Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఏ నిముషానికి....!

e nimushaaniki

గంట రాత్రి ఎనిమిదిన్నర.

రాఘవయ్య భోంచేసి చెయ్య కడుక్కొని తుండు గుడ్డతో తుడుచుకొంటూ హాల్లోకి వచ్చాడు.హాల్లో భారతమ్మ ఏదో పోగొట్టుకున్న దానిలా 'తనువిక్కడ-మనసెక్కడో ‘నన్న చందాన టివీ చూస్తోంది. అది గమనించిన రాఘవయ్యకు ఆమెపై జాలి కలిగి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి “ఏమిటి...భోంచేయవా?"అని అడిగాడు.

పార్వతమ్మ ఉలిక్కి పడ్డట్టు తిరిగి భర్త ముఖంలోకి చూస్తూ "ఆకలిగా లేదండి. ఈ రోజు పాప ఫోన్ చేస్తానంది.ఎదురు చూస్తున్నాను “అంది టెన్షన్ ఫీలవుతూ.

"పిచ్చిదానా! నువ్వు భోంచేయడానికి-పాప వద్దనుంచి ఫోన్ రావడానికి సంబంధమేవిటి?యూ.ఎస్.ఏ లో వాళ్ళకిప్పుడు బహుశా ఉదయం పది గంటలుంటుంది.పైగా వాళ్ళకు ఈ రోజు ఆదివారం. పాప ఇంకా నిద్ర పోతుందేమోలే పాపం. నువ్వెళ్ళి భోంచేయ్ ! ఫోన్ వస్తే నేను పిలుస్తాను” అని రెట్ట పట్టుకొని లేపి డైనింగులోకి పంపి సోఫాలో కూర్చొని టివీలో తనకు ఇష్టమైన చానల్ను మార్చుకొని చూస్తున్నాడు రాఘవయ్య.

రాఘవయ్య, పార్వతమ్మ దంపతులకు గీత ఒక్కగానొక్క కూతురు.చాలా తెలివికలది. ఆమెకు ఇంటర్ మీడియట్ లో జిల్లా స్థాయిలో ఫస్టు ర్యాంకు వొచ్చింది.అందుకే ఓ కార్చోరేటు ఇంజినీరింగు కళాశాల యాజమాన్యంవారు ఆమెను పిలిచి పైసా ఫీజు లేకుండా ఫ్రీ సీటు ఇవ్వడమే కాక ప్రభుత్వపు స్కాలర్‌షిప్పు కూడా ఏర్పాటు చేసింది. అందుకు తగ్గట్టు నాలుగేళ్ళు కష్టపడి చదివి ఇంజనీరింగ్ డిగ్రి డిస్టింక్షన్ లో పాసైంది. ఇంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు అంతటితో ఆపుకొని ఏదేని వుద్యోగానికి వెళ్ళమని తల్లిదండ్రులు,బంధుమిత్రులు చెప్పినా వినకుండా తన ఆశయం మేరా అమెరికాలో ఎం.ఎస్  చదవాలని అందుకు కావలసిన జి.ఆర్ .ఇ పరీక్ష రాసి అక్కడ పేరున్న యూనివెర్సిటీలో సీటు సంపాయించుకొని అమెరికాకు వెళ్ళి పోయింది గీత.

ఆమె అమెరికా వెళ్ళి దాదాపు రెండేళ్ళు కావొస్తోంది. తన కోర్సు కూడా ఇంకో వారంలో పూర్తవుతోంది..అది పూర్తవుతూనే వెంటనే ఇండియాకు రానుంది గీత .ఆ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానంది. ఆ శుభ వార్తను వినాలనే తల్లదండ్రులు తాపత్రయపడుతూ ఎంతో ఆశతో, ఆదుర్దాతో కూతురి ఫోన్ కొరకు యెదురు చూస్తున్నారు. ముఖ్యంగా తల్లి పార్వతమ్మ.

రాఘవయ్య ఓ చిన్న కంపెనీలో గుమాస్తా. అందులో తనకొచ్చిన జీతం రాళ్ళతో, భార్య సహకారంతో సంసారాన్ని సాగించి కూతుర్ని ఇండియాలో ఇంజనీరింగ్ చదివించి ఎం. ఎస్ చదివే నిమిత్తం ఆమెను అమెరికాకు పంపించారు. కూతుర్ని అమెరికాకు పంపించటానికి ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టం 'అబ్బా' వర్ణనాతీతం.అందుకే తల్లి దండ్రులకు కృతజ్ఞతగా వుంటూ తను సంపాయించి వాళ్ళను పోషించే రోజుకోసం ఎదురు చూస్తోంది గీత. ఆ రోజులు దగ్గరలోనే వున్నాయని నిముష నిముషానికి మనసులో తలచుకొంటూ ఆనందిస్తోందామె!
గీత అమెరికాలో వుండి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఎం.ఎస్ . పట్టాతో మాతృ భూమిలో కాలు పెట్టాలన్న పట్టుదలతో చదువుతోంది. పాపం... ఆమెకు ఆర్థిక ఇబ్బందులు అక్కడ కూడా ఎదురవగా వాటిని అధిగమించే నిమిత్తం కాలేజీ అయిన తరువాత తీరిక సమయాల్లో ఏవో చిన్నచిన్న పనులు చేసుకొని చదువుతూ తల్లిదండ్రులకు ఆ భారం లేకుండా చేసింది. తన సంపాదనతోనే అక్కడ  నిలత్రొక్కుకుంది.రెండేళ్ళు చదివి ఎం.ఎస్. పూర్తి చేసుకోంది.త్వరలో ఇండియాకు రానున్నట్టు గత వారంలో తల్లికి ఫోన్ చేసి చెప్పింది.
ఫోన్ రింగైయ్యింది...

ఫోన్ అందుకున్నాడు రాఘవయ్య. భోంచేయడం ఆపి చేయి కడిగేసుకొని పరిగెత్తినట్టు భర్తవద్దకొచ్చింది పార్వతమ్మ అది కూతురి వద్ద నుంచి వచ్చిన ఫోనేనని వూహించుకొని.

"హల్లో! చెప్పమ్మా! బాగున్నావా...చాలా సంతోషం తల్లీ! ఏమిటి...ఫోన్ను అమ్మకిమ్మంటావా!అమ్మ కూడా నీ ఫోన్ కొరకే యెదురు చూస్తోందిరా తల్లీ! ఇదిగో అమ్మకిస్తున్నాను"అని ఫోన్ భార్య చేతికిచ్చి వెళ్ళి సోఫాలో కూర్చొని టివీ చూస్తున్నాడు రాఘవయ్య.

"ఇదిగో...మిమ్మల్నే! ఆ టివీ వాల్యూం కాస్త తగ్గించండి. ఆఁ ...చెప్పమ్మా...చెప్పురా తల్లీ! ఎలా వున్నావ్ ?" సంతోషంతో వుక్కిరి బిక్కిరై పోతూ అడిగింది తల్లి పార్వతమ్మ.

"ఐయామ్ ఫైన్ మా! ముఖ్యంగా మీకో శుభ వార్త. నా చదువు పూర్తయ్యింది.రాబోయే శనివారమే ఇండియాకు బయలుదేరుతున్నాను" సంతోషంతో చెప్పింది గీత.

"మై గాడ్ !ఎంతటి తియ్యటి కబురు చెప్పావే తల్లీ! నాకెంతో ఆనందంగా వుంది. నిజం చెప్పాలంటే నువ్వు అక్కడున్న ఈ రెండేళ్ళు ప్రతి నిముషం నిన్ను తలచుకొంటూ నేనూ మీ నాన్న భయంతోనే బ్రతికామమ్మా!"గగ్దద స్వరంతో అంది. మళ్ళీ తనే "తల్లీ! ఈ రెండేళ్ళకే నిత్యం నా కళ్ళలో కదిలాడే నీ రూపాన్ని లీలగా మరచి పోతున్నానేమోనని పిస్తోంది. ఇప్పుడు నువ్వు ఆ వూరి తిండికి, వాతావరణానికి బాగా రంగొచ్చి అందంగా తయారై వుంటావనుకొంటున్నాను !" ఆదుర్దాతో అంది తల్లి పార్వతమ్మ. గీత పకపక నవ్వింది.

 "నువ్వికపై అలా ఏదేదో వూహించుకొని భయపడవలసిన అవసరం లేదమ్మా. నేను వచ్చేస్తున్నానుగా!ఆదివారం రాత్రికల్లా...నా దేశంలో...నా మాతృభూమిలో...నా ఇంట్లో...నా తల్లి ఒడిలో వుంటాను...ఓకే! ఇప్పుడు నీకు నాన్నకు షుగర్ , బిపిలకు కావలసిన మందులు,హెల్త పరమైన డ్రిక్సును కొనటానికి షాపింగ్ వెళుతున్నాను. తతిమ్మా విషయాలు ముఖాముఖి.భై!"ఫోన్ కట్ చేసి వెళ్ళి కారులో కూర్చొంది గీత స్నేహితురాలు కారును నడుపుతోంది. కారు వేగాన్ని పుంజుకొంది ఇరవై మైళ్ళకావల వున్న హెచ్ .ఇ. బి.షాపింగ్ సెంటర్కు.
భర్తకు విషయాలు చెప్పింది పార్వతమ్మ. భార్య భర్తలిద్దరూ కూతురు ఇండియాకు వస్తుందన్న  ఆనందంలో ఆ సంతోషాన్ని పంచుకొన్నారు. అలాగే టివీని చూస్తూ వున్నారు.

 అర్థగంట తరువాత....

అమెరికాలో చదువు పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో మాతృభూమి ఇండియాకు బయలుదేరనున్న గీత,  ఎం ఎస్ విద్యార్థిని కారు ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయింది. ప్రమాదానికి కారణం అతి వేగమే! ఇప్పుడు హ్యూస్టన్ సిటీలోని తెలుగు సంఘం వారు స్వఛ్చందంగా వివరాలను సేకరించి ఆమె మృత దేహాన్ని మాతృదేశం ఇండియాకు పంపటానికి తగు చర్యలు తీసుకొంటున్నారు.

అంతే....

టివీలో వేస్తున్న స్క్రోలింగ్ వార్తలను చదివిన గీత తల్లిదండ్రులు షాక్కు గురై, వేదనకు లోనై,  అదః పాతాళానికి కృంగిపోయి, దుఃఖ సముద్రంలో మునిగి పోయారు,

మరిన్ని కథలు
mister shakuni