Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram telugu serial twelth part

ఈ సంచికలో >> సీరియల్స్

ఏరు దాటిన కెరటం - పాలకోడేటి సత్యనారాయణరావు

eru daatina keratam stroy by satyanarayana rao

బాబు గుక్కపెట్టి ఏడుస్తుంటే కృష్ణమూర్తికి మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చాక చూస్తే బాబు నేలమీదకు దొర్లిపోయి,వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కృష్ణమూర్తి బద్ధకం వదిలించుకుని అన్నాడు - "ఏయ్. వీన్నొకసారి చూడు." ఆ మాట అనేసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడే గాని, కృష్ణమూర్తి చెవుల్లో బాబు ఏడుపు గింగురుమంటూనే ఉంది. అతనూ ఓ క్షణం పాటు చూశాడు. ఆ క్షణంలోనూ అతని పిలుపుకు జవాబుగా మనిషిరాలేదు సరికదా జవాబురాలేదు.

బాబు క్షణక్షణానికి శృతిపెంచుకుంటూ పోతున్నాడు. ఏడాది వెధవ లేడు ఎలా ఉంటాడు ఏడింటి వరకూ పాలులేకుండా. కళ్ళు నలుపుకుంటూ, బద్ధకం వదిలించుకుని మంచం దిగాడు కృష్ణమూర్తి "ఏం చేస్తున్నావ్ శారదా?"

అయినా శారద దగ్గర్నుంచి జవాబురాలేదు.

కృష్ణమూర్తి బాబును ఎత్తుకున్నాడు. ఒక్కక్షణం ఏడుపుమాని, వెంటనే అందుకున్నాడు. శారద దగ్గర్నుంచి జవాబు రాకపోయేసరికి శారద బాత్ రూంలో వుందేమోనని అటుకేసి వెళ్ళాడు. తలుపు దగ్గరగా వేసి ఉంది. తలుపు దగ్గరనుంచే పిలిచాడు. "శారదా!"

కృష్ణమూర్తి ఈసారి తలుపు తట్టాడు తలుపు తెరుచుకుంది. లోపల శారద లేదు.

చిరాగ్గా ఇంట్లోకి వచ్చాడు కృష్ణమూర్తి. బాబు ఏడుపుతో మనసంతా అశాంతిగా వుంది. అల్లకల్లోలంగా వుంది. అయినా శారద ఎక్కడకు వెళ్ళింది?

బాబుకు ఆకలి ఎక్కువైనట్లుగా వుంది. ఏడుపు యింకా ఎక్కువ చేశాడు. కృష్ణమూర్తి వంట యింట్లోకి నడిచాడు. అక్కడెక్కడా అతనికి పాలు కనబడలేదు. విసుగ్గా వెనక్కు తిరిగాడు. వీధిగది గుమ్మం ముందు పాలు పోసిన గిన్నె వుంది. స్టౌ అంటించి పాలు దానిమీద పడేశాడు. బాబును ఆడిస్తూ దొడ్లోకి తెచ్చాడు.

దొడ్లో జామచెట్టుమీద రెండు చిలకలు ముచ్చట లాడుకొంటున్నాయి. ఒక చిలుక తన కాలికిందనున్న జామంపండులోంచి కొంచెం గుజ్జు తీసి రెండో దానికి అందిస్తోంది. బాబుకూ, కృష్ణమూర్తికీ ఆశ్చర్యం ఆనందాన్ని కలుగజేసింది.

బాబు ఏడుపు ఆపుచేశాడు. ఆనందంగా ఆ చిలుకకేసి చూస్తున్నాడు. బుగ్గలమీద కన్నీటి చారలు, కన్నీరూ వున్నాయి. కంట్లోవున్న నీటి బొట్లు మెరుస్తున్నాయి. కృష్ణమూర్తికి బాధ కలిగింది.

శారద ఏం చేసినా ఊరుకుంటాడతను. కాని బాబును ఏడిపించటం మాత్రం సహించలేని విషయం. ఇంట్లో పిల్లలు కళకళ లాడుతూ నవ్వుతూవుంటే బాగుంటుంది. కాని, ఏడుస్తూ ఈసురో మంటూ వుంటే ఇంటికన్నా నరకం ఇంకోటి వుండదనిపిస్తుంది. అందుకే తనకూ, శారదకూ ఎపుడైనా గొడవంటూ వస్తే అది బాబు విషయంలోనే. పిల్లలంటే తనకు ఇష్టం. వాళ్ళను మించిన ఆనందం ఇంకేదీ లేదు. వాళ్ళు ఇంటికి దీపాలు. కంటికి పాపలు.

అయినా శారద ఎక్కడకు వెళ్ళింది? తెలీదు. రాగానే చెప్పాలి - ఇక మీదట యిలా బాబును ఏడిపిస్తే ఊరుకునేది లేదని. ఈ సారి బజారులోకి వెడితే చలం పుస్తకం "పిల్లల పెంపకం" కొని తేవాలి. ఇంట్లో చలం పుస్తకాలు అన్నీ వున్నాయి. ఆ ఒక్క "పిల్లల పెంపకం" తప్ప - చలం రాసిన చెత్త పుస్తకం ఆ పిల్లల పెంపకం ఒకటే అనుకున్నాడు తాను. కానీ ఎంతటి మేధావి చలం? పిల్లల్ని కనిపారేయటం తప్ప కనుపాపల్లా చూసుకొనే తల్లులెంతమంది వున్నారో ఈ లోకంలో?

బాబు మళ్లీ ఏడవటంతో కృష్ణమూర్తి ఆలోచనలు ఆగిపోయాయి. అమూల్ డబ్బా ఒకటి బాబుకు అందిచ్చాడు. ఆ డబ్బాతో బాబు ఆడుకొంటుంటే స్టౌమీద పాలు దింపి గ్లాసులోకి పోశాడు.

అయినా శారద ఎక్కడకు వెళ్ళింది?

వెనక ఏదో గాజుల చప్పుడైతే శారద అనుకొని వెనక్కు తిరిగుతూ అన్నాడు కృష్ణమూర్తి - "ఎక్కడకు వెళ్ళావు శారదా...?"

వచ్చింది పనిమనిషి రంగి

"అంట్లు దొడ్లోనే వున్నాయి చూడవ్వా" అంటూ పాలు కలపడంలోనే మునిగిపోయాడు కృష్ణమూర్తి.

బాబు కొంచెం పాలు తాగి, కొంచెం పారబోసి, మొత్తానికి పాలుతాగాను అన్నట్లుగా ముఖం పెట్టాడు. కృష్ణమూర్తికి ఎంతో ఆనందంగా ఉంది. బాబు అమూల్ డబ్బా మూత తీయ ప్రయత్నిస్తోంటే.

క్రిందపడ్డ అమూల్ డబ్బా మీద బాబు బొమ్మ అటూ యిటూ కదులుతోంది. ఆ కదలికలో ఎంతో అందాలు గుమ్మరిస్తోంది.

శారద... శారద... ఏదీ? ఇంకా రాదేం? అనుకొన్నాడు కృష్ణమూర్తి.

కృష్ణమూర్తి అలా అనుకొన్నాగానీ శారద జాడలేదు.

****    ****    ****    ****

"పోలీస్ రిపోర్టు ఇద్దామంటావురా కృష్ణా?"

తలెత్తి చూశాడు కృష్ణమూర్తి రావ్ కేసి. రావ్ ముఖం సీరియస్ గా వుంది. ఆ ముఖంలో బాధ వుంది. కృష్ణమూర్తితో అన్నాడు రావేమళ్లీ? "నువ్వు అపార్ధం చేసుకోకు - నీ బాధ నాకు తెలీంది కాదు. నిన్న పొద్దుటినుంచీ మీ ఆవిడ కనబడటం లేదు. బెజవాడకు యిచ్చిన టెలిగ్రాంకు రిప్లయి వచ్చేసింది. ఇక్కడా లేక, పుట్టింటిలోను లేక ఇంకెక్కడ వుందంటావ్?"

కృష్ణమూర్తి ఏమీ అనలేదు.

క్షణం ఆగి అన్నాడు రావ్ "ఏమయిందో నాకు తెలీదు. అందుకే పోలీస్ రిపోర్టు యిద్దామనుకుంటున్నాను."

"వద్దురా, పోలీసుల దృష్టికి పోవటం నాకిష్టం లేదు."

"పోలీసుల దృష్టిలోకి పోవటం యిష్టం లేకపోతే పోనీ, నీ భార్య మీదైనా నీకు ఇష్టం ఉందా లేదా? అదీ లేకపోయినా సరే, పోనీ, అదిగో వాడి సంగతి ఆలోచించు - ఆ బాబుగాడికోసమైనా..."

"వద్దురా, నాకది యిష్టంలేదు. ఇక ఆ సంగతి ఎత్తకు," అన్నాడు కృష్ణమూర్తి... "అయినా శారద ఏమయిందంటావురా?"

రావ్ కు ఆక్షణంలో ఎన్నో ఊహలు కలిగాయి - దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, ఎత్తుకు పోవడాలు, లేచి పోవడాలు, పారిపోవడాలు, ఆత్మహత్యలు, హత్యలు... అయినా అవన్నీ రావ్ బయటకు అనలేదు.

తలుపు తట్టిన చప్పుడయింది. రావే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా పనిమనిషి రంగి. రావ్ తలలో మెరుపొకటి మెరిసింది.

రంగి ఇంట్లో పనంతా పూర్తిచేశాక బయటకు కదిలింది. క్షణం తర్వాత రావ్ కృష్ణమూర్తితో చెప్పి బయటకు కదిలాడు. రంగి నడుస్తొంటే కూడా నడిచాడు రావ్. రంగి కొంతదూరం నడిచాక ఒక పూరింటిలో దూరింది. తనూ ఆ పూరింటిలోకి నడిచాడు రావ్. రావును చూసి రంగి కంగారు పడింది.

నెమ్మదిగా అడిగాడు రావు, "నువ్వు శారదమ్మగారింట్లో పని చేస్తున్నావు కదూ?"

"ఔనండీ!" అంది రంగి.

"అయితే శారదమ్మగా రెక్కడకు వెళ్లారు?"

"నాకేం తెలీదు. ఆ పెద్దోళ్ళ ఏదో జరిగితే మీరు నన్నడిగితే నేనెట్లా జవాబు చెప్పేది?" అంది రంగి.

రావుకు రంగి మాటల్లో ఏదో భావం కనబడింది. రంగికి కొంచెం అయినా తెలిసి వుండి తీరాలనుకొన్నాడు. మళ్లీ అడిగాడు, "నీ యిష్టం మరి ఆ అమ్మగారు కనబడ్డం లేదని పోలీసు రిపోర్టు యివ్వదలచుకున్నాం. పోలీసువాళ్ళు నిన్ను అడుగుతారు. అనుమానం వస్తే తీసుకెళ్ళి జైలులో కూడా పెడతారు. ఆ తర్వాత నీ యిష్టం!"

రంగి అంది వెంటనే "నన్నెందుకు పెడతారు జైల్లో?"

"ఎందుకూ? ఆ అమ్మగారు కనబడ్డంలేదు. ఎక్కడికైనా వెళ్ళిపోయిందో, ఎవరైనా ఏమైనా చేశారో ఎలా తెలుస్తుంది మరి?"

రంగి తిత్తర పడుతూ అంది "ఆయమ్మ వెళ్లిపోయుంటుంది?"

"నీకెలా తెలుసు?"

"నేనట్లే అనుకుంటున్నా!"

"అంటే, ఎక్కడి కెళ్ళిపోయి వుంటుంది?"

సందేహంతో అంది రంగి - "ఆ ఇంజనీరు బాబుతోనే వెళ్లి పోయుండొచ్చు!"

రావ్ ముఖం నల్లబడిపోయింది. నెమ్మదిగా అడిగాడు. "నీకెందుకు అలా అనిపిస్తోంది?"

"ఆయన అపుడపుడు వస్తోండేవాడు - "

రావు మరేమీ మాట్లాడలేదు, కథ చాలా తేలికగా విడిపోయిందనిపించింది. కాని ఈసంగతి కృష్ణమూర్తి కెలా చెప్పాలి?

ఇల్లు చేరుకొన్నాడు రావు - ఇల్లు చేరుకోబోయే ముందే ఆ ఇంజనీరు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంజనీరు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడట నాగార్జునసాగర్ కు! అతడు యిల్లు ఖాళీ చేసిన టైము, శారద కనిపించకపోవడం మొదలుపెట్టిన టైము ఒక్కటే!

ఇక సందేహం లేదు - శారద ఆ ఇంజనీరుతోనే...

అయినా ఈ ఆడవాళ్ళు యిలా ఎలా చేయగలరు? తాళికట్టి జీవితం పంచుకుంటున్న వ్యక్తిని యెలా మోసం చేయగలరు? ముఖ్యంగా కృష్ణమూర్తి లాంటి గంగి గోవును మోసం చేయటం... యెలా చేయగలిగింది? భర్తకు తెలియనీకుండా ఇన్నాళ్ళ నుంచీ ఎలా సాగిందీ తెరవెనుక నాటకం? -

అయినా ఈ విషయం కృష్ణమూర్తితో చెప్పటమెలా?

ఇంటికి వచ్చిన రావును కృష్ణమూర్తి అడిగాడు - "ఎక్కడకు వెళ్లావు?"

రావేమీ అనలేదు. రావు గుండెల్లో కక్ష, అసహ్యం అన్నీ నిండుకొని ఉన్నాయి. మంచంమీద బాబు నిద్రపోతున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు. ఇంత అందాల రాశిని ఎలా వదలి వెల్లగలిగింది శారద?

దాంపత్య బంధం ఇంతకాలము తనకు ఎంతో బలమైనదిగా కనిపించేది. ఈ క్షణంలో పేలవంగా తేలికగా కనబడింది రావుకు.

"కృష్ణా పోనీ ఒక పని చెయ్యరా? బాబును బెజవాడలో దింపి రారా?"

కృష్ణమూర్తి ఆశ్చర్యంగా చూశాడు రావుకేసి! "అదేమిటలా అంటున్నావు?"

"అవునురా నీ మిసెస్ ఎక్కడకు వెళ్లిందో తెలీదు, యెప్పుడు వస్తుందో తెలీదు. అంతకాలమూ వీడిని వాళ్ళ తాతగారింట్లో వుంచేస్తేనే మంచిది?"

కృష్ణమూర్తి పేలవంగా నవ్వాడు. "భలేవాడివిరా, అయినా ఎంత కాలం అక్కడ ఉంటాడు. శారద వచ్చేస్తుందిరా, నాకు తెలుసు... వచ్చాక బాబు లేకపోతే బెంగపెట్టుకొంటుంది!"

పిచ్చివాడు ఈ బంధాల నన్నింటినీ తేలికగా తెంచుకొని పోయిన శారద, కృష్ణమూర్తి దృష్టిలో ఎంత ఉన్నతంగా వుంది! ఈ సంగతి యెలా చెప్పటం??

మనసు ధృడపరచుకొంటూ అన్నాడు రావు. "కృష్ణా! - నన్ను అపార్ధం చేసుకోకు. ఇంతసేపటి నుంచీ యిది చెప్పకూడదనే  ప్రయత్నిస్తున్నాను. కానీ చెప్పక తప్పటంలేదు - శారద రాదు యిక నీదగ్గరకు!"

కృష్ణమూర్తి ఆశ్చర్యంగా చూశాడు!

రావే అన్నాడు మళ్ళీ - "ఔనురా నీ మిసెస్, అదే, యిక నీ దగ్గరకు రాదు. ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే శారద వెళ్ళిపోయింది - వెళ్ళిపోవటం కాదు. లేచిపోయింది మరొకరితో!..."

కృష్ణమూర్తికి తల తిరిగిపోయింది. ముఖం చిట్లించుకొంటూ అన్నాడు "రావ్! నువ్వంటున్న దేమిటో నీకు అర్ధం అవుతోందా?" -

"ఆ - ఎటొచ్చీ నీకే అర్ధం కావడం లేదు. శారద, అదిగో, ఆ యింట్లో ఉండే ఇంజనీరుతో వెళ్ళిపోయింది. ఇపుడు నాగార్జునసాగర్ దగ్గర కులాసాగా వుండివుంటుంది, చాలా?? నువ్వుత్త పిచ్చివాడివి! ఈ ఊళ్ళో అందరికి ఈ సంగతి తెలిసింది. కానీ నీకీ సంగతి తెలీదు!"

కృష్ణమూర్తి ఏమీ అనలేదు. అతను యింకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. శారద... తన జీవనజ్యోతి... ఇంతటి పని యెలా చేయగలిగింది? ఎలా వదిలి వెళ్ళిపోగలిగింది తన్ను? ఎక్కడుంది లోపం? అయినా యిదంతా నిజమా కాదా? తెలుసుకోవాలి. తప్పదు. అదే అన్నాడు రావుతో!

రావు నవ్వాడు - "నాగార్జునసాగర్ కా?"

తల ఊపాడు కృష్ణమూర్తి.

రావేమీ అనలేదు. కృష్ణమూర్తి మనసులో సుళ్ళు తిరుగుతున్నా ఆ లావా బయటి కొచ్చి తీరాలి. అది ఇక్కడ జరగలేదు. బహుశా నాగార్జునసాగర్ లో జరుగుతుందేమో...

రావు, కృష్ణమూర్తి యిద్దరూ బాబుతో సహా నాగార్జునసాగర్ చేరుకోనేసరికి, చీకటి తెరలు విచ్చుకోవటం ప్రారంభం అయింది. తూర్పు నుంచి వెలుగు రేఖలు నెమ్మది నెమ్మదిగా పరుచుకొంటున్నాయి.

బస్సు దిగిన వెంటనే యిద్దరూ ప్రాజెక్టు హౌస్ లో రూం తీసుకొని స్నానం అదీ ముగించారు. ఆ తర్వాత ఇద్దరూ కాలనీలో నడక సాగించారు. ఇంజనీరు పేరు చెప్పేసరికి, ఎవరో ఒకతను ఆ ఇంటి గుర్తులు చెప్పారు.

అటుకేసి కదిలారు యిద్దరూ...

"అదిగో, ఆ ఇల్లు అయివుండాలి నువ్వొక్కడివే వెళ్లిరా! బాబును నేను ఉంచుకుంటాను!" అన్నాడు. రావ్. రావ్ చూపించిన యింటి ముందెవరో స్త్రీ ముగ్గులేస్తున్నది.

కృష్ణమూర్తి నవ్వాడు "బాబును తీసుకెళ్లాలిరా!"

రావేమీ అనలేదు.

ఆ ఇంటిముందు ముగ్గులేస్తున్న వ్యక్తిని చూశాక. ఆ యిల్లు ఎవరిదని అడిగే అవసరం లేకపోయింది కృష్ణమూర్తికి. ఆ వ్యక్తి శారద!!

నెమ్మదిగా అక్కడ ఆగాడు కృష్ణమూర్తి.

ఎవరో రావటంలా అనిపించి తలెత్తింది శారద. తనభర్త కృష్ణమూర్తి! హఠాత్తుగా నిలబడిపోయింది. కళ్ళల్లో భయం మనసులో వణుకు.

"ఏమండీ, ఇంజనీరు గారున్నారా?"

శారద అదిరిపడింది. నెమ్మదిగా తలెత్తింది మరోసారి, ఆ తర్వాత తల వూపింది ఉన్నారన్నట్లుగా!

"ఒక్కసారి పిలుస్తారా? కొంచెం పనుంది!"

శారద యింట్లోకి వెళ్ళింది. కృష్ణమూర్తి ముగ్గుకేసి చూశాడు. తన జీవితంలా ఆ ముగ్గూ అసంపూర్తిగానే ఉండిపోయింది.

అయినా ముగ్గు వేస్తోందంటే కోరుకొని వచ్చినట్లే మరి!

ఇంట్లోంచి ఇంజనీరు బయటికొచ్చాడు. ముఖం పేలవంగా ఉంది. అయినా జీవంలేని నవ్వొకటి పెదవులమీదకు తెచ్చుకొని అన్నాడు "రండి!"

"నేను..." కృష్ణమూర్తిని ఆపుతూ అన్నాడు ఇంజనీరు... "శారద చెప్పింది!"

"క్షమించండి అవసరం అయి రావాల్సి వచ్చింది. మీరేమీ అనుకోనంటే రెండు నిమిషాలు శారదతో మాట్లాడతాను!" అన్నాడు కృష్ణమూర్తి యింట్లో కూర్చున్న వెంటనే.

"దానికేం భాగ్యం..." అంటూ ఇంజనీరు లోపలికి వెళ్ళాడు.

శారద వచ్చింది.

"కూర్చోండి!"

శారద కూర్చోగానే కొంగు నోట్లోకి తీసుకొంది. అయినా ఏడుపు ఆగటంలేదు.

"శారదగారూ...!

శారద భోరుమంది ఒక్కసారి.

"చూడండి, ఈ క్షణంవరకూ మీరంటే నాకు ఎనలేని గౌరవం వుంది. నా కన్నా వున్నతుడని మీరు యితనితో వచ్చారు. అందుకని మీరెందుకు ఇతనితో వచ్చారని అడగను!"

"ఏమండీ..." శారద బొంగురు గొంతుతో అంది.

"శారదగారూ - అనవసరంగా ఏడవకండి. ఏడుపు అంటే నా కసహ్యం మీరు ఏడిస్తే నిద్రపోతున్న బాబు లేస్తాడు. అప్పుడు కథ మరోలా అయిపోతుంది. అది నాకు
యిష్టంలేదు!..."

"ఏమండీ, నేను వచ్చేస్తానండీ...!"

"మిమ్మల్ని రమ్మని అడగటానికి రాలేదు నేను, నాకంటే బెటర్ మాన్ ను ఎన్నుకున్నారు. మీరు! మీ మార్గానికి అడ్డురానునేను, కాని చూడండి, ఈ బాబు అమ్మలేకుండా ఉండగలిగే వయసుకాదు. అందుకే అడగటానికి వచ్చాను. చెప్పండి, బాబును ఏం చెయ్యమంటారు? అనాధాశ్రమంలో చేర్చమంటారా? లేకపోతే మీరే వుంచేసుకుంటారా?"

శారద వెక్కి వెక్కి ఏడుస్తుంది... "ఏమండీ, నన్ను క్షమించండి. నేను వచ్చేస్తాను!"

కృష్ణమూర్తి వీల్లేదన్నట్లుగా తల ఊపుతూ అన్నాడు "బాబు సంగతి చెప్పండి..."

"నన్ను క్షమించండి. తప్పు చేశాను."

క్షణం ఆగి అన్నాడు కృష్ణమూర్తి "చూడండి శారదగారూ! తప్పు చేశారా లేదా అని అడగటం లేదు నేను.

కెరటాలన్నీ ఏట్లోనే వుంటేనే బాగుంటాయి. అందాన్నీ కలుగజేస్తాయి. కానీ కెరటం ఏరు దాటితే అందమూ, ఆనందమూ ఉండదు. పై పెచ్చు వరదలా ప్రమాదాన్ని తెస్తాయి, దుఃఖాన్ని తెస్తాయి. ముంచేస్తాయి. మన కుటుంబంలో వచ్చిన ఈ వరద బాబును ముంచేస్తోంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను బాబును ఏం చేయమంటారని...?" కృష్ణమూర్తి ఆపేశాడు.

శారద చాలా సేపు తర్వాత అంది "బాబును ఉంచేయండి!"

కృష్ణమూర్తి పేలవంగా నవ్వి అన్నాడు. "నాకు తెలుసు మీరిది అంటారని! కానీ బాబు మీ సంసారానికి అడ్డు లేకుండా ఉండాలంటే ఒక్కసారి వార్నికూడా అడగండి."

శారద యింట్లోకి వెళ్ళింది! ఈ సారి ఇద్దరూ తిరిగి వచ్చారు.

నెమ్మదిగా అన్నాడు ఇంజనీరు "బాబును ఇక్కడే వుంచేయండి నాకేమీ అభ్యంతరం లేదు. నా కన్నకొడుకులాగే చూసుకుంటాను!"

కృష్ణమూర్తి లేచాడు. సోఫామీద బాబు హాయిగా నిద్రపోతున్నాడు. నెమ్మదిగా అన్నాడు. "నిజమేలెండి బాబు యిన్నాళ్ళూ నా కన్నకొడుకే అనుకున్నాను. కానీ ఈనాడు తెలిసింది. బాబు మీ కన్నకొడుకని శలవ్" అంటూ విసురుగా ఇంట్లోంచి బయటకొచ్చాడు కృష్ణమూర్తి.

ప్రాజెక్ట్ హౌస్ రూంలో కృష్ణమూర్తి కంట్లోంచి వస్తున్న ఆ కన్నీటి కెరటాలని వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నాడు రావ్.

 


(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్