Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అర్జున్‌ రెడ్డి చిత్ర సమీక్ష

arjun reddy movie review

చిత్రం:అర్జున్‌ రెడ్డి 
తారాగణం: విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్‌ రామకృష్ణ, సంజయ్‌ స్వరూప్‌, కమల్‌ కామరాజు తదితరులు 
సంగీతం: రధన్‌ 
సినిమాటోగ్రఫీ: రాజు తోట 
దర్శకత్వం: సందీప్‌ రెడ్డి వంగా 
నిర్మాత: ప్రణయ్‌ రెడ్డి వంగా 
విడుదల తేదీ: 25 ఆగస్ట్‌ 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
మెడికో అర్జున్‌రెడ్డి (విజయ్‌ దేవరకొండ)కి కోపమెక్కువ. కోపంలో ఏం చేస్తాడో అతనికే తెలియదు. అంత కోపంలోనూ అతను ఓ మంచి ప్రేమికుడన్న విషయం కీర్తి (షాలిని పాండే)తో ప్రేమలో పడ్డాకే తెలుస్తుంది. అయితే వీరి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు తగులుతారు. కీర్తికి వేరే పెళ్ళయిపోతుంది. దాంతో అర్జున్‌ దేవదాసులా మారిపోతాడు. మందుకీ, డ్రగ్స్‌కీ బానిసైపోతాడు. మరి, ఆ దేవదాసు ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే. 
మొత్తంగా చెప్పాలంటే 
'పెళ్ళిచూపులు' సినిమా విజయ్‌ దేవరకొండని స్టార్‌ని చేసింది. ఏదో ఆషామాషీగా స్టార్‌ అయిపోలేదీ యంగ్‌ హీరో. చాలా క్యాజువల్‌గా ఉంటాడు. రియల్‌ లైఫ్‌లో ఓ కుర్రాడెలా ఉంటాడో విజయ్‌ దేవరకొండ అలాగే ఉంటాడు. అదే అతనికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. అర్జున్‌ రెడ్డి సినిమాలోనూ అంతే. ఆ పాత్రని ఎలా డిజైన్‌ చేశారో, అలా తనను తాను డిజైన్‌ చేసేసుకున్నాడు. నటించినట్లుగా కాకుండా తెరపై జీవించినట్లుగా అనిపిస్తుంది. నటుడిగా విజయ్‌ దేవరకొండకి ఇది చాలా కఠిన పరీక్ష. అయినా ఈ పరీక్షలు విజయం సాధించాడు. 
హీరోయిన్‌ షాలిని పాండే సహజంగా అనిపిస్తుంది. నటన పరంగానూ ఓకే. మిగతా పాత్రధారుల్లో రాహుల్‌ రామకృష్ణకి మంచి మార్కులు పడతాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
వెండితెరపై 'దేవదాసు' తరహా సినిమాల్ని ఎన్నో చూసేశాం. అందుకే కొంచెం కొత్తదనం కోరుకున్నాడు దర్శకుడు. ఆ కొత్త దనమే సహజత్వం. కొంచెం బోల్డ్‌ కంటెంట్‌ని ఎంచుకున్నా, దర్శకుడు సినిమాని డీల్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ సహజత్వానికి దగ్గరా ఉన్నాయి. కథనం కూడా ఆకట్టుకుంటుంది. సంగీతం బాగుంది, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి బోనస్‌. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌ బాగున్నాయి. నిర్మాణపు విలువల పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే, ఎక్కడా రాజీ పడలేదనిపిస్తుంది. 
లిప్‌ టు లిప్‌ కిస్‌ పోస్టర్స్‌తో సినిమా ఓ వర్గం ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసింది. 'పెళ్ళిచూపులు' సినిమాతో యూత్‌లో మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ, ఈ సినిమాతోనూ వారిని నిరాశపరచడు. అయితే 'పెళ్ళిచూపులు' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పు పొందిందిగానీ, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కొంత నిరాశపరుస్తుంది. అయితేనేం దాన్ని యూత్‌ ఆడియన్స్‌తో కవర్‌ అప్‌ చేసెయ్యొచ్చు. ఆ స్థాయిలో సినిమాలో బోల్డ్‌ కంటెంట్‌ కనిపిస్తుంది. ఓవర్‌ ది బోర్డ్‌ అన్న మాట తప్పదుగానీ, దాన్ని జడ్జ్‌ చేసుకునేలానే దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. మసాలా కోరుకునే ఆడియన్స్‌కి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్నీ ఎంటర్‌టైన్‌ చేశారు. అలా ఈ సినిమాకి మంచి విజయం అందుకునే లక్షణాలు మెండుగా ఉన్నాయని చెప్పక తప్పదు. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
ఈ తరం ప్రేక్షకులు మెచ్చే దేవదాసు - అర్జున్‌రెడ్డి 
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka