Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

గతసంచికలో ప్రారంభమయిన ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue226/629/telugu-serials/premiste-emavutundi/premiste-emavutudi/

 

(గత సంచిక తరువాయి)... వెళ్తున్న వాళ్ళ వైపు చూసి ఊపిరి పీల్చుకున్న రమేష్  గాయత్రి వైపు చూసాడు. గాయత్రి ఎడమచేయి అరచేతిలో పూలు వేసుకుని, కుడిచేత్తో లెక్కపెడుతున్నట్టు అటు, ఇటూ తిప్పుతోంది పూలని. ఆమె వచ్చిన దగ్గరినుంచి ఆ పూల మీదనుంచి చూపు తిప్పడం లేదు.. నోరు తెరిచి మాట్లాడడం లేదు. అతనికీ చిరాగ్గా ఉంది. తనే మాట్లాడాలనుకుంటే ఎదురుగా కూర్చున్న శరణ్య, తేజ  ఇందాకటి నుంచి   తమనే గమనిస్తూ, తమ  గురించే మాట్లాడుకుంటున్నారు అనిపించింది. అందుకే పలకరించడానికి బిడియపడి మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళగానే స్వాతంత్యం వచ్చినట్టు అనిపించింది. గాయత్రి వాళ్ళని గమనించలేదు పూలతో ఆడుకుంటూ,   చెట్లవైపు, కాంపౌండ్ వాల్ అవతల రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది.

ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. గాయత్రికి మనసులో ఎవరన్నా చూస్తారేమో అనే భయంతో పాటు ద్రిల్లింగ్ గా ఉంది. ఒక అబ్బాయితో మొదటిసారి పార్క్ లో కూర్చోడం ఇంత బాగుంటుందా! అనిపిస్తోంది.

పార్క్ కి రావమే తక్కువ ... ఎవరు తీసుకువస్తారు తనని.. ఒక్కతి గుడికే వెళ్ళలేదు ఎప్పుడు .,.. అమ్మతోటే  వెళ్తుంది శివరాత్రికి, నాగుల చవితికి, కార్తిక మాసం, శ్రావణ మాసం ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మ, తనూ కలిసి  వెళ్తారు. అలాంటిది  పార్క్ కి  ...... నవ్వొచ్చింది గాయత్రికి. ఆమెనే చూస్తున్న రమేష్  ఆమె పెదవుల పైన విరిసిన నవ్వు చూసి అడిగాడు “ఎందుకు నవ్వుతున్నవ్ ...”

గాయత్రీ పెదాలు బిగించి నవ్వు ఆపుకుంటూ తల అడ్డంగా ఊపింది  ఏం  లేదన్నట్టు.

“చెప్పు నా హెయిర్ స్టైల్ బాగాలేదా లేకుంటే నా డ్రెస్ బాగాలేదా చెప్పు “ అన్నాడు.

“ఛి, ఛి అదేం కాదు  ఊరికే “ అంది ..

“లే  ఏదో ఉంది ఉట్టిగ  నవ్వనికి పాగల్ దానివా “ అన్నాడు.

గాయత్రికి అతని భాష వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అతను తనతో మాట్లాడడమే గొప్పగా అనిపిస్తోంది. ఇంతవరకు తనకి లెటర్ రాసిన వాళ్ళు ఇలా పార్క్ కి రమ్మని పిలిచిన వాళ్ళు ఎవరు ఎదురుపడలేదు. ఇతను తనకి లెటర్ రాసాడు... రోజు తనని చూడడానికి సందు మొదట్లో గంటల తరబడి నిలబడతాడు. తానంటే ఎంత ప్రేమ లేకపోతే అలా నిలబడతాడు. చాలా మంది మగపిల్లలు తను రోడ్డు మీద వెళ్తుంటే అదేపనిగా చూస్తారు.. కొందరు విజిల్స్ వేస్తారు , కొందరు కావాలని తనని తగులుతూ వెళ్తారు. వాళ్ళని చూస్తే వొళ్ళు మండిపోతుంది నాలుగు తన్నాలనిపిస్తుంది. కానీ ఇతను ఎప్పుడూ అలాంటి వెకిలి వేషాలు వేయలేదు... ఎంత మంచివాడు ! గాయత్రి మాట, పలుకు లేకుండా అలా ఆలోచిస్తూ కూర్చోడం రమేష్ కి నచ్చలేదు.

“ ఏందీ సైలంట్ గా కూర్చుని నీ  మొకం చూపించి పొనికి వచ్చినవా”  అన్నాడు విసుగ్గా ..

అతని స్వరంలో వినిపించిన విసుగు గాయత్రికి తను చాలా తప్పు చేసిన ఫీలింగ్ కలగ చేసింది.

“ఆ  పూలేం చేస్తవు..” అన్నాడు ఆమె చేతిలో ఉన్న పూలు చూస్తూ.

“ఏం  చేయను”  అంటూ గబుక్కున కింద వదిలేసింది.

“ఏమన్న మాట్లాడు “ అన్నాడు.

“ ఏం మాట్లాడాలి”  అంది సన్నని స్వరంతో..

“ సినిమాలు చూడవా ... లవర్స్ ఏం మాట్లాడుకుంటరు .... “

“ నేను ఎక్కువగా సినిమాలు చూడను “ తలదించుకుని ఏదో నేరం చేసిన దానిలా అంది.

“ మరేం చేస్తావు .... ఉట్టిగ  కాలేజ్ కి పోవుడు, ఇంటికి వచ్చుడు అంతనేనా “

తల ఊపింది ...” మా ఇంట్లో ఆడపిల్లలను ఎక్కడికి వంటరిగా పంపరు .... “

“ మరి కాలేజ్ కెట్ల పంపుతున్రు.. “

“ తప్పదు  కదా చడువుకోవాలిగా .... చదువుకోకపోతే ఎలా ? మా ఇంట్లో చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆడపిల్లలైన, మగపిల్లలు అయినా చదువుకోవాలి.. ఉద్యోగం చేయాలి. నువ్వు కాలేజ్ కి వెళ్లి వచ్చావా..”

“లేదు పోలేదు... “

“ఎందుకని?”

“ ఎందుకేంది? నువ్వు ఈవినింగ్ వస్తావో, రావో అని పరేషాన్ ఉండే...”

గాయత్రీ అప్పడు తలెత్తి విస్మయంగా చూసింది అతని మొహం లోకి. చిన్న కళ్ళు,   సన్నటి మీసం, కొద్ది, కొద్దిగా షేవ్ చేసిన గడ్డం, వొత్తుగా ఉన్న క్రాఫ్ .... సన్నగా, బాగా పొడుగ్గా ... అలా చూస్తుంటే సడన్ గా సిగ్గు తెర కమ్మేసింది. గబుక్కున తల దించుకుంది.

“ఏమైంది గట్ల చూస్తున్నవ్ బాగా లేనా” అడిగాడు రమేష్.

గాయత్రికి ఆ ప్రశ్నకి సమాధానం తట్టలేదు ... అతను బాగున్నాడా, బాగాలేడా అనే ఆలోచనకి ఆస్కారం ఇవ్వకుండానే ఆమె మనసు అతని వైపు ఆకర్షించబడుతోంది. అలా ఆకర్షించబడడంలో ఆమె ప్రమేయం లేదు. కేవలం వయసు మాత్రమే అతని గురించి ఆలోచిస్తోంది. అతని మాటలకి చూపులకి లోంగిపోతోంది ... అతను అందగాడా, తనకి తగినవాడా, అతని అర్హతలేంటి ఇవన్నీ  ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యవధి లేదు... ఇప్పటికే బాగా ఆలస్యం అయింది పాపం అతను తనకోసం మూడు నెల్ల నుంచి ఎదురు చూస్తున్నాడు.. ఇంతటి గొప్ప ప్రేమికుడు అసలు ఈ భూమ్మీద ఉంటాడా.. అందుకే సమాధానం చెప్పకుండా అతని వైపు ఒక్కసారి చూసి కళ్ళు వాల్చుకుంది. ఆమెకి ఆ క్షణం తన కళ్ళే అతనికి సమాధానం చెప్పాయి అన్న నమ్మకం కలిగింది.

చలికాలం కావడం వలన కాబోలు పార్క్ లో జనం పల్చబడుతున్నారు... నెమ్మదిగా చీకట్లు ముసురుకుంటున్నాయి. అసలే నీడవనం పైగా చలికాలం ... వాళ్ళు కూర్చున్న చోట మరింతగా చీకటి కమ్మింది. గబుక్కున రమేష్ ఆమె చేయి అందుకున్నాడు.. గాయత్రీ ఉలిక్కి పడింది.. తన చేయి  లాక్కోడానికి ప్రయత్నించింది కానీ అతను బలంగా తన గుప్పిట్లో బిగించడంతో ఆ స్పర్శ మధురంగా అనిపిస్తుంటే అలా సిగ్గుతో భూమిలోకి కళ్ళు దించేసుకుని ఉండిపోయింది.      రమేష్ నెమ్మదిగా అన్నాడు “ గాయత్రీ నువ్వంటే నాకు చాల ఇష్టం.. మనం లవ్ చేసుకుందాం. “

గాయత్రీ బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి చెవుల్లోనుంచి పాకుతూ వచ్చి చేరింది.

“ నువ్వు మస్తుగుంటవు ... నిజం చెప్తున్న ... నిన్ను చూడనీకే నేను కాలేజ్ కి గూడా బంకు కొడుతున్న.. నిన్ను చిన్నప్పటినుంచి చూస్తున్న గాని ఎన్నడు ఇట్ల అనిపించలే .... ఏందో ఏమో ఈ నడమ నా కలలోకి గూడా వస్తున్నవు ... రోజు మనం ఈడనే కలవాలే ... సరేనా వస్తావా...”

“ అమ్మో రోజూనా కుదరదు.” గబుక్కున అంది గాయత్రి .

“ మరి ఎట్లా? నీతో మాట్లాడాలే అనిపిస్తది, నిన్ను చూడాలి అనిపిస్తది... ప్లీజ్ రా గాయత్రీ ....”

గాయత్రికి అతని స్వరంలో వినిపించిన అభ్యర్ధన వింటుంటే జాలేసింది..  నిస్సహాయంగా అంది “ రోజూ  కుదరదు ఎపుడన్నా ఒకసారి రాగలను. “

“ వీక్లీ టూ టైమ్స్ ....” రాజీకి వచ్చినట్టు అన్నాడు.

గాయత్రి  ఆలోచించింది.  వారానికి రెండు రోజులా ... ఇవాళ రావడమే  బాగా కష్టమైంది.. బయటకు వెళ్తున్నా అనగానే  ఎందుకు? ఎక్కడికి  అని అమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.. అందుకే అపర్ణ ఇంటికి నోట్స్ కోసం వెళ్తున్నా అని చెప్పి మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా పరిగెత్తుకొచ్చింది.. రోజు అలా చెబితే అమ్మ ఊరుకోదు .. కానీ పాపం రమేష్, తనకోసం కాలేజ్ కి  వెళ్ళకుండా ఎదురు చూసే రమేష్ .... తనకోసం కళ్ళు, కాళ్ళు నెప్పి పెట్టేలా ఎదురు చూసే రమేష్ ఇతనిని కష్టపెట్టడానికి మనస్కరించడం లేదు.. అందుకే అంది” ట్రై చేస్తాను. “

ఆ మాటకే పొంగిపోయాడు .... థాంక్స్ అన్నాడు... ఆమె ఇంక చేయి వదలమన్నట్టు కొద్దిగా చేయి లాక్కుంది .. అతను గబుక్కున చేతి మీద ముద్దు పెట్టుకుని వదిలేసాడు..

ఆమె గుండె జల్లుమంది... నరనరం వీణ తీగ అయి ప్రేమ రాగం ఆలపించింది. చివాల్న లేచి వెళ్తున్నా అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. రమేష్ “ అరె ఉండు డ్రాప్ చేస్తా”  అంటున్న మాటలు ఆమెకి వినిపించలేదు.

ఇల్లు చేరింది కానీ మనసు ఇందిరాపార్క్ లో గుల్ మొహరు చెట్టు కింద వదిలేసినట్టే అనిపిస్తోంది. బట్టలు మార్చుకుని మంచం మీద వాలిపోయి,  మాటి , మాటికి  రమేష్ ముద్దు పెట్టుకున్న చేయి చూసుకోసాగింది. ఇంతకాలం లేని అందం ఏదో కనిపించసాగింది తన చేతిలో..

పదేళ్లనుంచి ఎదురెదురు ఇళ్ళల్లో ఉంటున్నా ఎప్పుడూ  కలిసి ఆడుకోలేదు , కనీసం ఎప్పుడన్నా సరదాగా మాట్లాడుకోలేదు.. అలాంటిది ఇప్పుడు, మూడు నెలలనుంచి రమేష్ కి తన మీద అంత  ఇష్టం ఎలా కలిగిందో అని ఆశ్చర్యంగా అనిపించసాగింది గాయత్రికి.
మంచం  మీంచి గభాల్న లేచి అద్దం ముందుకు వచ్చి నిలబడి తనని తాను మొదటిసారిగా చూసుకుంటున్నట్టు చూసుకోసాగింది. నేను ఎంత అందంగా ఉన్నాను! చెంపల మీద జారిన జుట్టు రెండు చేతులతో వెనక్కి తోసుకుంటూ నా కళ్ళు ఎంత బాగున్నాయి  అనుకుంది.  నువ్వు మస్తుగుంటవ్ గాయత్రీ! అన్న అతని మాట గుర్తొచ్చింది.. చెంపల మీదకి గుల్ మొహర్ పూలు రాలినట్టు అనిపించింది.   అతని నోటి నుంచి పలికిన తన పేరు ఎంత అందంగా ఉంది..

“గాయత్రీ అన్నానికి వస్తున్నావా....”  అన్నపూర్ణ గొంతు గట్టిగా వినిపించడంతో ఉలిక్కిపడి వస్తున్నానమ్మా అంటూ గదిలోంచి బైటికి వచ్చింది.

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర  కూర్చుని తనకోసమే ఎదురు చూస్తున్నారు. గాయత్రి మౌనంగా వెళ్లి కుర్చీలో కూర్చుంది.

“కాలేజ్ లో చెప్పేటప్పుడు నువ్వు నోట్స్ రాసుకోలేదా “

తండ్రి ప్రశ్నకి ఉలిక్కిపడింది. తడబడుతూ అంది” నాకు మేడం చెప్పింది బాగా అర్ధం కాలేదు నాన్నా.. అందుకే ...”

“ఎందుకు అర్ధం కాదు... క్లాస్స్ లో ఉన్నప్పుడు వేరే విషయాలు ఆలోచించకూడదు కాన్సెసేన్త్రేషన్ పూర్తిగా చదువు మీదే పెట్టాలి “ అన్నాడు కార్తికేయ.

వొళ్ళు మండింది గాయత్రికి ...”  నీలాగా  చద్దన్నం మీద పెట్టాలా “ అనుకుంది మనసులో.. పైకి “లేదన్నయ్యా ... ఏంటో ఆవిడ మాట క్లియర్గా ఉండదు” అంది.

“సరేలే రేపటి నుంచి జాగ్రత్తగా విను.. విన్నది ఎప్పటికప్పుడు రాసుకో  ఆడపిల్లవి సాయంకాలాలు అస్తమానం బయటికి వెళ్ళలేవు...రోజులు బాగాలేవు” అంటూ అన్నం తినడంలో మునిగాడు కోటేశ్వరరావు ...

ఇంకా ఉంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్