Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.  ....http://www.gotelugu.com/issue227/631/telugu-serials/naadaina-prapancham/nadina-prapancham/ 

( గతసంచిక తరువాయి )... నిలుచుంది కీర్తన. ఏం సమాధానం చెప్పాలో తెలీక ఆ సంగతి ఈమెకెలా తెలుసు?

ఇది వరకొక సారి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కూడా ఇలాగే ఆకాష్‌ పేరెత్తి వ్యంగ్యంగా మాట్లాడింది.

‘‘ఆ విషయం నీకు అనవసరం బిందూ....!’’ శాంతం గానే సమాధానం ఇచ్చింది.

‘‘కాదు, నాకు చాలా అవసరం. నాకే అవసరం. ఆకాష్‌ తో తిరగటం మానేస్తే నీకే మంచిది....’’ బెదిరింపుగా అంది.

ఏంటి ఈ అమ్మాయి ధైర్యం?

తనకిష్టమైన వాళ్ళతో తను తిరుగుతుంది. బిందు పెత్తనం ఏంటి?

‘‘నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు. అది నా పర్సనల్‌. ఆకాష్‌ గురించి నువ్వు నాకు చెప్పడమేంటి....?’’ ఆవేశంలో అంది కీర్తన.

‘‘ఎందుకు చెబుతున్నానంటే, ఆకాష్‌ నా ఉడ్‌బి. అందమైన వాడు, డబ్బున్న వాడు కదాని వల విసిరి వుంటావు.

ఏదో ఫ్రెండ్‌లా భావించి అతను నీతో వచ్చుంటాడు. ఇంత వరకూ జరిగిందంతా మర్చిపో.

అతన్ని ఇంకో సారి నువ్వు కలిసినట్లు తెలిస్తే....మైండిట్‌!’’ బెదిరిస్తూ విసురుగా వెళ్ళి పోయింది మణి బిందు. షాక్‌ తిన్నట్లు అలాగే చూస్తూ నిల్చుండి పోయింది కీర్తన.

ఆకాష్‌ నా ఉడ్‌ బి....

ఆకాష్‌ నా ఉడ్‌ బి....

ఈ మాటలే పదే పదే చెవుల్లో మార్మోగుతున్నాయి.

ఇది నిజమా....?!

మణి బిందు అంత ధైర్యంగా ఎలా చెప్ప గలిగింది? అసలు చెన్నై వచ్చినట్లు ఈమెకెలా తెలుసు??

ఆకాష్‌ తనని గదా పెళ్ళి చేసుకుంటానన్నాడు. మరి బిందు తన ఉడ్‌ బి అంటుందంటే?

ఆకాష్‌ తనని మోసం చేశాడా?

అసలతను అలా చెయ్య గలడా?

అందుకేనా ఎన్నిసార్లు వివరాలడిగినా, అతను దాట వేశాడే తప్ప అతడి వివరాలు చెప్ప లేదు!!!

కాళ్ళలో మేకు దిగబడినట్లు అలాగే వుండిపోయింది.

అటువైపు వచ్చిన ఆమె ఫ్రెండ్స్‌ పరధ్యానంగా నిలబడిన కీర్తనని చూసి గబగబా దగ్గరకి వచ్చి పలకరించారు.

ఉలిక్కి పడి తిరిగి చూసింది. పాలిపోయి ఉన్న ఆమె మొహాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

‘‘కీర్తనా! ఏమయ్యింది?’’ ఆందోళనగా అడిగారు.

‘‘ఆకాష్‌.... మణిబిందుకి ఉడ్‌ బి....?!’’ తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది.

‘‘ఈజిట్‌....?’’

‘‘అదేంటి....?’’

‘‘ఎవరన్నారు....?’’ అంటూ అందరూ గబగబా ప్రశ్నలు సంధించారు.

నిస్త్రాణగా ఉన్న ఆమెను చూసి.

‘‘పదండి కాంటీన్‌కి వెళ్ళి మాట్లాడుకుందాం’’ అంటూ ఆమెని తీసుకుని వెళ్ళారు.

‘‘ఇప్పుడు చెప్పు’’ సావధానంగా అందరూ కూర్చుని అడిగారు.

‘‘మణిబిందు అంది’’ అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చింది.

ఎవరూ తొందరపడి ఏ కామెంట్‌ చేయలేదు.

‘‘ఆకాష్‌తో మాట్లాడి ఇప్పుడే తేల్చుకోవాలని వుంది’’ ఉద్రేకంగా అంది కీర్తన.

ఎవరూ మాట్లాడలేదు.

‘‘ఇంకో టెన్‌ డేస్‌లో స్టేట్‌ లెవల్‌ టోర్నమెంట్‌ ఉంది. ఆ తర్వాత నేషనల్‌ గేమ్స్‌ సెక్షన్‌. ఇక డైరెక్ట్‌గా నేషనల్‌ గేమ్‌ కెళ్ళే టైమ్‌లో నువ్వు డిప్రెస్‌ అవ కూడదు.

ఈ విషయం తర్వాత తేల్చుకో వచ్చని నా ఉద్దేశం’’ ఒకమ్మాయి అంది.

‘‘టేకిటీజీ కీర్తనా! అతనెలాంటివాడైనా నువ్వు ఒకేలా తీసుకో. మణిబిందు చెప్పిందంటే ఆషామాషీగా చెపుతుందా? ఏమో! మన మీద తనకి ఎప్పుడూ కక్షే!నిన్ను ఏడిపించడానికి అన్నా అనుండొచ్చు. రేపో, ఎల్లున్డో డైరెక్ట్‌గా అతని ఇంటికో, ఆఫీస్‌కో వెళ్ళి ఎంక్వయిరీ చెయ్యి. ఏ విషయం తేలి పోతుంది’’ ఈజీగా చెప్పింది.

ఈ బంధం అంత ఈజీగా తెగి పోయేదా?

మణి బిందు చెప్పింది నిజమని తేలితే, తను తట్టుకో గలదా?

కీర్తన మనసంతా బాధగా, గుఋలుగా అయోమయంగా మారి పోయింది.

‘‘అతని ఆఫీస్‌ అడ్రస్‌ కనుక్కుని, రాత్రికి ఫోన్‌ చేస్తానుండు’’ మరో అమ్మాయి అంది.

కాలేజీలో ఆ రోజంతా డల్‌ గానే గడిపింది. ఈవెనింగ్‌ ప్రాక్టీస్‌కి వెళ్ళబుద్ధి కాలేదు. అయినా స్టేట్‌ గేమ్స్‌ ఎన్నాళ్ళో లేవు. తప్పదనుకుంటూ వెళ్ళింది కానీ, వాళ్ళు ఆడుతుంటే మైదానంలో చూస్తూ కూర్చుంది.

అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చింది అశోక్‌ తనని ఈ రోజు త్వరగా రమ్మన్న సంగతి.

అందరికీ చెప్పి గబగబా స్టేడియం బయటికి వచ్చి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసింది.

గుమ్మం లోనే అశోక్‌ ఎదురయ్యాడు.

‘‘త్వరగా రమ్మన్నానా.... సరే! పద...స్నానం చెయ్యి....’’ అభిమానంగా అన్నాడు.

అన్న మాటకి ప్రాణం లేచొచ్చింది.

చాలా రోజుల తర్వాత ఇంత హుషారుగా వున్నాడు. అతని మొహం వింత కాంతితో ప్రకాశిస్తోంది.

మనిషి కూడా శ్రద్ధగా తయారయ్యాడు. వంట గది లోంచి ఒకటే ఘుమఘుమలు.

ఇంతకీ ఆ వచ్చే గెస్ట్ లు  ఎవరో....? అన్నయ్య హడావిడి ఏంటో అనుకుంటూ బాత్‌ రూంకి వెళ్ళి స్నానం చేసి చుడీదార్‌ వేసుకుని వచ్చింది.
అశోక్‌ ఒకటే హడావిడి పడి పోతున్నాడు. కిచెన్‌ లోకి వెళ్ళి కుక్‌కి పలుసార్లు సజెషన్స్‌ యిస్తున్నాడు.

కీర్తన వచ్చే సరికే తండ్రికి స్నానం చేయించి, తెల్లని మల్లె పూవు లాంటి పంచె, లాల్చీ తొడిగాడు.

కీర్తన తండ్రి పక్కన కూర్చుని ‘‘గెస్ట్ స్‌ ఎవరో తెలుసా?’’ రహస్యంగా అడిగింది. తెలీదన్నట్లు కళ్ళార్పాడాయన.

‘‘ఏంటో అంత సస్పెన్స్‌’’ అంది. నవ్వాడాయన.

ఇంతలో ఇంటి ముందు గెస్ట్స్‌ రావటం కోసం పంపిన తమ కారు వచ్చి ఆగింది. కుతూహలంగా చూస్తోంది కీర్తన. అందు లోంచి ముందుగా ఒక యువకుడు దిగాడు. ఆ వెనుక బాపూ బొమ్మలా...అందంగా...నాజూగ్గా ఉన్నమ్మాయి దిగింది.

మొహమంతా నవ్వుతో వెలిగి పోతుండగా, అశోక్‌ ఎదురెళ్ళి ఆహ్వానించాడు. లోపలికి రాగానే ముందుగా ఎదురైన కీర్తనకి వాళ్ళని పరిచయం చేశాడు.

‘‘హి ఈజ్‌ ప్రకాష్‌! మన ఫార్మాస్యూటికల్స్‌లో పనిచేస్తున్నాడు. ఈమె జాహ్నవి. ప్రకాష్‌ వాళ్ళ సిస్టర్‌’’ చెప్పాడు.

నమస్కారం, ప్రతి నమస్కారాయ్యాక వాళ్ళిద్దరినీ తండ్రి వద్దకు తీసుకెళ్ళి పరిచయం చేశాడు.

జాహ్నవి చైతన్య రహితంగా వున్న అతని పాదాలకి నమస్కరించింది. కీర్తనకి ఏదో స్ఫురించి జాహ్నవి వంకా అశోక్‌ వంకా అనుమానంగా చూస్తోంది.

లేవ లేని కుడి చెయ్యి పట్లా, ఆశీర్వదించ లేని ఎడం చేతి పట్లా అశక్తతతో నలిగి పోతూ జాహ్నవి వంక చూశాడు భూపతి.
ఆయన కంటి కొకుల్లో నీరు చూసి చలించి పోయింది జాహ్నవి. నెమ్మదిగా అతని పక్కకి వచ్చి, అతని చేతి మీద ఓదార్పుగా తట్టింది.
తండ్రి సంతృప్తిగా తన వంక చూడటం గమనించి అశోక్‌ మనసు ఆనందంతో నిండి పోయింది. కీర్తన కూడా సంతోషం గానే కనిపిస్తోంది.
తీసుకు వెళ్ళి నానమ్మకి పరిచయం చేశాడు. ఆవిడ పాదాలకి నమస్కరించింది జాహ్నవి.

భుజాలు పట్టుకొని పైకి లేపి తేరి పార ఆమె వంక చూసి, ‘మహా లక్ష్మిలా వుంది’ సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. అందరూ హాల్ లో కూర్చున్నారు.
కుక్‌ వచ్చి అందరికీ జ్యూస్‌ సర్వ్‌ చేశాడు. భూపతికి తాగించడానికి కీర్తన గ్లాసు తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్ళింది.

అప్పటికే అశోక్‌ తండ్రిని వెనక్కి వాల్చి దిళ్ళు ఎత్తుపెట్టి కూర్చోబెట్టాడు.

కీర్తన తాగించ బోతుండగా జాహ్నవి వచ్చి ఆమె చేతిలో గ్లాస్‌ తీసుకొని ‘‘ఇక నుంచీ ఈ పసి పిల్లాడిని చూసే బాధ్యత నాది. అలవాటు చేసుకుంటాను.’’ అనగానే కీర్తన ముందు తెల్ల బోయినా ఆమె మాటలకి చాలా సంతోషించింది.

జాహ్నవి కలుపుగోలుతనానికి అశోక్‌ ముచ్చట పడ్డాడు. భూపతికి విషయం అర్ధమయింది.

అశోక్‌ మనసు కూడా తెలిసింది. తన కోసమే, తనని ప్రేమగా సాకడం కోసమే ఈ అమ్మాయిని ఎంచుకున్నాడు.

ఇక నుంచీ తను మరణించే వరకూ కీర్తన బదులు ఈమే తనని సంరక్షిస్తుంది. అంత ఓపిక, ఓర్పు ఈ అమ్మాయిలో వున్నాయా....? తదేకంగా ఆమె వంక చూశాడు.

తెల్లని గుండ్రని మొహం.... కలువ రేకుల్లాంటి కళ్ళు, పూర్తిగా తీసిన మధ్య పాపిట, ఎర్రని పెద్ద బొట్టు, తన చిన్నప్పుడు తల్లి యిలాగే వుండేది.తల మెల్లగా తిప్పి తల్లి వంక చూశాడు భూపతి. కొడుకు మనసు గ్రహించినట్లు చిరునవ్వు నవ్విందామె.

‘‘సరిగ్గా తినిపించక పోయినా, చూడక పోయినా ఏమీ అనుకో వద్దు. కొత్త కదా! నేర్చుకుంటాను.’’ అచ్చం కీర్తన లాగే చిన్న పిల్లాడికి చెప్పినట్లు భూపతికి చెప్పింది.

నవ్వాడాయన. ఆనందంగా చూసింది జాహ్నవి. అశోక్‌, ప్రకాష్‌ లోపలి గది లోకి వెళ్ళారు. నానమ్మ ఎప్పటిలా మూలన కూర్చుంది.
భూపతి పడుకున్న మంచం అంచున కూర్చున్న జాహ్నవి, ఆయన పెదాల చివర జారుతున్న జ్యూస్‌ని తుడుస్తూ....

‘‘నేను మీ ఇంటి కోడలిగా నచ్చానా....?’’ అడిగింది. చెయ్యి లేపాడాయన. అర్ధం కాలేదు జాహ్నవికి . ఏంటన్నట్లు చూసింది.

కీర్తనకి అర్ధమయింది. పుస్తకం పెన్ను అడుగుతున్నారు. తీసుకురాబోయింది. ఇంతలోనే జాహ్నవి....

‘‘ఓ!..... రాస్తారా!....’’ అంటూ పక్కనే వున్న పుస్తకం పెన్ను తెచ్చిచ్చింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavtundi