Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaaram

మనకు తెలిసిన వ్యక్తైనా, సంస్థ అయినా కనుమరుగైపోయినట్టు తెలిస్తే, అయ్యో ..పాపం .. అనుకోవడం జరుగుతూంటుంది కదూ. అంతదాకా ఎందుకూ, ఆరోజుల్లో మన ఇళ్ళల్లో ఉండే చెట్టో, చేమో, ఏ గాలివానైనా వచ్చి కూకటి వేళ్ళతో లేచిపోయినా అంతే బాధగా ఉండేది. పెంపుడు జంతువుల విషయంలోనూ అలాగే ఉంటుంది కదూ..ఈ ఆధునిక యుగంలో, అలాటి బంధాలూ, అనుబంధాలూ అంతగా కనిపించడం లేదు. మనుషులకే దిక్కులేదు, ఇంక సంస్థలూ, చెట్లూ చేమల మాటెవడికి పడుతుంది? ఇంక సంస్థలంటారా, రోజుకో సంస్థ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూన్న ఈ రోజుల్లో, మహ అయితే, రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనే దురాశ తో ఆ ఫైనాన్సు కంపెనీలోనో, బ్యాంకులోనో డబ్బులు "పొదుపు" చేసికున్నవారు మాత్రం, ఆ "సంస్థలు" జెండా ఎత్తేసినప్పుడు మాత్రం అయ్యో..అయ్యయ్యో.. అని నెత్తీ నోరూ బాదుకుంటారు, కనీసం వాళ్ళు దాచుకున్న డబ్బులొచ్చేవరకూ..

ఇంక చెట్టూ పుట్టా అంటారా, ఈరోజుల్లో పెరుగుతూన్న జనాభా దృష్ట్యా రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమంలో, ఈరోజుల్లో ప్రతీ చోటా అడ్డం వచ్చిన చెట్లన్నీ కొట్టిపారేస్తున్నారు. "అభివృధ్ధి" కావాలంటే ఆమాత్రం " త్యాగాలు " చేయాలిగా !! ప్రతీదానికీ సెంటిమెంటు పెట్టుకోలేముగా మరి! చెప్పేనుగా మనుషులకే ఠికాణా లేదు. ఏదో ఆ కట్టుకున్నవాడో, కట్టుకున్నదో తప్ప, మిగిలినవారికి అంతగా పట్టింపు ఉండడంలేదు. ఏదో ఆ పదిరోజులూ కార్యక్రమాలు చేసేసి చేతులు దులిపేసికోవడం. ఆ తరువాత గుర్తుండి, వీలుంటే మాసికాలూ, తద్దినాలూ పెట్టడం. లేకపోతే ఓ దండం పెట్టేయడం. చేసికున్నవాడికి చేసికున్నంతా. పైగా ఇంకో విషయం, ప్రతీదానినీ సమర్ధించుకోవడం-- " ఈరోజుల్లో అంత టైమెక్కడిదండీ.." అని. మరి ఆరోజుల్లో టైముండే చేసేవారా, ఉన్న అనుబంధాన్ని బట్టి ప్రతీదానికీ టైము కేటాయించేవారు. కనీసం సంవత్సరంలో ఒకసారైనా గుర్తుచేసికుని, ఆ వ్యక్తి గురించి నాలుగు మంచిమాటలు చెప్పుకునేవారు. కానీ ఈరోజుల్లో , ఓ ప్రముఖ వ్యక్తై పోయాడంటే, ఆ ఒక్కరోజుకీ మాత్రం, మీడియా ధర్మమా అని, ఆ కుటుంబ సభ్యులకే కాదు, దేశం/ రాష్ట్రం లో , ఎవడు టివీ పెట్టినా అతన్ని హాస్పిటల్ నుండి, అంత్యక్రియలదాకా జరిగే కార్యక్రమాలని చూడాల్సిందే. ఆ వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టి "అయ్యో..పాపం " అనుకుంటాము.
పైన ఉదహరించినవన్నీ, ఎవరి అనుబంధాన్ని బట్టి వారు అనుభవిస్తూంటారు. ఒకరికి నచ్చింది ఇంకోరికి నచ్చాలని లేదు. ఓ వ్యక్తున్నాడనుకోండి, అందరికీ ఉపకారాలు చేసుండకపోవచ్చు, " పోన్లెద్దూ ఓ గొడవొదిలిందీ.. " అనుకోవచ్చు. ఓ చెట్టు కొట్టేసినా, పోనిద్దూ ప్రతీరోజూ ఆకులెత్తుకోలేక చచ్చేవాళ్ళం అని అనుకునేవారున్నా ఆశ్చర్యం లేదు. అలాగే ఓ పెంపుడుజంతువు గురించి కూడా, ఆ పెంచుకున్నవాడికుండొచ్చేమో కానీ, చుట్టుపక్కలున్నవాళ్ళు " అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ, ఎప్పుడు చూసినా భొయ్యిమంటూ అరవడమే, ఎప్పుడు మీదపడుతుందో తెలిసేది కాదు.." అన్నవారే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు.
   కానీ కొన్ని సంవత్సరాలపాటు, అందరి జీవితాలతో ఓ "బంధం" పెనవేసికుని, ఎందరో ఎందరెందరో మొహాలలో, ఓ సంతోషం చేకూర్చిన ఓ సంస్థ, ఒక వ్యవస్థ కనుమరుగైనప్పుడు మాత్రం, " అయ్యో.. అలాగా.." అని అనుకోని వారుండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇరవయ్యో శతాబ్దంలో పై ఊళ్ళకి చదువులకోసం, వెళ్ళినవారనండి, ఎక్కడో దూరప్రదేశాల్లో ఉద్యోగరీత్యా ఉంటూ, స్వగ్రామంలో ఉండే తల్లితండ్రులనండి, లేదా ఆరోజుల్లో తమ రచనలు ఏ పత్రిక్కో పంపినవారనండి, చిన్నచిన్న గ్రామాల్లో గ్రంధాలయాలకి నాగా లేకుండా, పత్రికలు తెప్పించుకునేవారనండి... ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది మనుషులకి, తోడునీడగా ఉండే ఆ " మనీ ఆర్డరు " వ్యవస్థ కనుమరుగైనప్పుడు నిజంగా గుండె చెరువైపోయిందంటే నమ్మండి.--  

   
    పైఊళ్ళకి పైచదువులకి పంపేటప్పుడు, ఆ ఊళ్ళో తెలిసినవారికి పరిచయం చేసేవారు తప్పకుండా. కారణం మరేమీ కాదూ, ఏ కారణం చేతైనా టైముకి మనీఆర్డరు అందకపోతే, ఆ పరిచయం ఉన్నాయన దగ్గరకి వెళ్ళి, పని కానిచ్చుకోవచ్చని. అసలు ఆ మనీఆర్డర్ల ప్రక్రియే తమాషాగా ఉండేది. డబ్బూ, నింపిన మనీ ఆర్డరు ఫారమ్మూ ఇవ్వగానే, ఆ ఫారం వెనక్కాల ఎర్ర సిరాతో పెద్దగా ఓ నెంబరువేయడం, రెండు కార్బన్ పేపర్లు, అందులో ఒకటి తిరగేసి, రసీదుపుస్తకంలో ఎడ్రసు వ్రాసేసి, ఆ రసీదునెంబరు మళ్ళీ ఆ ఫారంమీద వ్రాయడమూ, అందులో రాసింది కనిపించని ఓ కాపీ మీద ఓ పెద్ద స్టాంపు కొట్టి, చేతిలో పెట్టడమూ. క్షేమసమాచారాలో, విశేషాలో వ్రాసుకోడానికి, ఓ జాగా ఉండేది. కావాల్సినన్ని విశేషాలు వ్రాసేసేవారు, ఆ కాగితం వెనక్కాలా, ముందు భాగాల్లోనూ. ఎప్పుడైనా మనీఆర్డరు వచ్చిందంటే, పోస్టుమాన్ ఓ సంతకం పెట్టించుకుని, ఆ " సందేశ" కాగితం చింపి మనకిచ్చేవాడు. సంతకం పెట్టించుకున్న భాగం , ఎవరైతే పంపారో వారికి తిరిగిపంపేవారు. అంతకుముందు డబ్బుపంపిన రసీదూ, సంతకం పెట్టిన ఎం.ఓ. రసీదూ ఉంటే చాలు , ఆ రెండిటినీ ఓ తీగకు గుచ్చేయడంతో పని పూర్తైపోయినట్టే. ఈ మనీఆర్డర్ల బట్వాడా ద్వారా, బోర్డర్లలో ఉండే జవాన్లు, వారివారి కుటుంబాలకి డబ్బులు పంపేవారు.
    e-transfers వచ్చిన ఈ యుగంలో మరింక ఈ మనిఆర్డర్లతో పనుండదు, నిజమే. కానీ లక్షలాదిమంది ముఖాలలో నెలకోసారైనా, ఓ "మెరుపు" మెరిపించిన ఆ మనీఆర్డర్ల ప్రక్రియ, ఇంక చూడలేమంటే, మరి బాధగానే ఉంది...
    అలాగే ఇంకా ఎన్నెన్ని వ్యవస్థలు కనుమరుగైపోతాయో … ఎంతైనా వాటితో ఉన్న అనుబంధాలని మర్చిపోలేము కదా…
సర్వే జనా సుఖినోభవంతూ…

 

మరిన్ని శీర్షికలు
weekly horoscope september 1st to september 7th