Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కాలంతో ప్రయాణం

kaalamto prayanam

“ పొద్దున  నాలుగు  గంటలవుతుంది . ఆఫీస్  నుండి అప్పుడే  ఇంటికి  బయల్దేరాను . ఆలోచనలతో  తల  బరువెక్కేసింది. నచ్చని  పని   చేయడం  వాళ్ళ  వచ్చే  సైడ్  ఎఫెక్ట్  అది.  ఇక  చాలని  మనసు  చెప్తుంది  కానీ  ఉద్యోగం  మానేసి  ఇంకేం  చేయాలో  మాత్రం  చెప్పడం  లేదు. రోడ్  పక్కన  బైక్  ఆపి టీ  కొట్టు  దగ్గర  ఆగి  టీ  తాగుతూ  ఆలోచించసాగాను . ఒక్క  సారిగ  నా  గతం  మొత్తం   కళ్ళకు  కనిపించింది. నా  గతం  లో  నేను  లేను , ఆఫీస్  లో  నేను సాల్వ్  చేసిన  బగ్స్  యే  వున్నాయ్. మారాలి  ఇది  మారాలి  నేనేంటో  కనుక్కోవాలి, కానీ  ఎలా ?. వెళ్ళాలి  ఎక్కడికన్నా  వెళ్లాలి. కొద్ది  రోజులు  జాబ్  కాకుండా  ఏదయినా  చేయాలి. అంతే  వెంటనే  ఇంటికి  వెళ్లి  బట్టలు సర్దుకొని బ్యాగ్ తో  బయల్దేరాను. ఎక్కడకు  వెళ్తున్నానో  తెలియదు, ఎందుకు  వెళ్తున్నానో  తెలియదు  కానీ  వెళ్తున్నాను.

బస్సు సిటీ దాటి బయటికి  వచ్చింది, ఎదో  పల్లెలా  వుంది  కిటికీ  లోనుంచి  చూస్తే  పచ్చని  పొలాల  మధ్యలోనుండి  ఉదయిస్తున్న  సూర్యుడు  కనిపిస్తున్నాడు. "గమ్యమెరుగని  ఈ  బాట  సారికి దారి చూపుమా , ఓ  ప్రభాతమ " అని  మనసులోనే  అనుకుంటూ  సూర్యునికి  నమస్కారం  చేసి  ప్రయాణం  సాగించాను . ప్రయాణం  అంటే  గుర్తొచ్చింది, చిన్నప్పుడు  తాత గారు  చెప్పేవారు  "మరణమనే  గమ్యానికి  చేరుకోవడానికి  కాలమనే  వాహనంలో  చేసే  ప్రయాణమే  ఈ  జీవితం  అని".

ఏ  సందర్భంలో  చెప్పారో  గాని తాత  సరిగ్గా  చెప్పాడు. నేనిప్పుడు  నా  ప్రయాణం  లోనే  నా  జీవితాన్ని  వెతుక్కుంటున్నాను. ఒకరి  అమాయకత్వం  ఇంకొకరికి  ఆనందం ,ఆదాయం.  ఒకరి  భయం  ఇంకొకరి  బలం,  ఈ  వింత  ప్రపంచంలో . అలాంటి  ఈ  ప్రపంచానికి  నన్ను  నేను  పరిచయం  చేసుకోడానికి  బయల్దేరాను . బస్సు ఎక్కడో ఒక పల్లెటూర్లో ఆగింది. చిన్న బస్సు స్టాండ్ అది. అప్పటికే  బాగా ఆకలి వేస్తుండడంతో అక్కడే దిగేసాను. దిగగానే ఒక పెద్ద మర్రి చెట్టు ఆ పక్కనే పెద్దగా హనుమంతుని గుడి. ఇప్పటి వరకు అంత పెద్ద హనుమంతుని గుడి ని ఎక్కడ చూడలేదు అది కూడా రాముని విగ్రహం లేకుండా. కానీ ఆ ఆలయం చూస్తుంటే ఎవరు అక్కడ పూజలు చేస్తున్నట్లు లేదు బాగా  బూజు పడి పోయింది. అప్పుడే నా దృష్టి ఆ ఊరి పేరున్న బోర్డు మీద పడింది. ఆ ఊరి పేరు దక్షిణ ద్రోణాగిరి.

బస్సు నుండి దిగిన నన్ను అంతా వింతగా చూస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు కొంచెం దూరం లో అంబెడ్కర్ విగ్రహం దగ్గర పిచ్చాపాటి వేస్తున్న గ్రామ ప్రజల్ని చూసాను. వెంటనే అక్కడికి వెళ్లాను. అప్పుడే ఆ గుంపులో నుండి ఒక బూర మీసాలతను అడిగాడు నేనెవరినని. అప్పుడే ఆ ఊరి పేరున్న బోర్డు గుర్తొచ్చింది. ఊరి పేరు కిందనే వ్యవసాయంలో ఆదర్శ గ్రామం గ భారత ప్రభుత్వంచే గుర్తించబడినట్లు రాసి వుంది. నేను ఒక విద్యార్థినని ఈ గ్రామ వ్యవసాయ పద్ధతులని అభ్యసించడానికి వచ్చానని చెప్పాను. అతను ఒకింత గర్వం తో నవ్వుతు షకీల్ అనే కుర్రాణ్ణి పిలిచి నన్ను సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లామని పురమాయించాడు. షకీల్ తన అట్లాస్ సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టి సర్పంచ్ ఇంటి వైపు బయల్దేరాడు. బక్క పలుచగా ఉన్న ఆ షకీల్ నన్ను ఎక్కించుకొని  సైకిల్ తొక్కుతుంటే ఎంతో బాధగా అనిపించింది కానీ నేను నడుపుతానని చెబితే అతను వేరే అర్ధం ఏమైనా తీసుకుంటాడేమో అని మౌనంగా వున్నాను. కొద్ది సేపటి తర్వాత సైకిల్ వేగం తగ్గింది సర్పంచ్ ఇల్లు వచ్చిందనుకుంటా. నన్ను సర్పంచ్ ఇంటి ముందు దింపేసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు షకీల్.

ఆ సైకిల్ శబ్దానికి బయటికి వచ్చాడు సర్పంచ్. చూడటానికి బ్రహ్మణుడిలా వున్నాడు.కాళ్ళు చేతులు శుభ్ర పరుచుకొని ఇంటిలోపలికి వెళ్లాను. సర్పంచ్ తన ఎదురుగ ఉన్న కుర్చీ లో కూర్చోమని సైగ చేసాడు. ఆ బూర మీసాల తాతకేదయితో  చెప్పానో అదే సర్పంచ్ కి కూడా చెప్పాను. తన బాధ్యతగా ఒక పని వాణ్ని పిలిపించి ఊరి చివరనున్న ఒక పాకలో నా కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు సర్పంచ్. ఆ పని వాడు నా బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు

తనతో పరిచయం పెంచుకోవడానికి ఆ వూరికి దక్షిణ ద్రోణాగిరి అని పేరెలా వచ్చిందని అడిగాను. అనుకోని ఆ ప్రశ్నకు నవ్వుతు బదులిచ్చాడు సర్పంచ్.

"కురు పాండవులకు గురువు కాకముందు ద్రోణా చార్యుడు ఈ గ్రామం లో ఉన్న కొండ  పై బస చేసాడని ప్రసిద్ధి. అతనికి విశ్వకర్మ అనే శిష్యుడు ఉండేవాడు. తన శిష్యుని సేవలకు మెచ్చిన ద్రోణ చార్యుడు అతనికి విలు విద్యని నేర్పించాడు. రాముడు ఒకే బాణంతో వరుసగా ఉన్న ఏడు చెట్లని నేలకూల్చగలడు . ఆ విద్యనే విశ్వకర్మునికి నేర్పించాడు ద్రోణ చార్యుడు. ఆ కొండపై దక్షిణ దిక్కులో నేలకొరిగిన ఆ ఏడూ చెట్లను చూసి ఈ వూరికి దక్షిణ ద్రోణాగిరి అని పేరు పడింది."

అప్పటికే  మధ్యాహ్నం అవుతుండటంతో  సర్పంచ్ దగ్గర సెలవు తీసుకొని పనివాని సాయంతో  పాక  వైపు  బయల్దేరాను . ద్రోణాగిరి కొండకు దగ్గర్లో వుంది పాక . మట్టి గోడలతో, వెదురు బొంగులతో, తాటాకు కప్పుతో చూడటానికి పర్ణశాలలా వుంది ఆ పాక. వర్షాకాలపు తొలకరి చినుకులతో తడిసిన నేల, ఆకాశపు అంచును తాకుతూ పచ్చదనపు పరువాలతో విస్తరించిన ద్రోణాగిరి పర్వతం, ఆ పర్వతం నుండి వస్తున్న పక్షుల రాగాలు, ఇవన్నీ చూస్తుంటే భూతల స్వర్గంలో ఉన్నట్లుంది. 

ఆ పనివాడు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు.చుట్టూ చూస్తుంటే కొద్ది దూరంలో ఒక చిన్న  కాల్వ లో కొంత మంది కలిసి చేపలు పడుతున్నారు.చూడాలనిపించి అక్కడికి వెళ్ళాను. కాల్వలో  ప్రవాహం తక్కువగా ఉంది. ఒక చోట ఇసుక బస్తాలు, తాటి మొద్దులు అడ్డంగా వేసి కాల్వ లో గుంతలా తయారు చేసారు. ఆ గుంత లో చేపలు పడుతున్నారు. కానీ చూస్తుంటే ఇప్పటి వరకు  ఒక్క చేప కూడా పడ్డట్లు లేదు.వాళ్ల మాటలను బట్టి చూస్తుంటే ఇంకాసేపట్లో చేపలు పట్టడం  ఆపేసేటట్లున్నారు. అప్పుడే మా నాన్న చేపలు పట్టె విధానం గుర్తొచ్చింది.

వెంటనే వెళ్లి ఆ చేపలు పడుతున్న వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకున్నాను . నా అదృష్టం  కొద్ది నేను బస్ స్టాప్ లో కలిసిన ఆ బూర మీసాల తాత కూడా అక్కడే వున్నాడు. పేరు ఒక్కటి నేను  చెప్పాను మిగతా సంగతంతా ఆ తాతే చెప్పేసాడు. పనిలోపని గా తన పేరు లక్ష్మణ రావు అని అందరు లక్ష్మయ్య అని పిలుస్తారని నాకు చెప్పాడు.  ఆ తాత సాయంతో దగ్గర్లోనుండి మనిషి ఎత్తున్న కర్ర, కరెంటు  వైర్లు, కరెంటు  స్థంబానికి  తగిలేంచేలా  కొక్కేలు  తెప్పించాను. ఆ పొడవాటి కర్ర చివర్లో ఒక కొక్కెం ఉంచి ఆ కొక్కానికి కరెంటు  వైర్ తగిలించి ఆ కరెంటు వైర్ ఇంకో కోన ని కరెంటు స్థంబానికి వేలాడదీసాను. కర్ర చివర్లో వున్న కొక్కానికి కరెంటు రావడం స్టార్ట్ అయ్యింది. అందరిని ఆ గుంత లోనుండి బయటికి పంపించి కర్ర  చివరనున్న కొక్కెం నీళ్లలో ఆనేలా చేశాను. మైల్డ్  కరెంటు  షాక్  తగిలిన  చేపలు  కొద్ది  క్షణాల  పాటు  నీటిపైన  తేలసాగాయి. కర్ర ను నీటి లోనుండి తీసిన వెంటనే పక్కన వున్న వాళ్ల్లు  ఆ  చేపలను  పట్టుకొని  బయటేసారు. బయట  ఆ  చేపలను  ఒక  బస్తాలోకి  వేసేసారు . కాసేపటికే ఆ బస్తా నిండా చేపలు అయ్యిపోయాయి. కాసేపటి తర్వాత ఇక చాలనుకున్నాక అందరూ కూర్చొని చేపల్ని భాగాలు గా పంచుకున్నాం. నా భాగం చేపలను కూడా లక్ష్మయ్య తాతకె ఇచ్చేసాను. ఆ తాత అర్ధమయ్యిందన్నట్లుగా నవ్వుతూ చేపల పులుసు ఇంటికి పంపిస్తానన్నాడు.

పాక లోకి వెళ్లి కుండలోనున్న నీళ్లు తాగి నీల మీద చాప వేసుకొని పడుకున్నాను. బాగా అలసి పోయి ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది. కొద్ది సేపటికి తలుపు చప్పుడు వినిపించడంతో నిద్ర లేసాను. ఎవరో అమ్మాయి చేతిలో బాక్స్ పట్టుకొని తలుపు దగ్గర నిల్చొని వుంది.ఆకు పచ్చ చీరలో చూడటానికి చాల అందంగా వుంది.

"నా పేరు మనోహరి. లక్ష్మణ రావు గారి మనవరాలిని. మీకు ఈ బాక్స్ ఇవ్వమని తాత పంపాడు " అని చెప్పేసి బాక్స్ లోపల పెట్టేసి తాను వెళ్ళిపోయింది. చేపల పులుసు ఘుమఘమలాడుతుండడంతో కడుపులో కాలి ఉంచకుండా లాగించేసాను. అప్పటికి వర్షం కూడా మొదలయ్యింది. గుడిసె లో అక్కడక్కడా కురుస్తుంది. అదేమీ పట్టించుకోకుండా మధ్యలో ఆపేసిన నిద్ర ను మళ్ళి కొనసాగించాను.

లక్ష్మయ్య తాత పొలంలో తాత తో పాటు పని చేస్తూ రోజులు గడపసాగాను. ఆ వయసులో వ్యవసాయమే వ్యసనంగా పని చేస్తున్న లక్ష్మయ్య తాత ను చూస్తుంటే నా మీద నాకే జాలేసింది. అలాగే మనోహరి తో కూడా కొద్ది కొద్ది గా పరిచయం పెంచుకున్నాను. అప్పటికే వారం రోజులయిపోయింది నేను ఆ వూరొచ్చి. ఎప్పుడు చేపలు పెట్టాలన్న నన్ను వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు గ్రామ ప్రజలు. ఈ వారం రోజులు తెలియకుండానే గడిసిపోయాయి.

ఒక రోజు పొద్దున్నే లక్ష్మయ్య తాత ఇంటి నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి. వెళ్లి చూసే సరికి కొద్ది  నిమిషాల ముందే తాత గుండె ఆగిపోయి చనిపోయాడని మనోహరి చెప్పి ఏడుస్తుంది. కాసేపటికే శవాన్ని పాడె ఎక్కించారు. అప్పుడే ఆ ఊరి సర్పంచ్ తాత నోట్లో తులసి తీర్ధం పోయామని మనోహరి కి సైగ చేసాడు. మనోహరి వెంటనే ఇంట్లో కెళ్ళి ఒక చిన్న సీసా లో తులసి తీర్థం తీసుకొచ్చి తాత నోట్లో వేసింది. ఆ తరువాత పాడె ఎత్తడం మొదలెట్టారు. నేను కూడా ఒక వైపు పట్టుకున్నాను. పాడె సందు చివరకు తిరిగే సరికి పై నుండి తాత గొంతు వినిపించింది "నన్ను పాడే ఎక్కించారేంట్రా పింజారి వెధవల్లారా అని". వెంటనే సగం ఊరి జనాలంతా ఇంటికి పరుగు తీశారు. మిగిలిన వాళ్లకు ఏం జరిగిందో అర్ధం కాక అలాగే నిలబడిపోయారు. కాసేపటికి ఆ గ్రామ సర్పంచి వచ్చి పొరపాటు జరిగుండవచ్చని కొద్దిసేపు లక్ష్మయ్య స్పృహ కోల్పోయి ఉండొచ్చు దాన్ని చూసి అందరు చనిపోయాడని భావించి ఉంటారని చెప్పి ప్రజలనందరిని వాళ్ళ వాళ్ళ  ఇళ్ళకి వెళ్ళమన్నాడు. నాకు అది నమ్మ బుద్ది కాలేదు. కానీ ఇంకే కారణం నాకు తట్టలేదు. ఏది ఏమయితేనేం తాత చనిపోలేదు. మనోహరి కూడా సంతోషంగా వుంది. ఊరి ప్రజలంతా ఒక్కొక్కరుగా లక్ష్మయ్య తాత కు జాగ్రత్త చెప్పి ఇళ్లకు బయల్దేరారు. "ఏరా సత్తి నా పాడె మోయాలని అంత ఆత్రంగా వుందేంట్రా ?" అని పార పట్టుకొని పొలానికి బయల్దేరాడు తాత, వద్దని వారిస్తున్న మనోహరి మాట వినకుండా.

ఇంకో పదిహేను రోజులు అలా గడిచిపోయాయి. ఈ పదిహేను రోజులలో మనోహరి తో పరిచయం ప్రేమ గా మారింది. మనోహరి రెండు సంవత్సరాల క్రితం వరకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండేది. అక్కడే అమ్మ నాన్నలతో కలిసి ఉండేది. కానీ ఒక రోజు తన అమ్మ నాన్నలు ఆక్సిడెంట్ లో చనిపోయారు. దాంతో అక్కడ ఉండటం ఇష్టం లేక తన తండ్రి ఊరయిన ఈ వూరికి వచ్చింది తాతతో కలిసి ఉండటానికి. అప్పటి నుండి ఇక్కడే ఉంటుంది.  ఎప్పటి లాగే ఆ రోజు కూడా పొలంలో పని చేస్తున్నాడు లక్ష్మయ్య తాత. కొద్దిగా చినుకులు పడుతున్నాయి. కొద్ది దూరం లో కాలువ తొవ్వుతూ మనోహరి తో పిచ్చాపాటి వేస్తున్నాను నేను. ఒక్క సారిగా "అమ్మా" అంటూ కుప్పకూలిపోయాడు తాత. వెంటనే మేమిద్దరం పరిగెత్తి తాతను పట్టుకున్నాం. నొట్లొనుండి రక్తం కక్కుతూ గిల గిల కొట్టుకుంటున్నాడు. ఫిట్స్ అనుకోని గడ్డపార ని తాత చేతిలో పెట్టాం కానీ ఏమి మార్పు లేదు. వెంటనే తాత ని భుజం మీద ఎక్కించుకొని దగ్గర్లో వున్న డాక్టర్ దగ్గరికి పరిగెత్తాను.  వర్షం కొద్ది కొద్దిగా పెద్దదవుతుంది. అడుగులు తడబడుతున్నాయి. కాసేపటికి ఎలాగోలా డాక్టర్ ఇంటి దగ్గరికి చేరుకున్నాను. వెంటనే డాక్టర్ తాత ని కిందకి దింపి ఒక బల్లపై పడుకోబెట్టాడు. తాత ఇంకా రక్తం కక్కుతూ కొట్టుకుంటేనే వున్నాడు. నన్ను గట్టిగా పట్టుకొని మనోహరి జాగ్రత్త అని చెప్పాడు అతి కష్టం మీద. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. అంతలోనే మనోహరి కూడా అక్కడికి చేరుకుంది. తాత ను పట్టుకొని ఏడుస్తుంది. నాకు గుండెంతా బరువెక్కింది. దుఃఖం తన్నుకొస్తోంది. అయినా ధైర్యం నటిస్తూ మనోహరి కి ధైర్యం చెప్తున్నాను. కొద్దిసేపటికి గ్రామ ప్రజలు గుమిగూడారు. తాత ను మళ్ళి పాడె ఎక్కించారు. నేను ఒక వైపు పట్టుకున్నాను.

అప్పుడే అనుకున్నాను "నేను మోసేది నీ బరువు ని మాత్రమే కాదు తాత నీ బాధ్యతలను కూడా" అని. కొద్దిసేపటికి దహన సంస్కారాలు పూర్తయ్యాయి. మనోహరి ఇంటికెళ్ళాను. అప్పుడే చుట్టూ ఉన్నవాళ్ళంతా ఒక్కొక్కరుగా మనోహరి ని ఓదారుస్తూ వెళ్ళిపోసాగారు. ఆ రాత్రంతా అలాగే మౌనంగా కూర్చున్నాం. కొద్ది రోజుల పరిచయమున్న నాకే అంత బాధ వేస్తుంటే తన పరిస్థితి అర్ధం చేసుకోగలను.  తాను మామూలు మనిషి కావడానికి ఇంకో వారం పట్టింది. నేనా వూరికి వచ్చి నెల అయిపొయింది.ఇంతకుముందున్న సంతోషం ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను మనోహరి తో పాటు అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ రోజు చాల పెద్దగా గాలి దుమారంతో వర్షం కురుస్తోంది. పొలం వెళ్ళడానికి వీలు పడకపోవడంతో ఇంట్లోనే వున్నాం.  వర్షం పెద్దగా కురుస్తుండటం తో స్టోర్ రూమ్ కప్పు పై రంద్రం పడినట్లుంది రూమ్ లోనుండి నీళ్లు బయటికి వస్తున్నాయి. మనోహరితో ఆ రూమ్ తాళాలు తెరిపించి రూమ్ లోపలికి వెళ్ళాం. పైన ఒక పెంకు పక్కకు పడడంతో ఆ రంద్రం నుండి వర్షం కురుస్తుంది. పక్కనే ఉన్నటేబుల్ మీద ఎక్కి పెంకు సరి చేయడానికి ప్రయత్నించాను. అప్పటికీ ఎత్తు సరిపోకపోవడంతో చుట్టూ చూస్తుంటే పక్కనే ఒక ఇనుప పెట్టె కనిపించింది. అది టేబుల్ మీద వేసి దానిపైకెక్కి పెంకు సరి చేయడంతో నీరు కారడం ఆగిపోయింది. కిందికి దిగి ఆ పెట్టెలో ఏముందా అని చూద్దామని హాల్ లోకి తీసుకువచ్చాము. మనోహరి ఆ పెట్టె లక్ష్మయ్య తండ్రి రామచంద్రయ్య ది అని చెప్పింది. ఆ పెట్టెలో తాను రాసిన పద్యాలు, లక్ష్మయ్య తాత జాతకం ఇంకా కొన్ని బట్టలు, వస్తువులు వున్నాయి. పెట్టెలోకి నీళ్లు వెళ్లడంతో అవన్నీ తడిసిపోయాయి. వాటిని బయట పెట్టేసి ఆ ఇనుప పెట్టెని బోర్లా పెట్టాను దాని లోనున్న నీరు బయటికి పోవడానికి. అప్పుడే నా దృష్టి పెట్టె కింది భాగం లో ఉన్న రంద్రం మీద పడింది ఆ రంద్రం లో చిన్న పుల్ల పెట్టి లోపలకు నొక్కగానే పెట్టెలోపలినుండి ఒక ఇనుపరేకు కింద పది దాని మీద ఒక పుస్తకం పడింది.

మనోహరి కూడా ఎప్పుడు ఆ పుస్తకాన్ని చూడలేదు. చూడడానికి డైరీ లా వుంది. పుస్తకం తెరిచి చదవడం మొదలు పెట్టాం.

"ఇది ద్వాపర యుగం నాటి కథ. పలువురు చరిత్రకారుల పుస్తకాల ఆధారంగా నా పరిశోధనలతో తెలుసుకున్న కథ. ఒకప్పుడు వింధ్య రాజ్యమనే పెద్ద సామ్రాజ్యం ఉండేది. అది అంతర్యుద్ధాల ఫలితంగా మూడు రాజ్యాలుగా విడిపోయింది. ఆ రాజ్యాలే వంగ , కళింగ , కారుణ్య  రాజ్యాలు. కొన్ని సంవత్సరాల వరకు  ఈ మూడు రాజ్యాలు ఎప్పుడు తమ మధ్య యుద్దాలతోనే గడిపాయి. విశ్వకర్మ అను కారుణ్య రాజ్య సైన్యాధ్యక్షుడి కృషితో మూడు రాజ్యాలు సంధి కుదుర్చుకున్నాయి. ఆ సంధి కి చిహ్నంగా ప్రతి వార్షికం యుద్ధ పోటీలు జరుపుకుంటాయి. చాలా మంది ప్రజలు సంధి కి చిహ్నంగా ఈ యుద్ధ పోటీలేంటని ప్రశ్నించారు కానీ ఆ ప్రశ్న మూడు రాజ్యాల రాజుల వరకు వెళ్ళలేదు. ఈ పోటీల్లో వీర మరణం పొందిన వీరులందరి పేర్లను, వారి శిల్పాలను మూడు రాజ్యాల రాజ మందిరాల్లో ఉంచుతారు. ఎప్పటి లాగే ఆ వార్షికం కూడా ఈ మూడు రాజ్యాలు కలిసి తమ సంధికి  చిహ్నంగా పోటీలు మొదలు పెట్టాయి. మూడు రాజ్యాల నుండి మొత్తం తొమ్మిదుగురు ఈ  పోటీలలో పాల్గొంటారు. ప్రజలంతా ఎంతో ఆసక్తితో ఈ పోటీల కోసం ఎదురు చూడసాగారు .

మూడు రాజ్యాల సరిహద్దుల్లో కారుణ్య నది ఒడ్డున వున్న వింధ్య అరణ్యం మధ్యలో ఈ పోటీలు  నిర్వహిస్తున్నారు . ఈ పోటీల కోసం ప్రత్యేకంగా ఒక కట్టడాన్ని నిర్మించారు. వృత్తాకారంలో వున్న ఆ కోట మధ్యలో  ఒక చిన్న సరస్సు,సరస్సు చుట్టూ మనిషి ఎత్తున్న ఎండు గడ్డి మొక్కలు, ఆ సరస్సు  పక్కనే నింగిని తాకేలా వున్న ఒక పొడవాటి స్థూపం, ఆ స్థూపానికి మూడు వైపులా మూడు రాజ్యాల  చిహ్నాలు ఏనుగు, సింహం, గుర్రం వున్నాయి. కారుణ్య రాజ్యానికి సింహం, వంగ రాజ్యానికి ఏనుగు , కళింగ రాజ్యానికి గుర్రం చిహ్నాలు.మూడు రాజ్యాల రాజులు వారి బలగం, ప్రధాన అర్చకులు , తొమ్మిది మంది పోటీదారులు కలిసి ఆ స్తూపం దగ్గర పూజ నిర్వహించ సాగారు. పూజ పూర్తవగానే  రాజులు తమ తమ బలగాలతో కోట పైభాగానికి చేరుకున్నారు పోటీలను వీక్షించడానికి.

మొత్తం  తొమ్మిది మంది వున్న , అందులో ముగ్గురి మీదే అందరి ఆసక్తి. వారే అన్ని విద్యల్లో ఆరి తేరిన వారు , అపజయం ఎరుగని వారు, అసామాన్య వీరులు, ఆజాను బాహులు, అరవీర భయంకరులు, అన్నదమ్ములు  విక్రమ సింహ , అంగజ, అశ్వోత్తములు. ప్రజల హర్షధ్వానాల మధ్యలో పోటీలు మొదలుపెట్టారు ముగ్గురు రాజులు. తొమ్మిది మంది పోటీదారులు తమ ఆయుధాలతో సిద్ధమయిపోయారు. ఒక్క సారిగా కోట లోని తొమ్మిది ద్వారాలు తెరుచుకున్నాయి, వాటి లొనుండి దిక్కులు దద్దరిల్లేలా గాండ్రిస్థూ తొమ్మిది పులులు బైటకి వచ్చాయి. వాటి మీద సవారి చేస్తున్న సైనికుల ఆదేశాలతో  అవి సరస్సు వైపు పరుగులు తీసాయి. వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన విక్రమసింహుడు వ్రుత్తాకారంలో తొమ్మిది మందితో కలిసి తమ తమ కవచాలతో దుర్భెద్యమైన వలయాన్ని తయారు చెసాడు. అంతలోనె దూరం నుండి విక్రుతమైన అరుపు చెవులు దద్దరిల్లేలా వినిపించసాగింది. ఆ శబ్దం వింధ్యారణ్యం లోని కిన్నెర పక్షులదని అర్ధమయ్యేలొపే ఆ వలయం నుండి అశ్వోత్తమున్ని, హరివర్యున్ని తమ కాళ్ళతో తన్నుకు వెళ్ళాయి ఆకాశానికి. విక్రమసింహుడు వెంటనే తేరుకుని మిగిలిన ఏడుగురితో వలయాన్ని పూర్తి చేసాడు ఏ పులి తన పంజా రుచి చూపించకుండానికి తావివ్వకుండా. మరి కొన్ని కిన్నెర పక్షులు తమ కాళ్లతో వింధ్య అరణ్యం లోని మహా సర్పాలను తీసుకు వచ్చి వలయం పైకి వదిలి పెట్టాయి.ఆ మహా సర్పాల కాటు నుండి తప్పించుకుంటూ వలయం విచ్చిన్నం  కాకుండా పులులపై సవారీ చేస్తున్న సైనికుల దాడి ని అడ్డుకుంటున్నారు పోటీ దారులు. అంతలోనే హరివర్యున్ని తన్నుకువెళ్ళిన పక్షి సరసులొ హరివర్యున్ని వదిలేసి వలయం వైపు దూసుకు వచ్చింది. తన శిరస్సును కాళ్ళతో బందించడనికి వస్తున్న ఆ కిన్నెర పక్షిని  గమనించిన అంగజుడు  తన  శిరస్సు వంచి వలయాన్ని ఒక చేతితో ఆపుతూ ఇంకొక చేతితో పక్షి కాళ్ళను తన కత్తితో నరికేసాడు. బాధతో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఆ కిన్నెర పక్షి వింధ్యారణ్యం వైపు వెళ్ళిపోయింది.

ప్రజలు అంగజుని సాహసానికి జేజేలు పలికారు. సరస్సులో పడిన హరివర్యుడు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, అంతలొనే అతనికి కొంచెం దూరంలో వస్తున్న ముసల్ల గుంపు కనిపించింది. భయంతో తీరానికి ఈద సాగాడు. కాని అప్పటికే సమయం మించి పొయింది. తన కత్తితో ఒక మొసలి నోటిలో నుండి బయటికి దింపాడు, అంతలొనే ఇంకో మొసలి తను కత్తి పట్టుకున్న చేతి మీద దాడి చేసింది తన పదునైన పళ్ళతో. .అన్ని మొసల్లు ఒక్క సారే దాడి చెయడంతో తన తుది శ్వాస విడిచాడు హరివర్యుడు ఆ సరస్సులో.  కొద్ది సెపట్లొనే సరస్సు మొత్తం రక్తంతో ఎర్రగ మారిపొయింది. కొంచెం అదును కొసం ఎదురు చూస్తున్న విక్రమసింహుడు, అంగజుడు ఒకరికొకరు సైగలు చేసుకొని పక్క వాళ్ళ వైపు చూసారు.వాళ్ళు అర్ధమైందన్నట్లుగా ఒక్కసారిగా బలమంతా ఉపయోగించి  పులులను వెనక్కి నెట్టారు. వెంటనే విక్రమ, అంగజులు తమ కత్తులతో పులుల మీద సవారి చేస్తున్న సైనికుల తలలు ఎగిరిపడేలా నరికేసి చెరొక పులి పై కూర్చొని ఎత్తయిన  గడ్డి మొక్కల్లోకి చెరొక దిశగ పరిగెత్తించారు పులులను.  విక్రమ సింహుని వెంబడి ఇద్దరు సైనికులు, అంగజుని వెంబడి ఇద్దరు సైనికులు తమ పులులని పరిగెత్తించారు. వలయం విచ్చిన్నం కాకుండా మిగిలిన పోటిదారులు జగ్రత్త పడ్డారు.

విక్రమ సింహుడు, అంగజులు తమ కత్తితో వెళ్తున్న దారిలొ గడ్డి మొక్కలను నరుకుతూ వెళ్ళ సాగారు. వారు అనుకున్నట్లుగానే కాసేపటికి విక్రమ సింహుడు అంగజులు ఎదురెదురుగా వచ్చారు వెంటనే ఇద్దరు తమ ఒరల్లో నుండి రెండు కత్తులని తీసి, వారి వెనుక వస్తున్న సైనికులకు ఏం జరిగిందో అర్ధమయ్యే లోపే విక్రమ సింహుడు అంగజుని వెనుక వస్తున్న సైనికుల్ని , అంగజుడు విక్రమ సింహుని వెనుక వస్తున్న సైనికుల తలలు నరికేసి అదే వేగంతో వారు సవారీ చేస్తున్న పులుల డొక్కల్లోకి తమ కత్తులని దింపారు. అ నలుగురు సైనికుల శరీరాలు, వారు సవారి చేస్తున్న పులులు ఒక్క సారిగా కుప్పకూలిపొయాయి. ఏ మాత్రం సమయం వృధా చేయకుండా వలయం వైపు పరుగులు తీయించారు తమ పులులని.

సరిగ్గా తన శిరస్సుని సరస్సులో  వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ కిన్నెర పక్షిని తన కత్తితో ఆ పక్షి కాలు లోకి దింపి దాని ఆధారంతో  ఆ పక్షి పైకి అధిరోహించి తన ఆధీనం లోకి తెచ్చుకొని దాన్ని వలయం వైపు మళ్ళించాడు అశ్వోత్తముడు. విక్రమ సింహుడు అంగజులు సరస్సు వద్దకు  చేరుకొనే సరికి వలయం అప్పటికే విచ్చిన్నమైపోయింది. విదూషుడు, అజేయులు వీర మరణం  పొందారు . మిగిలిన ముగ్గురు పోటీ దారులు గాయాలతో పులులతో, మహా సర్పాలతో తలపడుతున్నారు. వేగంగా  అంగజ, విక్రమ సింహులు రెండు వైపుల నుండి సైనికులపై విరుచుకుపడ్డారు. ఇంకో వైపు నుండి  అశ్వోత్తముడు  కిన్నెర పక్షి సాయంతో ఒక్కో సర్పాన్ని వధించ సాగాడు.. అర గడియలో మిగిలిన సైనికులందరిని సంహరించేసారు.

కిన్నెర పక్షి నుండి అశ్వోత్తముడు, పులుల పై నుండి విక్రమ సింహుడు, అంగజుడు కిందికి దిగారు . పులులు కోట గోడ వైపు , కిన్నెర పక్షి వింధ్యారణ్యం వైపు లఘించాయి . ప్రజల  హర్షద్వానాలు  మిన్నంటాయి . అప్పటి వరకు గాయంతో ఉన్న ఒక పులి పోటీదారుడైన ప్రద్యుషుని పైకి దూకింది వెనక నుంచి . అది గమనించిన  విక్రమ  సింహుడు , అశ్వోత్తముడు  తమ  కత్తులతో  మెరుపు  వేగంతో  ఆ పులి ముందు కాళ్ళు నరికేసారు, ఆ పులి అలానే సరస్సులో పడిపోయింది.

పోటీ పూర్తయ్యినట్లు కారుణ్య రాజ్యాధీశుడు సైగలు చేయగానే సంబరాలు ఆకాశాన్నంటాయి . ముగ్గురు రాజులు ఒక చోటుకి చేరుకున్నారు. పోటీదారులందరిని పిలిచి అభినందించ సాగారు. కారుణ్య రాజ్యాధీశుడు ప్రజలనుద్దేశించి ఉపన్యసించసాగాడు . “ఈ పోటీ లో గెలిచిన వంగ, కళింగ  కారుణ్య రాజ్య పోటీదారులకు నా అభినందనలు.ఈ పోటీల్లో విక్రమ, అంగజ, అశ్వోత్తములు వారి తండ్రి విశ్వకర్మ ని గుర్తుకు తెచ్చారు. ఈ మూడు రాజ్యాల సంధి  కి  ఎంతో  కృషి చేసిన విశ్వకర్మునికి మూడు రాజ్యాలు ఎంతో  రుణపడి  ఉంటాయి. ఈ రోజుని చరిత్ర లో  గుర్తుపెట్టుకునేలా ముగ్గురు  రాజులం  కలిసి  ఒక  చారిత్రాత్మక  నిర్ణయం  తీసుకున్నాం. వచ్చే  పౌర్ణమి నుండి  విక్రమ సింహుడు కారుణ్య  రాజ్యానికి, అంగజుడు కళింగ రాజ్యానికి, అశ్వోత్తముడు వంగ రాజ్యానికి  సర్వ సైన్యాధ్యక్షులుగా నియమించబడుదురు. వచ్చే పౌర్ణమి ముందు రోజు అంటే సరిగ్గా ఏడు దినముల తరువాత అంగజ, అశ్వోత్తములు వంగ, కళింగ రాజ్యాలకు ప్రయాణమవుతారు.”

ఈ  అనూహ్య ప్రకటనను విని కారుణ్య రాజ్య ప్రజలంతా నివ్వెరపోగా, వంగ కళింగ రాజ్యాల ప్రజలు  ఆనందంతో అంగజ అశ్వోత్తముల పేర్లు అరవసాగారు.పైకి గర్వంగా వున్నా అన్న దమ్ములకు  లోపలో ఎంతో బాధ వేయసాగింది. ఇన్ని వార్షికాలు కలిసున్న అన్న దమ్ములు వచ్చే పౌర్ణమి నాటికి విడిపోబోతున్నారు . ఆ ప్రజల అరుపుల మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాత్రం అసూయతో  రగిలి  పోతు ఒకరి మొఖం ఒకరు చూసుకోసాగారు. ఆ గరళకంఠుని గళములో వుండే విషాన్ని  మించివుంటుంది వాళ్ళ కళ్ళలో అసూయ. వారే  వంగ, కళింగ రాజ్యాల సైన్యాధీశులు కబేరుడు, అఖిలేశ్వరుడు. అంతటితో ఆ పోటీలు ముగియడంతో ప్రజలు వారి వారి రాజ్యాలకు బయల్దేరారు. ముగ్గురు అన్నదమ్ములు మాత్రం వారి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తామెప్పుడూ కలుసుకునే  స్థలానికి బయల్దేరారు . కారుణ్య నది పక్కనే ఉన్న చిన్న కుటీరం అది. ఆ స్థలం వాళ్ళు తమ  నాన్నతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు తెస్తుంది. సంధ్య సమయం లో కారుణ్య నది పైన ఉన్న పెద్ద  చెట్టు కొమ్మ పై కూర్చో పెట్టి, వాళ్ళ నాన్న చెప్పిన వీరుల కథలు, ఒకే ఏనుగు తొండం పై ముగ్గురుని  కూర్చోబెట్టి స్నానం చేపించిన రోజులు, పక్కనే ఒడ్డుపై చెక్క కత్తులతో శిక్షణ ఇచ్చిన క్షణాలను ఆ  స్థలం గుర్తుకు తెస్తుంది. ఎన్నడూ లేని విధంగా వారి మధ్యలో మౌనం రాజ్యమేలుతుంది

విక్రమ సింహుడు కుటీరంలోకి వెళ్లి ధనుస్సు బాణాలతో బయటికి వచ్చాడు .

వాళ్ళ తండ్రి విశ్వకర్ముడు తయారు చేసిన విల్లది. అదే ధనస్సుతో ఒకసారి విశ్వకర్ముడు వరుసగా  ఉన్న ఏడు వృక్షాల మధ్యలో రంద్రం పడేలా బాణం సంధించాడు. ఆ రోజు నుండి ముగ్గురు అన్న  దమ్ములు ప్రతి రోజు ఆ ఏడు వృక్షాల మద్యలోనున్న రంద్రం నుండి బాణం పంపడానికి  ప్రయత్నించడం పరిపాటి. ఇప్పటి వరకు అశ్వోత్తముడికి  తప్ప ఎవరికీ అది సాధ్యపడలేదు. ఈ  సారి కూడా అదే జరిగింది విక్రమ సింహుని బాణం, అంగజుని బాణం మూడు చెట్లు దాటేసి  ఆగిపోయాయి . అశ్వోత్తముడు మాత్రం అవలీలగా ఆ ఏడు చెట్ల రంద్రాల మధ్యలోనుండి బాణాన్ని  పంపించేశాడు. విలువిద్యలో  అశ్వోత్తముడు మేటి .కత్తి యుద్ధం లో విక్రమ సింహుణ్ణి  మించిన  వాళ్ళు లేరు.ఇక అంగజుని బలం భీమునితో సమానం .

అప్పటికే చీకటి పడుతుండటంతో ధనుస్సుని కుటీరం లో ఉంచి అన్నదమ్ములు తమ తమ గుర్రాలతో బయలుదేరడానికి  సిద్ధమయ్యారు . సరిగ్గా అప్పుడే కారుణ్య నది లో ఒక శవం కొట్టుకు  రావడం చూసారు. కారుణ్య రాజ్య సైనికుని శరీరం అది. అతని గుండెలోనుండి బాణం దింపబడి  వుంది. వెంటనే అన్నదమ్ములు నది పై వైపుకి గుర్రాలని పరిగెత్తించారు. వాళ్ళనుకున్నట్లు గానే  కొంచెం దూరంలో ఒక బందిపోటు ముఠా కనిపించింది. పది మంది సైనికుల్ని చంపి కుప్పగా  పడేసి అప్ప్పుడే ద్రోణాగిరి కొండ ఎక్కడానికి సిద్ధంగా వున్నారు .
అశ్వోత్తముడు ఆలస్యం చేయకుండా బందిపోటు ముఠాపై బాణాలు సంధించాడు. ఒక బాణం  మధ్యలో ఉన్న మూడు చెట్లనుండి రంద్రం చేసుకుంటూ వెళ్లి ఒక బందిపోటు దొంగ తల గుండా  దూసుకుపోయింది . వెంటనే అప్రమత్తమైన మిగతా ముఠా సభ్యులు వంతెన పైకి వాళ్ళ గుర్రాలను  పరిగెత్తించారు. అశ్వోత్తముని మరొక బాణం, విక్రమ సింహుడు విసిరిన శూలం ఒకే సారీ వంతెనకు  ఒడ్డున ఉన్న ఆధారాన్ని తెంపడంతో ఆ వంతెన ఒక్కసారిగా నదిలో పడిపోయింది. అప్పటికే ఆ  వంతెన మీదున్న ఒక బందిపోటు దొంగ నదిలో పడిపోయాడు హాహాకారాలు చేస్తూ.

సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దం చేస్తూ అయిదు వృక్షాలు ఆ నది పైన వంతెనలా బాట వేస్తూ  నేలకొరిగాయి. ఒక బాణం అశ్వోత్తముని చేతిలో ఉన్న విల్లుని  విరిచేసింది. అశ్వోత్తముడు తృటిలో ఆ బాణం నుంచి తప్పించుకుని గుర్రం నుండి కింద పడిపోయాడు   మిగిలిన ముఠా సభ్యులు తమ గుర్రాలతో ఆ చెట్ల పై నుండి “జయహో  నాయక ” అని వాళ్ళ  నాయకునికి జేజేలు పలుకుతూ ఆ కారుణ్య నదిని  దాటేసారు. వెంటనే ఆ దండనాయకుడు చెట్ల  మధ్యలోకి విరిగేలా బాణాలు  విసిరాడు .ఆ విరిగిన చెట్లు కారుణ్య నదిలో కొట్టుకుపోసాగాయి . ఆ  దండనాయకుని విలువిద్యని చూసి అన్నదమ్ములు  నిశ్చేష్యులయ్యారు. దూరంగా చీకటిలో  మాయమైపోతున్న ఆ బందిపోటు దొంగల్ని చూస్తూ కూడా ఏమి చేయలేక పోయారు. అశ్వోత్తముని  బాణం తాకి చనిపోయిన దొంగ ని విక్రమ సింహుడు తన గుర్రంపై ఎక్కించుకొని కారుణ్య రాజ్య మహామంత్రి కౌటిల్యుని గృహం వైపు తన గుర్రాన్ని పరిగెత్తించాడు. అతని వెనకాలే  అశ్వోత్తముడు  అంగజుడు తమ గుర్రాలతో బయల్దేరారు.

రాజకార్యాలు పూర్తి చేసుకొని కౌటిల్యుడు అప్పుడే నిద్రకు ఉపక్రమించాడానికి  సిద్దమయ్యాడు. బయట గుర్రాల శబ్దం వినిపించడంతో అప్రమత్తమయ్యాడు. కాసేపటి తర్వాత కాపలా భటుడు  వచ్చి విశ్వ కర్మ కుమారులు వచ్చినట్లుగా విన్నవించాడు. వారిని లోపలికి రమ్మన్నట్లుగా సైగ  చేసాడు మహామంత్రి. తమతో తెచ్చిన ఆ ముఠా సభ్యుని శవాన్ని నేలపై పడేసి జరిగిందంతా వివరించాడు విక్రమ  సింహుడు  మహామంత్రికి . అప్పుడే అశ్వోత్తముడు  మధ్యలో  కలుగ  జేసుకొని  “మా తండ్రి  విశ్వకర్మునికి సాటిగా వారి దండనాయకుడు విలువిద్యలో ఆరితేరాడు ఎవరు మహామంత్రి తాను ??”

“తన పేరు గంగాధరుడు.మీ తండ్రికి స్నేహితుడు.మీ తండ్రి ఈ కారుణ్య రాజ్యానికి  సర్వ సైన్యాధీశుడుగా వున్నపుడు గంగాధరుడు ఉప సైన్యాధీశునిగా వుండే వాడు. మీ తండ్రి విశ్వ కర్ముని హత్యానేరం కింద గంగాధరునికి మరణ శిక్ష విధించాడు మహా రాజు. కానీ తప్పించుకొని కైలాస పర్వతం పక్కనే ఉన్న  కింకర రాజ్యంలో తలదాచుకున్నాడు కొద్ది  రోజులు.ఆ తర్వాత అక్కడ కింకర రాజ్య సింహాసనానికి  వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు దారులకి నాయకుడిగా వారి దండనాయకుడిగా  మారిపోయాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత మొదటి సారి మన రాజ్యంలో అడుగుపెట్టాడు. దానికి కారణం  తెలుసుకోవాలి. ఉదయం మహారాజు గారి తో ఈ విషయం చర్చిస్తాను.ఈ విషయాన్నీ ఇక నాకు  వదిలిపెట్టండి “ అని విక్రమ సింహుని వైపు చూసాడు మహామంత్రి. 

అర్ధమయ్యిందన్నట్లుగా అన్నదమ్ములు బయటికి బయల్దేరారు. వారం రోజులు గడిచిపోయాయి. మరునాడు పౌర్ణమి అనగా అంగజుడు కళింగ రాజ్యానికి, అశ్వోత్తముడు వంగ రాజ్యానికి బయల్దేరారు. తల్లి విద్యావతి దగ్గర సెలువు తీసుకొని కారుణ్య నది ఒడ్డున ఉన్న  కుటీరానికి  చేరుకున్నారు. విక్రమ సింహుడు విశ్వ కర్ముని ధనస్స్సు ని అశ్వోత్తమునికి, తన శూలాన్ని అంగజునికి బహుమతి గా ఇచ్చాడు. అంగజ అశ్వోత్తములు బయల్దేరారు తమ బలగాలతో. వారి వెనుకనే విక్రమ సింహుడు కారుణ్య రాజ్య సైనికులతో బయల్దేరాడు. వింధ్యారణ్యంలో అంగజుడు అశ్వోత్తముడు వెళ్తున్న దారికి ఇరు వైపులా ఏనుగులు తొండంతో పూలు చల్లుతున్నాయ్. ఆ దారి పైన కిన్నెర పక్షులు తమ రెక్కలతో పందిరి వేసాయి. వంగ కళింగ కారుణ్య రాజ్యాలు కలిసే చోట కారుణ్య రాజ్య మహారాజు వీరికి వీడుకోలు పలికాడు. వంగ కళింగ రాజ్యాల సైనికులు తమకు కాబోయే సైన్యాధ్యక్షులకు ఘన స్వగతం పలికారు. వారి వారి రాజ్యాల్లో. పౌర్ణమి నాడు విక్రమ సింహ , అంగజ  , అశ్వోత్తముల నియామకం ఘనంగా జరిగింది.

అన్నదమ్ములు సైన్యాధీశులు గా నియమింపబడి అయిదు సంవత్సరాలు ముగిసాయి. ఈ ఐదు సంవత్సరాలలో వారి వివాహాలు కూడా జరిగిపోయాయి. వీరి పరాక్రమాలు గురించి దేశమంతటా చెప్పుకోసాగారు. వంగ రాజ్య మహారాజు ఆజ్ఞల ప్రకారం కింకర రాజ్యం తో చేతులు కలిపి అశ్వోత్తముడు దండనాయకుడైన గంగాధరుని బందీ గా పట్టుకొని దుర్బేధ్యమయిన వంగ రాజ్య కారాగారం లో ఉంచాడు. కింకర రాజ్యం వంగ రాజ్యానికి సామంత రాజ్యం గా మారింది. అప్పుడే కురుక్షేత్ర మహా సంగ్రామం గురించి ముగ్గురు రాజులకు వార్త అందింది.  దాని గురించి చర్చించడానికి ఒక రోజు కారుణ్య రాజ్యం లో కలుసుకున్నారు ముగ్గురు మహా రాజులు. వారి రాజులతో పాటు అంగజ, అశ్వోత్తములు కూడా కారుణ్య రాజ్యానికి వచ్చారు. ముగ్గురు అన్నదమ్ముల ఆనందానికి అవధులు లేవు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పాండవులతో కలిసి యుద్ధం చేయాలన్న కారుణ్య రాజ్య మహారాజు నిర్ణయం మిగిలిన ఇద్దరు రాజులకు నచ్చలేదు. మహామహులున్న కురు సేన ని పాండవులు ఓడించలేరని వారి నమ్మకం.

కారుణ్య రాజ్యం పాండవుల పక్షాన పోరాడడానికి నిర్ణయించుకోగా వంగ కళింగ రాజ్యాలు కౌరవుల పక్షం పోరాడటానికి నిర్ణయిచుకున్నాయి. అన్న విక్రమ సింహుని తో యుద్ధం చేయాలన్న ఆలోచన రాగానే అంగజ అశ్వోత్తముల గుండెలు పగిలిపోయాయి. కానీ రాజాజ్ఞని ధిక్కరించే ధైర్యం వారిలో లేదు. విక్రమ సింహుని పరిస్థితి కూడా అలాగే వుంది.

కొద్ది రోజుల తరువాత  విక్రమ సింహుడు తన సైన్యంతో ఇంద్రప్రస్థ కు బయల్దేరాడు. ఇంద్రప్రస్థ కు చేరుకోవడానికి సరయు నది ఒడ్డున ఉన్న కోసల రాజ్యం గుండా ప్రయాణించాలి.  కోసల రాజ్యం అప్పటికే కౌరవుల పక్షాన పోరాడటానికి నిర్ణయించుకుంది. విక్రమ సింహుణ్ణి అడ్డుకోవాల్సింది గా అప్పటికే కోసల రాజ్యానికి దుర్యోధనుని నుండి ఆజ్ఞలు అందాయి. దాంతో కారుణ్య రాజ్య సైన్యాలకు కోసల రాజ్య సైన్యాలకు మధ్య సరయు నది ఒడ్డున మహా సంగ్రామం జరిగింది. అప్పటికే విక్రమ సింహుని ఆధ్వర్యం లో ఎన్నో యుద్ధాల్లో వీరోచితంగా పోరాడి గెలిసిన కారుణ్య రాజ్య సైన్యానికి కోసల రాజ్యాన్ని ఓడించడానికి నాలుగు దినములు సరిపోయింది. ఆలా కురుక్షేత్ర మహాసంగ్రామం ముందే పాండవ పక్షానికి ఒక విజయం దక్కింది. పాండవ సేనలో ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇంద్రప్రస్థ చేరుకున్న విక్రమ సింహున్ని అతని సైన్యాన్ని సాదరంగా ఆహ్వానించారు పాండవులు.  

అంగజ అశ్వోత్తములు కూడా తమ సైన్యం తో హస్తినాపురి చేరుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే అనుకున్నట్లుగానే కృష్ణుని శాంతి రాయబారం విఫలం కావడం తో కురుక్షేత్ర మహా సంగ్రామం మొదలయ్యింది. మొదటి రోజు భీష్మ ద్రోణుల ఆధ్వర్యంలో అంగజ అశ్వోత్తములు , యుధిష్టురుని అద్వర్యం లో విక్రమ సింహుడు యుద్ధం లో పాల్గొన్నారు. అంగజ అశ్వోత్తములు ఒకరినొకరు కాపాడుకుంటూ పాండవ సేన పై విరుచుకు పడ్డారు. భీష్మ ద్రోణ అంగజ అశ్వోత్తముల ధాటికి పాండవ సేన విలవిలలాడిపోయింది. మొదటి రోజు విజయం కౌరవులనే వరించింది. తన శిష్యుడు విశ్వకర్ముని కుమారులయిన అంగజ అశ్వోత్తముల యుద్ధ విద్యలు చూసి ద్రోణాచారుడు అబ్బురపడ్డాడు.రెండవ రోజు అశ్వోత్తముడు విశ్వకర్ముని విల్లుని ధరించి రణ భూమి లో అడుగు పెట్టాడు. దుర్యోధనుని ఆజ్ఞల ప్రకారం ధర్మరాజు ను బందీ గా పట్టుకోవాలి. అర్జునుణ్ణి ధర్మ రాజు నుండి వేరు చేయాల్సిన భాద్యత అశ్వోత్తముని పై ఉంచారు. యుద్ధం మొదలవగానే అర్జునుని రథం  వైపు పరుగులు తీసింది అశ్వోత్తముని రథం. ఇంకో వైపు భీముడు అంగజుని సేన పై విరుచుకు పడుతుండగా విక్రమ సింహుడు , ధర్మ రాజు భీష్మ ద్రోణులతో తలపడుతున్నారు.

ఆ రోజు అర్జునుడు అశ్వోత్తముల మధ్యలో భీకర యుద్ధం జరిగింది. అర్జునిని ఒక బాణం అశ్వోత్తముని రథాన్ని నడుపుతున్న సైనికుణ్ణి వధించిందీ. దాంతో రథం అదుపు తప్పి కింద పడిపోయింది.రథంతో పాటు కిందపడిన అశ్వోత్తముడు తేరుకొని కోపంతో రథం తో విడిపోయిన గుర్రాన్ని తన అధీనం లోకి తెచ్చుకొని దాని పైకి అధిరోహించి మెరుపు వేగంతో రణ భూమి లో కదలాడాడు. దేవుళ్ళు ఇచ్చిన అస్త్రాలు లేవు కానీ తన తండ్రి ఇచ్చిన శిక్షణ మెండు గా వుంది.

అశ్వోత్తముని విల్లు నుండి వచ్చే ప్రతి బాణం పాండవ సైనికుల పాలిట యమపాశం గా మారింది. ఇది చూసి వంగ రాజ్య సైనికులు నూతన ఉత్సాహం తో పాండవ సైనికులపై విరుచుకు పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండటం చూసి అర్జునుని రథాన్ని అశ్వోత్తముని వద్దకు పరుగులు తీపించాడు కృష్ణుడు. ఇంకో వైపు ధర్మ రాజు ని బందీ గా పట్టుకోవాలని భీష్మ ద్రోణుల ప్రతి ప్రయత్నాన్ని విక్రమ సింహుడు విఫలం చేయ సాగాడు. యుద్ధ వ్యుహాలలో ఆరితేరిన భీష్మ ద్రోణుల వ్యూహాలకు కూడా ప్రతి వ్యూహాలు  రచించసాగాడు విక్రమ సింహుడు. కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణ ద్రోణాగిరి లో తాను కనుక విశ్వ కర్ముని ప్రాణాలు కాపాడి ఉండకపోతే ఈనాడు ఈ ముగ్గురు యోధుల పరాక్రమాలను ప్రపంచం చూసుండేది కాదు అని మనసులోనే అనుకున్నాడు ద్రోణాచార్యుడు. మరొకవైపు భీమసేనుడు కళింగ సెనలపై విరుచుకు పడుతున్నాడు. అంగజుడు తన శక్తినంత ఉపయోగించి భీముణ్ణి అడ్డుకుంటున్నాడు.

కృష్ణుడు రథాన్ని నడుపుతుండగా అర్జునుడు తన బాణాలతో వందల కొద్దీ వంగ రాజ్య సైనికుల్ని రణభూమి కి బలి ఇస్తున్నాడు. కొద్దీ సేపటికి రథం అశ్వోత్తముని వద్దకు చేరుకుంది. మెరుపు వేగంతో కదులుతున్న అశ్వోత్తముణ్ణి అందుకోవడం అర్జునికి శక్తికి మించిన పనయ్యింది. అశ్వోత్తముడు తన బాణం తో అర్జునిని విల్లుని విరిచేసాడు. మరొక బాణం అర్జునిని తలకు గురి పెట్టి వదిలాడు. అప్పుడే కృష్ణుడు రథం ఒక చక్రాన్ని ముందు ఉన్న రాయి పైకి ఎక్కించాడు. రథం కొంత ఎత్తుకు లేవడంతో అర్జునుని తలకు తగలాల్సిన బాణం అర్జునుని కవచాన్ని ఛేదిస్తూ ఛాతికి తగిలింది.

వెంటనే కృష్ణుడు శంఖం పూరివ్వడంతో పాండవ సైనికులు అర్జునుని రథం చుట్టూ వలయాన్ని ఏర్పరచగా ద్రుష్టద్యుమ్నుని ఆజ్ఞలతో పాండవ అశ్వ దళం అశ్వోత్తముని పైకి, వంగ సైన్యాలపైకి దండెత్తింది. భీమా సేనుడు కూడా తన సైన్యాన్నంత అశ్వోత్తముని పైకి మళ్ళించాడు. అంగజుడు భీష్ముడు ద్రోణుడు ముందుండి అశ్వోత్తముణ్ణి వెనుకకు పంపించారు. విక్రమ సింహుడు, ధర్మరాజు, భీమా సేనుడు, ధృష్టద్యుమ్నుడు ఒకవైపు భీష్ముడు అంగజుడు ద్రోణుడు అశ్వోత్తముడు మరియు కౌరవ కుమారులు మరొక వైపు నిలిచి యుద్ధం చేస్తుండటంతో వేల మంది సైనికులు నేలకొరిగారు.  భీమ సేనుని దాటికి దృతరాష్టుని పుత్రులు ఒక్కరొక్కరుగా నెలకొరుగుతున్నారు. కాసేపటికే సూర్యుడు అస్తమించుతుండటంతో యుద్దాన్ని నిలిపి వేశారు.

రెండు వైపులా ప్రాణ నష్టం బాగా జరిగింది. పచ్చని పంటల తో పులకించాల్సిన పుడమి తల్లి ధర్మం పేరుతొ జరుగుతున్న ఈ మారణహోమం లో రక్తం తో , మాంసపు ముద్దలతో తడిసిపోయింది. ఈ మారణకాండ ను చూడలేననుకున్నాడేమో ఆ సూర్యుడు కూడా త్వరగా అస్తమించాడు. 

పాండవ శిబిరంలో అర్జునుడు చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడన్న వార్త దావాహంలా పాకుతుంది. ఒక కుటీరం లో కృష్ణుడు, ధర్మ రాజు నిల్చొని ఉండగా వైద్యులు  అర్జునుణ్ణి పరిశీలిస్తున్నారు. అర్జునుడు చివరి ఘడియల్లో ఉన్నట్లు ధర్మ రాజు కి కృష్ణుడికి తెలిపారు వైద్యులు. ఈ యుద్దానికి కారణుడైన తనను తానే నిందించుకుంటూ బాధ పడుతున్నాడు యుధిష్టురుడు. అప్పుడే మారు వేషంలో ద్రోణాచార్యుడు ఆ కుటీరంలోకి వచ్చాడు. గుర్తు పట్టిన ధర్మ రాజు  అయోమయంగా చూస్తున్నాడు. అప్పుడే ద్రోణా చార్యుడు తన మారువేషం తొలగించి ధర్మరాజు తో చెప్పసాగాడు "నేను మీకు గురువు కాకముందు దక్షిణ ద్రోణగిరి అనే గ్రామంలో కొద్ది రోజులు వున్నాను. అక్కడే ఒక వింత మొక్కను చూసాను, చూడటానికి సంజీవని మొక్కలా వుంది. ఒక రోజు ఆ కొండపైన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విశ్వకర్మ అనే సైనికునికి తులసి తీర్థం లో ఈ మొక్కల రసాన్ని కలిపి తాగించాను. విశ్వకర్ముడు కొద్దీ నిమిషాల్లోనే మామూలు మనిషిగా తయారయ్యాడు. ఆ విశ్వకర్మ పుత్రులే ఈ విక్రమ సింహ, అంగజ, అశ్వోత్తములు. ఆ తర్వాత అక్కడ ఋషులు చెప్పిన దాని ప్రకారము త్రేతాయుగం లో ఆంజనేయుడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడటానికి సంజీవని తో ఉన్న పర్వతాన్ని తీసుకొని వస్తున్నపుడు  ఆ పర్వతం లోని ఒక భాగమయిన దక్షిణ ద్రోణగిరి కింద పడింది. అందుకే ఆ గ్రామానికి దక్షిణ ద్రోణగిరి అని పేరు పడిందని తెలిసింది. కానీ ఈ సంజీవని మనిషి చావు బతుకులతో ఉన్నపుడే ఇవ్వాలి. అలా కాక చనిపోయిన వ్యక్తికి ఈ సంజీవని ఇస్తే పక్షం రోజులను మించి ఆ వ్యక్తి బ్రతుకలేడు" అని చెప్పి దక్షిణ ద్రోణాగిరి కారుణ్య రాజ్యం లో ఉందని, ఆ మొక్క ఉన్న స్థలం గురించి  ధర్మరాజుకి తెలిపి కృష్ణుని దగ్గర, ధర్మ రాజు దగ్గర సెలవు తీసుకొని , చావుబతుకులతో ఉన్న అర్జునుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ద్రోణాచార్యుడు.

ఇప్పటికిప్పుడు వాయు వేగంతో దక్షిణ ద్రోణాగిరి వెళ్లి ఆ సంజీవని తెచ్చేదెవరని అలోచించి వెంటనే ఆలస్యం చేయకుండా విక్రమ సింహుణ్ణి పిలిపించారు. విక్రమ సింహుడు వెంటనే తన వాహనమైన కిన్నెర పక్షిని అధిరోహించి దక్షిణ ద్రోణాగిరి వైపు బయల్దేరాడు. ఉరుములు  మెరుపులను లెక్క చేయలేదు. కురుస్తున్న వర్షంతోనే దాహం తెరుచుకుంటుంది ఆ కిన్నెర పక్షి.ఆగమేఘాల మీద వెళ్లడమంటే ఏమిటో ఆ రోజు విక్రమ సింహుడు చూపించాడు. సంజీవని తీసుకొని పాండవ శిబిరానికి చేరుకున్నాడు. విక్రమ సింహుడు సంజీవని తీసుకొని దిగగానే ఆ కిన్నెర పక్షి ఇక ఈ మహా కావ్యంలో తన పాత్ర పూర్తయ్యిందన్నట్లుగ ప్రాణాలు విడిచింది. వెంటనే ధర్మరాజు తులసి తీర్థం లో సంజీవని ని కలిపి అర్జునిని తో తాగిపించాడు. కొద్ది సమయం తరువాత అర్జునుడు మాములుగా అయిపోయాడు. పాండవులంతా విక్రమ సింహుని కౌగిలించుకొని ధన్యవాదాలు తెలిపారు. మరుసటి రోజు కోసం వ్యూహాలు సిద్ధం చేయసాగారు పాండవులు. విక్రమ సింహుడు మాత్రం బయటికి వచ్చి ఆ కిన్నెర పక్షి ని అక్కున చేర్చుకొని వీడుకోలు తెలిపాడు.

అర్జునుడు అశ్వోత్తమునిపై కోపంతో రగిలిపోతున్నాడు. మరుసటి రోజు యుద్ధంలో అతనిని ఎలా అయినా సంహరించాలని పట్టుదలతో వున్నాడు. అప్పుడే కృష్ణుడు చెప్ప సాగాడు. "అశ్వోత్తముడు గొప్ప యోధుడే కానీ యుద్ధ వ్యూహాలతో ఆరితేరిన వాడు కాదు. అంగజుడు కూడా ఆ కోవకు చెందిన వాడే" . అర్జునుడు అర్ధమయ్యిందన్నట్లుగా విక్రమ సింహుని లోపలికి పిలిపించాడు. అశ్వోత్తముణ్ణి అంగజుణ్ణి మిగిలిన కౌరవ సేన నుండి వేరు చేయడానికి వ్యూహం పన్నారు. ఈ మహా సంగ్రామం లో తన సోదరులు సమిధలు కాబోతున్నారని విక్రమ సింహునికి అర్ధమయ్యిపొయింది. తాను మరుసటి రోజు యుద్ధం లో పాల్గొనలేనని తన స్థానం లో ఉప సైన్యాధీశుడు జయకేతుడు కారుణ్య రాజ్యానికి అధ్యక్షత వహిస్తాడని పాండవులకు మనవి చేసుకున్నాడు. విక్రమ సింహుని బాధ ను అర్ధం చేసుకున్న పాండవులు అతని కోరికను అంగీకరించారు..

మరుసటి రోజు ఉదయం చనిపోయాడనుకున్న అర్జునుని చూసి పాండవ సేన లో ఉత్సాహం రెట్టింపయ్యింది. యుద్ధం  మొదలయిన కాసేపటికే అంగజుణ్ణి అశ్వోత్తముణ్ణి మిగిలిన కౌరవ సేన నుండి వేరు చేసారు. తరువాత భీమ సేనుడు తన సైన్యం తో అంగజుని పై విరుచుకు పడ్డాడు.

అర్జునుడు అశ్వోత్తముని సేనపై బాణాల వర్షం కురిపిస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన వంగ, కళింగ రాజ్య ఉప సైన్యాధీశులు కబేరుడు, అఖిలేశ్వరుడు అర్ధ సైన్యాన్ని తీసుకొని రణభూమిలో మరొక వైపుకు చేరుకున్నారు. అంగజ, అశ్వోత్తములు మిగిలిన సైనికులతోనే  భీమార్జునులు   సైన్యంతో పోరాడ సాగారు. భీముడు తాను కూర్చున్న ఏనుగు తో అంగజుని రథాన్ని నేలకూల్చాడు.  నేలకొరిగిన అంగజుడు లేచి అన్న విక్రమ సింహుడు ఇచ్చిన శూలాన్ని భీముని కి గురిపెట్టి విసిరాడు. భీముడు కూడా దానిని అడ్డుకోడానికి తన గదను విసిరాడు. కానీ ఆ గద ను చీల్చుకుంటూ అంగజుని శూలం భీముని వైపుకు రాసాగింది. తృటి లో భీముడు కూర్చున్న ఏనుగు ముందు కాళ్లు    ఎత్తడంతో ఆ శూలం ఏనుగు నుదుటి లోకి దిగింది. ఆ ఏనుగు హాహాకారాలు చేస్తూ నెల మీద కుప్పకూలిపోయింది. దీంతో భీముని కోపం తారాస్థాయికి చేరింది. మదమెక్కిన ఏనుగులా అంగజుని సేన పై విరుచుకు పడ్డాడు. భీముడు అంగజులు పక్కనే ఉన్న గదలు తీసుకొని ద్వంద యుద్దానికి దిగారు. భీముని బలానికి అంగజుని బలం సరితూగలేదు. భీముని గద అంగజుని చాతిని తాకడంతో యుద్ధ వీరుడు అంగజుడు నేలకొరిగాడు. నొట్లొనుండి రక్తం కక్కుతున్నాడు. అప్పటికే భీమసేనుని కోపం తగ్గిపోయింది. రక్తం కక్కుతూ క్షోభ అనుభవిస్తున్న మహావీరుడు అంగజుని చూసి కళ్ల నిండా నీరుతో భీమసేనుడు ఆ మహావీరుని క్షోభ ను ముగించేశాడు.

ఇంకో వైపు అర్జునుని బాణాలకు అశ్వోత్తముని రథం, ఆ రథానికి ఉన్న గుర్రాలు నేలకొరిగాయి. అశ్వోత్తముడు నేలపైనుండే అర్జునిడితో పోరాడుతున్నాడు. అర్జునుని బాణం అశ్వోత్తముని విల్లుని విరిచేసి కవచాన్ని చేధించింది. అశ్వోత్తముడు వెంటనే తన ఓర లోనుండి కత్తి ని తీసి అర్జునుని రథం వైపు కదిలాడు. అర్జునుని ఒక్కో బాణాన్ని తన కత్తి తో అడ్డుకుంటున్నాడు. కానీ అశ్వోత్తముడు ఎంతో సేపు నిలవలేకపోయాడు. అర్జునుడు వెనువెంటనే రెండు బాణాలు వదలడంతో ఒక బాణాన్ని తన కత్తి తో ఖండించినా ఇంకో బాణం అశ్వోత్తముని గొంతులో దిగింది. తర్వాత అర్జునుని విల్లు నుండి వరుసగా వచ్చిన బాణాలు ఆశ్వోత్తముని తలను మొండెం నుండి వేరు చేసాయి. అలా ఎక్కడో కారుణ్య రాజ్యం లోని కుగ్రామం లో మొదలైన ఈ మహావీరుల ప్రయాణం ఇంత మంది మహామహుల మధ్యలో కురుక్షేత్ర సంగ్రామం లో ముగిసింది. ఆ రోజుకి యుద్ధం అంతటితో ముగిసింది. ఆ రోజు రాత్రి విక్రమ సింహుడు తన తమ్ముళ్లను చూసుకోవడానికి కాల భూమి లా మారిన ఆ రణ భూమి కి వచ్చాడు. వివశులై పడి  ఉన్న తన తమ్ముళ్ల శరీరాలను చూసిన విక్రమ సింహునికి భూమి కంపించినట్లయ్యి నేలకొరిగాడు.

"ఏమని చెప్పేదర మన తల్లికి నేనేమని చెప్పెదరా…..

మీ మృత్యువుకే వ్యూహము పన్నిన పాపి ని నేనని చెప్పనా….

ధర్మ స్థాపనకు జరుగుతున్న ఈ మహా సంగ్రామపు సమిధలు మీరని చెప్పనా….

భీమార్జునులనే మృత్యు ద్వారాలకు పంపిన మహా వీరులు నా తమ్ములని చెప్పనా…..

నేనేమని చెప్పెదరా ఆ మాతృమూర్తి నేనేమని చెప్పెదర...." అని అక్కడే కూలబడి పోయాడు విక్రమ సింహుడు.

విక్రమ సింహుడు పాండవుల దగ్గర సెలవు తీసుకొని జయకేతుణ్ణి కారుణ్య రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించి కాలి నడకన వింధ్యారణ్యాలకు ప్రయాణమయ్యాడు.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయకేతనం ఎగురవేశారు.లక్షల మంది సైనికుల శవాలపై ఎగురవేసిన జెండా అది. ధర్మ స్థాపన జరిగిందిన్నారు. ఇకపై ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందన్నారు.ఇది నవయుగానికి నాంది అన్నారు కానీ వారికి తెలియదు వచ్చేది కలియుగమని. యుద్ధం ముగిసిన తరువాత కొన్ని రోజులకు పాండవులంతా ద్రోణాగిరి గ్రామం చేరుకొని అక్కడ హనుమంతుని గుడిని స్వహస్తాలతో నిర్మించారు. సంజీవని తీసుకొస్తున్న ఆంజనేయుని విగ్రహాన్ని ఆ గుడి బయట ప్రతిష్టించారు.కారుణ్య నది పక్కనే ఉన్న కుటీరం దగ్గరే ద్రోణాగిరి శిఖరాగ్రానికి విల్లుని ఎక్కు పెడుతున్నట్లుగా ఉన్న విశ్వ కర్ముని విగ్రహాన్ని , పక్కనే కిన్నెర పక్షి పై కూర్చొని  ఉన్న విక్రమ సింహుని విగ్రహాన్ని, ఏనుగు పై కూర్చున్న అంగజుని విగ్రహాన్ని, గుర్రంపై కూర్చుని విల్లు ఎక్కు పెట్టినట్లుగా ఉన్న ఆశ్వోత్తముని విగ్రహాన్ని ప్రతిష్టాపించారు పాండవులు. "

ఇంతటి ఘన చరిత్ర కలిగిన వూరు ఈ దక్షిణ ద్రోణాగిరి. చాల సంవత్సరాల వరకు ఆ సంజీవని కోసం దక్షిణ ద్రోణాగిరి అంతా గాలించాను కానీ ఎక్కడ దొరకలేదు.ఒకరోజు హనుమంతుని గుడిలో పూజ చేస్తుండగా నేలపై ఒక ఆకు కనిపించింది. పురాణాల్లో చెప్పిన ప్రకారం అది చూడడానికి సంజీవని ఆకులా వుంది. అప్పుడే నా దృష్టి ఆంజనేయుడి విగ్రహం చేతిలో ఉన్న గుట్ట పై పడింది. సంజీవని మొక్క అక్కడే ఉన్నట్లుంది. అందుకే గ్రామంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆ గుడి తో ముడి పెట్టి ఆ గుడిని మూసివేయించాను. కొన్ని రోజుల తర్వాత ఆ సంజీవని ఆకులు తీసుకొచ్చి తులసి తీర్ధం తో కలిపి రెండు సీసాల్లో వుంచాను. ఎప్పుడైనా నేను కానీ తాను కానీ చావుబతుకుల్లో వున్నప్పుడు ఆ తీర్థం వాడాలని లక్ష్మయ్య కు చెప్పాను. కానీ లక్ష్మయ్య నన్ను నమ్మలేదు. అందుకే నా మిత్రుడు జమీందారు  నారాయణ రెడ్డి కి అసలు విషయం చెప్పకుండా  నాకేమయిన అపాయం జరిగినప్పుడు ఆ తులసి తీర్థం నాకిచ్చేట్లు ప్రమాణం చేయించుకొని అతనికి ఒక  సీసాను ఇచ్చాను. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత పొలంలో నడుస్తున్న నన్ను పాము కాటేసింది. పక్కనే నడుస్తున్న నారాయణరెడ్డి ఆ విషాన్ని తన పళ్లతో పీల్చి బయటికి వేసి నన్ను డాక్టర్ వద్దకు మోసుకుపోసాగాడు. విషం నరాల్లోకెక్కుతున్నట్లుంది నా చూపు మందగించింది మాట తడబడుతుంది, తడబడుతూనే తనకు సీసా గురించి గుర్తు చేసి మూర్ఛపోయాను. వెంటనే నారాయణ రెడ్డి తన జీబులోనుంచి సీసా తీసి తీర్ధం నా నోట్లో వేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. కాసేపటికి నాకు స్పృహ వచ్చింది. అప్పుడే నారాయణ రెడ్డి జరిగిందంతా చెప్పాడు "నువ్వు చనిపోయావని భయపడ్డానోయ్ .. దారి మధ్యలో నీ నాడి ఆడలేదు. వెంటనే తీర్ధం ఇచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. డాక్టర్ విరుగుడు మందు ఇవ్వడంతో బతికి బయట పడ్డావ్."  అంటే నేను చనిపోయాక నారాయణ రెడ్డి నాకు తీర్ధం ఇచ్చాడు. ఇంకో పదిహేను రోజుల్లో నేను చనిపోబోతున్నానని అప్పుడే తెల్సింది. ఏ సంజీవని ఇక నన్ను కాపాడలేదు. ఈ పదిహేను రోజులు నరకయాతన అనుభవిస్తున్నాను. ఎవరితో చెప్పిన నన్ను నమ్మట్లేదు. పిచ్చివాని ల చూస్తున్నారు. స్వలాభం కోసం సంజీవని వాడుకున్నందుకు నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది. మిగిలిన సీసాను లక్ష్మయ్య కు తులసి తీర్థం అని చెప్పి ఇంట్లో వుంచాను . నాకు తెలిసిన ఈ ఊరి ఘన చరిత్ర ఈ దేశమంతా తెలియాలని నా ఆశ........"                

చదవడం పూర్తవగానే మనోహరి నేను ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం. నమ్మశక్యం కాలేదు కానీ జరిగిన సంఘటనలను బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. నిజం తెలుసుకోవడం కోసం ఆ చీకట్లోనే ఆంజనేయుని గుడి దగ్గరకు బయల్దేరాను. మనోహరి వస్తానన్న ఇంత చీకట్లో వద్దని వారించాను.ఆంజనేయుడి గుడి దగ్గరికి చేరుకున్నాను. ఆంజనేయుని పాదాలకు నమస్కరించి తన చేతిలో ఉన్న స్థలం వైపు ఎక్కడం ప్రారంభించాను. నేననుకున్నట్లు అక్కడ ఎలాంటి చెట్టు కనపడలేదు. అబద్దమేమో అనుకొని క్రిందకు దిగుతుంటే ఆంజనేయుని చేతి నుండి ఒక గ్రంథం కింద పడింది. దాన్ని ఇంటికి తీసుకు వచ్చి చదవడం ప్రారంభించాను. అప్పటికే మనోహరి పడుకొని వుంది.

"నా పేరు నారాయణ రెడ్డి. నా మిత్రుడు రామ చంద్రయ్య తన చివరి రోజుల్లో ఎంత చెప్పినా నమ్మలేదు. కానీ అతను మరణించిన కొన్ని రోజుల తర్వాత దక్షిణ ద్రోణగిరి దగ్గర తవ్వకాల్లో అతను చెప్పినట్లు గానే ఆ వీరుల విగ్రహాలు బయట పడ్డాయి. ఇప్పటికి శాస్త్రవేత్తలు అవి ఏ కాలపు విగ్రహాలో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ ఊరి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి  నాలో పెరిగింది. ఈ ఊరి గురించి రాసిన ఎన్నో గ్రంథాలు చదివాను. ఈ ఊరి మూలాలున్న ఎంతో మంది పీఠాధిపతుల నుండి కనుక్కున్నాను. వంగ కళింగ కారుణ్య రాజ్యాల సంధి కోసం విశ్వకర్మ రాయబారాలు నడుపుతున్న రోజులవి. ఒక రోజు కారుణ్య రాజ్యపు యువరాజు ఉమా మహేశ్వరుడు సైన్యాధీశుడు విశ్వ కర్మ, ఉప సైన్యాధీశుడు గంగాధరులతో వింధ్య అరణ్యం లో వేటకు వెళ్ళాడు.  యుక్త వయసులో ఉన్న యువరాజు విశ్వ కర్మ వద్దని వారిస్తున్నా వినకుండా తన గుర్రాన్ని వేగంగా పోనిస్తూ దారిలొ కనిపించిన ప్రతి జంతువు పైన బాణాలు సాధించ సాగాడు. అలా ఒక బాణం పులి కి తగిలింది.కోపంతో పులి యువరాజు పైకి దూకింది. యువరాజు తృటి లో తప్పించుకోగా ఆ పులి పంజా దెబ్బకు గుర్రం కుప్పకూలింది. యువ రాజు వెంటనే విశ్వ కర్మ కొరకు కేకలు వేస్తూ ఓర లోనుండి కత్తి తీసాడు. పులి ఒకే సారి యువరాజు మీదకి దూకడంతో ఆ పంజా దెబ్బకు యువరాజు చేతిలోని కత్తి , యువరాజు దూరంగా ఎగిరి పడ్డారు. కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న యువరాజు ని అంతం చేయడానికి దూకిన పులి ని తన బాణం తో వధించేసాడు విశ్వ కర్ముడు. అప్పటికే యువ రాజు కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు. గంగాధరునికి , విశ్వకర్మునికి ఏం  చేయాలో తెలియలేదు. అప్పటికే యువ రాజు మూర్ఛపోయాడు. ఇంకో మార్గం లేదని తెలిసాక యువరాజు దగ్గర గంగాధరుని ఉంచి వాయు వేగంతో వెళ్లి సంజీవని తీసుకొచ్చాడు విశ్వ కర్మ. కొద్ది సేపటికి యువరాజు మాములుగా అయిపోయాడు.యువ రాజు మౌనంగా రాజ భవనం వైపు బయల్దేరాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మూడు రాజ్యాల మధ్యలో సంధి కుదిరింది. ఒక రోజు విశ్వ కర్మడు, గంగాధరుడు దక్షిణ ద్రోణాగిరి కొండపై వెళ్తుండగా కొద్ది దూరంలో శబ్దాలు వినిపించి అటువైపు వెళ్లారు. అక్కడ గుహ లోనుండి ఆ శబ్దాలు వస్తున్నాయి. తమ ఆయుధాలతో లోపలికెళ్లిన వాళ్ళు తమ కళ్ళ  ముందున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మహా రాజు ఉమా మహేశ్వరుడు పర్యవేక్షణ లో వందలాది మంది వైద్యులు తమ వద్దనున్న సంజీవని ఆకులతో వివిధ పదార్ధాలను కలిపి వన్య ప్రాణులపై పరీక్షిస్తున్నారు. తృటిలో కారుణ్య రాజ్య సైనికులు ఇద్దరినీ చుట్టుముట్టి బంధించి మహారాజు దగ్గరికి తీసుకెళ్లారు.

"విశ్వ కర్మ నువ్వు ఆ రోజు నన్ను కాపాడిన తరువాత ఈ వైద్యుల ద్వారా తెలిసింది ఈ సంజీవని గురించి. ఒక్క సారైతే ఈ సంజీవని నన్ను బతికించింది. మళ్ళీ ఈ సారి ఇంకేదయినా పులి దాడి చేస్తే ఈ సంజీవని కూడా నన్ను బతికించలేదు. అందుకే ఈ వైద్యుల సాయంతో ఈ సంజీవని ఉపయోగించి నాకు మరణమే లేకుండా చేసుకుంటాను. అప్పుడు ఈ వింధ్య రాజ్యమేంటి ఈ విశ్వమే నా గుప్పెట్లో ఉంటుంది.మరణం లేకుంటే మనిషి కూడా దేవుడే.

"అమృతం కావాలనుకున్న ఆ దానవుల దుర్గతే నీకు కూడా పడుతుంది మహా రాజ" అంటూ విశ్వ కర్మ తన కత్తి ని తీసి బంధించిన సైనికుల పైకి దూశాడు. గంగాధరుడు కూడా విశ్వకర్ముని తో కలిసి సైనికుల పైకి దాడికి దిగాడు.కానీ గుహ లోపల నాలుగు వైపులా ఎత్తులో ఉన్న సైనికులు తమ బాణాలను విశ్వ కర్ముని గుండెల్లోకి దింపడంతో విశ్వకర్ముడు అక్కడికక్కడే మరణించాడు.  గంగాధరుడు వెంటనే ఆ గుహ లోనుండి బయటికి దూకి తన గుర్రాన్ని పరిగెత్తించాడు. తన వెనకాల వస్తున్న సైనికులను చంపి అక్కడి నుండి  తప్పించుకొని కింకర రాజ్యానికి వెళ్లి తల దాచుకున్నాడు. కొన్ని సంవత్సరాల్లోనే అక్కడ వారికి దండ నాయకుడిగా మారాడు. దక్షిణ ద్రోణా గిరి పైనున్న ఆ స్థలాన్ని నాశనం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నించినా ఎప్పుడు సఫలం కాలేదు. అలాంటి ఒక ప్రయాత్నాన్నే విశ్వ కర్ముని పుత్రులు విఫలం చేసారు. తలనొప్పిగా  మారుతున్న గంగాధరుణ్ణి పట్టుకోవడానికి వంగ రాజ్యపు రాజు సాయంతో ఆశ్వోత్తముని ఉసిగొల్పాడు ఉమా మహేశ్వరుడు. ఆశ్వోత్తముడు తన పరాక్రమాలతో మరియు కింకర రాజ్యం సాయంతో గంగాధరుణ్ణి చెరసాలకు పంపాడు.మార్గమద్యంలో  విశ్వ కర్ముని హత్య గురించి గంగాధరుడు ఎన్ని విధాలుగా చెప్పినా ఆశ్వోత్తముడు నమ్మలేదు. కారుణ్య రాజు తమ తండ్రి పై , తమపై చూపించిన అభిమానం గంగాధరుని నిజాన్ని అబద్దం చేసింది. మరణం నుండి విముక్తి పొందడానికి ఉమా మహేశ్వరుని ప్రయత్నాలు మాత్రం కొన సాగుతునే వున్నాయి. కురుక్షేత్రం నుండి తిరిగి వచ్చిన వంగ, కళింగ సైన్యాధీశులు కుబేరుడు, అఖిలేశ్వరుడులు తమ రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వంగ కళింగ సింహాసనాలను అధిష్టించారు.        

కురుక్షేత్రాన్ని మధ్యలో వదిలేసి వచ్చిన విక్రమ సింహునికి కింకర రాజ్య ముఠా సభ్యులు మార్గ మధ్యంలో తారస పడ్డారు.విక్రమ సింహుని పరాక్రమాలు గురించి తెలిసిన ముఠా సభ్యులు వెంటనే తమ కత్తులు బయటికి తీసి చుట్టుముట్టారు. దుఃఖం లో ఉన్న విక్రమ సింహుడు మాత్రం కత్తి తీయలేదు. అతనిని బందీ గా కింకర రాజ్యానికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల తరువాత వారి ద్వారా తన తండ్రి హత్య గురించి నిజం తెలుసుకొని కోపం తో రగిలిపోయాడు విక్రమ సింహుడు. అక్కడ ఉన్న వారిని పోగేసుకొని కారుణ్య రాజ్యం పైకి యుద్దానికి బయల్దేరాడు. కారుణ్య రాజ్య సైన్యాధీశుడు జయకేతుడు కూడా చేతులు కలపడంతో కారుణ్య రాజ్య కోట ఆక్రమించుకోవడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఉమా మహేశ్వరున్ని వధించి విక్రమ సింహుడు వంగ కళింగ రాజ్యాలపై కూడా దండెత్తాడు. రణభూమి లో తమ ధర్మాలను మరిచి ఆశ్వోత్తముని, అంగజుని మరణానికి కారకులయిన కభేరుణ్ణి, అఖిలేశ్వరున్ని అంతమొందించాడు విక్రమ సింహుడు. గంగాధరుణ్ణి చెర శాల నుండి విడిపించాడు. ఉమా మహేశ్వరుడు పరీక్షలు జరుపుతున్న ఆ గృహ ను , సంజీవని చెట్లను అగ్ని కి ఆహుతి ఇచ్చారు గంగాధరుడు, విక్రమ సింహులు. మూడు రాజ్యాలను కలిపి వింధ్య రాజ్యం గా మార్చి జయకేతుణ్ణి మహా రాజు గా ప్రకటించాడు విక్రమ సింహుడు. గంగా ధరుడు జయకేతుని సాయంతో కింకర రాజ్యాన్ని జయించి వారికి రాజు గా దండ నాయకుడిగా మారాడు. విశ్వకర్ముడు తన తల్లి విద్యావతి తో కలిసి కారుణ్య నది పక్కన ఉన్న కుటీరంలో తమ శేష జీవితాన్ని గడిపారు.ఆ తరువాత ఎంతో మంది మళ్ళీ ఆ స్థలాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారు కానీ ఎవరివల్ల కాలేదు.."

ఇది చదివిన తర్వాత ఆ స్థలం ఎక్కడో కనుక్కోవాలన్న ఆసక్తి నాలో రోజు రోజుకి పెరిగింది. రోజు ఆ దక్షిణ ద్రోణాగిరి కొండను ఆ స్థలం కొరకు గాలించ సాగాను.  కానీ ఎక్కడ కనిపించలేదు. ఒక రోజు పాండవులు స్థాపించిన విగ్రహాలు బయటపడ్డ స్థలం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అనిపించింది ఒక వేల నిజంగా విశ్వ కర్మ ఇక్కడి నుండి తన విల్లుతో  దక్షిణ ద్రోణగిరి శిఖరాగ్రానికి గురి పెట్టి బాణం వదులుతే ఎక్కడకు చేరుకుంటుందని. మరుక్షణమే అనిపించింది ఒకవేళ అక్కడే ఈ స్థలం ఉంటే అని.వెంటనే మనోహరి ని వెంట బెట్టుకొని ట్రెక్కింగ్ కని కొండపైకి తీసుకెళ్ళాను. ఇంకా మనోహరి కి ఆంజనేయ గుడిలో దొరికిన గ్రంథం గురించి చెప్పలేదు. ఆ రోజు రాత్రి కి నేను అనుకున్న స్థలానికి వెళ్ళాము. కానీ అక్కడ గృహ లాంటిదేమి కనిపించలేదు. రాత్రవడంతో అక్కడే బస చేసాం. అర్ధ రాత్రి ఎదో శబ్దం అవడంతో నిద్ర లేచాను. దూరంలో ఎదో వెలుతురు కనిపిస్తుంది. ఎవరో టార్చ్ పట్టుకొని కొండకటువైపు నుండి వస్తున్నాడు. కాసేపటికి వెలుతురు మాయమయ్యింది. నేను నెమ్మదిగా లేచి కొండ కటువైపు వెళ్ళాను. అక్కడ చిన్న గుహ వుంది. లోపలికి తొంగి చూస్తే గ్రామ సర్పంచ్. ఆ గుహ నిండా సంజీవని మొక్కలు, తులసి మొక్కలు ఇంకా ఏవేవో పరికరాలు వున్నాయి. సర్పంచ్ ఒక ఇంజక్షన్ తీసుకొని ఎలుక లోకి ఎదో పదార్ధాన్ని ఎక్కిస్తున్నాడు. కాసేపటికి తన దగ్గర ఉన్న పిస్టల్ తో ఆ ఎలుకను తలలో కాల్చేశాడు. కాసేపటి తర్వాత ఎలుక మాములుగా లేచి వెళ్ళిపోయింది. సర్పంచ్ మోహంలో వికృతమైన నవ్వు కనిపించింది.వెంటనే ఆ ఇంజక్షన్ తనకు ఇచ్చుకోడానికి సిద్దమయ్యాడు. నాకు పరిస్థితి అర్ధమయిపోయింది. కొన్ని సంవత్సరాల నుండి సర్పంచ్ ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఆ ఉమా మహేశ్వరునికి అంత మంది వైద్యులకు సాద్య పడంది ఇతనికి సాధ్యమయ్యింది. నేను వెంటనే తేరుకొని అతని ముందుకెళ్లాను. ఆతను పిస్టల్ నా వైపు ఉంచాడు.

"తప్పు చేస్తున్నారు మీరు"

"ఏది తప్పు కుర్ర కుంక వి నీకేమి తెలుసు జీవితం విలువ. ఇది సంవత్సరాల నాటి నా కష్టం. పాండవులందరు ఒక్కొక్కరుగా మరణించినా ధర్మ రాజుకి మాత్రం మరణం రాలేదు. కారణం ఈ దక్షిణ ద్రోణాగిరి. మరణం లేకుంటే మనిషి కూడా దేవుడే". అంటూ తనకి ఇంజక్షన్ ఇచ్చుకోవడానికి సిద్దమయిపోయాడు సర్పంచ్.

వెంటనే నేను పక్కనే ఉన్న నిప్పు కాగడాలను సంజీవని చెట్లపైకి, ఆ పరికరాలపైకి విసిరేస్తూ అతని వైపు దూకాను. సర్పంచ్ పిస్టల్ రెండు రౌండ్లు పేలింది. అరుస్తూ సర్పంచ్ ని పట్టుకొని ఆ గుహలోనుండి బయటికి దూకేసాను. సర్పంచ్ జారుకుంటూ కొండ అవతలి వైపు లోయలోకి పడిపోయాడు. నా కన్నులు మూసుకుపోతున్నాయి. దూరంగా మనోహరి పరిగెత్తుతూ వస్తుంది. ఇక బ్రతకడం అసాధ్యం అనిపించింది. కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి.

కాసేపటి తరువాత..

కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా ఏడుస్తూ మనోహరి. నేను లేవడం చూసి కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తుంది. చూస్తే పక్కనే సిరంజి కాలీ గా పడుంది.  దేన్నయితే ఆపడానికి ఆ విశ్వ కర్ముడు ప్రాణాలిచ్చాడో , దేన్నయితే ఆపడానికి  నేను స్వయంగా ప్రాణ త్యాగం చేసానో ఆ అమరత్వాన్ని నేనే పొందాను.

రోజులు నెలలుగా , నెలలు సంవత్సరాలుగా గడవ సాగాయి. కొన్ని సంవత్సరాలకి మనోహరి కూడా చనిపోయింది. కావలిసిన వాళ్లంతా చనిపోయారు.

నేను మాత్రం ఈ కాలంతో ప్రయాణం చేస్తున్నాను తెలియని గమ్యానికి చేరని తీరాలకు..."

అంతటితో బుక్ ముగియడంతో ఇంటి కిటికీ లోనుంచి బయటికి చూసాడు నికోలస్, ఎదురుగా దక్షిణ ద్రోణాగిరి కొండ........     

మరిన్ని కథలు
ookade koduku