Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఉంగరాల రాంబాబు చిత్ర సమీక్ష

Ungarala rambabu movie review

చిత్రం: ఉంగరాల రాంబాబు 
తారాగణం: సునీల్‌, మియా జార్జ్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి, అలీ, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్‌, ప్రభాస్‌ శ్రీను, తాగుబోతు రమేష్‌, దువ్వాసి మోహన్‌ తదితరులు. 
సంగీతం: జిబ్రాన్‌ 
సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి 
దర్శకత్వం: కె.క్రాంతి మాధవ్‌ 
నిర్మాత: పరుచూరి కిరీటి 
విడుదల తేదీ: 15 సెప్టెంబర్‌ 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
200 కోట్లకు వారసుడు రాంబాబు (సునీల్‌). తాత మరణంతో ఆ ఆస్తులన్నీ దూరమవుతాయి రాంబాబుకి. అనుకోకుండా రాంబాబు, బాదం బాబా (పోసాని కృష్ణమురళి)ని కలుస్తాడు. ఆ తర్వాత రాంబాబు దశ తిరుగుతుంది. 200 కోట్ల బంగారం దొరుకుతుంది రాంబాబుకి. పెద్ద ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీని పెట్టి బస్సుల్ని నడుపుతుంటాడు. చిన్న చిన్న చికాకుల కారణంగా బాదం బాబా ఇచ్చే సలహాలతో తన ఆఫీసులోనే ఉన్న మేనేజర్‌ సావిత్రి (మియాజార్జ్‌)ని పెళ్ళాడాలనుకుంటాడు. అది బాదం బాబా సలహానే. సావిత్రిని పెళ్ళాడితే రాంబాబు దశ తిరుగుతుందా? అసలు 200 కోట్ల బంగారం రాంబాబుకి దొరకడం వెనుక కథేంటి? అన్నది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా సునీల్‌ ఏ సినిమా చేసినా, తన వరకు తాను పూర్తి న్యాయం చేస్తున్నాడు. సిక్స్‌ ప్యాక్‌ చేసినా, డాన్సుల్లో సత్తా చాటుతున్నా, ఇవన్నీ సునీల్‌కి సినిమా మీద ఉన్న కమిట్‌మెంట్‌ని చెబుతాయి. ఈ సినిమాలోనూ సునీల్‌ కమిట్‌మెంట్‌కి వంక పెట్టలేం. నటుడిగా చెయ్యాల్సిందంతా చేశాడు. డాన్సులు, యాక్షన్‌ బాగా చేశాడు. ఉన్నంతలో తన పాత్ర ద్వారా కామెడీ చేయడానికీ ప్రయత్నించాడు. 
మియా జార్జ్‌ అందంగా ఉంది. అయితే నటిగా ఆమెకు తగిన పాత్ర లభించలేదనే చెప్పాలి. పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె పాత్ర తేలిపోయింది. 

సీనియర్‌ నటుడు ప్రకాష్‌రాజ్‌, తన అనుభవాన్ని రంగరించే ప్రయత్నం చేశాడు. కమెడియన్లలో పోసాని కృష్ణమురళి బాగా నవ్విస్తే, వెన్నెల కిషోర్‌ ఫర్వాలేదన్పించాడు. చాలా మంది కమెడియన్లు ఉన్నా వారి నుంచి కామెడీ అంతగా బయటకు తీసుకురాలేకపోయాడు దర్శకుడు. మిగతా పాత్రధారులంతా ఫర్వాలేదన్పించారంతే. 

ఈసారి కథ విషయంలో కొంత క్లారిటీ మిస్సయ్యాడు దర్శకుడు. కథనం విషయంలోనూ అంతే, పూర్తి గందరగోళం ప్రదర్శించాడు. డైలాగ్స్‌ ఓకే అన్పిస్తాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. పాటలు ఏమంత ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. సంగీతం ఫర్వాలేదన్పిస్తుందంతే. ఎడిటింగ్‌ చాలా అవసరం అనిపిస్తుంది. 

సునీల్‌ అంటే హీరో కన్నా ముందుగా కమెడియన్‌ గుర్తుకొస్తాడు. కామెడీ చేస్తూనే, హీరోయిజం పండించగల సత్తా ఉన్న నటుడు సునీల్‌. అయితే కథల ఎంపికలో సునీల్‌ తడబడ్తుండడంతోపాటే, సునీల్‌ని ఎలా ప్రొజెక్ట్‌ చేయాలో తెలియక దర్శకులూ తడబడ్తున్నారు. ఈ సినిమాకైతే దర్శకుడు కొన్ని పాత్రలు, కొన్ని సన్నివేశాలు బాగానే రాసుకున్నా, ప్యాడింగ్‌ సన్నివేశాల విషయంలో కంగాళీకి ఛాన్స్‌ ఇచ్చేశాడు. పాటలైతే ఎందుకొస్తున్నాయో తెలియదనేంతలా ఉన్నాయి. ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యమే. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటమే కాదు, కథల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం. డాన్సుల వరకూ సునీల్‌ బాగా చేశాడు. పోసాని కామెడీ ఆకట్టుకుంటుంది. ఈ రెండే ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. జాతకాల పిచ్చోడిగా సునీల్‌ని చూపించినప్పుడు మేగ్జిమమ్‌ అతనితో కామెడీ చేయించడానికి అవకాశముంటుంది. దర్శకుడు అక్కడా మిస్‌ ఫైర్‌ అయ్యాడు. ఓవరాల్‌గా సినిమా నిరాశపరుస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
'ఉంగరాల రాంబాబు' నవ్వించలేకపోయాడు, ఆకట్టుకోలేకపోయాడు 
అంకెల్లో చెప్పాలంటే: 2.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka