Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...  http://www.gotelugu.com/issue228/633/telugu-serials/naadaina-prapancham/nadina-prapancham/

( గతసంచిక తరువాయి )...‘‘నా చిన్నప్పటి మా అమ్మలా ఉన్నావు.’’ రాసాడాయన. కళ్ళలో నీళ్ళు తిరిగాయి జాహ్నవికి. అది చూసి మళ్ళీ రాసాడాయన.

‘‘మీ అత్తగారి నోరు చాలా పెద్దది. జాగ్రత్తగా వుండాలి. యింత అమాయకంగా వుంటే ఈ ఇంట్లో ఉండలేవు.’’

అది చదివి నవ్వింది....‘‘మీరు తోడుంటారుగా! ఫర్లేదు’’ ధీమాగా అంది.

ఆ తర్వాత జాహ్నవి ఏదో అడగడం. ఆయన రాయడం వాళ్ళ సంభాషణ నిరాఘాటంగా సాగి పోతోంది.

కొంచెం దూరంలో సోఫాలో కూర్చున్న కీర్తనకి హఠాత్తుగా తను వంటరినన్న బాధ కలిగింది.

ఇంట్లో మొదటి సంతానంగా పుట్టి, రెండో బిడ్డ ఇంట్లోకి రాగానే మొదటి బిడ్డ ఫీయ్యే అభద్రతా భావం ఆమెని ఆవహించింది. మెల్లిగా లేచి తన గది వైపు నడవబోతోంది....

ఇంతలో అశోక్‌ కార్డ్‌లెస్‌ తెచ్చిచ్చి ‘‘చిట్టీ! ఎవరో ఆకాషంట’’ చెప్పి ఇచ్చాడు.

దడదడలాడే గుండెతో తన గది లోకి వచ్చింది.

తలుపు బోల్ట్‌ వేసుకుని.....

‘‘హలో!....’’ అంది.

‘‘హలో!....చిట్టీ బావున్నావా....?’’ అటు నుంచి ఆకాష్‌ చిలిపిగా అనడం వినిపించింది.

ఏడుపు ముంచుకు రాబోయింది. ఆపుకుంది.

‘‘హలో!....’’ లైన్‌ కట్టయిందేమోనన్న అనుమానంతో అన్నాడు.

‘‘ఆ!....’’

‘‘మాట్లాడు.. ఎలా వున్నావు?’’

‘‘బాగానే వున్నాను.’’

‘‘ఇరవై నాలుగు గంటలు... ఇరవై నాలుగు యుగాలు గడిచినట్లు వుంది. నిన్ను చూడాలనిపిస్తోంది చిట్టీ!’’ అనురాగంగా అన్నాడు.
‘‘నా పేరు చిట్టి ఏం కాదు...కీర్తన.’’

‘‘ఇందాక ఎవరో పిలుస్తుంటే వినపడింది.’’

‘‘మా అన్నయ్య....’’ చెప్పింది.

‘ఆహా!’’ అని వూరుకున్నాడు.

క్షణమాగి ‘‘ఎప్పుడు....? ఎక్కడ....?’’ అన్నాడు.

‘‘ఏంటి...?’’ అయోమయంగా అంది.

‘‘మనం కలవడం....’’ సరదాగా అన్నాడు.

మైండ్‌ లోకి చటుక్కున ఐడియా వచ్చింది.

‘‘రేపు మీ ఆఫీస్‌లో గాని, మీ ఇంట్లో గాని...’’ అనేసింది. కాసేపు అటు వైపు నిశ్శబ్దం.

‘‘ఇపుడు కాదు కీర్తనా! ఇంకా టైముంది’’ మెల్లగా అన్నాడు.

‘‘కాదు రేపే!’’ మొండిగా అంది.

‘‘ప్లీజ్‌!.....’’ అభ్యర్ధనగా అన్నాడు.

కీర్తన ఏదో అనే లోపే అశోక్‌ పిలవడం వినిపించి...

‘‘రేపు గానీ, ఎల్లున్డి గాని ఫోన్‌ చెయ్యండి, అన్నయ్య పిలుస్తున్నాడు. బై’’ చెప్పి కార్డ్‌లెస్‌ ఆఫ్‌ చేసింది.

గది బయటకు రాగానే జాహ్నవితో కనిపించాడు అశోక్‌.

కీర్తనని చూసి, జాహ్నవిని చూపిస్తూ..

‘‘ఈ అమ్మాయి నీకు నచ్చిందా...?’’ అడిగాడు. జాహ్నవి ముసి ముసిగా నవ్వుకుంటోంది.

‘‘చా...లా...’’ ముఖ్యంగా నాన్న గారి విషయంలో....!’’ మనస్ఫూర్తిగా అంది.

‘‘అయితే పెళ్ళెపుడు....?’’ సరదాగా అంది.

‘‘ముందు నీ పెళ్ళి అవ్వాలిగా! ఆ తర్వాతే!’’ ఆమె తలమీద మొట్టి వెళ్ళిపోతుంటే అయోమయంగా చూసి, మధ్యలో ఈ లింకేంటీ అనుకుంది.

ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

‘‘మీ యాంబిషన్‌ ఏంటో చెప్పండి....?’’ కీర్తన జాహ్నవిని చూస్తూ అడిగింది.

‘‘యాంబిషన్‌....? ప్రత్యేకంగా ఏం లేవు. మీ అన్నయ్య ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలి. ఇంట్లో అందరినీ బాగా చూసుకోవాలి. అంతే!’’ అంటుంటే ఆశ్చర్యంగా అనిపించింది.

ఏ లక్ష్యమూ లేకుండా జీవితం ఎంత చప్పగా వుంటుంది. ప్రేమ నిలబడాలంటే రెండు వైపులా కృషి వుండాలి తప్ప ఒక సైడ్‌ కాదుగా.

ఏమోలే! ఈమె పరిధి యింతే కావచ్చు. సరిపెట్టుకుంటూ అనుకుంది కీర్తన.

‘‘మీకు మంచి సంబంధం తేవాలని మీ అన్నయ్య కోరిక. అందుకే వెతుకుతున్నారు.’’ చెప్పింది జాహ్నవి.

‘తనకే ఈ విషయం తెలీదే! ఈమెతో అన్నయ్య ఎప్పుడు చెప్పాడు? అయినా ఈ మధ్య తను వూళ్ళో లేదుగా అప్పుడు చెప్పి వుంటాడు’ అనుకుంది. 

రాత్రికి వాళ్ళు భోజనాలు చేసి బయలుదేరారు. వెళ్ళే ముందు నానమ్మ అమ్మతాలూకు నగ పెట్టెని, తనతో బొట్టు పెట్టించి యిప్పించింది.
సుమారు ఏడెనిమిది లక్ష ఖరీదైన ఆభరణాలు, ఈ ఇంటి కోడలి కోసం అలాగే దాచి వుంచారు.

ఇహ జాహ్నవికీ, తమకీ మధ్య బంధం ముడిపడినట్లేననిపించింది.

కానీ అంత లోనే మరో ఆలోచన మనసుని వణికించింది. పిన్నికి ఆ విషయం తెలీదు.

పిన్ని లేకుండా యిదంతా జరిగింది.

ముఖ్యంగా ఆ నగలు తనకిమ్మని ఆమె ఎన్నో సార్లు తండ్రిని అడిగింది. ఆయన చూపుతోనే తిరస్కరించారు.

ఇప్పుడీ విషయం తెలిస్తే 

ఆమె రియాక్షన్‌ ఎలా వుంటుందో చెప్పడం కష్టం.

అందరికీ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఆలోచిస్తూనే బెడ్‌రూంకి వెళ్లింది. పడుకోడానికి ప్రయత్నించింది కానీ నిద్ర పట్టడం లేదు.
ఆరోజు జరిగిన సంఘటన అనుభవం మనసుని సంచలనానికి లోను చేస్తోంది.

కాసేపటికి గదిలో లైటు వెలిగింది. ఆ మ్తెరులో నిువెత్తు అనురాగానికి చిహ్నంగా అన్నయ్య.

ఎందుకో, ఎవరో అన్నయ్యని తననుంచి లాక్కుపోతున్నారనిపించింది. ఉక్రోషంగా వుంది. దిండుని కాళ్ళతో తన్ని కోపంగా బుంగ మూతి పెట్టి కూర్చుంది.

‘‘ఏమయింది చిట్టీ!’’ లాలనగా అడిగాడు.

‘‘నువ్వు మారిపోయావు. నీకిప్పుడు కొత్త రిలేషన్స్‌ వచ్చాయి’’ మనసులో ఏమీ వుంచుకోలేక అక్కసుగా అంది.

పకపకా నవ్వేశాడు. ‘‘ఏంటి చిట్టీ! నీ బాధ?’’

‘‘ఏం లేదులే....నిద్రొస్తోంది....’’ ముసుగు పెట్టేసింది.

అశోక్‌ దగ్గరకి వచ్చి తలమీద దుప్పటి తీసి ఆమె నుదుటి మీద మెల్లగా చుంబించి...

‘‘దేనికీ భయపడకు. నాకు జీవితంలో అందరికన్నా, ఆఖరికి నాన్నగారి కన్నా కూడా నువ్వే ముఖ్యం. నీ సుఖసంతోషాల కోసమే ఏం చేసినా..... ఎక్కువ ఆలోచించక పడుకో.’’

మనసులో ఒక భాగం తేలికపడింది. అయినా అన్నయ్యని అనుమానించడం ఏమిటి? తన పిచ్చి గానీ అనుకుంది.

ఇంతలో టేబిల్‌ మీదున్న కార్డ్‌లెస్‌ మోగింది. కొంప దీసి ఆకాష్‌ కాదు గదా! ఒక్క గంతులో వెళ్ళి తీసింది. అప్పటికే హాల్లో ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు అన్నయ్య.

అటువైపు తన టీం మేట్‌ ఫోన్‌.

‘‘నీకేనమ్మా!’’ అంటూ అశోక్‌ రిసీవర్‌ క్రెడిల్‌ చేశాడు.

‘‘హలో! చెప్పు....’’ ఆత్రుతగా అంది కీర్తన.

‘‘అడ్రస్‌ పట్టేశాను’’ ఉత్సాహంగా వింది కీర్తన.

‘‘చెప్పు....ఆకాష్‌ ఏం చేస్తుంటాడు? వాళ్ళ పేరెంట్స్‌ వివరాలు ఏంటి’’ అంది.

‘‘అదేమీ తెలియదు. అతని ఆఫీస్‌ అడ్రస్‌ తెలిసింది. అమీర్‌పేటలో, వివరాలు తెలియవు. కానీ ‘ఆకాష్‌ కంప్యూటర్స్‌’ వాళ్ళదేనట. చాలా రిచెస్ట్‌ ఫెలో! అతని వల నిజమైతే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఉంటా బై!’’ ఫోన్‌ పెట్టేసింది.

ఆలోచిస్తూ వుండిపోయింది కీర్తన.

ఆకాష్‌ ప్రేమ నిజమైతే తను నిజంగా అదృష్టవంతురాలే! కానీ అతను రిచ్చెస్ట్‌ ఫెలో అవడం మూలంగా కాదు. తననీ, తన లక్ష్యాన్ని అతను గౌరవించడం మూలంగా మాత్రమే తను అదృష్టవంతురాలు.

రేపు ఎలాగైనా ఆకాష్‌ని ఆఫీస్‌ లోనే కలిసి అసలు ఈ మణిబిందు సంగతేంటో తేల్చాలి.

మణిబిందు మనస్థత్వం తనకి తెలుసు. ఎలాగైనా విజయం సాధించాలి అనే టైప్‌. అందు కోసం ఎదుటి వారిని మానసికంగా హింసించడం ఆమె ఎంచుకున్న మార్గం. 

విజయం ఎప్పుడూ అలా రాదని తనకి తెలియాలి. అందుకే ఆకాష్‌తో ముందు ఈ విషయం మాట్లాడాలి.

ఏం మాట్లాడాలీ, ఎలా మాట్లాడాలీ అన్నీ ఒకటికి పదిసార్లు అనుకుని ఎప్పుడో అర్ధరాత్రి నిద్ర లోకి జారుకుంది కీర్తన.

**************

‘‘చిట్టీ! కాలేజీకి వెళ్ళవా? లే!’’ అంటూ అశోక్‌ లేపుతుంటే మెలకువ వచ్చింది.

టైమ్‌ చూసింది. ఏడయింది. ‘మైగాడ్‌ లేటయింది’ అనుకుంటూ లేచి గంటలో రెడీ అయిపోయింది.

‘‘ఇంకా టైముంది కదమ్మా! నేను దించేస్తాలే!’’ అని అశోక్‌ అంటున్నా వినిపించుకోకుండా..

‘‘పనుంది వెళ్ళాలి’’ అంటూ ఆదరాబాదరాగా బయలుదేరింది.

అమీర్‌పేటకి డైరెక్ట్‌గా ఆటో మాట్లాడుకుంది. వెళుతున్నంత సేపూ ఒకటే టెన్షన్‌. ఆకాష్‌ ఎలాంటి వాడో కాసేపట్లో తెలుస్తుంది. 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్