Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavtundi

గతసంచికలో ప్రారంభమయిన ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue227/632/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...  గంగరాజు ఇల్లు చిన్నది... ఒక చిన్న హాలు, చిన్న వంట గది... ఒకే ఒక పడక గది.. ఇంటి నిండా బోలెడు సామాను... పడక గదిలో రెండు మంచాలు... ఒక దాని మీద గంగరాజు పడుకుంటాడు.. రెండో దాని మీద కొడుకులిద్దరు పడుకుంటారు.. రెండు మంచాల మీదా దిండ్లు, పక్క బట్టలు, మగ వాళ్ళు తుడుచుకుని పడేసిన టవల్స్, దుర్గమ్మ చీరలు పగలంతా పడి  ఉంటాయి. రాత్రి కాగానే అవసరమైన దుప్పట్లు, దిండ్లు తీసుకుని మిగతా  బట్టలు కింద పడేసి ఎవరి దారిన వాళ్ళు పడుకుంటారు.  వంట గదికి అవతల వైపు చిన్న సందు... ఆ  సందులో బాత్రూం, లావేటరీ ... అక్కడే  అంట్లు, బట్టలు చేసుకోడానికి నల్లా.... పక్కన మరో పోర్షన్ లో  కూలి పని చేసుకునే సత్తెమ్మ దంపతులు ఉంటారు.. పైన రెండు పోర్షన్లు... అందరు కూడా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు.. దుర్గ కూడా ఇంటెడు పని తనే చేసుకుంటుంది...

వచ్చే ఆదాయంలో ఇంటి అద్దె మూడున్నర  వేలు, కరెంట్ బిల్లు, సరుకులు, రమేష్ చదువు... కాక ఎప్పటికప్పుడు షాప్ కి కావాల్సిన సామాను కూడా కొంటూ ఉండాలి... అదలా ఉంచితే ఈ అద్దె ఇల్లు చూస్తుంటే దుర్గమ్మకి చిరాగ్గా ఉంటుంది.. అందుకే ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశతో  నెలకి రెండున్నర వేలు చిట్టిలు కడుతుంది... ఇల్లు పొదుపుగా నడిపిస్తుంది...  పెద్ద కొడుకు దుబాయ్ వెళ్లి రెండేళ్ళు అవుతోంది కానీ... ఇంత వరకు అతని దగ్గర నుంచి ఒక పైసా కూడా రాలేదు..  కొడుకు బాగా సంపాదిస్తూ, తల్లి, తండ్రులను మర్చి పోయి జల్సా చేస్తున్నాడని దుర్గమ్మకి కోపం.  కనీసం అతని దగ్గర నుంచి ఉత్తరాలు కానీ ఫోన్ లు కానీ రావడం లేదు..  ఫోన్  షాప్ లో ఉంటుంది.. ఇది వరకు ఎవరన్న వచ్చి ఫోన్ చేసుకుని  నిమిషానికి ఇంత అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చే సరికి బయట వాళ్ళు ఎవరూ అతని ఫోన్ వాడడం లేదు.. బంధువులు ఎవరన్నా  ఫోన్ చేస్తే అక్కడికే చేస్తారు.. కొడుకు ఫోన్ చేసాడేమో అని ప్రతి రోజూ భర్త ఇంటికి రాగానే అడుగుతుంది దుర్గమ్మ.

దుర్గమ్మకి ఉన్నట్టే గంగరాజు మనసులో కూడా కొడుకు తమని మరచి పోయాడేమో అనే సంశయం ఉన్నా, కొంచెం లోకజ్ఞానం తెలిసిన వాడు కావడంతో కొడుకు అక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నాడో ఏమో అనవసరంగా పంపించాను అని బాధ పడుతుంటాడు.. కానీ తన బాధ మాత్రం పైకి వ్యక్తం చేయడు .

గంగరాజు ఉదయం ఏడింటికే షాపు తెరుస్తాడు.. అప్పటికే ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్ళంతా న్యూస్ పేపర్ కోసం షాపు దగ్గర నిలబడి ఉంటారు.. అందుకే త్వరగా నిద్ర లేచి, స్నానం చేసి, భార్య ఇచ్చిన చాయ్ తాగి షాపుకి వెళ్ళి పోతాడు.  మళ్ళి తొమ్మిదింటికి ఇంటికి వచ్చి నాస్తా చేసి వెళ్తాడు.  ఈలోగా పక్కనే ఉన్న లాండ్రీ షాపు ఐలయ్య చూసుకుంటాడు.  ఇల్లు, షాపు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి భోజనానికి షాప్ మూసి  వస్తాడు..  మళ్ళి మూడు గంటలకి తీస్తాడు. ఆది వారాలు మాత్రం మధ్యాహ్నం వరకూ మాత్రమే తీసి ఉంచుతాడు..

ఆ రోజు ఆదివారం ... రోజు లాగే ఏడింటికే వెళ్లి తిరిగి తొమ్మిదింటికి ఇంటికి వచ్చాడు. అప్పటికి రెండో కొడుకు సురేష్  తయారై చపాతీ తింటున్నాడు..

గంగరాజు భుజం మీది కండువా కుర్చీ కోడు మీద వేసి కుర్చీలో కూర్చుంటూ” నాక్కూడా నాస్తా తే”  అన్నాడు భార్యతో.

అప్పుడే రమేష్ స్నానం చేసి దువ్వెన , అద్దం  తీసుకుని వచ్చి వీధి గుమ్మం దగ్గర నిలబడి, పగటి వెలుగులో తల దువ్వుకో సాగాడు.

“దుర్గా... నీ కొడుకుకు షోకులేనా ... సడువుతుండా .... సక్కగ కాలేజ్ కి పోతుండా లేదా “ ప్లేట్ లో చపాతీలు తీసుకొచ్చి ఇస్తున్న భార్యని అడిగాడు.

దుర్గ మురిపెంగా కొడుకుని చూస్తూ “ ఊకొ ... ఎందుకు పోడు... మంచిగ సదుకుంటుండు”  అని సమాధానం చెబుతూ “ రమేషు జల్ది రా బిడ్డా... నాస్తా చేద్దువు” అంది. ఆమెకి మూడో కొడుకంటే చాలా గారాబం.

దువ్విన తలే దువ్వుతున్న రమేష్ సమాధానం చెప్పలేదు. 

గంగరాజు రమేష్ ని గమనిస్తూ చపాతీ తినసాగాడు.    సురేష్. పాత కాలం నాటి చెక్క కుర్చీల్లో కూర్చుని చపాతీ తింటూ నెమ్మదిగా అన్నాడు..” డాడి  ఫస్ట్ కి జీతం వచ్చినంక ఒక టేబుల్ కొందాము .... ఇట్లా చేతిలో పట్టుకుని తినుడు కష్టమైతుంది.. “

గంగరాజు తల తిప్పి సురేష్  వైపు చూసాడు. వేడి, వేడి చపాతీ, పప్పు వేసిన ప్లేటు కాలుతోంటే వొడిలో కాసేపు, చేతిలో కాసేపు తిప్పుతూ అవస్థ పడుతున్నాడు .. గంగరాజు  అటు, ఇటూ చూసి ఒక మూల ఉన్న ప్లాస్టిక్ స్టూల్ చూపిస్తూ దుర్గతో అన్నాడు “ ఆ స్టూల్ తీసుకొచ్చి ఇయ్యి... పాపం  ఎట్ల తింటడు...”

దుర్గ వెళ్లి స్టూల్ తెచ్చి కొడుకు దగ్గర పెట్టింది. స్టూల్ మిద ప్లేట్ పెట్టుకుని వొంగి తింటూ మళ్ళి అన్నాడు సురేష్..”. గిసొంటిదే టేబుల్ వేయి రూపాయిలకే వస్తది... కొందాం. “

రమేష్ తల దువ్వుకుని వస్తూ అన్నాడు...” డాడీ  నాకు సెల్ ఫోన్ కావలె..”

గాయత్రిని కలుసుకున్న దగ్గర నుంచి అతనికి అర్జెంట్ గా మొబైల్ కొనుక్కోవాలని ఉంది. మొబైల్ చేతిలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు గాయత్రితో మాట్లాడచ్చు, వాట్స్ ఆప్ లో మెసేజెస్ పెట్టుకో వచ్చు అని ఉబలాటంగా ఉంది.

“ఏమిటికిరా..”. అడిగాడు గంగరాజు.

“ మా దోస్తులందరికి ఉంది.... సెల్ ఫోను లేకుంటే ఏమన్నా ఎమర్జెన్సీ ల నీకు మెసేజ్ ఇయ్యల్నంటే ఎట్లా.. అందుకే నాకు సెల్ కావలె ..”. లోపలికి వెళ్లి అద్దం పెట్టేసి వచ్చాడు.

గంగరాజు కొడుకు వైపు తదేకంగా చూసాడు. ముదురు నీలం మీద తెలుపు చెక్స్ ఉన్న ఇస్త్రి  షర్ట్, జీన్స్ ప్యాంటు, నీటుగా దువ్విన క్రాఫ్, మొహానికి అడ్డుకున్న పౌడర్ ... ఆయన దృష్టి సురేష్ మీద పడింది. మాములు టేరి కాటన్ ప్యాంటు,  తెల్ల షర్ట్  చాలా సింపుల్ గా , ఒద్దికగా ఉన్నాడు.

హటాత్తుగా సురేష్ ని అడిగాడు..” నీ తాన సెల్ ఫోన్ ఉందా సురేషు..”

సురేష్ తలెత్తి  లేదు అన్నట్టు చూసాడు.

ఆయన రమేష్ వైపు చూస్తూ అన్నాడు.. “ నౌకరీ చేసేటోనికి లేదు గాని  నీకేందుకురా.. నకరలైతున్నయ్యా.. ఇయాల సండే.. ఏడికి పెండ్లి కొడుకు లెక్క తయారైనవు ... “    రమేష్ పొగరుగా అన్నాడు..” నౌకరీ చేస్తేనేనా... మా కాలేజ్ ల అందరి తాన ఉంది... “
    దుర్గమ్మకి భర్త రమేష్ తో అట్లా మాట్లాడడం నచ్చలేదు. చిన్న కొడుకు ముచ్చట పడి అడుగుతున్న సెల్ ఫోన్ వెంటనే కోనేయచ్చు కదా అనుకుంది.   అతను ఏది అడిగినా వీలైనంత వరకు లేదు, కాదు అనకుండా తనకు చేత నయినంత చేస్తుంది. ఇప్పుడు కూడా భర్తతో అంది కొనియ్యచ్చు కదా.. ఏమైతది ?

“ముందు సడువుకోమ్మను.. నౌకరీ చూసుకుని సెల్ ఫోన్ కొనుక్కుంటడో , కలర్ టి వి కొంటాడో  నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం ...” చపాతీ తినడం పూర్తీ చేసి చేయి కడుక్కుంటూ అన్నాడు.

“నాకు సెల్  కావలె డాడి”   మొండిగా అన్నాడు రమేష్ ...

“ నాలుగు దినాలు షాప్ లో కూసుని దంద చేయి ఇప్పిస్త”  అంటూ మంచం వైపు వెళ్లి పడుకున్నాడు గంగరాజు .

రమేష్ తల్లి వైపు చూసి “ చూసినవా  ఎట్ల  అంటున్నాడో”  ఫిర్యాదుగా అన్నాడు.

ఆవిడ చపాతీ ప్లేటు ఇస్తూ “ నేను కొనిస్త బిడ్డ పికరు చేయకు” అంది.

సురేష్ తల్లి వైపు చూస్తూ “ వాడు ఏమడిగిన కొనిస్తవు ....కష్టపడే తోల్లం మాకేం లేకున్న నీకు ఫరక్ పడదు...” అన్నాడు.

చిన్నోడు నాయనా .... ఆనికేమేరుక . తమ్మున్ని మంచిగ చుసుకోవలె”  అంది నచ్చ చెబుతున్నట్టుగా .

“ఏం చిన్నోడు... ఇరవై ఏండ్లు  చిన్నోడా! “ అంటూ బయటకి వెళ్లిపోయాడు సురేష్. రమేష్ అదేం  పట్టించుకోలేదు... తనకి అమ్మ సెల్ కొనిస్తుంది.. అంతే ... గాయత్రితో బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు.  ఆ ఆనందంతో ఒక చపాతీ ఎక్కువ తిన్నాడు. రమేష్ సాధించాడు... రెండున్నర వేలు పెట్టి సెల్ కొని ఇచ్చింది దుర్గమ్మ. కొన్ని విషయాల్లో ఎంత పొదుపుగా ఉంటుందో చిన్న కొడుకుకి సంబంధించిన విషయాల్లో అంట ఉదారంగా ఉంటుంది దుర్గమ్మ. భర్తకి తెలియకుండా కొనడం కాక అవసరం అయితే ఆయనతో గొడవ పడడానికి కూడా వెనకాడదు. అది రమేష్ కి మంచి అవకాశం ... అందుకే ఏం కావాలన్నా తల్లి దగ్గర సాధించేయగలడు.

కొత్త మొబైల్ .... అది అరచేతిలో పట్టుకుంటే ప్రపంచం మొత్తం తన అరచేతిలో పెట్టుకున్నంత ధీమాగా అనిపించింది రమేష్ కి..

దానికేసి పదే, పదే చూస్తూ మురిసిపోయాడు.

“ఇక్కడియ్ బిడ్డా దేవుని తాన పెట్టిస్త “ అంది దుర్గమ్మ.   

“మొబైల్ దేవుని తాన పెట్టుడెందమ్మ “ అనబోయి ఆగిపోయి బుద్ధిగా ఇచ్చాడు. ఆవిడ దానికి నాలుగువైపులా గంధం పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, ఒక అగరుబత్తి తిప్పి కొడుకుకి ఇచ్చింది.

మురిసిపోతూ తీసుకుని,  బయటికి వెళ్లి తండ్రి దగ్గర సిమ్ కార్డ్ ఉంటుందని తెలిసి కూడా పక్క షాప్ లో  ఒక సిమ్ కొన్నాడు.. ఇరవై నాలుగు గంటల తరవాత అది యాక్టివేట్ అవుతుందని చెప్పడంతో అబ్బా ఇరవై నాలుగు గంటలా అని ఉసూరు మన్నాడు... అతి కష్టం మిద ఇరవై నాలుగు గంటలు గడిచాయి... కీపాడ్ చూసాక గుర్తొచ్చింది సెల్ తనకి మాత్రమే ఉంది గాయత్రికి లేదు అని..

రమేష్ కి ఇప్పుడు ఆ మొబైల్  నిరుపయోగంగా అనిపించింది. ఆ రోజంతా గాయత్రి కోసం చూసాడు... తన మొబైల్ చూపించి ఆమెని కూడా కొనుక్కోమని చెప్పడానికి.. ఆమె కనిపించలేదు.. చాలా దిగులుగా అనిపించింది..

గాయత్రి దగ్గర మొబైల్  లేకుండా ఎట్లా మాట్లాదాలో అర్ధం కాలేదు.. .ఆమె కూడా వాళ్ళ డాడిని అడిగి సెల్ కొనిపించుకోమని చెప్పాలె. వాళ్ళ డాడీ కొంటడో , లేదో .... తనే కొంటే ! అమ్మనడికి ఇంకా రెండు వేలు తీసుకుని గాయత్రికి సెల్ గిఫ్ట్ ఇస్తే.... అమ్మో ...

రమేష్ కి ఇప్పుడు అదొక దిగులుగా మారింది.. తను ఏ అవసరం కోసం ఇంత  గొడవ చేసి సెల్ కొన్నాడో అది  తీరడం లేదు...

రాత్రి పదింటి దాకా అటు, ఇటూ తిరిగి ఇంటికి వచ్చాడు.. అన్నం తినేసి పడుకుని,  సెల్  తీసి దాని వైపు చూసాడు..  బేకార్  అనుకుంటూ  దిండు కింద పెట్టుకుని పక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాడు.

ఆ రాత్రంతా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని తనూ, గాయత్రీ అందులో బోలెడు కబుర్లు చెప్పుకున్నట్టు, ద్యుయట్ పాడుకున్నట్టు కలలు కన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్