మాత్రం ఉత్తేజం చాలు. తన లక్ష్యం నుంచి తననెవరూ తప్పించ లేరు. పట్టుదలగా అనుకుంది.

ఆయన చేతితో అశోక్‌ గది వంక చూపిస్తూ ఏదో అంటున్నారు.  కాసేపటికి అర్ధమైంది. వెళ్ళి తనని అన్నయ్యతో మాట్లాడమంటున్నాడు.

హృదయం తేలికయింది. అయినా అన్నయ్య ఎన్నో పనుల ఒత్తిడిలో వుండి వుంటాడు. తన చిన్నప్పటి నుంచి తన మనసెరిగి తనకి అన్ని విధాలా రక్షణ కల్పించిన వాడు అన్నయ్యే.

అలాంటిది ఇప్పుడేదో కొంచెం మారాడని తను అపార్ధం చేసుకుంటే ఇక తమ మధ్య వున్న రిలేషన్‌కి అర్ధం ఏంటి?

అనుకుంటూ అశోక్‌ గదికి వెళ్ళింది.

అతను కంప్యూటర్‌ దగ్గర కూర్చుని బిజీగా వున్నాడు.

సంకోచిస్తూనే ‘‘అన్నయ్యా!’’ అంటూ పిలిచింది.

‘‘ఆ....రామ్మా! కంగ్రాట్స్‌’’ చిరునవ్వుతో చెప్పాడు.

గబ గబా బయటికి వెళ్ళి చెంగున తను గెలిచిన కప్‌ తీసుకొచ్చి అన్న ముందు పెట్టింది.

ఆమె ఆతృతగా చూస్తోంది.

పది సెకండ్లు దాని వంక చూసి, ఏదో ఆలోచిస్తూనే దాన్ని పైకెత్తి ముద్దు పెట్టాడు.

కీర్తన మనసు పురి విప్పిన నెమలిలా మారింది. అన్నయ్య ఏం మార లేదు. తనే అనవసరంగా ఎక్కువ వూహించింది.

సంతోషంగా అన్న చెంపని ముద్దాడి, గేమ్‌ తాలూకు విశేషాలన్నీ ఏకరువు పెట్టింది. అవన్నీ చెపుతుంటే ఆకాష్‌ గుర్తొచ్చాడు.

అతని గురించి చెప్పాలని మనసు వువ్విళ్ళూరింది. కానీ అతనంతట అతనే వచ్చి ఇంట్లో చెపితే బావుంటుందన్న ఆలోచన రావడంతో ఆగి పోయింది.

పదకొండింటి వరకూ కబుర్లు చెప్పి, అప్పుడు కడుపు నిండిన సంతృప్తితో గది బయటకు వచ్చేస్తుంటే...

‘‘చిట్టీ....’’ అశోక్‌ పిలవడం చూసి ఆగి...

‘‘ఏంటన్నయ్యా?’’ అడిగింది.

‘‘రేపు ఈవినింగ్‌ త్వరగా వచ్చేయి.’’

‘‘అలాగే! ఏంటి విశేషం?’’ కుతూహలంగా అంది.

‘‘రేపు మనింటికి గెస్ట్స్‌ వస్తున్నారు’’ చెప్పాడు.

‘‘ఎవరు?’’ ఆతృతగా అంది.

అన్నయ్య తరపు గెస్ట్‌లు. అదీ తనకు తెలీనివాళ్ళు ఎవరు? ఆతృతగా అడిగింది.

‘‘అది సీక్రెట్‌..చెప్ప కూడదు. నువ్వు త్వరగా వచ్చేయి. నీకే తెలుస్తుంది...’’ నవ్వుతూ అన్నాడు.

అలాగేనని చెప్పి తన రూంకి వచ్చేసి ఒళ్ళెరగనట్లు పడి నిద్ర పోయింది.

**********

కాలేజీలో అడుగు పెట్టగానే ఎప్పటిలా ఘన స్వాగతం లభించింది.

సౌతిండియా వాలీ బాల్‌ ట్రోఫీని గెల్చుకున్న...అంటూ తమకు పేరు పేరునా కంగ్రాట్స్‌ చెపుతూ బ్యానర్స్‌ వేలాడ దీశారు.

ప్రిన్సిపాల్‌ ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మరీ అభినందించారు.

కాలేజీలో అందరూ ఎదురయినప్పుడల్లా కంగ్రాట్స్‌ చెబుతున్నారు. క్లాస్‌కి వెళుతుంటే లైబ్రరీ దగ్గర సెకండియర్‌ అబ్బాయి ఒకతను...

‘‘కీర్తనక్కా! నేషనల్‌ గేమ్‌ విన్నర్స్‌ మీరే....!’’ గట్టిగా అరిచి చెప్పాడు.

ఆ అరుపు చుట్టుపక్కలంతా ప్రతిధ్వనించింది.

అటు వైపు వెళుతున్న మణి బిందు అది విని తోక తొక్కిన త్రాచులా లేచింది.

సరా సరి అతని దగ్గరకి వెళ్ళి ‘‘ఏరా....బెట్టింగా....?’’ కోపంగా అంది.

‘‘బెట్టింగా...అదేంటి! వాలీ బాల్‌లో కూడానా? నాకు తెలీదు’’ బిక్క చచ్చి అన్నాడు.

‘‘నేనెవరినీ?’’ అడిగింది.

‘‘తెలీదు.’’

‘‘తెలీదా?’’ గద్దించింది.

‘‘మీరు వాలీ బాల్‌ ఆడతారని తెలుసు గానీ, మీ పేరు నిజంగా తెలీదండీ’’ భయంగా అన్నాడు.

‘‘అంటే....నన్ను చూసే, మా టీం నేషనల్‌ గేమ్స్‌లో గెలవదన్న ఉద్దేశ్యంతో అరిచావు కదూ?’’ క్రోధంగా అంది.

‘‘అమ్మో! అమ్మో! ఇదన్యాయం. అసలు నేను మీ వంకే చూడ లేదు. నేను కీర్తనక్కని చూసి అన్నాను. నిజం....ఒట్టండి....’ లబ లబ లాడుతూ మొత్తుకుంటుంటే....

కీర్తనకి జాలి వేసింది.

సౌతిండియా టోర్నమెంట్‌ గెలిచే  సరికి తమ జట్టుకి మరింత పేరు వచ్చింది. అది మణి బిందు సహించ లేక పోతోంది.

ఆమెకి టార్గెట్‌ నేషనల్‌ గేమ్స్‌లో గెలవటం.

తమకి టార్గెట్‌ కూడా అదే!

ఇంత మంది టార్గెట్‌ అదే అయినప్పుడు, అందరూ గెలవ లేరు...ఒకే టీమ్‌ గెలుస్తుంది.

జయాపజయాల్ని ఒకలాగే స్వీకరించాలి. నీ వరకూ నీ తప్పు లేకుండా పోరాడు. ఆ తర్వాత ఓడినా, ఓటమి లోనూ ధీరోదాత్తత కనిపిస్తుంది

పోరాడి ఓడితే, గెలిచిన జట్టు మీద కన్నా ఓడిన జట్టు మీదే అభిమాన వర్షం కురుస్తుంది.

అలా కాకుండా కమిట్‌మెంట్‌ లేకుండా పేలవమైన ఆటని ప్రదర్శిస్తూ ఓడిపోతే, అది చాలా అవమానం.

మణి బిందులో బాగా ప్రతిభ వుంది. ఆమె ఆట తీరు అమోఘం....కానీ అంత నిబద్దత లేదు.

కానీ ఆమెకు గెలుపు కావాలి.

గెలుపు లోని మజా కావాలి.

అందు కోసం ఆమె అడ్డదోవలు వెతుకుతుంది. ఆమెకి అహంకారం చాలా ఎక్కువ.

కీర్తన ఆట తీరు ఆమెలో దాగిన భయాల్ని, అసూయనీ, ద్వేషాన్నీ రెచ్చ గొడుతోంది.

అందుకే ఎప్పుడు తీరిక దొరికినా ఆమెని దెబ్బ కొట్టే విషయం మీదే దృష్టి అంతా.

జూనియర్‌ మీద మండి పడుతున్న మణి బిందుని చూసి దగ్గరగా వచ్చింది కీర్తన.

అతని వంక చూసి ‘‘నువ్వెళ్ళు.....’’అంది.

బతుకు జీవుడా! అనుకుంటూ అక్కడి నుండి పరుగు తీశాడు.

‘‘అతనేదో కాజువల్‌గా అన్నాడు. దానికింత గొడవేంటి మామూలు గానే అంది కీర్తన.

చివ్వున తల తిప్పి చూసింది మణిబిందు. నాగుబాము పడగ బుసలు కొట్టినట్లు అనిపించి కొంచెం వెనక్కే అడుగు వేసింది.

‘‘ఆకాష్‌ నీతో చెన్నై వచ్చాడా?’’ ద్వేషంగా చూస్తూ అంది.
(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi