Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Swamy Vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

'భారతరత్న' శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య - టీవీయస్.శాస్త్రి

Bharata Ratna - Sri Mokshagundam Visvesvarayya

భారతదేశంలోని ప్రఖ్యాత ఇంజనీరు అయిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలను కొన్నిటిని తెలుసుకుందాం! ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లలో అతి ముఖ్యుడు. వీరి అసలు పేరు విశ్వేశ్వరాయ. కానీ వారిని అందరూ విశ్వేశ్వరయ్య అని ప్రేమగా పిలిచేవారు.

ఈయన, 15-09-1860న, శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ అనే పుణ్యదంపతులకు, నేటి కర్ణాటక రాష్ట్రంలోని, బెంగుళూరు సమీపంలోని ముద్దినేహళ్లి అనే కుగ్రామంలో జన్మించారు. వీరిది అతి పేదకుటుంబం. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లాలోని 'మోక్షగుండం' గ్రామానికి చెందినవారు. ఉదర పోషణార్ధం, వారు కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి వలస వెళ్ళారు. శ్రీ విశ్వేశ్వరయ్య గారి తండ్రి గొప్ప సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. సంపాదనకోసం ఎక్కువగా ఇతర గ్రామాలను సంచరించేవారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయటం విశ్వేశ్వరయ్యగారి తల్లి మీద పడింది. ఆమె గొప్ప భక్తిపరాయణురాలు. విశ్వేశ్వరయ్యగారు తల్లి సంరక్షణలో విద్యాబుద్ధులు పొందటమే కాకుండా-ఋజువర్తన, క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకున్నారు. ఆ మహాతల్లి కొడుకును చక్కగా తీర్చిదిద్దింది.

ఆయన బాల్యంలోనే వారి కుటుంబం చిక్ బళ్ళాపూరుకి మకాం మార్చింది. అయన ప్రాధమిక విద్య చిక్ బళ్ళాపూరులోనే జరిగింది. ఉపాధ్యాయులు అతని ప్రతిభను గుర్తించి, అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. వీరికి గణిత శాస్త్రమంటే ఎక్కువ మక్కువ. ఈ విషయాన్ని గ్రహించి శ్రీ నాదముని నాయుడు గారు అనే ఉపాధ్యాయుడు ఇతనికి గణిత శాస్త్రంలో బాగా తర్ఫీదునిచ్చి, ప్రవీణుడిని చేసారు. మేనమామగారైన శ్రీ రామయ్య గారి ఆర్ధిక సహాయంతో బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో బి. ఎ లో చేరారు. సరిగ్గా ఈ సమయంలో శ్రీ విశ్వేశ్వరయ్య గారికి పితృవియోగం కలిగింది. అప్పుడు విశ్వేశ్వరయ్య గారి వయసు 15 సంవత్సరాలే! ఈ విషాద ఘట్టం ఆయనను మానసికంగా బాగా కృంగతీసింది. తన్ను తానే ఓదార్చుకొని, గుండె నిబ్బరపరచుకొని, పిల్లలకు ట్యూషన్లు చెప్పి కష్టపడి బి. ఎ ను పూర్తిచేసారు. అదృష్ట వశాత్తు మైసూరు మహారాజావారి దృష్టిలో పడ్డారు. రాజావారి ఆర్ధిక సహాయంతో పూనాలో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసారు.

ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత, మొదటిసారిగా బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. ఆ సమయంలో వీరు బొంబాయిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. 1908 లో నిజాం నవాబు ఆహ్వానం మేరకు, నిజాం ప్రభుత్వంలో ఇంజనీరుగా చేరి పలు రిజర్వాయులను నిర్మించటమే కాకుండా, హైదరాబాద్ ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. నిజాం నవాబు వీరి మేధస్సును గుర్తించి 1912 లో దివాన్ గా పదోన్నతిని కల్పించారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఏ పనిని ఆయనకు ఎవరు అప్పగించినా, ఆయన ఆ పనిని ఒక తపస్సుగా చేపట్టేవారు. రోజుకు 18 గంటలు పనిచేయటం ఆయనకు నిత్యకృత్యం. ఈ క్రమశిక్షణ, పట్టుదల, నీతీనిజాయితీలే ఆయనను ప్రఖ్యాత వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

ఆయన తన చివరిదశలో కూడా ఇలా అనేవారు, "నాకు ఈ క్రమశిక్షణ, ఋజువర్తన ప్రసాదించింది నా మాతృమూర్తే!" అని. నిజం నవాబు తనకు అప్పగించిన పని పూర్తి అయిన తరువాత, నాటి మైసూరు రాష్ట్రంలో ఉద్యోగిగా చేరారు. అన్నివిధాలా ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. వారి పనితీరుని, నిజాయితీని మెచ్చి, మైసూరు మహారాజావారు బహుమానాలతో, బిరుదులతో సత్కరింపతలచిన వేళ, విశ్వేశ్వరయ్య గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు. జీతం తప్ప మరే ఇతర ప్రతిఫలాన్ని ఆయన తన జీవితంలో ఆశించలేదు. నేటి కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజ సాగర్ డ్యాం, బృందావన్ గార్డెన్స్, మైసూరు విశ్వ విద్యాలయం మొదలగునవి ఆయన కృషి వలెనే సాధ్యపడ్డాయి. ఆయన ప్రఖ్యాత ఆర్ధికవేత్త కూడా! ఆయన మైసూరు బ్యాంకు అనే సంస్థను కూడా స్థాపించి, మధ్యతరగతి ప్రజలకు పొదుపు చేసుకోవలసిన అవసరం గురించి తెలియచేసారు.

ఆయన ప్రతిభను గుర్తించి, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్ తో సత్కరించాయి. 1917 లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో అయన ప్రముఖ పాత్ర వహించారు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. ఆయనకు బ్రిటిషు ప్రభుత్వపు నైట్హుడ్ (సర్) బిరుదు వచ్చింది. 1955 లో భారత ప్రభుత్వం ఆయనను 'భారతరత్న' బిరుదుతో సత్కరించింది. ప్రాంతీయ బేధాలను పట్టించుకోకుండా భారత దేశానికి అనితర సేవలందించిన ఈ మహనీయుడు, తన శతజయంతి ఉత్సవాలను పూర్తిచేసుకొని, 12-04-1962 న స్వర్గస్తులయ్యారు. ఎవరైనా అఖండ మేధావిని గురించి చెప్పేటప్పుడు, 'ఆయన బ్రెయిన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్'అని చెప్పటం ఒక సామెతగా మారింది. ఆయన పుట్టిన రోజును 'ఇంజనీర్స్ డే !' గా జరుపుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుంది. పనిని, కర్తవ్యాన్ని దైవంగా భావించే శ్రీ విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర మన అందరికీ ఆదర్శనీయం! ఆచరణీయం!!

నీతీనిజాయితీలతో, క్రమశిక్షణతో పనిచేయటమే ఆయనకు మనమిచ్చుకునే నివాళి!

మరిన్ని శీర్షికలు
weekly horoscope (Sept 13 - Sept 19)