Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

 గతసంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue230/638/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)... 

రోజు లాగే ఆ రోజు కూడా ఇంట్లో నుంచి బైటికి వస్తూనే గాయత్రి  కళ్ళు రమేష్ కోసం వెతికాయి. వేప చెట్టుకి ఒక కాలు తన్ని పెట్టి కిళ్ళి కొట్టు దగ్గర నిలబడి ఉండే రమేష్ కనిపించలేదు. అప్పటికి అతడిని పార్క్ లో కలుసుకుని వారం అయింది.. మధ్య, మధ్య రమేష్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడం అప్పుడే సరిగ్గా వాళ్ళ నాన్నో, గాయత్రీ నాన్నో, లేక అన్నయ్యలో, పక్కింటి వాళ్ళో కనిపించడంతో ఇద్దరు మాట్లాడుకో లేక పోయారు. 

రమేష్ రెండు, మూడు సార్లు పలకరించడానికి ప్రయత్నించినా గాయత్రి భయంగా తల వంచుకుని వేగంగా నడుస్తూ వెళ్ళి పోయింది.. ఎవరన్నా చూస్తారేమో అనే భయంతో అలా వెళ్ళి పోయినా ఆ సందు దాటి రోడ్డు మీదకి రాగానే అతను తన వెనకాల వస్తున్నాడేమో అనే ఆశతో నడక వేగం తగ్గించి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వెళ్తుండేది...  కాని అతను కనిపించక పోడంతో నిరాశగా వెళ్ళి పోతుండేది. అలాంటి స్థితిలో ఆ రోజు తరవాత  వాళ్ళిద్దరూ మళ్ళి కలవ లేక పోయారు.

అయితే గాయత్రికి ఆ రోజు తరవాత అనుక్షణం రమేష్ తలపులే... పార్క్ లో ఇద్దరూ గుల్ మొహర్ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకోడం, అతను తన చేయి తాకడం, ఆ అనుభూతి, ఆ స్పర్శ ఆమెకి పదే , పదే  గుర్తొస్తున్నాయి. మళ్ళి అతన్ని కలవాలని, చల్లని గాలిలో చెట్టు కింద అతను చెప్పే కబుర్లు వినాలని తహతహగా ఉంది. అందుకే ఎలాగోలా అతనే ఆ రోజు లాగా ఫలానా చోట ఫలానా టైం కి కలుద్దాం అని మళ్ళి లెటర్ ఇస్తే బాగుండు అనుకుంటూ రోజు బయటికి రాగానే అతని కోసం వెతక సాగింది. 

రమేష్ కనిపించక పోవడంతో దిగులు ఆవరించేసింది. ఇంతేనా ఇంక తామిద్దరూ కలవరా... తను, రమేష్ ప్రేమించుకోరా... ఆలోచిస్తూ రోడ్డు క్రాస్ చేస్తున్న దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చాడు “ ఏయ్ గాయత్రి” అని పిలుస్తూ.. 

గాయత్రి ఉలిక్కి పడి తల తిప్పి చూసింది. ఆమె మనసు పురి విప్పిన నెమలి అయింది. రమేష్.... హారన్లు మోగుతుంటే ఆమె చేయి పట్టుకుని “జల్ది నడువ్” అంటూ రోడ్డు దాటి ఫుట్ పాత్ మీదకి వచ్చాడు. 

అతనలా చేయి పట్టుకుని రోడ్డు క్రాస్ చేయించడంతో గాయత్రికి సిగ్గు ఆవరించేసింది.. “ ఏంటిది? నేను చిన్న పిల్లనా”. అనుకుంది.  “నువ్విప్పడు కాలేజ్ కి పోవద్దు...” అన్నాడు.

“ఎందుకు” ఆశ్చర్యంగా చూసింది.

“మనం గోల్కొండ పోదాం” అన్నాడు..

“ అమ్మో... కాలేజ్ మానేసా... ఇంకేమన్నా ఉందా... నాన్నకి తెలిసినా, అన్నయ్యకి తెలిసినా తన పని అయి పోయినట్టే...” తల అడ్డంగా ఆడిస్తూ అంది...” నేను రాను...”

“ ఎందుకు రావు? రాకుంటే మనం కలుసుకొనుడు కష్టమైతుంది... మల్ల కాలేజ్ అయి పోయే టైం కి రిటర్న్ రావచ్చు... ఇంట్ల చెప్పే అవసరం లేదు.. కాలేజ్ కి పోయిన అనే చెప్పచ్చు..... “

“వద్దు రమేష్ నాకు భయం నేను రాను  ....”

“ భయం లేదు.. ఏం  లేదు ... నడు నీతో చానా మాట్లాడేది ఉంది...” అంటూ తొందర పెట్టసాగాడు.. 

అప్పటికే వాళ్ళు అడ్డంగా నిలబడే సరికి షాపుల ముందు బండ్లు అపుకుంటున్న వాళ్ళు విసుక్కో సాగారు.

గాయత్రికి కాలేజ్ కి వెళ్ళకపోతే ఇంట్లో తెలుస్తుందేమో అనే భయం ఒక పక్క, అనుకోకుండా వచ్చిన అపరూపమైన అవకాశం రమేష్ తో గోల్కొండ వెళ్ళడం, సాయంత్రం దాకా అతనితో నడవడం ....ఇది వదులుకుంటే మళ్ళీ వస్తుందా.. ఇప్పుడు రానని చెప్తే ఇంకెప్పుడూ పిలవడేమో ... 

సాయంత్రం దాకా ... అతని తో గడపడమా... తలచుకుంటేనే ఎంతో బాగుంది... ఏం మాట్లాడతాడో...... ఐ లవ్ యు అంటాడేమో...నీ కళ్ళు బాగుంటాయి అని పోగుడుతాడేమో... ఇంకా ఏం  మాట్లాడతాడో... ఊహిస్తున్నకొద్దీ  మత్తుగా, గమ్మత్తుగా అనిపిస్తోంది.  వెళ్తే ఏం  తను ఇంత వరకు గోల్కొండ చూడలేదు కూడా....

గాయత్రి ఆలోచిస్తుండగానే రమేష్ అటుగా వచ్చిన ఖాళి ఆటో పిలవడం, మాట్లాడడం, రా అంటూ గాయత్రి చేయి పట్టుకుని లాగి ఆటోలో కూర్చోబెట్టడం జరిగి పోయింది. ఆటో కదలగానే గాయత్రీ గుండె వేగంగా కొట్టుకో సాగింది భయంతో... కాలేజ్ ఎగ్గొట్టి ఇలా వెళ్ళడం అమ్మో చాలా తప్పు చేస్తోంది తను... 

“నేను దిగిపోతాను” అంది జాలిగా రమేష్ వైపు చూస్తూ..

“ అరె ఏం కాదు గమ్మునుండు...  ఎవరికీ తెలుస్తది.. మీ డాడి ఏమన్నా కాలేజ్ కి పోయి మా బిడ్డ ఇయాల కాలేజ్ కి వచ్చిందా, లేదా అని ఎంక్వైరీ చేస్తాడా..”

“చేయక పోతే మాత్రం  ఇలా వెళ్ళడం తప్పు కదా..”

“తప్పు అనుకుంటే లవర్సే ఉండరు... ఉట్టిగ నిన్ను రోజు సూసుకుంట లవ్ చేయల్నా... కలిసి మాట్లాడుకోవలే... మూవీస్ చూడాలే... నీ గురించి నేను మా డాడి తోని ఫైట్ చేసి ఇగో ఈ సెల్ ఫోన్ కొన్న..మా అమ్మ తాన పైసలు తెచ్చిన ఇయాల మస్తు ఎంజాయ్ చేద్దం ఊకే పికరు చేయకు....” అన్నాడు ఆమె చేయి తన చేతి లోకి తీసుకుని..

వెచ్చటి ఆ స్పర్శకి గాయత్రి తనువూ, మనసు కూడా పులకించి పోయింది.. 

ఆటో ఆబిడ్స్ దాటి నాంపల్లి మీదుగా లక్డికా పూల్ చేరడంతో ఆ ట్రాఫిక్ చూసి భయంగా తన చేయి లాక్కుంది ... ఎవరన్నా చూస్తారేమో అన్నట్టు పుస్తకం తెరిచి మొహానికి అడ్డంగా పెట్టుకుంది.. ఆటో మాసాబ్ ట్యాంక్ చేరింది.. 

“బుక్ ఎందుకు అడ్డం పెట్టుకున్నావు” అడిగాడు..

“ఊరికే” అంది..

“ నాకెరికే ఎవరు నీ పేస్ చూడకుండ కదా.. ఒక మంచి స్కార్ఫ్ కొనుక్కో... ఈ లంగ ఓనీలు వదిలేసి డ్రెస్ లు ఏసుకోవలే.... ఊరోళ్ల లెక్క ఏందీ ఈ డ్రెస్... ఇయాల రేపు అమ్మాయిలను  చుస్తలేవ ... మొకం కనిపించకుండా కవర్ చేసుకుని బాయ్ ఫ్రెండ్ల తోని తిరుగుతున్రు... నేర్చుకోవాలే.... మీ కాలేజ్ ల అందరు నీ లెక్కనే ఉంటరా ...”

అతను చెప్తుంటే శ్రీ కృష్ణుడు చెప్తున్న  గీతాసారం ఎంతో భక్తిగా వింటున్న అర్జునుడు లాగా విన సాగింది. 

“మా ఇంట్లో డ్రెస్ లు వేసుకోనివ్వరు” అంది మెల్లగా...

“కోట్లాడాలే నేను మా డాడి తో కొట్లాడి  సేల్ ఫోన్ కొనలే “

“ అమ్మో... తాట తీస్తారు నాన్న అని అది సరే నువ్వేంటి కాలేజ్ కి అసలు వెళ్ళవా” ..అడిగింది.

“నిన్న పోయిన జర సేపు కూసుని వచ్చేసిన.. ఏం బోవలె... బోర్” అన్నాడు..

“మరెలా నువ్వు వెళ్ళక పోతే అన్నీ మిస్ అవుతావు కదా.”

“పొతే నిన్ను మిస్ ఆయిత... “ అన్నాడు..

గాయత్రికి ఆ మాట వేణు గానం లా వినిపించింది. సిగ్గుతో మొహం తిప్పేసుకుంది. ఆటో గోల్కొండ చేరింది. పర్సు తీసి  ఐదు వందల రూపాయల నోటు దర్జాగా ఇస్తున్న రమేష్ వైపు అబ్బురంగా చూసింది గాయత్రి .. ఆటో వాడిచ్చిన చిల్లర తీసుకుని జేబులో వేసుకుంటూ నడు అంటూ ఎంట్రన్స్ వైపు నడిచాడు. 

బలిష్టంగా, ఎత్తుగా  ఉన్న  ద్వారం లోంచి లోపలికి వెళ్తుంటే గాయత్రికి ధ్రిల్లింగ్ గా అనిపించింది.  కొందరు విదేశీ టూరిస్ట్ లతో పాటు తమ లాగా వచ్చిన యువ జంటలను చూసాక కొంచెం ధైర్యం వచ్చింది గాయత్రికి.  గైడ్ కావాలా అంటూ వచ్చాడో వ్యక్తీ.. “అవసరం లేదు “ అంటూ గాయత్రితో నెమ్మదిగా అన్నాడు “ జర సేపు తిరిగి చూసి కుర్చుని మాట్లాడుకుందాం.” “సరే” అంది గాయత్రీ..  గోల్కొండ గురించి వినడం, చదువుకోడం తప్ప ఎన్నడు చూసే అవకాశం లభించ లేదు. ఇప్పడు ఆ చారిత్రక కట్టడాన్ని చూస్తుంటే తమాషాగా, ఆనందంగా ఉంది. ఎంత మంచి వాడు రమేష్ తనని ఇక్కడి తీసుకు వచ్చాడు అనుకుంది. అతని మీద బోలెడంత ప్రేమ పెరిగి పోయింది. 

ఎంట్రన్స్ లో దాటి వెళ్ళగానే అక్కడ మధ్యలో నిలబడి పైకి చూస్తూ కొందరు చప్పట్లు కొడుతుంటే ఆశ్చర్యంగా చూసింది.. 

తను కూడా చప్పట్లు కొట్టింది.. అది ప్రతిధ్వనించడం గమనించింది.. అక్కడి నుంచి ఒక్కో గది చూస్తూ పైకి వెళ్లారు. “ఇక్కడ కూర్చుందాం”  అంటూ  పెద్ద రాయి మీద కూర్చున్నాడు రమేష్.. ఇంకా లోపల చూడాలని ఉన్నా రమేష్ కూర్చోడంతో తను కూడా అతనికి కొంచెం ఎడంగా కూర్చుంది.

“అంత దూరం ఎందుకు జర దగ్గరకు జరుగు” అన్నాడు. 

సిగ్గు పడుతూ కొంచెం అతని వైపు జరిగింది. 

“ మనం మారేజ్ చేసుకుందామా”  ఆమె చేయి తన చేతి లోకి తీసుకుని అడిగాడు.

“ ఇప్పుడా ... ఇంత తొందర గానా...” ఆశ్చర్యంగా అడిగింది. 

ఐ లవ్ యు అని చెప్తాడని, రోజు కలుసుకునే ఉపాయం చెప్తాడని, ఇంకా ఏదో చెప్తాడని, మధ్య, మధ్య తన చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడని  ఏవేవో ఊహించుకుంది.. కానీ అతను నేరుగా పెళ్లి చేసుకుందాం అనే సరికి గుండెలో రాయి పడినట్టు అయింది.. ఇప్పుడు పెళ్ళేంటి... తనకి ఇంకా పదిహేడు నిండ లేదు... నవంబర్ లో నిండిపోయి పద్దెనిమిది వస్తుంది. 

చదువు పూర్తీ కాకుండా పెళ్లి చేసుకోడమా.... విచిత్రంగా చూస్తూ ఉండి పోయింది.   

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్